టీఆర్పీ రేటింగ్స్ కోసమే కశ్మీర్‌లో చిచ్చు!
-
చానెళ్ల తీరుపై మారకపోతే రాజీనామా చేస్తాను: కశ్మీర ఐఏఎస్ టాపర్ హెచ్చరిక
సివిల్స్ పరీక్షల్లో తొలి కశ్మీర్ టాపర్ షా ఫైజల్ తాజాగా లోయలో జరగుతున్న హింసాత్మక ఘటనలపై ఫేస్‌బుక్‌లో స్పందించారు. ‘రాజ్యం తన పౌరుల్ని తానే చంపడం.. గాయపర్చడం.. తనను తాను గాయపర్చుకొని.. స్వీయవిధ్వంసం చేసుకోవడమేనని’ అని ఆయన తన తాజా పోస్టులో పేర్కొన్నారు.
ప్రస్తుతం కశ్మీర్‌లో పాఠశాల విద్య డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న ఫైజల్.. తన ఫొటోలు, మిలిటెంట్ కమాండర్ బుర్హాన్ వనీ మృతదేహం ఫొటోలు పక్కపక్కనపెట్టి కొన్ని చానెళ్లు కథనాలు ప్రసారం చేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జాతీయ మీడియా తన తీరు మార్చుకోకపోతే త్వరలోనే ఐఏఎస్ ఉద్యోగానికి రాజీనామా చేస్తానని ఆయన హెచ్చరించారు. ‘నా ఫొటోలు, మృతిచెందిన మిలిటెంటర్ కమాండర్ బుర్హాన్ వనీ ఫోటోలు కలిపి చూపించడం ద్వారా ఓ సెక్షన్ జాతీయ మీడియా తన సంప్రదాయబద్ధమైన కథనాలు వండివారుస్తోంది. అబద్ధాలు, ప్రజల్లో విభజన ప్రాతిపదికగా ప్రసారం చేసే ఈ కథనాలు మరింత విద్వేషాన్ని రేపుతాయి’ అని ఫైజల్ ఆందోళన వ్యక్తం చేశారు.
’ప్రస్తుత మరణాలతో కశ్మీర్ తీవ్ర సంతాపంలో మునిగిపోయిన సమయంలో న్యూస్‌రూమ్స్ నుంచి రెచ్చగొట్టేలా వెలువడుతున్న వాడీవేడి కథనాలు కశ్మీరీలను మరింత ఏకాకులను చేస్తున్నాయి. వారిలో మరింత ఆగ్రహాన్ని రేపుతున్నాయి. భారత ప్రభుత్వం కన్నా మీడియా తీరే దారుణంగా ఉంది’ అని ఫైజల్ పేర్కొన్నారు. కేవలం టీఆర్పీ రేటింగ్స్ కోసం కశ్మీర్ లోయలో చిచ్చురేపుతున్న వారి పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరముందని ఆయన సూచించారు. ఇలాంటి మూర్ఖమైన టీవీ చర్చల్లో తాను పరోక్షంగా భాగం కావడం ఎంతో చికాకును కలిగిస్తున్నదని, టీవీ చానెళ్లు తనను చిత్రీకరించిన తీరు ఎంతో బాధకు గురిచేసిందని ఆయన పేర్కొన్నారు.