హిప్నాటిజంతో.. రూ. 93 వేలు నొక్కేశాడు!
ఆయనో బ్యాంకు మేనేజర్. రోజూలాగే తన కేబిన్‌లో కూర్చున్నారు. తన వద్దకు వచ్చిన ఓ వ్యక్తితో కాసేపు అలా మాట్లాడారో లేదో.. ఏదో మత్తులో ఉన్నట్లుగా క్యాషియర్ వద్దకు వెళ్లి, 90 వేల రూపాయలు అడిగి తీసుకున్నారు. తన జేబులో ఉన్న మరో రూ. 3వేలు కలిపి.. మొత్తం రూ. 93 వేలు ఆ వ్యక్తికి ఇచ్చేశారు. పది నిమిషాల తర్వాత గానీ ఏం జరిగిందో ఆయనకు తెలియలేదు. విషయం ఏమిటంటే, అవతల వచ్చిన వ్యక్తి మేనేజర్‌ను 'హిప్నటైజ్' చేశాడు! అవును.. హిప్నాటిజం ప్రభావంలో పడి సదరు బ్యాంకు మేనేజర్ అక్షరాలా 93 వేల రూపాయలు పోగొట్టుకున్నారు. ఈ ఘటన ముంబైలోని స్టేట్‌బ్యాంక్ ఆఫ్ పాటియాలాలో జరిగింది.
మేనేజర్ భూపేంద్ర కుమార్ మణిరామ్ (52) వద్దకు తన పేరు ఎంకే శర్మ అని చెప్పుకొని ఓ వ్యక్తి వచ్చాడు. తాను మహారాష్ట్ర గృహనిర్మాణ సంస్థలో పనిచేస్తున్నట్లు తెలిపాడు. తన తమ్ముడు వికలాంగుడని, అతడి పేరు మీద బ్యాంకు ఖాతా తెరవాలని వచ్చానన్నాడు. ఎంహడాలో తక్కువ ధరకు ఫ్లాట్లు ఇప్పిస్తానని కూడా తెలిపాడు. తన పేరు రిజిస్టర్ చేసుకోవాల్సిందిగా చెప్పి, పాన్ కార్డు ఇతర వివరాలు ఇవ్వాలన్నాడు. తర్వాత కాసేపటికి మేనేజర్ భూపేంద్ర కుమార్ క్యాషియర్ వద్దకు వెళ్లి 90 వేలు తీసుకున్నారు. తన జేబులోంచి మరో 3 వేలు తీసి, మొత్తం 93 వేలు అతడికి ఇచ్చేశారు. తానేదో ట్రాన్స్‌లో ఉన్నానని, తనకేమీ తెలియలేదని, పదినిమిషాల తర్వాత మాత్రమే పూర్తిగా తెలివి వచ్చిందని ఆయన అన్నారు. ఈ వ్యవహారంపై 420 సెక్షన్ కింద కేసు నమోదైంది. తీరా చూస్తే ఎంహడాలో ఎంకే శర్మ పేరుతో ఎవరూ పనిచేయడం లేదని తెలిసింది. హిప్నాటిజంతో డబ్బులు దోచుకోవడం ఇదే మొదటిసారని పోలీసులు కూడా అంటున్నారు.