IAS topper Shah Faesal
-
‘అంతా ముగిసిపోయింది..దాయాల్సిందేమీ లేదు’
న్యూఢిల్లీ : మాజీ ఐఏఎస్ అధికారి, జమ్మూ కశ్మీర్ రాజకీయ నాయకుడు షా ఫైజల్‌ను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆర్టికల్ 370 రద్దు, రాష్ట్ర విభజన నేపథ్యంలో విదేశాలకు వెళ్లేందుకు ప్రయత్నించిన ఆయనను తిరిగి శ్రీనగర్‌కు పంపించారు. ప్రస్తుతం ఆయనను గృహ నిర్బంధంలో ఉంచినట్లు తెలుస్తోంది. 2009లో సివిల్స్‌లో టాప్ ర్యాంక్ సాధించిన తొలి కశ్మీరీగా రికార్డు నెలకొల్పిన షా ఫైజల్.. గత జనవరిలో తన ఉద్యోగానికి రాజీనామా చేసి.. రాజకీయ పార్టీని స్థాపించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు, రాష్ట్ర విభజన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంపై ఫైజల్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈద్ సందర్భంగా ప్రతీ అవమానానికి బదులు తీర్చుకునే వరకు పండుగ జరపుకోబోనని ఆయన ట్వీట్ చేశారు. అదే విధంగా మంగళవారం..‘ కశ్మీర్లో రాజకీయ హక్కులను కాపాడుకునేందుకు సుస్థిర, అహింసాయుతమైన, దీర్ఘకాలపు రాజకీయ ఉద్యమం రావాల్సి ఉంది. ఆర్టికల్ 370 రద్దు అయిన వెంటనే అంతా ముగిసిపోయింది. రాజ్యాంగవేత్తలు మాయమైపోయారు. ప్రస్తుతం ఇక్కడ ఒకరి కింద పనిచేస్తూ వారి చెప్పిందానికల్లా తలాడించడమో లేదా వేర్పాటువాదిగా ఉండటమో చేయాలి. ఇందులో దాయాల్సిందేమీ లేదు. ఎవరి నిర్ణయం వారిది’ అని ఫైజల్ ట్విటర్ వేదికగా అసహనం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఆయన ఇస్తాంబుల్ వెళ్లేందుకు ఢిల్లీ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. దీంతో ఆయనను అడ్డుకున్న పోలీసులు జమ్మూ కశ్మీర్‌కు పంపించారు. Kashmir will need a long, sustained, non-violent political mass movement for restoration of the political rights. Abolition of Article 370 has finished the mainstream. Constitutionalists are gone. So you can either be a stooge or a separatist now. No shades of grey. — Shah Faesal (@shahfaesal) August 13, 2019 -
కొత్త పార్టీని స్థాపించిన సివిల్స్ టాపర్
శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌కు చెందిన మాజీ ఐఏఎస్ అధికారి, 2010 సివిల్స్ టాపర్ షా ఫైజల్ ఆదివారం జమ్ము అండ్ కశ్మీర్ పీపుల్స్ మూమెంట్ అనే కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించనున్నారు. రాజ్‌బాగ్ పట్టణంలోని గిండున్ గ్రౌండ్లో పార్టీని ఆవిష్కరించనున్నట్టు ఫైజల్ తెలిపారు. కశ్మీరీలపై నిరాటంకంగా కొనసాగుతున్న ఆకృత్యాలు, అణచివేతను నిరసిస్తూ యూపీఎస్సీ 2010 బ్యాచ్ టాపర్ అయిన ఫైజల్.. ఐఏఎస్ పదవికి ఈ ఏడాది జనవరిలో రాజీనామా చేసిన విషయం తెలిసిందే. కేంద్రం కీలక ప్రభుత్వ సంస్థలను నాశనం చేసేలా వ్యవహరిస్తున్నదని ఆయన తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యంగా బీజేపీ ప్రభుత్వం వ్యవహార తీరుపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ముస్లిం, దళితులపై దాడులు జరుగుతున్నాయని ఆయన పలుమార్లు ఆవేదన వ్యక్తం చేశారు. వీటన్నింటికీ నిరసనగా తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఫైజల్ ప్రకటించారు. రాష్ట్రంలో అవినీతిరహిత, పారదర్శక రాజకీయాల కోసం తనకు మద్దతుగా నిలువాలని కొంతకాలంగా యువతతోపాటు వివిధ వర్గాలను కలుస్తూ ప్రచారం చేస్తున్నారు. కశ్మీర్లో శాంతిని కోరుకుంటున్న పలువురు యువనాయకులు ఆయన పార్టీలో చేరే అవకాశం ఉంది. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో పోటీపై ఆయన ఎలాంటి ప్రకటన చేయ్యలేదు. -
‘ఈ పదేళ్లు జైలులో గడిపినట్లుంది’
శ్రీనగర్ : ఐఏఎస్ అధికారిగా ఉన్న ఈ పదేళ్లు నాకు జైలులో గడిపినట్లనిపించింది అంటున్నారు మాజీ ఐఏఎస్ అధికారి షా ఫజల్. 2009లో సివిల్ సర్వీస్ పరీక్షలో మొదటి ర్యాంకు సాధించిన తొలి కశ్మీరీగా చరిత్ర సృష్టించిన ఫజల్.. గత నెలలో తన పదవికి రాజీనామ చేసిన సంగతి తెలిసిందే. ఉద్యోగానికి రాజీనామ చేసిన తరువాత తొలిసారి ఓ పబ్లిక్ మీటింగ్‌కు హాజరయ్యారు ఫజల్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘విదేశాలకు వెళ్తే నా కుటుంబంతో కలిసి చాల సౌకర్యవంతమైన జీవితం గడిపే అవకాశం ఉన్నప్పటికి కూడా.. నేను అలా చేయలేదు. నా ప్రజల కోసం ఇక్కడే ఉండాలనుకున్నాను. ప్రజలకు, అధికారులకు మధ్య ఉన్న అగాధాన్ని పూడ్చాలనుకున్నాను. ఐఏఎస్‌ను ఎంచుకున్నాను’ అని తెలిపారు. అంతేకాక ‘ఈ పదేళ్లలో నా ప్రజలకు ఎన్నో సేవలు చేశాను. దాంతో పాటు సర్వీసు కాలంలో ఎన్నో అన్యాయాలను, అమానుషాలను కూడా చూశాను. వీటన్నింటి గురించి విన్నప్పడు నేను చాలా నిస్సహాయుడినని భావించేవాడిని. నిజం చెప్తున్న.. ఈ పదేళ్లు జైలులో ఉన్నట్లు అనిపించింది. కానీ ఇప్పుడు ఉద్యోగాన్ని వదిలేశాను. ఇక మీదట ఊరూరా తిరుగుతు ప్రజల సమస్యల గురించి పోరాటం చేస్తాన’ని తెలిపాడు. అంతేకాక కశ్మీర్ ప్రజల గురించి మాట్లాడ్డానికి.. వారి సమస్యల గురించి పోరాటం చేయడానికి తాను రాజకీయాల్లోకి వస్తున్నాని ప్రకటించాడు. అవినీతి రహిత రాజకీయాల కోసం తాను పాటుపడతానని.. అందుకే ఏ పార్టీలో చేరబోనని.. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని తెలిపాడు షా ఫజల్. -
సివిల్స్ టాపర్ సంచలన నిర్ణయం
శ్రీనగర్: జమ్మూ, కశ్మీర్‌కు చెందిన యువ ఐఏఎస్ అధికారి షా ఫజల్ బుధవారం తన ఉద్యోగానికి రాజీనామా చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. 2009లో జరిగిన సివిల్ సర్వీస్ పరీక్షలో ఆయన మొదటి ర్యాంకు సాధించారు. ఫస్ట్ ర్యాంకు సాధించిన మొదటి కశ్మీరీగా ఆయన చరిత్ర సృష్టించారు. ఐఏఎస్ అధికారి అయినప్పటి నుంచి ప్రజల్లో ఉంటూ.. ప్రజల సమస్యలపై నిత్యం స్పందిం చే వారు. కశ్మీర్లో జరుగుతున్న నిరంతర హత్యలకు నిరసనగా తాను రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. హత్యలను అరికట్టేం దుకు కేంద్రం చర్యలు తీసుకో వట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తన రాజీనామాకు గల కారణాలను తన ఫేస్బుక్ పేజీలో రాశారు. కొన్ని హిందుత్వ శక్తుల చేతుల్లో 20 కోట్ల భారతీయ ముస్లింలు వివక్షకు గురవుతు న్నారని,వారిని పక్కకు పెడుతున్నారని తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. కశ్మీర్లో జరుగుతున్న అత్యాచారాలపై స్పందిస్తూ.. ఫజల్ ఆరు నెలల కింద ఓ ట్వీట్ చేశారు. వెంటనే ఆయనపై జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఆ తర్వాత శిక్షణ కోసం విదేశాలకు వెళ్లి ఇటీవలే వచ్చిన ఫజల్.. పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్నారు. బీజేపీ ప్రభుత్వం పేరు ప్రస్తావించకుండా.. కేంద్రంపై పలు విమర్శలు చేశారు. ‘ఆర్బీఐ, సీబీఐ, ఎన్ఐఏ తదితర ప్రభుత్వ రంగ సంస్థలను నాశనం చేస్తూ రాజ్యాంగం ప్రసాదించిన గొప్ప కట్టడాన్ని కూలదోయాలని చూస్తున్నారని, దీన్ని ఆపాల్సిన అవసరం ఉంది’ అని అన్నారు. ఫజల్ నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీలో చేరతారని, వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో బారాముల్లా నుంచి పోటీ చేస్తారని భావిస్తున్నారు. -
రేపిస్తాన్ ట్వీట్.. ‘బాస్ నుంచి లవ్ లెటర్’
సాక్షి, న్యూఢిల్లీ : సివిల్స్ పరీక్షల్లో తొలి కశ్మీర్ టాపర్ షా ఫైజల్‌కు కేంద్ర ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తున్నందుకు క్రమశిక్షణ ఉల్లంఘన చర్యలు తీసుకునేందుకు సన్నద్ధమతుతోంది. ఈ మేరకు మంగళవారం ఆయనకు షోకాజు నోటీసులు పంపించింది. 15 రోజుల్లోగా వివరణయివ్వాలని ఆదేశించింది. అశ్లీల చిత్రాలు చూడటానికి అలవాటు పడిన ఓ కామాంధుడు గుజరాత్లో కన్నతల్లిపై అత్యాచారానికి పాల్పడిన దారుణోదంతంపై స్పందించిన షా ఫైజల్.. ఇండియాను ‘రేపిస్తాన్’ అనే అర్థం వచ్చేలా వ్యంగ్యంగా ఓ ట్వీట్ చేశారు. అది కాస్త వైరల్ అయింది. ఓ ప్రభుత్వ ఉద్యోగి అయివుండి ఇండియాను ఇలా అవమానిస్తారా అని ఓ వ్యక్తి ట్విటర్ ద్వారా ప్రశ్నించగా.. ‘మీరు ఇది ఇండియా అని ఎలా గుర్తించారు. మీరు ప్రధాని కార్యాలయం(పీఎంఓ)కు ట్యాగ్ చేయడం మరిచిపోయారు’ అని వ్యంగ్యంగా సమాధానమిచ్చారు. సోషల్ మీడియాలో ఇలాంటి వాఖ్యలు చేయడం పట్ల కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయింది. ప్రభుత్వాన్ని అధికారులు కించపరిచేవిధంగా ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయకూడదని 2016లో కేంద్ర ప్రభుత్వం నిబంధన విధించింది. అనుచిత వ్యాఖ్యలు చేసిన అధికారులపై తగిన చర్యలు తీసుకుంటామని ప్రకటించింది. నిబంధనలు అతిక్రమించినందుకు షా ఫైజల్‌కు షోకాజు నోటీసులు పంపించింది. తనకు నోటీసులు వచ్చిన విషయాన్ని ఆయన ధ్రువీకరించారు. తన బాస్ నుంచి లవ్ లెటర్ వచ్చిందని ట్వీట్ చేశారు. ‘దక్షిణాసియాలో పెరిగిపోతున్న అత్యాచార సంస్కృతిపై వ్యంగ్యంగా స్పందించినందుకు మా బాస్ నుంచి నాకు ప్రేమలేఖ వచ్చింద’ని వెల్లడించారు. కాగా, తన వ్యాఖ్యలను షా ఫైజల్ సమర్థించుకున్నారు. భావప్రకటన స్వేచ్ఛ తనకుందని తెలిపారు. ప్రభుత్వం ఉద్యోగిని అయినా తాము కూడా సమాజంలో భాగమేనని ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. మీ వ్యాఖ్యల వల్ల ఉద్యోగం కొల్పోయే అవకాశం ఉంటుందని తెలియదా అని అడగ్గా.. నేను ఎలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయలేదు. ఎవరిని కించపరిచే విధంగా ప్రవర్తించలేదు. ఈ చర్చలో నా ఉద్యోగం కొల్పోవడం అనేది చిన్న సమస్య. నా ఉద్దేశ్యం వేరు. ఒకవేళ ఉద్యోగం పోయినా పర్లేదు. ప్రపంచానికైనా మంచి జరుగుతుంద’ని సమాధానమిచ్చారు. pic.twitter.com/aIE2M8BmpR — Shah Faesal (@shahfaesal) July 10, 2018 కాగా షా ఫైజల్‌కు జమ్మూకశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా బాసటగా నిలిచారు. షా ఫైజల్ ట్వీట్లో ఎలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు లేవని అన్నారు. రాజస్థాన్ తదితర ప్రాంతాల్లోని అధికారులు ప్రభుత్వ నియమాలను ఉల్లంఘిస్తే పట్టించుకోని ప్రభుత్వం.. ఫైజల్‌కు నోటీసులు పంపడం దారుణమని ట్విటర్లో పేర్కొన్నారు. -
టీఆర్పీ రేటింగ్స్ కోసమే కశ్మీర్లో చిచ్చు!
చానెళ్ల తీరుపై మారకపోతే రాజీనామా చేస్తాను: కశ్మీర ఐఏఎస్ టాపర్ హెచ్చరిక సివిల్స్ పరీక్షల్లో తొలి కశ్మీర్ టాపర్ షా ఫైజల్ తాజాగా లోయలో జరగుతున్న హింసాత్మక ఘటనలపై ఫేస్బుక్లో స్పందించారు. ‘రాజ్యం తన పౌరుల్ని తానే చంపడం.. గాయపర్చడం.. తనను తాను గాయపర్చుకొని.. స్వీయవిధ్వంసం చేసుకోవడమేనని’ అని ఆయన తన తాజా పోస్టులో పేర్కొన్నారు. ప్రస్తుతం కశ్మీర్లో పాఠశాల విద్య డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న ఫైజల్.. తన ఫొటోలు, మిలిటెంట్ కమాండర్ బుర్హాన్ వనీ మృతదేహం ఫొటోలు పక్కపక్కనపెట్టి కొన్ని చానెళ్లు కథనాలు ప్రసారం చేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జాతీయ మీడియా తన తీరు మార్చుకోకపోతే త్వరలోనే ఐఏఎస్ ఉద్యోగానికి రాజీనామా చేస్తానని ఆయన హెచ్చరించారు. ‘నా ఫొటోలు, మృతిచెందిన మిలిటెంటర్ కమాండర్ బుర్హాన్ వనీ ఫోటోలు కలిపి చూపించడం ద్వారా ఓ సెక్షన్ జాతీయ మీడియా తన సంప్రదాయబద్ధమైన కథనాలు వండివారుస్తోంది. అబద్ధాలు, ప్రజల్లో విభజన ప్రాతిపదికగా ప్రసారం చేసే ఈ కథనాలు మరింత విద్వేషాన్ని రేపుతాయి’ అని ఫైజల్ ఆందోళన వ్యక్తం చేశారు. ’ప్రస్తుత మరణాలతో కశ్మీర్ తీవ్ర సంతాపంలో మునిగిపోయిన సమయంలో న్యూస్‌రూమ్స్ నుంచి రెచ్చగొట్టేలా వెలువడుతున్న వాడీవేడి కథనాలు కశ్మీరీలను మరింత ఏకాకులను చేస్తున్నాయి. వారిలో మరింత ఆగ్రహాన్ని రేపుతున్నాయి. భారత ప్రభుత్వం కన్నా మీడియా తీరే దారుణంగా ఉంది’ అని ఫైజల్ పేర్కొన్నారు. కేవలం టీఆర్పీ రేటింగ్స్ కోసం కశ్మీర్ లోయలో చిచ్చురేపుతున్న వారి పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరముందని ఆయన సూచించారు. ఇలాంటి మూర్ఖమైన టీవీ చర్చల్లో తాను పరోక్షంగా భాగం కావడం ఎంతో చికాకును కలిగిస్తున్నదని, టీవీ చానెళ్లు తనను చిత్రీకరించిన తీరు ఎంతో బాధకు గురిచేసిందని ఆయన పేర్కొన్నారు.