
సీసా అడుగు భాగంలో నీళ్లు, పైభాగంలో పెట్రోల్
సాక్షి, గండేపల్లి (తూర్పు గోదావరి): పెట్రోలు కోసం బంక్‌కు వెళ్లిన ఆ వాహనదారులు షాక్ తిన్నారు. పెట్రోల్‌కు బదులు నీళ్లు రావడంతో అవాక్కయ్యారు. వెంటనే తేరుకుని ఆందోళన చేపట్టారు. ఈ సంఘటన గురువారం మండలంలో చోటుచేసుకుంది. మండలంలోని మల్లేపల్లి శివారున ఉన్న శ్రీధాత్రీ ఎంటర్‌ప్రైజెస్ (హెచ్‌పీ) పెట్రోల్ బంకులో తాళ్లూరుకు చెందిన ఆరుగొల్లు పండు, రైతులు, మల్లేపల్లి, ఇతర గ్రామాలకు చెందిన వాహనదారులు తమ ద్విచక్ర వాహనాల్లో పెట్రోల్ పోయించుకున్నారు. ఆస్పత్రి నిమిత్తం రాజానగరం వెళుతున్న పండు వాహనం బంక్‌కు కొంత సమీపంలో నిలిచిపోయింది. వాహనంలో ఉన్న పెట్రోల్‌ను సీసాలోకి నింపి బంకు వద్దకు చేరుకున్న వినియోగదారులు ఆందోళన చేపట్టారు.
సమాచారం తెలుసుకున్న విజిలెన్స్ సీఐ ఎన్ రమేష్, విజిలెన్స్ తహసీల్దార్ గోపాలరావు అక్కడికి చేరుకుని వినియోగదారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ పెట్రోల్ తనిఖీకి సంబంధించిన వ్యక్తి అందుబాటులో లేనందున ప్రస్తుతానికి పెట్రోల్ వినియోగాన్ని నిలిపివేయించినట్టు తెలిపారు. జరిగిన విషయంపై వివరాలు నమోదు చేసుకున్నామని తదుపరి చర్యలు తనిఖీ అనంతరం ఉంటాయని రెవెన్యూ అధికారి జి.కృష్ణ పేర్కొన్నారు. ప్రస్తుతం పెట్రోల్ వినియోగాన్ని నిలిపివేయించామని తనిఖీ నిర్వహించేంత వరకు ఒక వ్యక్తిని బంక్ వద్ద ఉంచనున్నట్టు వెల్లడించారు. ఎటువంటి సంఘటనలు చోటుచేసుకోకుండా స్థానిక పోలీసులు అక్కడికి చేరుకుని బాధితులను శాంతింపజేశారు.
పెట్రోల్ ఉండే రసాయనపదార్థం వల్లే నీరులా తేలిందని బంక్ నిర్వాహకులు, అధికారులు చెబుతున్నారు. అనుమానం వచ్చిన వినియోగదారులు వాహనంలో పోయించిన పెట్రోల్‌ను సీసాల్లో మార్చడంతో సీసా అడుగు భాగంలో నీరు, పైభాగంలో పెట్రోల్ తేలడంతో అధికారులు, పెట్రోల్ కోసం వచ్చిన ఇతర వినియోగదారులు అవాక్కయ్యారు. ఇటువంటి సంఘటనలు గతంలోనూ జరిగాయని, అయినా బంక్ నిర్వహణలో మార్పు రావడం లేదని వినియోగదారులు బాహాటంగానే చెబుతున్నారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా అధికారులు కఠినమైన చర్యలు తీసుకోవాలని వినియోగదారులు డిమాండ్ చేస్తున్నారు.

బంక్ వద్ద వినియోగదారులు, ఇతర ప్రయాణికులు
Comments
Please login to add a commentAdd a comment