రెబెల్స్!
పురపాలక ఎన్నికలు రాజకీయ పార్టీలకు ఇబ్బందులు తెచ్చిపెడుతున్నాయి. ఈ ఎన్నికల్లో వెలువడే ఫలితాలే సార్వత్రిక సమరంలోనూ ప్రతిఫలించే అవకాశం లేకపోలేదని.. అన్ని పార్టీలూ అభ్యర్థుల ఎంపికపై ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. ఈ కారణంగా అభ్యర్థుల జాబితాపై మల్లగుల్లాలు పడుతున్నాయి.
అభ్యర్థిని ఖరారు చేస్తే ఆశావహుల నుంచి వ్యతిరేకత వస్తుందని భావిస్తున్న పార్టీ పెద్దలు.. పేర్లు ఖరారు చేయకుండా చివరి నిమిషం వరకు గోప్యత పాటిస్తున్నారు. నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియకు చివరి నిమిషంలో ఎంపిక చేసిన అభ్యర్థులకు బి-ఫారాలు ఇవ్వాలని పార్టీలు నిర్ణయించుకున్నట్లు నేతలు చెబుతున్నారు. రెబెల్స్!
ఇబ్రహీంపట్నం నగర పంచాయతీ ఎస్సీ జనరల్‌కు రిజర్వ్ కావడం పార్టీ నేతలకు అభ్యర్థుల సమస్య తలెత్తింది. జనరల్‌కు రిజర్వ్ అవుతుందని భావించిన వివిధ పార్టీల నేతలు దాదాపు ఏడాది కాలంగా ప్రజల్లోకి వెళ్తూ వివిధ సేవా కార్యక్రమాలు చేపట్టారు. తీరా రిజర్వేషన్లు ఖరారు కావడంతో పరిస్థితులు మారాయి. రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులను వెతకడంలో తలమునకలైన పార్టీలు ఇప్పటివరకు అభ్యర్థులను ఖరారు చేయలేదు. నామినేషన్ల ప్రక్రియ పూర్తయినప్పటికీ.. ఇద్దరేసి అభ్యర్థులు నామినేషన్లు వేశారు. దీంతో వారిని బుజ్జగించి ఉపసంహరణ చేసుకునేలా నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు.
ముఖ్యంగా ఇక్కడ టీడీపీ, కాంగ్రెస్ పార్టీల మధ్యే పోటీ నడుస్తోంది. ఇరుపార్టీల నుంచి ముగ్గురేసి అభ్యర్థులున్నారు. పూర్తిస్థాయిలో చర్చించి మంగళవారం ఉదయంకల్లా ఖరారు చేయనున్నట్లు పార్టీవర్గాలు చెబుతున్నాయి.
తాండూరు మున్సిపాలిటీ జనరల్ మహిళకు రిజర్వ్ అయింది. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని ఖరారు చేయగా.. స్థానికంగా నెలకొన్న సమీకరణ లతో టీడీపీకి అభ్యర్థుల కొరత ఏర్పడింది. అయితే కాంగ్రెస్ మాత్రం అభ్యర్థిని ఖరారు చేయలేదు. ఆ పార్టీ నుంచి 9వ వార్డు, 29 వార్డులో అభ్యర్థుల మధ్య పోటీ నెలకొంది.
వికారాబాద్ మున్సిపాలిటీ జనరల్‌కు రిజర్వైంది. చైర్మన్ అభ్యర్థిగా టీడీపీ నుంచి రమేష్‌కుమార్, టీఆర్ఎస్ నుంచి శుభప్రద్ పటేల్ పేర్లు దాదాపు ఖరారైనప్పటికీ, కాంగ్రెస్‌లో మాత్రం ఇంకా సస్పెన్స్ వీడలేదు. ఆ పార్టీ నుంచి వి.సత్యనారాయణ పేరు ముందువరుసలో ఉన్నప్పటికీ మరో ఇద్దరి పేర్లు కూడా పరిశీలిస్తున్నట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. ఒకట్రెండు రోజుల్లో స్పష్టత రానుంది.
పట్టణ ప్రాంతంలోని బడంగ్‌పేట, పెద్ద అంబర్‌పేట నగర పంచాయతీల పరిధిలో పోటీ పెద్దగా లేనప్పటికీ పార్టీలు మాత్రం ఇప్పటికీ అభ్యర్థులను ఖరారు చేయలేదు.