
న్యూఢిల్లీ: ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజ సంస్థ అమెజాన్ డెలివరీ బాయ్ అత్యాచార యత్నం కేసు కొత్త మలుపు తిరిగింది. తనను హిప‍్నటైస్ చేసి అమెజాన్ డెలివరీ బాయ్ అత్యాచార యత్నం చేశాడంటూ నోయిడాకు చెందిన ఓ మహిళ ఆరోపించిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేయడానికి సదరు మహిళ అంగీకరించలేదు. అంతేకాకుండా దీనికి సంబంధించిన ఫిర్యాదును కూడా ఆమె వెనక్కి తీసుకుంది.
ఈ కేసు విచారణ చేపట్టిన నోయిడా(సిటీ) ఎస్‌ఐ వినీత్ జైస్వాల్ మాట్లాడుతూ ...‘అమెజాన్ డెలివరీ బాయ్‌ను విచారించాం. తనపై వచ్చిన ఆరోపణలను అతను ఖండించాడు. వస్తువుల ఎక్చేంజ్ కోసం బాధితురాలి ప్లాట్‌కు వెళ్లినప్పుడు అక్కడ ఇరువురి మధ్య వాగ్వివాదం జరిగింది. దాని తరువాత కూడా అక్కడే కొన్ని ఫ్లాట్లలో అతను వస్తువులను డెలివరీ చేశాడు. బాధితురాలిని వైద్యపరీక్షలు చేయించుకోమని అడిగాం. అయితే ఆవిడ వైద్యపరీక్షలు చేయించుకోవడానికి నిరాకరించారు. అంతేకాకుండా ఆ ఫిర్యాదును కూడా వెనక్కు తీసుకున్నారు’ అని తెలిపారు. దీనిపై స్పందించిన అమెజాన్ సంస్థ తమకు కస్టమర్ల భద్రతే అత్యంత ప్రాధాన్యమైన విషయమని తెలిపింది. అప్పుడప్పుడూ ఇలాంటి సంఘటనలు తమను ఇబ్బందులకు గురిచేస్తూ ఉంటాయని... విచారణకు సంబంధించి పోలీసులకు పూర్తి సహకారం అందిస్తామని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment