అమెరికా రాయబారి ఎలిజబెత్ జోన్స్‌కు జ్ఞాపికను అందజేస్తున్న కేటీఆర్. చిత్రంలో హైదరాబాద్ యూఎస్ కాన్సుల్ జనరల్ జెన్నిఫర్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగర అభివృద్దిపై తమకు సంపూర్ణ అవగాహన ఉందని, ఐటీ రంగం విస్తరించి ఉన్న ప్రాంతాల్లో మాత్రమే అభివృద్ధి జరుగుతోందనే విషయం వాస్తవం కాదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు చెప్పారు. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా అన్ని ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన జరుగుతోందని స్పష్టం చేశారు.
హైదరాబాద్ సాఫ్ట్‌వేర్ ఎంటర్‌ప్రైజెస్ అసోసియేషన్ (హైసియా) ఆధ్వర్యంలో సోమవారం నెక్లెస్ రోడ్డులోని థ్రిల్‌సిటీలో జరిగిన ఐటీ పరిశ్రమ ప్రతినిధుల సమావేశంలో కేటీఆర్ ప్రసంగించారు. రాష్ట్రంలో ఎనిమిదేళ్లుగా ప్రణాళికబద్ధంగా చేసిన కృషితో హైదరాబాద్‌లో పెట్టుబడులకు అనుకూల వాతావరణం ఏర్పడిందని తెలిపారు.
ఆవిష్కరణల వాతావరణాన్ని అభివృద్ధి చేయడంలో భాగంగా టీ హబ్, వీ హబ్, ఇన్నోవేషన్ సెల్, ప్రత్యేక శానిటేషన్ హబ్ ఏర్పాటు కాగా, త్వరలోనే దేశంలో అతిపెద్ద ప్రోటోటైప్ సెంటర్ టీ వర్క్స్‌ను ప్రారంభిస్తామని వెల్లడించారు. హైదరాబాద్‌లో ఆవిష్కరణల వ్యవస్థ బలంగా ఉండటంతో ఇప్పటికే అంతరిక్ష పరిశోధనలలో స్కై రూట్, ధ్రువ వంటి స్టార్టప్‌లు హైదరాబాద్ నుంచి విజయవంతంగా దూసుకెళ్తున్నాయని, త్వరలో మరిన్ని స్టార్టప్‌లు విజయం సాధిస్తాయని మంత్రి ధీమా వ్యక్తం చేశారు.
ఐటీ ఉద్యోగుల్లో 20 శాతం ఇక్కడే
ఐటీ ఉద్యోగాల సంఖ్యలో హైదరాబాద్ తొలిసారిగా బెంగళూరును అధిగమించిందని, దేశంలోని ఐటీ ఉద్యోగుల్లో 20 శాతం మంది హైదరాబాద్‌లోనే పనిచేస్తున్నారని కేటీఆర్ వెల్లడించారు. ఆఫీసు స్పేస్ వినియోగంలోనూ బెంగళూరును హైదరాబాద్ అధిగమించి అత్యధిక ఉద్యోగాలు కల్పించిన నగరంగా నిలిచిందన్నారు. టాస్క్ ద్వారా ఇప్పటివరకు 7 లక్షల మంది యువతకు ఐటీ, లైఫ్‌సైన్సెస్, ఎలక్ట్రానిక్స్‌తో పాటు వివిధ రంగాల్లో నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇచ్చామని చెప్పారు. రాష్ట్రంలోని పది లక్షల గృహాలకు ఇంటర్నెట్‌ను అందించే ‘టీ ఫైబర్’ ఈ ఏడాది పూర్తవుతుందని, పౌర సేవల్లో దేశంలోనే తెలంగాణ ‘మీ సేవా’ కేంద్రాలు ఉత్తమంగా ఉన్నాయని తెలిపారు.
విస్తరణపై దృష్టి పెట్టండి
ఐటీ పరిశ్రమను హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు విస్తరించడంపై ఐటీ సంస్థలు ఆలోచించాలని, జిల్లా కేంద్రాల్లో ఇప్పటికే ఐటీ టవర్ల ఏర్పాటు శరవేగంగా సాగుతోందని కేటీఆర్ తెలిపారు. వరంగల్‌లో ఐటీ కంపెనీలు విజయవంతంగా కార్యకలాపాలు కొనసాగిస్తుండగా, ఆదిలా బాద్ లాంటి మారుమూల ప్రాంతాల్లోనూ ఐటీ కార్యాలయాలు అందుబాటులోకి వస్తాయన్నారు. బాసర ట్రిపుల్ ఐటీ వంటి విద్యాసంస్థల విద్యార్థులతో ఐటీ కంపెనీలు కలిసి పనిచేయాలన్నారు.
సోషల్ ఇన్‌ఫ్రాను బలోపేతం చేస్తున్నాం
సోషల్ ఇన్‌ఫ్రాలో హైదరాబాద్ దేశంలోనే మొదటి స్థానంలోనే ఉందని, ఎస్‌ఆర్‌డీపీ ద్వారా అనేక ప్రాజెక్టులను పూర్తి చేయడంతోపాటు మురుగునీటిని వందశాతం శుద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు కేటీఆర్ వెల్లడించారు. 2050 నాటికి హైదరాబాద్ తాగునీటి అవసరాలకు సరిపడా మౌలిక వసతుల నిర్మాణంతోపాటు హైదరాబాద్ మెట్రో, ఎయిర్‌పోర్ట్ మెట్రో తదితర ప్రజా రవాణా వ్యవస్థలను బలోపేతం చేస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్‌లో 300 కిలోమీటర్ల మేర సైక్లింగ్ ట్రాక్‌ను ఏర్పాటు చేసేందుకు జీహెచ్‌ఎంసీ ప్రయత్నిస్తోందని చెప్పారు. హైసియా అధ్యక్షుడు మనీషా సాబు, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ తదితరులు పాల్గొన్నారు.
కేటీఆర్‌తో అమెరికా రాయబారి భేటీ
భారత్‌లో అమెరికా రాయబారి ఎలిజబెత్ జోన్స్, హైదరాబాద్‌లోని యూఎస్ కాన్సుల్ జనరల్ జెన్నిఫర్ లార్సెన్ సోమవారం ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్‌తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. టీ హబ్ ప్రాంగణాన్ని కేటీఆర్‌తో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా టీ హబ్ ప్రత్యేకతలను కేటీఆర్ వారికి వివరించారు.
హైదరాబాద్ ఆర్థిక పురో గతికి టీహబ్ అద్దం పడుతోందని, భారత్‌లోనే ప్రముఖ స్టార్టప్ ఇంక్యుబేటర్‌గా టీహబ్‌కు గుర్తింపు ఎందుకొచ్చిందో అర్థమైందని జెన్నిఫర్ లార్సెన్ ట్వీట్ చేశారు. అంతకుముందు ఎలిజబెత్ జోన్స్, జెన్నిఫర్ లార్సెన్‌లు రంగారెడ్డి జిల్లా ఆదిబట్లలోని టాటా లాకిడ్ మార్టిన్‌ను సందర్శించారు. వీరు టాటా లాకిడ్ ప్రతినిధులతో మాట్లాడుతూ.. టాటాసంస్థల పనితీరును ప్రశంసించినట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment