హ్యూసిస్ ఆటోమేషన్ బాట
- వ్యవస్థాపకులు జి.ఆర్.రెడ్డి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హెచ్ఆర్ మేనేజ్మెంట్ సేవలందిస్తున్న హ్యూసిస్ ఆటోమేషన్ బాట పట్టింది. హ్యూమన్ రిసోర్సెస్(హెచ్ఆర్) రంగంలో రోజువారీ కార్యకలాపాలను పూర్తిగా క్లౌడ్ ఆధారిత టెక్నాలజీకి అనుసంధానం చేసింది. ఇందుకోసం పలు సేవలందిస్తున్న కంపెనీలతో చేతులు కలిపింది. పేరోల్, బెనిఫిట్స్, హైరింగ్, ట్యాక్సెస్ ఇలా 150 రకాల అంశాలను ఒకే ప్లాట్‌ఫామ్‌పైకి తీసుకొచ్చామని హ్యూసిస్ వ్యవస్థాపకులు జి.ఆర్.రెడ్డి మంగళవారమిక్కడ మీడియాకు తెలిపారు.
తాము సేవలందిస్తున్న కంపెనీలకు మరింత మెరుగ్గా వన్ స్టాప్ సొల్యూషన్స్‌ను ఈ టెక్నాలజీ వీలు కల్పిస్తుందని చెప్పారు. ‘ఐఎస్బీ, ఆస్ట్రాజెనికా వంటి 400 కంపెనీలు క్లయింట్లుగా ఉన్నాయి. హెచ్ఆర్ విభాగంలేని కంపెనీలకు హెచ్ఆర్ ఫంక్షన్ మేనేజ్మెంట్ సేవలను థర్డ్ పార్టీగా అందిస్తున్నాం. ఏడాదిలో 100 నగరాలకు చేరుకోవడం ద్వారా క్లయింట్లకు చెందిన 5 లక్షల మంది ఉద్యోగులకు సేవలను అందించాలన్నది లక్ష్యం’ అని తెలిపారు.