స్లిప్పులపై విజి‘లెన్స్’
తుఫాన్ బాధితులకు సరకుల పంపిణీలో ‘తమ్ముళ్ల’ ప్రమేయం
12 టన్నుల బియ్యం, నిత్యావసర సరుకులు ఇచ్చిన రేషన్ డీలర్లు
విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ తనిఖీల్లో బయటపడ్డ వైనం
సింహాచలం : రేషన్‌కార్డులు లేని తుఫాన్ బాధితులకుసరకుల పంపిణీలో సిఫార్సు స్లిప్పులు వ్యవహారం రచ్చకెక్కింది. రేషన్ దుకాణాల్లో సరుకులు తెచ్చుకోండంటూ అడవివరంలో టీడీపీ కార్యకర్తలు నడిపిన ఘటన మంగళవారం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల తనిఖీల్లో బహిర్గతమైంది. తెలుగు తమ్ముళ్లు పంపించిన సిఫా ర్సు స్లిప్పులపై సరకులు ఇచ్చామంటూ రేషన్ డీలర్లు సైతం విజిలెన్స్ అధికారుల సమక్షంలో ఒప్పుకోవడం విశేషం. రాష్ర్ట మంత్రి గంటా శ్రీనివాసరావు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న భీమిలి నియోజకవర్గంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. వివరాలిలోకి వెళ్తే రేషన్ కార్డులు లేని తుఫా న్ బాధితులకు సంబంధిత నియోజకవర్గ ఎమ్మెల్యే సిఫార్సు లేఖ అవసరం ఉండగా, అడవివరంలో మాత్రం మాజీ సర్పంచ్ పాశర్ల ప్రసాద్ పేరిట స్లిప్పులు జారీ అ య్యాయి. సంబంధిత విషయాన్ని ఒక స్థానికుడు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశాడు. జిల్లా కలెక్టర్ యువరాజ్ ఈ విషయాన్ని పరిశీలించమని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్పికి ఆదేశించారు. దీనిపై ఎస్పి సురేష్‌బాబు తమ అధికారులను అడవివరంలో ఉన్న 93,94, 95 రేషన్ దుకాణాల్లో తనిఖీలు నిర్వహించమని ఆదేశించారు. విజి లెన్స్ అండ్ ఎన్ఫోర్స్ మెంట్ డిఈ కె.అజయ్‌కుమార్, ఏఈ సత్యకుమా ర్ రేషన్ దుఖాణాల్లో తనిఖీలు నిర్వహించారు.
93 రేషన్ దుకాణంలో 369 మందికి, 94 రేషన్‌షాపులో 33మందికి, 95 రేషన్ దుకాణంలో 105 మందికి అనధికార స్లిప్పులపై బియ్యం, నిత్యావసర సరుకులు ఇచ్చినట్టు గుర్తించారు. పాశర్ల ప్రసాద్ పంపించిన సిఫార్స్ లేఖపై సరుకులు ఇచ్చామని సబంధిత రేషన్ డీలర్లే అధికారుల సమక్షంలో ఒప్పుకున్నా రు. మూడు రేషన్ దుకాణాల్లో కలిపి 12 టన్నుల బియ్యం, నిత్యావసర సరుకులు అనధికార స్లిప్పులపై ఇచ్చినట్టు గుర్తిం చారు. 93 రేషన్ షాపులో 62 బస్తాలు, 94 షాపులో 21 బస్తాలు స్టాకు తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. ఈ తరుణంలో 93 రేషన్ దుకాణం వద్దకు వచ్చిన పాశర్ల ప్రసాద్ తాను స్లిప్పులు జారీ చేశానని అంగీకరించారు. డీఈ మాట్లాడుతూ సిఫార్స్ స్లిప్పులు జారీ చేసే అధికారం ఎమ్మెల్యేకే ఉందని మరెవరికీ లేదన్నారు. అనధికార స్లిప్పుల జారీ, రేషన్ డీలర్ల నిర్వాకం ఉన్నతాధికారులకు తెలియజేస్తామన్నారు.