ఐటీ మినహాయింపు 5 లక్షలు చేయాలి
రూ.2.50 లక్షలకు సెక్షన్ 80సీ మినహాయింపు పెంచాలి
డెలాయిట్ బడ్జెట్ ముందస్తు సర్వేలో అభిప్రాయాలు
న్యూఢిల్లీ: రానున్న కేంద్ర ఆర్థిక బడ్జెట్లో ఆ శాఖ మంత్రి అరుణ్‌జైట్లీ ఆదాయపన్ను మినహాయింపును ప్రస్తుతమున్న రూ.2.50 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచాలంటూ ట్యాక్స్ సలహా సేవల సంస్థ డెలాయిట్ నిర్వహించిన సర్వేలో బలమైన అభిప్రాయం వ్యక్తమైంది. అలాగే, సెక్షన్ 80సీ కింద ప్రస్తుతమున్న రూ.1.50 లక్షల అదనపు మినహాయింపును సైతం రూ.2.50 లక్షలకు పెంచాలని కూడా సర్వేలో పాల్గొన్న వారు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇందులో వెల్లడైన అభిప్రాయాలు ఇలా ఉన్నాయి...
అందరిదీ ఒకటే మాట...
ఆదాయపన్ను మినహాయింపును గణనీయంగా పెంచాలని సర్వేలో పాల్గొన్న వారిలో దాదాపు అందరూ కోరగా... 58 శాతం మంది అయితే పరిమితిని రూ.5 లక్షలకు పెంచాలని డిమాండ్ చేశారు. ‘‘ప్రభుత్వం ఇలా చేయడం వల్ల వినియోగదారుల చేతుల్లో మరింత నగదు ఉంచినట్టు అవుతుంది. దీంతో డిమాండ్ ఊపందుకుంటుంది. శ్లాబ్ రేటును మార్చడం వల్ల పొదుపును ప్రోత్సహించినట్టు అవుతుంది. ఫలితంగా వ్యవస్థలో పెట్టుబడులు పెరగడానికి ఇది దోహదం చేస్తుంది’’ అని డెలాయిట్ నివేదిక పేర్కొంది.
రూ.2.50 లక్షలు చేయాలి...
సెక్షన్ 80సీ కింద ప్రస్తుతం వివిధ రకాల సాధనాల్లో రూ.1.50 లక్షల పెట్టుబడులకు ఇస్తున్న పన్ను మినహాయింపును రూ.2.50 లక్షలు చేయాలని సర్వేలో 71 శాతం మంది అభిప్రాయం తెలిపారు. ‘‘ఆదాయ స్థాయిలు, ద్రవ్యోల్బణం దృష్ట్యా ప్రస్తుత పరిమితి సహేతుకంగా లేదు. దీన్ని పెంచడం వల్ల గృహస్థుల పొదుపు... బీమా, ప్రావిడెంట్ ఫండ్, ఈక్విటీ తదితర సాధనాల వైపు మళ్లుతుంది. దీంతో మౌలిక రంగంపై మరింత పెద్ద మొత్తంలో వ్యయానికి ఊతమిచ్చినట్టు అవుతుంది’’ అని సర్వే నివేదిక వెల్లడించింది.
కార్పొరేట్ ట్యాక్స్‌ను 18%కి తగ్గించాలి:సీఐఐ
కార్పొరేట్ పన్నును బడ్జెట్లో 18 శాతానికి తగ్గించాలని సీఐఐ డిమాండ్ చేసింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖకు వినతిపత్రాన్ని అందించింది. 2017–18 బడ్జెట్‌కు సంబంధించి ఇచ్చిన సూచనల్లో కార్పొరేట్ పన్ను రేటును 18 శాతానికి తగ్గించాలని, అన్ని సర్‌చార్జీలు, సెస్ కూడా కలిపి ఈ మేరకే ఉండాలని సీఐఐ సూచించింది. అదే సమయంలో పన్ను తగ్గింపులు, ప్రోత్సాహకాలను తొలగించాలని కోరినట్టు సీఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ ఢిల్లీలో మీడియాకు తెలిపారు.