సాక్షి, హైదరాబాద్: కోవిడ్ విజృంభణ.. లాక్‌డౌన్ అనంతరం ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితులు నెలకొంటున్న నేపథ్యంలో డిసెంబర్ నాటికి 50% ఉద్యోగులను ఆఫీసులకు రప్పించేందుకు నగరంలోని పలు ఐటీ కంపెనీలు చర్యలు తీసుకుంటున్నాయి. తాజాగా హైదరాబాద్ సాఫ్ట్‌వేర్ ఎంటర్‌ప్రైజెస్ అసోసియేషన్ (హైసియా) నిర్వహించిన ఫ్యూచర్ వర్క్ మోడల్స్ సర్వేలో ఈ విషయం తేలింది. ఇక మహానగరం పరిధిలో చిన్న,పెద్ద ఐటీ కంపెనీలు సుమారు 1,500 వరకు కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. ఇందులో డిసెంబర్ నాటికి ఉద్యోగులను ఆఫీసు నుంచే పనిని ప్రారంభించేందుకు 33% కంపెనీలు చర్యలు తీసుకుంటున్నట్లు ఈ సర్వే వెల్లడించింది. (చదవండి: ఓవైపు కేసులు.. మరోవైపు మనవడికి 40 కోట్ల కానుక)
మరో 41% సంస్థలు వచ్చే ఏడాది తమ ఉద్యోగులను ఆఫీసులకు రప్పించాలని భావిస్తున్నట్టు తేలింది. కాగా, తమ ఉద్యోగులను ఇంటి నుంచి పనిచేస్తుండటం వల్ల ఉత్పాదకత ఏమాత్రం తగ్గలేదని పలు కంపెనీలు వెల్లడించినట్లు పేర్కొంది. ఆయా కంపెనీల వ్యయం 22% తగ్గిందని పలు కంపెనీలు భావిస్తున్నాయి. ఐటీ సంస్థలు తమ ఉద్యోగులను ఆఫీసులకు రప్పించే విషయమై సొంతంగా ఎవరికి వారే హైబ్రిడ్ విధానం ప్రణాళిక వేసుకుంటున్నట్టు ఈ సర్వే తేల్చడం విశేషం.
తగ్గని ఉత్పాదకత..
మహానగరం పరిధిలోని బహుళజాతి,చిన్న,పెద్ద ఐటీ కంపెనీలు 1,500 వరకు ఉన్నాయి. వీటిల్లో సుమారు 7 లక్షలమంది పనిచేస్తున్నారు. దాదాపు అన్ని కంపెనీలు..ఉద్యోగులకు అత్యవసర సమావేశాలు, ప్రాజెక్టు సమావేశాలు మినహా మిగతా రోజుల్లో ఇంటి నుంచి పనిచేసేందుకే అనుమతించాయి. అయినప్పటికీ ఉద్యోగుల ఉత్పాదకత ఏమాత్రం తగ్గలేదని ఐటీ రంగ నిపుణులు చెబుతున్నారు. ఆయా కంపెనీలకు యూరప్,బ్రిటన్,అమెరికా తదితర దేశాలనుంచి వచ్చే ఔట్‌సోర్సింగ్ ప్రాజెక్టులు సైతం తగ్గలేదని స్పష్టం చేస్తున్నారు. కాగా, ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉద్యోగులను కార్యాలయాలకు రప్పించేందుకు చర్యలు తీసుకోవాలని ఐటీ కంపెనీలకు సూచించచడంతో ఈ విషయంలో కదలిక మొదలైంది. ప్రస్తుతం క్రమంగా సాధారణ పరిస్థితులు నెలకొంటున్న నేపథ్యంలో డిసెంబరు నాటికి తమ ఉద్యోగుల్లో కనీసం 50 శాతమైనా కంపెనీలకు రప్పించాలని సొంతంగా ప్రణాళికలు సిద్ధంచేసుకుంటున్నట్లు హైసియా వర్గాలు ‘సాక్షి’కి తెలిపాయి.
సొంతంగా ప్రణాళికలు సిద్ధంచేసుకుంటున్నారు
‘ఉద్యోగులను కార్యాలయాలకు రప్పించే విషయంలో ఐటీ కంపెనీలు వారి చేతిలో ఉన్న ప్రాజెక్టులు,ఉద్యోగుల అవసరాన్ని బట్టి హైబ్రిడ్ విధానాలను సొంతంగా తయారు చేసుకుంటున్నాయి. ఈవిషయంలో ఎవరి బలవంతమూ లేదు. ఇంటినుంచి పనిచేసే విధానమైనా ఆయా కంపెనీ ఉద్యోగుల ఉత్పాదకత, నగరం నుంచి ఐటీ ఉత్పత్తుల ఎగుమతుల్లో ఏమాత్రం తగ్గుదల నమోదు కాలేదు. ఐటీ ఎగుమతుల్లో ఏటా జాతీయ స్థాయి సగటు కంటే అధిక వృద్ధి నమోదవుతోంది. ఐటీ రంగంలో ఉద్యోగభద్రతకు కూడా ఎలాంటి ఢోకా లేదు. ఉద్యోగుల వేతనాల్లో కోతలు లేవు. నూతన ఉద్యోగాల సృష్టి కూడా క్రమంగా పెరుగుతోంది.
– భరణి, హైసియా ప్రతినిధి
Comments
Please login to add a commentAdd a comment