hypnotism
-
Psychic Day 2021: హిప్నాటిజానికి మూలం ఏమిటో తెలుసా?
మైమరచిపోయేలా చేయడం.. మంత్ర ముగ్ధులను చేయడం.. మెల్లగా వశం చేసుకుని చెప్పినట్టు చేసేలా చేయడం.. ఇదంతా హిప్నాటిజం. మరి ఈనాటి ఈ హిప్నాటిజానికి మూలం ఏమిటో తెలుసా?.. 18వ శతాబ్దం నాటి మెస్మరైజేషన్.. తన అంతరాత్మకు అనంతమైన శక్తి ఉందని.. ఆ ‘సైకిక్ పవర్’తో వ్యాధులన్నీ నయం చేస్తానని జనాన్ని నమ్మించిన ఓ వ్యక్తి లీలలే. అతడు తెలియక చేసినా.. చివరికి అదంతా సైన్స్ అని తేలడం, రెండు కొత్త ఆవిష్కరణలకు మార్గం చూపడం విశేషం. ఈ ఆదివారం (ఆగస్టు 1) ‘సైకిక్ డే’ సందర్భంగా ఆ కథేంటో తెలుసుకుందామా? అది 1770వ సంవత్సరం.. ఆధునిక వైద్యం అందుబాటులో లేని కాలం.. అనారోగ్యానికి గురైన వారి రక్తాన్ని జలగలతో పీల్పించడం, రోగం తగ్గుతుందంటూ గాయాల నుంచి రక్తం మరింతగా కారిపోయేలా చేయడం జరుగుతున్న కాలం.. శాస్త్రవేత్తలు కొత్త ఆవిష్కరణలు చేస్తే భయంతో తిరస్కరిస్తున్న కాలం. మంత్రతంత్రాలను విపరీతంగా నమ్మే ఆ సమయంలో ఓ వ్యక్తి తెరపైకి వచ్చాడు. ఏ రోగాన్నైనా తగ్గించగలనంటూ జనాన్ని ఆకర్షించాడు. ఆయనే ఫ్రాంజ్ ఆంటోన్ మెస్మర్. ఆయన పేరులోని మెస్మర్ నుంచే మెస్మరైజేషన్ అనే పదం పుట్టింది. ‘యానిమల్ మ్యాగ్నెటిజం’ పేరుతో.. ఆస్ట్రియాకు చెందిన మెస్మర్.. జనాన్ని మాయ చేయడానికి తనదైన ఓ సిద్ధాంతాన్ని ప్రచారం చేశాడు. దానికి ‘యానిమల్ మ్యాగ్నెటిజం’ అని పేరుపెట్టాడు. భూమితోపాటు సూర్యచంద్రులు, ఇతర గ్రహాల అయస్కాంత, గురుత్వాకర్షణ శక్తులు మనుషుల శరీరంపై ప్రభావం చూపిస్తాయన్నాడు. మన శరీరం ఒక శక్తివంతమైన అయస్కాంతం అని, అందులోని జీవశక్తి ‘మ్యాగ్నెటిక్ ఫ్లూయిడ్’ అని చెప్పాడు. వీటి పనితీరును గ్రహాల శక్తులు దెబ్బతీయడం వల్లే ఏవేవో రోగాలు వస్తాయని ప్రకటించాడు. తనకున్న సైకిక్ శక్తులను ఉపయోగించి కేవలం తన చేతులతో ఏ రోగాన్నైనా తగ్గిస్తానని ప్రచారం చేశాడు.ఈ మాటలు జనంపై విపరీతంగా ప్రభావం చూపాయి. ఆయనకు విపరీతంగా ఫాలోయింగ్ పెరిగిపోయింది. సాధారణ ప్రజలే కాదు.. ఫ్రాన్స్ మహారాణి మేరీ ఆంటోనెట్టే కూడా మెస్మర్ వైద్యం మాయలో పడ్డారు. ట్రాన్స్‌లోకి తీసుకెళ్లి.. శారీరక, మానసిక సమస్యలతో బాధపడే చాలా మంది మెస్మర్ ప్రచారాన్ని నమ్మి చికిత్స కోసం వచ్చేవారు.‘గ్రహాల శక్తులు, యానిమల్ మ్యాగ్నెటిజం’ వంటి అంశాలు మానసిక సమస్యలున్న వారిని ఆకర్షించాయి. మానసిక ఒత్తిళ్లు, ఆందోళనలు, డిప్రెషన్, ఏదో ఒక విషయంగా తీవ్రంగా భయపడటం వంటి ఇబ్బందులు ఉన్నవారు పెద్ద సంఖ్యలో వచ్చేవారు. ► మెస్మర్ వారిలో కొందరికి ఒంటరిగా.. మరికొందరికి గ్రూపులుగా ‘రోగాలు నయం చేసే ప్రక్రియలు’ నిర్వహించేవాడు. పెద్ద బాత్టబ్లలో నీళ్లు నింపిపెట్టి.. అవి అయస్కాంత నీళ్లుగా చెప్తూ వాటిలో కూర్చోబెట్టేవాడు. తన చేతులను వారి ముందు తిప్పుతూ ఏదో శక్తులను ప్రయోగిస్తున్నట్టు చేసేవాడు. ఆ సమయంలో పేషెంట్లు మైమరపు (ట్రాన్స్)లోకి వెళ్లేవారు. తిరిగి లేవగానే తమలో ఏదో కొత్త ఉత్తేజం వచ్చినట్టు ఉత్సాహపడేవారు. ‘నమ్మకమే చికిత్స’ అని తేలింది అప్పుడే ఓవైపు మెస్మర్‌కు జనంలో విపరీతంగా ఆదరణ పెరగడం, మరోవైపు ఆయన చికిత్స విధానాన్ని శాస్త్రవేత్తలు తప్పుపట్టడంతో అప్పటి ఫ్రాన్స్ ప్రభుత్వం రంగంలోకి దిగింది. మెస్మర్ వైద్య ప్రక్రియలు, పద్ధతులపై విచారణ చేయించాలని నిర్ణయించింది. 1784లో ప్రఖ్యాత శాస్త్రవేత్త, రాజకీయ నేత బెంజమిన్ ఫ్రాంక్లిన్ నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందానికి బాధ్యత అప్పగించింది. శాస్త్రవేత్తలు ‘యానిమల్ మ్యాగ్నెటిజం’ అంతా ఉత్త కల్పనే అని తేల్చారు. ► చిత్రమేమిటంటే.. మెస్మర్ దగ్గరికి వెళ్లినవారిలో చాలా మందికి వ్యాధులు తగ్గుముఖం పడుతుండేవి. ముఖ్యంగా మానసిక సమస్యల నుంచి బయటపడేవారు. మరి ఇదెలా సాధ్యమైందన్న దానిపై శాస్త్రవేత్తలు గట్టిగా పరిశోధన చేశారు. అప్పుడే ఓ అద్భుతమైన విషయాన్ని కనిపెట్టారు. అదే ‘ప్లాసిబో’ ఎఫెక్ట్. ఏమిటీ ‘ప్లాసిబో’ ఎఫెక్ట్ ఏదైనా రోగం/మానసిక ఇబ్బందులతో బాధపడుతున్నవారికి ఏదైనా మందు, చికిత్సతో నయమవుతుందని పూర్తి విశ్వాసం కలిగించగలిగితే.. వారిలో ఆ సమస్య తగ్గుముఖం పడుతుంది. నిజానికి వారికి ఎలాంటి మందు ఇవ్వకున్నా, చికిత్స చేయకున్నా సరే.. ఉత్తుత్తి మందులు, చికిత్సతోనే కొంతవరకు కోలుకుంటారు. బాధితులు తమకు నయమైపోతుందన్న నమ్మకంతో ఆందోళనలను వదిలేసి, ఉత్సాహంగా ఉండటమే దీనికి కారణమని శాస్త్రవేత్తలు తేల్చారు. దీనినే ‘ప్లాసిబో’ ఎఫెక్ట్‌గా పిలుస్తారు. కొందరు వైద్యుల దగ్గరికి వెళ్తే తమకు త్వరగా వ్యాధులు తగ్గిపోతాయని జనం నమ్ముతుంటారు. అందరు వైద్యులు ఇచ్చేది దాదాపు ఒకే రకమైన మందులు అయినా కూడా.. వారి దగ్గరికి వెళ్లినవారు త్వరగా కోలుకుంటుంటారు. దీనికి ప్లాసిబో ఎఫెక్ట్ కారణమని చెప్పొచ్చు. హిప్నాటిజానికి బీజం పడింది అప్పుడే.. ► మెస్మర్‌కు శక్తులేమీ లేవని, అదంతా కల్పితమని శాస్త్రవేత్తలు ప్రకటించడంతో ఆయన ఫ్రాన్స్ వదిలి వెళ్లిపోయాడు. సాధారణ జీవనం గడిపి.. 1815లో చనిపోయాడు. ఆయన పేరుతో ‘మెస్మరిజం (మాయచేయడం, మంత్రముగ్ధులను చేయడం)’ పదం పుట్టి చిరస్థాయిగా నిలిచిపోయింది. ► మెస్మర్ విధానాలు కల్పితమే అయినా అందులోని నిగూఢమైన సైన్స్ సంగతులు బయటికొచ్చాయి. ప్లాసిబో ఎఫెక్ట్‌ను గుర్తించడానికి, హిప్నాటిజం పుట్టుకకు కారణమయ్యాయి. ► 1841లో ప్రఖ్యాత స్కాటిష్ వైద్యుడు జేమ్స్ బ్రెయిడ్ ‘హిప్నాటిజం’ ప్రక్రియను ప్రతిపాదించాడు. మెస్మర్ ‘యానిమల్ మ్యాగ్నెటిజం’ సిద్ధాంతాన్ని ప్రస్తావిస్తూనే.. మనుషుల్లో నమ్మకం కలిగించడం, వారిని ట్రాన్స్‌లోకి తీసుకెళ్లి మానసిక సమస్యలకు చికిత్స చేయడం వంటివి హిప్నాటిజం ద్వారా సాధ్యమని చెప్పాడు. మొత్తంగా ఓ మోసగాడి లీలలు.. వైద్యంలో రెండు కీలక ప్రక్రియలకు మూలంగా నిలవడం విశేషం. – సాక్షి సెంట్రల్ డెస్క్ -
ప్రముఖ హిప్నాటిస్ట్ కమలాకర్ కన్నుమూత
హైదరాబాద్: ప్రముఖ సైకలాజికల్ హిప్నాటిస్ట్ డాక్టర్ హిప్నో కమలాకర్ బుధవారం రాత్రి కన్నుమూశారు. ఇటీవల ఆయనకు కరోనా పాజిటివ్ రాగా క్వారంటైన్ అనంతరం నెగిటివ్ నిర్థారణ అయ్యింది. మంగళవారం రాత్రి గుండెపోటు రావడంతో సోమాజిగూడ యశోద ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ బుధవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. హిప్నో కమలాకర్ జర్నలిస్ట్, న్యాయవాదిగా పనిచేయడంతో పాటు రెండు దశాబ్దాలుగా స్టేజీ హిప్నాటిస్ట్‌గా ప్రాచుర్యం పొందారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా చాలా కాలం పనిచేశారు. కమలాకర్ సతీమణి డాక్టర్ హిప్నో పద్మా కమలాకర్ దేశంలోనే తొలి మహిళా హిప్నాటిస్ట్. ఈయనకు కుమార్తె సరోజారాయ్, కుమారుడు హిమకర్ ఉన్నారు. స్వగ్రామం రాజమండ్రి సమీపంలోని నాగుల్లంక కాగా, 15 ఏళ్లుగా హైదరాబాద్ అశోక్‌నగర్‌లో నివాసం ఉంటున్నారు. చదవండి: తండ్రి, కొడుకును బలి తీసుకున్న కరోనా.. ‘మనకు మొహమాటం ఉన్నా.. కరోనాకు లేదు’ -
‘అమెజాన్ డెలివరీ బాయ్’ కేసులో కొత్త ట్విస్ట్!
న్యూఢిల్లీ: ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజ సంస్థ అమెజాన్ డెలివరీ బాయ్ అత్యాచార యత్నం కేసు కొత్త మలుపు తిరిగింది. తనను హిప్నటైస్ చేసి అమెజాన్ డెలివరీ బాయ్ అత్యాచార యత్నం చేశాడంటూ నోయిడాకు చెందిన ఓ మహిళ ఆరోపించిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేయడానికి సదరు మహిళ అంగీకరించలేదు. అంతేకాకుండా దీనికి సంబంధించిన ఫిర్యాదును కూడా ఆమె వెనక్కి తీసుకుంది. ఈ కేసు విచారణ చేపట్టిన నోయిడా(సిటీ) ఎస్ఐ వినీత్ జైస్వాల్ మాట్లాడుతూ ...‘అమెజాన్ డెలివరీ బాయ్‌ను విచారించాం. తనపై వచ్చిన ఆరోపణలను అతను ఖండించాడు. వస్తువుల ఎక్చేంజ్ కోసం బాధితురాలి ప్లాట్‌కు వెళ్లినప్పుడు అక్కడ ఇరువురి మధ్య వాగ్వివాదం జరిగింది. దాని తరువాత కూడా అక్కడే కొన్ని ఫ్లాట్లలో అతను వస్తువులను డెలివరీ చేశాడు. బాధితురాలిని వైద్యపరీక్షలు చేయించుకోమని అడిగాం. అయితే ఆవిడ వైద్యపరీక్షలు చేయించుకోవడానికి నిరాకరించారు. అంతేకాకుండా ఆ ఫిర్యాదును కూడా వెనక్కు తీసుకున్నారు’ అని తెలిపారు. దీనిపై స్పందించిన అమెజాన్ సంస్థ తమకు కస్టమర్ల భద్రతే అత్యంత ప్రాధాన్యమైన విషయమని తెలిపింది. అప్పుడప్పుడూ ఇలాంటి సంఘటనలు తమను ఇబ్బందులకు గురిచేస్తూ ఉంటాయని... విచారణకు సంబంధించి పోలీసులకు పూర్తి సహకారం అందిస్తామని తెలిపింది. చదవండి: మహిళపై అమెజాన్ డెలివరీ బాయ్ అఘాయిత్యం -
హిప్నటైజ్ చేసి.. ఆపై అత్యాచారయత్నం
న్యూఢిల్లీ: అమెజాన్ డెలీవరీ బాయ్ ఒకరు తనను హిప్నటైజ్ చేసి.. అత్యాచారం చేసేందుకు ప్రయత్నించారంటూ ఓ 43 ఏళ్ల మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివరాలు.. బాధితురాలు నోయిడాలోని ఓ అపార్ట్మెంట్లో ఉంటూ.. ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తుంది. ఈ క్రమంలో కొద్ది రోజుల క్రితం అమెజాన్‌లో ఓ బాక్స్‌ను ఆర్డర్ చేసింది. ఈ బాక్స్‌లో మరో ఐదు చిన్న బాక్స్‌లు వస్తాయి. అయితే కారణం తెలియదు కానీ ఆ వస్తువులను రిటర్న్ చేయాలని భావించింది. ఇందుకోసం అమెజాన్ కస్టమర్ కేర్ నంబర్‌కు కాల్ చేసి, రిటర్న్ రిక్వెస్ట్ పెట్టింది. ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం అమెజాన్ డెలివరీ బాయ్ రిటర్న్ పెట్టిన వస్తువులను తీసుకునేందుకు గాను బాధితురాలి ఇంటికి వచ్చాడు. ఐదు బాక్స్‌లను రిటర్న్ తీసుకెళ్లలేనని.. కేవలం నాలుగు బాక్స్‌లను మాత్రమే తీసుకెళ్తానని చెప్పాడు. దాంతో వారిద్దరి మధ్య గొడవ ప్రారంభమయ్యింది. ఈ క్రమంలో బాధితురాలి సోదరి అమెజాన్ కస్టమర్ కేర్‌కు కాల్ చేసి డెలివరీ బాయ్ మీద ఫిర్యాదు చేసింది. దాంతో అమెజాన్ కంపెనీ, డెలివరీ బాయ్‌ను అక్కడి నుంచి వెళ్లి పోమ్మని చెప్పింది. ఈ నెల 9న మరో వ్యక్తి వచ్చి మొత్తం ఐదు బాక్స్‌లను కలెక్ట్ చేసుకుంటాడని బాధితురాలితో చెప్పింది. అనంతరం బాధితురాలి సోదరి బయటకు వెళ్లింది. ఈలోగా కిందకు వెళ్లిన డెలివరీ బాయ్ కాసేపటికే బాధితురాలి అపార్ట్మెంట్ వద్దకు వచ్చి.. ఐదు బాక్స్‌లను తీసుకెళ్తానని చెప్పాడు. కానీ బాధితురాలు అందుకు ఒప్పుకోలేదు. కస్టమర్ కేర్ చెప్పిన దాని ప్రకారం బుధవారం మరో ఏజెంట్‌కే వాటిని ఇస్తానని చెప్పింది. ఇలా మాట్లాడుతుండగానే.. బాధితురాలు కళ్లు తిరిగి పడిపోయింది. స్పృహ వచ్చి చూసే సరికి తాను కింద పడిపోయి ఉన్నానని.. డెలివరీ బాయ్ ప్యాంట్ విప్పి తన ఎదురుగా నిల్చున్నాడని బాధితురాలు తెలిపింది. దాంతో తాను సాయం కోసం అరిచానని.. కానీ ఆ సమయంలో తన ఇంట్లో, చుట్టుపక్కల ఎవరు లేరని పేర్కొంది. వెంటనే ఇంట్లోకి వెళ్లి మాబ్కర్ర తీసుకువచ్చి డెలివరీ బాయ్ మీద దాడి చేశానని.. దాంతో అతడు అక్కడి నుంచి పారిపోయాడని పేర్కొంది. డెలివరీ బాయ్ తనను హిప్నటైజ్ చేసి, అత్యాచారయత్నం చేశాడని బాధితురాలు ఆరోపించింది. ఆ తర్వాత ఈ విషయం గురించి తన సోదరితో చెప్పానని.. ఆమె ఎంట్రీ రిజస్టర్‌లో ఉన్న డెలివరీ బాయ్ నంబర్‌కు కాల్ చేసి అతను ఎక్కడి నుంచి వచ్చాడనే వివరాలు కనుక్కుందని చెప్పింది. ఆ తర్వాత పోలీస్ స్టేషన్‌కు వెళ్లి సదరు డెలివరీ బాయ్ మీద ఫిర్యాదు చేశామంది. దీని గురించి అమెజాన్ ప్రతినిధి మాట్లాడుతూ.. కస్టమర్ల భద్రతమే మా ప్రథమ ప్రాధాన్యం. ఈ ఆరోపణలు మమ్మల్ని ఇబ్బంది పెట్టాయి. వెంటనే సదరు డెలివరీ బాయ్ మీద చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
సైక్లింగ్‌తో లైంగిక ఆరోగ్యానికి మేలు
న్యూయార్క్: సైకిల్ తొక్కే అలవాటు ఉన్న వారికి లైంగిక పరమైన సమస్యలు వస్తాయనేది అపోహేనని ఓ అధ్యయనంలో తేలింది. సైకిల్ తొక్కటం వల్ల నష్టాల కంటే లాభాలే ఎక్కువగా ఉన్నాయని శాన్ఫ్రాన్సిస్కోలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా పరిశోధకులు తేల్చారు. స్విమ్మింగ్, రన్నింగ్ చేసే వారితో పోలిస్తే సైక్లింగ్ చేసేవారికి లైంగిక పటుత్వం ఎక్కువగా ఉంటున్నట్లు తేలిందని వీరు చెబుతున్నారు. సైక్లింగ్‌తో కార్డియోవాస్యులర్ లాభాలతోపాటు కీళ్ల సమస్యలు కూడా తగ్గుతాయన్నారు. సైక్లిస్ట్లలో బరువు సంబంధ సమస్యలు కూడా చాలా వరకు దూరమైనట్లు పరిశోధకుల్లో ఒకరైన ప్రొఫెసర్ బెంజమిన్ బ్రేయర్ వివరించారు. అధ్యయనంలో భాగంగా 2,774మంది సైక్లిస్టులు, 539మంది స్విమ్మర్లు, 789 మంది రన్నర్స్‌ను పరిశోధకులు ఎంపిక చేసుకున్నారు. -
హిప్నాటిజంతో.. రూ. 93 వేలు నొక్కేశాడు!
ఆయనో బ్యాంకు మేనేజర్. రోజూలాగే తన కేబిన్‌లో కూర్చున్నారు. తన వద్దకు వచ్చిన ఓ వ్యక్తితో కాసేపు అలా మాట్లాడారో లేదో.. ఏదో మత్తులో ఉన్నట్లుగా క్యాషియర్ వద్దకు వెళ్లి, 90 వేల రూపాయలు అడిగి తీసుకున్నారు. తన జేబులో ఉన్న మరో రూ. 3వేలు కలిపి.. మొత్తం రూ. 93 వేలు ఆ వ్యక్తికి ఇచ్చేశారు. పది నిమిషాల తర్వాత గానీ ఏం జరిగిందో ఆయనకు తెలియలేదు. విషయం ఏమిటంటే, అవతల వచ్చిన వ్యక్తి మేనేజర్‌ను 'హిప్నటైజ్' చేశాడు! అవును.. హిప్నాటిజం ప్రభావంలో పడి సదరు బ్యాంకు మేనేజర్ అక్షరాలా 93 వేల రూపాయలు పోగొట్టుకున్నారు. ఈ ఘటన ముంబైలోని స్టేట్‌బ్యాంక్ ఆఫ్ పాటియాలాలో జరిగింది. మేనేజర్ భూపేంద్ర కుమార్ మణిరామ్ (52) వద్దకు తన పేరు ఎంకే శర్మ అని చెప్పుకొని ఓ వ్యక్తి వచ్చాడు. తాను మహారాష్ట్ర గృహనిర్మాణ సంస్థలో పనిచేస్తున్నట్లు తెలిపాడు. తన తమ్ముడు వికలాంగుడని, అతడి పేరు మీద బ్యాంకు ఖాతా తెరవాలని వచ్చానన్నాడు. ఎంహడాలో తక్కువ ధరకు ఫ్లాట్లు ఇప్పిస్తానని కూడా తెలిపాడు. తన పేరు రిజిస్టర్ చేసుకోవాల్సిందిగా చెప్పి, పాన్ కార్డు ఇతర వివరాలు ఇవ్వాలన్నాడు. తర్వాత కాసేపటికి మేనేజర్ భూపేంద్ర కుమార్ క్యాషియర్ వద్దకు వెళ్లి 90 వేలు తీసుకున్నారు. తన జేబులోంచి మరో 3 వేలు తీసి, మొత్తం 93 వేలు అతడికి ఇచ్చేశారు. తానేదో ట్రాన్స్‌లో ఉన్నానని, తనకేమీ తెలియలేదని, పదినిమిషాల తర్వాత మాత్రమే పూర్తిగా తెలివి వచ్చిందని ఆయన అన్నారు. ఈ వ్యవహారంపై 420 సెక్షన్ కింద కేసు నమోదైంది. తీరా చూస్తే ఎంహడాలో ఎంకే శర్మ పేరుతో ఎవరూ పనిచేయడం లేదని తెలిసింది. హిప్నాటిజంతో డబ్బులు దోచుకోవడం ఇదే మొదటిసారని పోలీసులు కూడా అంటున్నారు.