హుదూద్ దెబ్బకు ఉలిక్కిపడిన ఉత్తరాంధ్ర!
హుదూద్ దెబ్బకు ఉత్తరాంధ్ర ఉలిక్కి పడింది. విశాఖతో పాటు విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలు అల్లకల్లోలం అయ్యాయి. భారీగా ఆస్తి నష్టం జరిగింది. గంటకు 190 నుంచి 200 కిలో మీటర్ల వేగంతో వీచిన పెను గాలులు బీభత్సం సృష్టించాయి. తుపాన్ గురించి హెచ్చరికలు అందించే విశాఖ తుపాన్ హెచ్చరికల కేంద్రం కూడా మూగబోయింది. భారీ వర్షంతో కేంద్రంలోకి వర్షపు నీరు చేరింది. భీకర గాలులకు భవనంలోని కిటికీలు, తలుపులు దెబ్బతిన్నాయి. తుపాన్ హెచ్చరికల కేంద్రానికి రాడార్‌తో సంబంధాలు తెగిపోయాయి.
తుపాను ధాటికి విశాఖ హార్బర్ గజగజ వణికింది. 60 పెద్ద పెద్ద బోట్లను సైతం తుపాన్ తిప్పికొట్టింది. మర బోట్లు జెట్టిపైకి కొట్టుకు వచ్చాయి. ఒక్కో మరబోటు విలువ 40 లక్షల రూపాయలు ఉంటుందని మత్స్యకారులు చెప్పారు. ఆర్కే బీచ్ ధ్వంసం అయింది. దీంతో మత్స్యకారులు లబోదిబోమంటున్నారు. సముద్రంలో ఇంతటి బీభత్సాన్ని తాము ఇంతవరకు చూడలేదని మత్స్యకారులు చెప్పారు. తుపాన్ ధాటికి విశాఖ విలవిల్లాడిపోయింది. భారీ వృక్షాలు, విద్యుత్, టెలిఫోన్ స్తంభాలు నేలకూలాయి. దీంతో కమ్యూనికేషన్ వ్యవస్థ దెబ్బతింది. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అపార్ట్మెంట్లకు పగుళ్లు వచ్చాయి. తుపాన్ తాకిడికి రోడ్లు కొట్టుకుపోయాయి. చాలా చోట్ల రోడ్లు కోతలకు గురయ్యాయి.
సాయంత్రం 6 గంటల వరకు తుపాను ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ రోజు మధ్యాహ్నం ఒంటిగంటకు తుపాను పూర్తిగా తీరం దాటింది. పూడిమడక గ్రామం వద్ద తుపాను తీరం దాటింది. తీరం దాటుతున్న సమయంలో పూడిమడక గ్రామం వద్ద అల్లకల్లోలం సృష్టించింది. తుపాను బలహీనపడిన తరువాత అల్పపీడనంగా మారుతుందని ఐఎండి తెలిపింది.
తూర్పుగోదావరి జిల్లాలోని గాలిమొగ అడవులలలో 16 మంది మత్స్యకారులు చిక్కుకున్నారు. ఈ జిల్లాలోని కర్రపాలెం, లోలూరు, కొత్తూరు గ్రామాలలో ఇళ్లలోకి, ప్రభుత్వ పాఠశాలలలోకి నీరు వచ్చిచేరింది.
శ్రీకాకుళం జిల్లాలో
హుదూద్ ప్రభావం వల్ల శ్రీకాకుళం జిల్లాలో భారీగా ఆస్తి నష్టం జరిగింది. పలు ప్రాంతాల్లో జనజీవనం స్తంభించిపోయింది. కరెంటు, రవాణా, సమాచార వ్యవస్థ దెబ్బతింది. జిల్లాలో సహాయ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. భారీ వర్షాలకు వేలాది ఇళ్లు కూలిపోయాయి. లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. . భారీ వర్షాలకు శ్రీకాకుళంలోని నాగావళి నది ఉగ్రరూపం దాల్చింది. కళింగపట్నం, పొన్నాడలంక, బందరువానిపేట వంటి ప్రాంతాలు జలమయమయ్యాయి. కళింగపట్నం రోడ్లపై చెట్లు కూలాయి. రహదారి మొత్తం మూసుకుపోయింది.
శ్రీకాకుళం- పాలకొండ, శ్రీకాకుళం-కళింగపట్నం, శ్రీకాకుళం -రాజాం రహదారులపై కూడా భారీగా చెట్లు నేలకూలాయి. ఈ ప్రాంతాల్లో సమాచార వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. సంతబొమ్మాళి మండలం సి.పురంలో తాటిచెట్టు కూలి వ్యక్తి మృతి చెందాడు. ఆర్మీ, నేవీ, రక్షణ బలగాలు సహాయక చర్యల్లో చురుగ్గా పాల్గొంటున్నాయి. జిల్లాలో ఇప్పటికే వేలాది ఎకరాల్లో జొన్న, అరటి, వరి, పత్తి పంటలు నీట మునిగాయి. కొన్ని ప్రాంతాల్లో అధికారులు ముందస్తు జాగ్రత్తగా విద్యుత్ సరఫరా నిలిపివేశారు. రహదారిపై భారీ వృక్షాలు నేలకొరగడంతో జిల్లాలోని పునరావాస కేంద్రాల్లో తలదాచుకున్న ప్రజలకు ఆహార పదార్థాలు అందించేందుకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
**