HYSEA
-
గుర్నానీకి హైసియా పురస్కారం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెక్ మహీంద్రా మాజీ సీఈవో, ఎండీ సి.పి.గుర్నానీ హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎంటర్ప్రైసెస్ అసోసియేషన్ (హైసియా) నుంచి జీవిత కాల సాఫల్య పురస్కారం అందుకున్నారు. హైసియా 31వ జాతీయ సదస్సు, అవార్డుల కార్యక్రమం బుధవారం హైదరాబాద్‌లో జరిగింది. 2022–23 సంవత్సరానికిగాను వివిధ విభాగాల్లో మొత్తం 36 కంపెనీలు, వ్యక్తులు హైసియా అవార్డులు అందుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. -
అన్ని ప్రాంతాల్లో మౌలిక వసతులు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగర అభివృద్దిపై తమకు సంపూర్ణ అవగాహన ఉందని, ఐటీ రంగం విస్తరించి ఉన్న ప్రాంతాల్లో మాత్రమే అభివృద్ధి జరుగుతోందనే విషయం వాస్తవం కాదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు చెప్పారు. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా అన్ని ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన జరుగుతోందని స్పష్టం చేశారు. హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎంటర్ప్రైజెస్ అసోసియేషన్ (హైసియా) ఆధ్వర్యంలో సోమవారం నెక్లెస్ రోడ్డులోని థ్రిల్సిటీలో జరిగిన ఐటీ పరిశ్రమ ప్రతినిధుల సమావేశంలో కేటీఆర్ ప్రసంగించారు. రాష్ట్రంలో ఎనిమిదేళ్లుగా ప్రణాళికబద్ధంగా చేసిన కృషితో హైదరాబాద్‌లో పెట్టుబడులకు అనుకూల వాతావరణం ఏర్పడిందని తెలిపారు. ఆవిష్కరణల వాతావరణాన్ని అభివృద్ధి చేయడంలో భాగంగా టీ హబ్, వీ హబ్, ఇన్నోవేషన్ సెల్, ప్రత్యేక శానిటేషన్ హబ్ ఏర్పాటు కాగా, త్వరలోనే దేశంలో అతిపెద్ద ప్రోటోటైప్ సెంటర్ టీ వర్క్స్‌ను ప్రారంభిస్తామని వెల్లడించారు. హైదరాబాద్‌లో ఆవిష్కరణల వ్యవస్థ బలంగా ఉండటంతో ఇప్పటికే అంతరిక్ష పరిశోధనలలో స్కై రూట్, ధ్రువ వంటి స్టార్టప్‌లు హైదరాబాద్ నుంచి విజయవంతంగా దూసుకెళ్తున్నాయని, త్వరలో మరిన్ని స్టార్టప్‌లు విజయం సాధిస్తాయని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. ఐటీ ఉద్యోగుల్లో 20 శాతం ఇక్కడే ఐటీ ఉద్యోగాల సంఖ్యలో హైదరాబాద్ తొలిసారిగా బెంగళూరును అధిగమించిందని, దేశంలోని ఐటీ ఉద్యోగుల్లో 20 శాతం మంది హైదరాబాద్‌లోనే పనిచేస్తున్నారని కేటీఆర్ వెల్లడించారు. ఆఫీసు స్పేస్ వినియోగంలోనూ బెంగళూరును హైదరాబాద్ అధిగమించి అత్యధిక ఉద్యోగాలు కల్పించిన నగరంగా నిలిచిందన్నారు. టాస్క్ ద్వారా ఇప్పటివరకు 7 లక్షల మంది యువతకు ఐటీ, లైఫ్‌సైన్సెస్, ఎలక్ట్రానిక్స్‌తో పాటు వివిధ రంగాల్లో నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇచ్చామని చెప్పారు. రాష్ట్రంలోని పది లక్షల గృహాలకు ఇంటర్నెట్ను అందించే ‘టీ ఫైబర్’ ఈ ఏడాది పూర్తవుతుందని, పౌర సేవల్లో దేశంలోనే తెలంగాణ ‘మీ సేవా’ కేంద్రాలు ఉత్తమంగా ఉన్నాయని తెలిపారు. విస్తరణపై దృష్టి పెట్టండి ఐటీ పరిశ్రమను హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు విస్తరించడంపై ఐటీ సంస్థలు ఆలోచించాలని, జిల్లా కేంద్రాల్లో ఇప్పటికే ఐటీ టవర్ల ఏర్పాటు శరవేగంగా సాగుతోందని కేటీఆర్ తెలిపారు. వరంగల్‌లో ఐటీ కంపెనీలు విజయవంతంగా కార్యకలాపాలు కొనసాగిస్తుండగా, ఆదిలా బాద్ లాంటి మారుమూల ప్రాంతాల్లోనూ ఐటీ కార్యాలయాలు అందుబాటులోకి వస్తాయన్నారు. బాసర ట్రిపుల్ ఐటీ వంటి విద్యాసంస్థల విద్యార్థులతో ఐటీ కంపెనీలు కలిసి పనిచేయాలన్నారు. సోషల్ ఇన్ఫ్రాను బలోపేతం చేస్తున్నాం సోషల్ ఇన్ఫ్రాలో హైదరాబాద్ దేశంలోనే మొదటి స్థానంలోనే ఉందని, ఎస్ఆర్డీపీ ద్వారా అనేక ప్రాజెక్టులను పూర్తి చేయడంతోపాటు మురుగునీటిని వందశాతం శుద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు కేటీఆర్ వెల్లడించారు. 2050 నాటికి హైదరాబాద్ తాగునీటి అవసరాలకు సరిపడా మౌలిక వసతుల నిర్మాణంతోపాటు హైదరాబాద్ మెట్రో, ఎయిర్పోర్ట్ మెట్రో తదితర ప్రజా రవాణా వ్యవస్థలను బలోపేతం చేస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్‌లో 300 కిలోమీటర్ల మేర సైక్లింగ్ ట్రాక్‌ను ఏర్పాటు చేసేందుకు జీహెచ్ఎంసీ ప్రయత్నిస్తోందని చెప్పారు. హైసియా అధ్యక్షుడు మనీషా సాబు, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ తదితరులు పాల్గొన్నారు. కేటీఆర్‌తో అమెరికా రాయబారి భేటీ భారత్‌లో అమెరికా రాయబారి ఎలిజబెత్ జోన్స్, హైదరాబాద్‌లోని యూఎస్ కాన్సుల్ జనరల్ జెన్నిఫర్ లార్సెన్ సోమవారం ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్‌తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. టీ హబ్ ప్రాంగణాన్ని కేటీఆర్‌తో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా టీ హబ్ ప్రత్యేకతలను కేటీఆర్ వారికి వివరించారు. హైదరాబాద్ ఆర్థిక పురో గతికి టీహబ్ అద్దం పడుతోందని, భారత్‌లోనే ప్రముఖ స్టార్టప్ ఇంక్యుబేటర్‌గా టీహబ్‌కు గుర్తింపు ఎందుకొచ్చిందో అర్థమైందని జెన్నిఫర్ లార్సెన్ ట్వీట్ చేశారు. అంతకుముందు ఎలిజబెత్ జోన్స్, జెన్నిఫర్ లార్సెన్‌లు రంగారెడ్డి జిల్లా ఆదిబట్లలోని టాటా లాకిడ్ మార్టిన్‌ను సందర్శించారు. వీరు టాటా లాకిడ్ ప్రతినిధులతో మాట్లాడుతూ.. టాటాసంస్థల పనితీరును ప్రశంసించినట్లు తెలిసింది. -
మనీషా సాబూ ఉన్నత పదవి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎంటర్ప్రైజెస్ అసోసియేషన్ (హైసియా) ప్రెసిడెంట్‌గా ఇన్ఫోసిస్ హైదరాబాద్ సెజ్ సెంటర్ హెడ్ సెంటర్ హెడ్ మనీషా సాబూ ఎన్నికయ్యారు. ఒక మహిళ ఈ బాధ్యతలు చేపట్టడం హైసియా చరిత్రలో ఇదే తొలిసారి. 2022–24 కాలానికి ఆమె ఈ పదవిలో ఉంటారు. హైసియా సీఎస్ఆర్ విభాగానికి మనీషా నేతృత్వం వహిస్తున్నారు. ఐటీ రంగంలో ఆమెకు 20 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హైసియా వైస్ ప్రెసిడెంట్‌గా ఫస్ట్‌సోర్స్ ప్రెసిడెంట్ ప్రశాంత్ నందెళ్ల, జనరల్ సెక్రటరీగా ఆరోప్రో సాఫ్ట్ సిస్టమ్స్ ప్రెసిడెంట్ రామకృష్ణ లింగిరెడ్డి ఎన్నికయ్యారు. చదవండి: హైదరాబాద్‌కి ఓకే చెప్పిన గ్రిడ్ డైనమిక్స్ -
Work From Home: ఇక ఉద్యోగులు ఆఫీసులకు రావాల్సిందే..!
ప్రస్తుతం కరోనా వైరస్ మూడో దశ కూడా ముగిసింది. చాలా కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ నుంచి మళ్లీ వర్క్ ఫ్రమ్ ఆఫీసుల వైపు మళ్లుతున్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఐటీ, ఐటీ ఆధారిత చిన్న, మధ్య తరహా, భారీ సంస్థలు ఉద్యోగుల విషయంలో ఏం ఆలోచిస్తున్నాయి? అనే అంశంపై హైదరాబాద్ సాఫ్ట్ వేర్ ఎంటర్ప్రైజెస్ అసోసియేష్(HYSEA) ఒక కీలక సర్వే నిర్వహించింది. ఆ సర్వేలో కొన్ని ఆసక్తికర అంశాలు వెలుగుచూశాయి. హైదరాబాద్ సాఫ్ట్ వేర్ ఎంటర్ ప్రైజెస్ అసోసియేషన్(HYSEA) ఫిబ్రవరిలో నిర్వహించిన 'రిటర్న్ టు ఆఫీస్' సర్వేలో మొత్తం 68 కంపెనీలు పాల్గొన్నాయి. హైదరాబాద్ కేంద్రంగా ఉన్నవే కాకుండా మల్టీ నేషనల్ కంపెనీలు కూడా ఈ సర్వేలో పాల్గొన్నాయి. హైదరాబాద్ కేంద్రంగా ఉన్న సంస్థల్లో వీటి శాతం 30గా భావించవచ్చు. ఇప్పటికే 56 శాతం ఆఫీసుల్లో ఉద్యోగులు ఆఫీసులకు వచ్చి పని చేస్తున్నారు. అదే సమయంలో 28 శాతం కంపెనీలు కొన్ని షరతులతో కూడిన వర్క్ ఫ్రమ్ ఆఫీస్(హైబ్రిడ్ మోడల్)లను నిర్వహిస్తున్నాయి. ఇంకో ఆసక్తికర విషయం ఏంటంటే.. 65 శాతం కంపెనీలు 100 శాతం ఉద్యోగులు అందరూ ఆఫీసులకు వచ్చి పని చేస్తే బాగుంటుందని ఆశిస్తున్నాయి. అయితే అది ఒకేసారి కాకుండా హైబ్రిడ్ మోడల్లో ఉండాలనుకుంటున్నాయి. అదే సమయంలో 15 శాతం కంపెనీలు అన్ని పనిదినాల్లో 100 శాతం ఉద్యోగులు ఆఫీసులకు వచ్చి పనిచేయాలని కోరుకుంటున్నాయి. 54 శాతం కంపెనీలు జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, నిర్ణయాల ఆధారంగా వర్క్ ఫ్రమ్ ఆఫీసు విషయంలో నిర్ణయాలు తీసుకుంటున్నాయి. అదే సమయంలో 46 శాతం కంపెనీలు స్థానిక నాయకత్వ నిర్ణయాలకు ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటున్నాయి. (చదవండి: మార్చిలో బ్యాంకుల సెలవుల జాబితా ఇదే..!) -
హైదరాబాద్‌లో వర్క్ ఫ్రమ్ హోంకు ఎండ్‌కార్డ్..! ఐటీ కంపెనీల కీలక నిర్ణయం..!
రాష్ట్రంలో కరోనా మూడో దశ పూర్తిగా ముగిసిపోయిందని తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు వెల్లడించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలోని ఐటీ కంపెనీలు ఉద్యోగులకు పూర్తిగా వర్క్ ఫ్రమ్ హోంను ఎత్తివేసి, ఆఫీసులకు పిలవొచ్చునని ఆయన మంగళవారం రోజున మీడియా సమావేశంలో తెలిపారు. దీంతో హైదరాబాద్‌లోని పలు ఐటీ కంపెనీలు ఉద్యోగులను తిరిగి ఆఫీసులకు పిలిచే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఐటీ కంపెనీలు సిద్దం..! కోవిడ్-19 మూడో వేవ్ ముగిసిందని తెలంగాణ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ పేర్కొనడంతో హైదరాబాద్‌లోని ఐటీ కంపెనీలు ఉద్యోగులను తిరిగి కార్యాలయాలకు పిలిపించుకునేందుకు సిద్ధమవుతున్నాయి. కంపెనీలు వర్క్-ఫ్రమ్-హోమ్ స్ట్రాటజీకి త్వరలోనే ముగింపు పలకవచ్చునని తెలుస్తోంది. ఇక ఆయా కంపెనీలు కూడా పూర్తి స్థాయి కార్యాలయాలను ప్రారంభించేందుకు త్వరలో ప్లాన్ చేస్తున్నాయి. ఈ ఏడాది జనవరిలో ఐటి కంపెనీలు ఉద్యోగులను తిరిగి కార్యాలయాలకు పిలవాలని భావించగా ఒక్కసారి ఓమిక్రాన్ వేరియంట్ రాకతో తిరిగి ఉద్యోగులు వర్క్ ఫ్రం హోంకే పరిమితమయ్యారు. అయితే రాష్ట్రంలో కోవిడ్-19 కేసుల పెరుగుదల కారణంగా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే, ఇప్పుడు కోవిడ్-19 కేసులు తగ్గుముఖం పట్టడంతోపాటు తెలంగాణలో కోవిడ్ పాజిటీవీటీ రేటు కూడా పడిపోవడంతో చాలా ఐటీ కంపెనీలు తమ మునుపటి నిర్ణయాన్ని పునరాలోచిస్తున్నాయి. రాబోయే రెండు వారాల్లో..! ఐటీ కంపెనీలు రాబోయే రెండు వారాల్లో కార్యాలయాలను ప్రారంభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గత రెండేళ్లలో నష్టపోయిన స్టార్టప్, చిన్న కంపెనీలు స్టాఫ్‌ని వెనక్కి పిలిపించుకోవాలని కంపెనీలు ఆలోచిస్తున్నాయి. కాగా, హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (హైసియా) ప్రెసిడెంట్ భరణి కె అరోల్ మాట్లాడుతూ...ఐటి కంపెనీలు అన్ని భద్రతా చర్యలతో సురక్షితమైన ప్రదేశాలని అన్నారు. చదవండి: 47 అంతస్తుల కో లీవింగ్ ప్రాజెక్ట్.. ఇండియాలోనే అతి పెద్దది.. ఎక్కడంటే? -
Hyderabad: ఐటీ కంపెనీల నయా ట్రెండ్..!
సాక్షి, హైదరాబాద్: కోవిడ్ విజృంభణ.. లాక్డౌన్ అనంతరం ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితులు నెలకొంటున్న నేపథ్యంలో డిసెంబర్ నాటికి 50% ఉద్యోగులను ఆఫీసులకు రప్పించేందుకు నగరంలోని పలు ఐటీ కంపెనీలు చర్యలు తీసుకుంటున్నాయి. తాజాగా హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎంటర్ప్రైజెస్ అసోసియేషన్ (హైసియా) నిర్వహించిన ఫ్యూచర్ వర్క్ మోడల్స్ సర్వేలో ఈ విషయం తేలింది. ఇక మహానగరం పరిధిలో చిన్న,పెద్ద ఐటీ కంపెనీలు సుమారు 1,500 వరకు కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. ఇందులో డిసెంబర్ నాటికి ఉద్యోగులను ఆఫీసు నుంచే పనిని ప్రారంభించేందుకు 33% కంపెనీలు చర్యలు తీసుకుంటున్నట్లు ఈ సర్వే వెల్లడించింది. (చదవండి: ఓవైపు కేసులు.. మరోవైపు మనవడికి 40 కోట్ల కానుక) మరో 41% సంస్థలు వచ్చే ఏడాది తమ ఉద్యోగులను ఆఫీసులకు రప్పించాలని భావిస్తున్నట్టు తేలింది. కాగా, తమ ఉద్యోగులను ఇంటి నుంచి పనిచేస్తుండటం వల్ల ఉత్పాదకత ఏమాత్రం తగ్గలేదని పలు కంపెనీలు వెల్లడించినట్లు పేర్కొంది. ఆయా కంపెనీల వ్యయం 22% తగ్గిందని పలు కంపెనీలు భావిస్తున్నాయి. ఐటీ సంస్థలు తమ ఉద్యోగులను ఆఫీసులకు రప్పించే విషయమై సొంతంగా ఎవరికి వారే హైబ్రిడ్ విధానం ప్రణాళిక వేసుకుంటున్నట్టు ఈ సర్వే తేల్చడం విశేషం. తగ్గని ఉత్పాదకత.. మహానగరం పరిధిలోని బహుళజాతి,చిన్న,పెద్ద ఐటీ కంపెనీలు 1,500 వరకు ఉన్నాయి. వీటిల్లో సుమారు 7 లక్షలమంది పనిచేస్తున్నారు. దాదాపు అన్ని కంపెనీలు..ఉద్యోగులకు అత్యవసర సమావేశాలు, ప్రాజెక్టు సమావేశాలు మినహా మిగతా రోజుల్లో ఇంటి నుంచి పనిచేసేందుకే అనుమతించాయి. అయినప్పటికీ ఉద్యోగుల ఉత్పాదకత ఏమాత్రం తగ్గలేదని ఐటీ రంగ నిపుణులు చెబుతున్నారు. ఆయా కంపెనీలకు యూరప్,బ్రిటన్,అమెరికా తదితర దేశాలనుంచి వచ్చే ఔట్సోర్సింగ్ ప్రాజెక్టులు సైతం తగ్గలేదని స్పష్టం చేస్తున్నారు. కాగా, ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉద్యోగులను కార్యాలయాలకు రప్పించేందుకు చర్యలు తీసుకోవాలని ఐటీ కంపెనీలకు సూచించచడంతో ఈ విషయంలో కదలిక మొదలైంది. ప్రస్తుతం క్రమంగా సాధారణ పరిస్థితులు నెలకొంటున్న నేపథ్యంలో డిసెంబరు నాటికి తమ ఉద్యోగుల్లో కనీసం 50 శాతమైనా కంపెనీలకు రప్పించాలని సొంతంగా ప్రణాళికలు సిద్ధంచేసుకుంటున్నట్లు హైసియా వర్గాలు ‘సాక్షి’కి తెలిపాయి. సొంతంగా ప్రణాళికలు సిద్ధంచేసుకుంటున్నారు ‘ఉద్యోగులను కార్యాలయాలకు రప్పించే విషయంలో ఐటీ కంపెనీలు వారి చేతిలో ఉన్న ప్రాజెక్టులు,ఉద్యోగుల అవసరాన్ని బట్టి హైబ్రిడ్ విధానాలను సొంతంగా తయారు చేసుకుంటున్నాయి. ఈవిషయంలో ఎవరి బలవంతమూ లేదు. ఇంటినుంచి పనిచేసే విధానమైనా ఆయా కంపెనీ ఉద్యోగుల ఉత్పాదకత, నగరం నుంచి ఐటీ ఉత్పత్తుల ఎగుమతుల్లో ఏమాత్రం తగ్గుదల నమోదు కాలేదు. ఐటీ ఎగుమతుల్లో ఏటా జాతీయ స్థాయి సగటు కంటే అధిక వృద్ధి నమోదవుతోంది. ఐటీ రంగంలో ఉద్యోగభద్రతకు కూడా ఎలాంటి ఢోకా లేదు. ఉద్యోగుల వేతనాల్లో కోతలు లేవు. నూతన ఉద్యోగాల సృష్టి కూడా క్రమంగా పెరుగుతోంది. – భరణి, హైసియా ప్రతినిధి -
ఇంటి నుంచీ పని చేయాల్సిందే
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కోవిడ్–19 పుణ్యమాని ఐటీ, ఐటీ సేవల రంగ ఉద్యోగులు ఇంటి నుంచి పని చేస్తున్నారు. కంపెనీనిబట్టి 20 శాతం లోపు మాత్రమే సిబ్బంది కార్యాలయాలకు వచ్చి విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే మహమ్మారి విస్తృతి నేపథ్యంలో ఉద్యోగులు ఆఫీసులకు వచ్చి పని చేసే అంశంపై హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎంటర్ప్రైసెస్ అసోసియేషన్ (హైసియా) తాజాగా ఓ సర్వే నిర్వహించింది. దీని ప్రకారం.. వర్క్ ఫ్రం ఆఫీస్ నూరు శాతం అసాధ్యం అని తేలింది. అంటే కీలక విభాగాల ఉద్యోగులు మాత్రమే కార్యాలయాలకు వచ్చి పని చేయాల్సి ఉంటుంది. ఇతరులు మాత్రం ఇంటిలోనే పని చేసేందుకు వీలు కల్పిస్తారు. కంపెనీల వర్క్ ఫ్రం ఆఫీస్ ప్రణాళికలు కోవిడ్–19 వ్యాక్సినేషన్, వీటి ఫలితాలపై మాత్రమే ఆధారపడి ఉంటుం దని స్పష్టమైంది. గడిచిన తొమ్మిది నెలల కాలంలో 20 శాతం పెద్ద కంపెనీలు కొంత ఆఫీస్ స్థలాన్ని ఖాళీ చేశాయి. మెరుగ్గా పని చేస్తున్నారు.. ఉద్యోగుల్లో 50 శాతం వరకు హైదరాబాద్ వెలుపల వారివారి స్వస్థలాల నుంచి విధులు నిర్వర్తిస్తున్నారు. ఉద్యోగులు వివిధ ప్రాంతాలకు చెందినవారు కావడంతో ఆఫీస్‌కు తిరిగి వచ్చి పని చేసే విషయం సంక్లిష్టంగా మారింది. వారు తిరిగి రావడానికి మరికొంత సమయం పడుతుంది. వర్క్ ఫ్రం హోం విధానంలోనూ ఉత్పాదకత మెరుగ్గా ఉంది. మహమ్మారి ముందస్తు రోజులతో పోలిస్తే ఉత్పాదకత 90 శాతంపైగా ఉందని 63 శాతం కంపెనీలు వెల్లడించాయి. కొన్ని కంపెనీల్లో ఉత్పాదకత 100 శాతం దాటింది. సర్వేలో పాలుపంచుకున్న కంపెనీల్లో.. 500 లోపు ఉద్యోగులున్నవి 63 శాతం, 501–1000 సిబ్బంది ఉన్నవి 11 శాతం, 1,000కిపైగా ఎంప్లాయ్స్ ఉన్నవి 26 శాతమున్నాయి. క్రమంగా ఆఫీసుకు.. వర్క్ ఫ్రం ఆఫీస్ 0.5 శాతం ఉందని 75 శాతంపైగా పెద్ద ఐటీ, ఐటీఈఎస్ సంస్థలు తెలిపాయి. 2021 మార్చి నాటికి 20 శాతంలోపు ఉద్యోగులను కార్యాలయం నుంచి పని చేసేలా ప్రణాళికలు చేస్తున్నట్టు 60 శాతం కంపెనీలు వెల్లడించాయి. జూన్ నాటికి దీనిని 40 శాతం వరకు చేయనున్నాయి. పెద్ద సంస్థలు డిసెంబర్ చివరి నాటికి 50–70 శాతం ఉద్యోగులను కార్యాలయం నుంచి పని చేయించాలని ఆలోచిస్తున్నాయి. నూరు శాతం వర్క్ ఫ్రం ఆఫీస్ వీలవుతుందని ఏ కంపెనీ కూడా చెప్పకపోవడం గమనార్హం. అత్యవసర విభాగాలు, కీలక ఉద్యోగులను మాత్రమే ఆఫీస్ నుంచి పని చేయిస్తామని 75 శాతం పెద్ద కంపెనీలు తెలిపాయి. వారంలో కొన్ని రోజులు మాత్రమే ఆఫీస్ నుంచి విధులు ఉండేలా కూడా ఏర్పాట్లు చేయనున్నాయి. క్లయింట్ల అత్యవసరాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు కొన్ని కంపెనీలు తెలిపాయి. -
నగరం నలుమూలలా ఐటీ విస్తరణ
సాక్షి, హైదరాబాద్: ఐటీ ఎగుమతుల్లో గత ఏడాది 18 శాతం వృద్ధిరేటు సాధించడం ద్వారా పెట్టుబడులకు హైదరాబాద్ అనుకూలమనే విషయాన్ని ప్రపంచానికి చెప్పగలిగామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎంటర్ప్రైజెస్ అసోసియేషన్ (హైసియా) 28వ వార్షిక సదస్సు ‘హైసియా ఇన్నోవేషన్ సమ్మిట్ 2020’లో కేటీఆర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. హైసియా అధ్యక్షుడు భరణి కె ఆరోల్ అధ్యక్షతన జరిగిన సదస్సులో కేటీఆర్ ప్రసంగించారు. ఐటీ గ్రిడ్ పాలసీలో భాగంగా హైదరాబాద్ నగరంలోని ఇతర ప్రాంతాలకు కూడా ఐటీ రంగాన్ని విస్తరిస్తున్నామని, గ్రిడ్ ఏరియాలో ఏర్పాటయ్యే చిన్న, మధ్య తరహా కంపెనీల(ఎస్ఎంఈ)కు అద్దెపై 30 శాతం రిబేటు ఇస్తామన్నారు. గ్రిడ్ ప్రాంతాల్లో 500 మంది కంటే ఎక్కువ మందితో ఏర్పాటయ్యే ఐటీ కంపెనీలకు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని చెప్పారు. కొంపల్లిలో వచ్చేవారం ఐటీ టవర్‌కు శంకుస్థాపన చేస్తామని, ఇప్పటికే 200కుపైగా ఎస్ఎంఈలు ఆసక్తి చూపుతున్నాయని కేటీఆర్ వెల్లడించారు. సమస్యల పరిష్కారానికి సానుకూలం కోవిడ్ సమయంలో ఐటీ కంపెనీలు ఉద్యోగులను తొలగించకుండా హైసియా వంటి సంఘాల సహకారంతో ఏర్పాటు చేసిన ‘లే ఆఫ్ రిడ్రెసల్ కమిటీ’ఫలితాన్నిచ్చిందని కేటీఆర్ వెల్లడించారు. ఐటీ డెవలపర్స్, రియల్ ఎస్టేట్ రంగం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా ఉందన్నారు. వర్క్ ఫ్రమ్ హోం విధానం కొనసాగుతున్నా దీర్ఘకాలంలో ఐటీ ఆఫీసులు, క్యాంపస్ మనుగడ సాగిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. నూతన ఆవిష్కరణల కోసం టిహబ్, నైపుణ్య శిక్షణ కోసం టాస్క్‌తో కలసి హైసియా పనిచేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. కోవిడ్ కాలంలో, వరదల వేళ హైసియా, ఆమ్‌చామ్, టై, నాస్కామ్ వంటి ఐటీ సంఘాలు, ఐటీ కంపెనీలు విరాళాలతో ముందుకు రావడం హర్షణీయమన్నారు. ఐటీ కంపెనీలకు అవార్డులు హైసియా వార్షికోత్సవం సందర్భంగా వివిధ కేటగిరీల్లో పలు ఐటీ కంపెనీలకు కేటీఆర్ చేతుల మీదుగా అవార్డులు అందజేశారు. ఎంపిక చేసిన పది స్టార్టప్‌లకు ఏడాదిపాటు స్పాన్సర్షిప్ అందిస్తామని హైసియా ప్రకటించింది. 170 స్టార్టప్‌లు, 200 మంది ఐటీ పరిశ్రమల ప్రముఖులు సదస్సులో పాల్గొన్నారు. సదస్సులో ఎస్టీపీఐ డీజీ ఓంకార్ రాయ్, ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, టెక్ మహీంద్ర సీఈవో ఎండీ సీపీ గుర్నానీ తదితరులు పాల్గొన్నారు. -
హైసియా కార్యవర్గం ఎంపిక
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎంటర్ప్రైజెస్ అసోసియేషన్ (హై సియా) ఐదుగురు కార్యవర్గం సభ్యుల బృందం ఎంపికైంది. గురువారమిక్కడ జరిగిన తొలి సమావేశంలో 2016-18 రెండేళ్ల కాల పరమితి గల ఈ బృందాన్ని ఎంపిక చేసినట్లు హైసియా ప్రెసిడెంట్‌గా ఇటీవలే కొత్తగా ఎంపికైన రంగా పోతుల ఒక ప్రకటనలో తెలిపారు. వైస్ ప్రెసిడెంట్లుగా జెన్‌క్యూ సీఈఓ మురళీ బొల్లు, ఎస్‌బీయూ (ఇండియా) మాన్యుఫ్యాక్చరింగ్ అండ్ టెక్నాలజీ హెడ్ హెచ్ ఆర్ శ్రీనివాస్‌రావులు, సెక్రటరీగా బట్లర్ అమెరికా ఇండియా ఆపరేషన్ అండ్ గ్లోబల్ ఐటీ/బీపీఓ సర్వీసెస్ వైస్ ప్రెసిడెంట్ భరణి కే ఆరోల్, ట్రెజరర్‌గా సీ3ఐ సపోర్ట్ సర్వీసెస్ వైస్ ప్రెసిడెంట్ పద్మజా చౌదరి, ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ కే హరికుమార్లున్నారు. -
హైసియా కొత్త ప్రెసిడెంట్ గా రంగా!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎంటర్ప్రైజెస్ అసోసియేషన్ (హైసియా) 2016-18గాను కొత్త ప్రెసిడెంట్‌గా రంగా పోతుల ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. హైసియా 24వ జనరల్‌బాడీ సమావేశంలో ఈయన నియమితులైనట్లు సంస్థ గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం ఇన్ఫార్ ఇండియా ప్రై.లి. వైస్ ప్రెసిడెంట్, సెంటర్ హెడ్ (హైదరాబాద్)గా బాధ్యతలు చేపడుతున్న రంగాకు పరిశ్రమలో దాదాపు 27 ఏళ్ల సుదీర్ఘ అనుభవముందని ప్రకటనలో పేర్కొన్నారు.