తొండంగి మండలం విశాల సహకార పరపతి సంఘం కార్యాలయంలో గండేపల్లి సొసైటీ బోగస్ రుణాల కుంభకోణంపై రైతులను విచారిస్తున్న అధికారులు (ఫైల్)
గండేపల్లిలో అక్రమాల తీగ లాగితే.. తొండంగిలో అవినీతి డొంక కదులుతోంది. టీడీపీ హయాంలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని, ముగ్గురు నేతల అండతో.. అమాయక రైతుల కళ్లుగప్పి కోట్లకు పడగలెత్తిన ‘పచ్చ’ నాయకుల పాపం పండుతోంది. సహకార వ్యవస్థను జలగల్లా పీల్చి పిప్పి చేసిన వారి బాగోతాలు ఒక్కొక్కటిగా బట్టబయలవుతున్నాయి. గండేపల్లి సహకార సొసైటీలో జరిగిన అవినీతిపై ఓపక్క శాఖాపరమైన విచారణ జరుగుతుండగా.. మరోపక్క లోకాయుక్త కూడా సుమోటోగా విచారణ చేపట్టింది. దీంతో ఈ కుంభకోణం ‘సూత్రధారుల’ గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.
సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: అవినీతి కార్యకలాపాలతో జిల్లా కేంద్ర సహకార బ్యాంక్(డీసీసీబీ)ను నష్టాల్లో ముంచేసిన ప్రబుద్ధుల జాతకాలు ఒక్కొక్కటిగా బయట పడుతున్నాయి. టీడీపీ ప్రత్తిపాడు నియోజకవర్గ ఇన్‌చార్జి, చంద్రబాబు సర్కార్‌లో డీసీసీబీ చైర్మన్‌గా ఉన్న వరుపుల రాజా హయాంలో.. అధికారాన్ని అడ్డం పెట్టుకుని, అమాయక రైతులను మోసం చేసి, ‘పచ్చ’నేతలు సాగించిన కోట్ల రూపాయల కుంభకోణం గుట్టు క్రమంగా వీడుతోంది. టీడీపీ పాలనలో డీసీసీబీ పరిధిలోని పలు సహకార సంఘాల్లో జరిగిన కుంభకోణాలను 2019 నవంబర్ నుంచి ‘సాక్షి’ వరుస కథనాలతో వెలుగులోకి తీసుకువచ్చింది. వీటిపై డీసీసీబీ ప్రస్తుత చైర్మన్ అనంత ఉదయ భాస్కర్ (అనంతబాబు) స్పందించి, విచారణ జరిపించి, పలువురిపై సస్పెన్షన్ వేటు వేసిన సంగతి తెలిసిందే. డీసీసీబీ సహా పలు సొసైటీల్లో అవినీతి బాగోతాలపై శాఖాపరంగా విచారణ జరుగుతుండగా.. తాజాగా తొండంగి మండలంలో రైతు రుణాల పేరిట రూ.10 కోట్లు పైనే కొట్టేసిన వారిపై లోకాయుక్త సుమోటోగా విచారణ చేపట్టింది. దీంతో సూత్రధారులైన ‘పచ్చ’నేతల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.
తొండంగిలోనే రూ.10.7 కోట్ల లావాదేవీలు
ప్రత్తిపాడు మండలం లంపకలోవ తరువాత ఆ స్థాయిలో కోట్ల రూపాయల అవినీతి జరిగిన సొసైటీ గండేపల్లి. ఇక్కడ అక్షరాలా రూ.23 కోట్లు అడ్డంగా బొక్కేశారు. అప్పటి టీడీపీ నేత, సొసైటీ ప్రెసిడెంట్ పరిమి బాబు కుటుంబ సభ్యులు మొదలు కారు డ్రైవర్ వరకూ.. ఇలా తెలిసిన వారందరినీ బినామీలుగా సృష్టించి సొమ్ములు దిగమింగారు. దీనిపై ప్రెసిడెంట్ సహా పలువురిపై క్రిమినల్ కేసు నడుస్తోంది. దీని విచారణలో వెలుగు చూస్తున్న వాస్తవాలు పలువురిని నివ్వెరపరుస్తున్నాయి. గండేపల్లి సొసైటీలో జరిగిన రూ.23 కోట్ల మేర కుంభకోణం జరగగా ఇందులో రూ.10.7 కోట్ల బినామీ రుణాలు తొండంగి సొసైటీ కేంద్రంగా ఉండడం చర్చనీయాంశంగా మారింది. చంద్రబాబు సర్కార్‌లో అన్నీ తానుగా వ్యవహరించిన యనమల రామకృష్ణుడి సొంత మండలం తొండంగి చుట్టూ ఈ కుంభకోణం తిరగడం గమనార్హం.
తొండంగి మండలమే ఎందుకంటే..
అసలు గండేపల్లి సొసైటీకి, తొండంగి సొసైటీలోని రైతులకు లింకేమిటి? అక్కడి రైతులకు రుణాలివ్వాలనే మంచి మనస్సు ‘పచ్చ’ నేతలకు ఎందుకు వచ్చిందని విచారణ చేసిన సహకార అధికారులకు నిర్ఘాంతపోయే వాస్తవాలు కళ్లకు కట్టాయి. పక్కా ప్లాన్ ప్రకారమే బినామీ రుణాలు నొక్కేయడానికే టీడీపీ నేతలు తొండంగి మండలాన్ని ఎంపిక చేసుకున్నారని రైతులు చెబుతున్నారు. అప్పటి ఆర్థిక మంత్రిగా ఉన్న యనమల రామకృష్ణుడితో నాటి డీసీసీబీ చైర్మన్ వరుపుల రాజాకు బలమైన బంధమే ఉండేది. రాజా రాజకీయ ఎదుగుదలకు యనమల అండదండలు దండిగా ఉండేవి. అప్పట్లో ఇద్దరూ అధికారంలోనే ఉన్నారు. ఈ నేపథ్యంలో గండేపల్లి సొసైటీలో జరిగిన రూ.23 కోట్ల కుంభకోణం మూలాలు తొండంగి మండలంలో వెలుగులోకి రావడంతో టీడీపీ నేతల పాత్రపై అక్కడి రైతుల్లో అనుమానాలు బలపడుతున్నాయి. గండేపల్లి సొసైటీ రుణ జాబితా ఆధారంగా జరుపుతున్న విచారణలో ఒక్క తొండంగి మండలంలోనే ఎక్కువ మంది బినామీ పేర్లతో సొమ్ములు దిగమింగిన విషయం వెలుగులోకి వచ్చింది. టీడీపీ నేతలకు అప్పట్లో అధికార బలం ఉండడంతో తొండంగి మండలంలో ఈ రుణాలతో సంబంధం లేని అమాయక రైతుల పేర్లతో జాబితా రూపొందించారని పలువురు ఆరోపిస్తున్నారు.
తొండంగిలోనే 59 మంది బినామీలు
ఈ కుంభకోణానికి సంబంధించి తుని నియోజకవర్గంలో 61 మంది బినామీ రైతుల పేర్లు లెక్క తేల్చగా, వీరిలో తొండంగి మండలంలోనే 59 మంది ఉన్న విషయం డివిజనల్ సహకార అధికారి డీఆర్ రాధాకృష్ణ ప్రాథమిక విచారణలో తేలింది. తొండంగి సొసైటీ సభ్యులుగా తేలి్చన 61 మందిలో 13 మంది మాత్రమే నిజమైన వారు. మిగిలిన వారి అడ్రస్‌లే ఆ సొసైటీలో లేకపోవడం విచారణాధికారులను విస్మయానికి గురి చేసింది. ముఖ్య నేతల ‘సహకారం’ లేకుండా తొండంగి మండలంలో ఇంతటి కుంభకోణానికి ఆస్కారమే ఉండదనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. యనమల రామకృష్ణుడు, టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి కృష్ణుడు, వారి ముఖ్య అనుచరుడైన పోల్నాటి శేషగిరిరావు కనుసన్నల్లోనే ఈ కుంభకోణం జరిగిందని తుని ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా ఆరోపించడం ఇందుకు బలం చేకూరుస్తోంది.
చనిపోయిన రైతులు, సొసైటీ సభ్యులు కాని రైతుల పేర్లతో నకిలీ పాసు పుస్తకాలు, డాక్యుమెంట్లు తయారు చేయడమే కాకుండా వాటిని తుని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో మార్ట్‌గేజ్ కూడా చేయించినట్టు ప్రాథమిక సమాచారం. ఇటువంటి పనులు సామాన్యుల వల్ల కాదని, అప్పటి టీడీపీ నేతల హస్తం లేకుండా ఇదంతా జరగదని అంటున్నారు. 36 మంది రైతులను విచారించగా వారిలో ఏడుగురు అసలు బతికే లేకపోవడం గమనార్హం. అంతమంది అమాయక రైతుల పేర్లపై పాస్ పుస్తకాలు, డాక్యుమెంట్లు సృష్టించడం వెనుక కచ్చితంగా అప్పుడు అధికారంలో ఉన్న టీడీపీ నేతల ప్రమేయం ఉంటుందని అంటున్నారు. విచారణ పూర్తయ్యేసరికి ఈ కుంభకోణంలో మరింత మంది ‘పచ్చ’ నేతల బండారాలు బయటపడటం ఖాయంగా కనిపిస్తోంది.
చదవండి:
విషాదం: అమ్మకు తోడుగా వచ్చి..
మాజీ మంత్రి దేవినేని ఉమాకు షాక్
Comments
Please login to add a commentAdd a comment