జీఎస్టీ అమల్లో సీఏలు కీలకం
► ఐసీఏఐ అంతర్జాతీయ సదస్సులో వెంకయ్య నాయుడు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అత్యంత ముఖ్యమైన సంస్కరణల్లో ఒకటైన వస్తు, సేవల పన్నుల (జీఎస్టీ) విధానం సజావుగా అమలయ్యేలా చూడటంలో చార్టర్డ్ అకౌంటెంట్లు కీలక పాత్ర పోషించాల్సి ఉంటుందని కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి వెంకయ్యనాయుడు చెప్పారు.జీఎస్టీఅమల్లో సవాళ్లతో పాటు అవకాశాలు కూడా ఉన్నాయన్నారు. దేశ ఆర్థికాభివృద్ధికి తమ వంతు తోడ్పాటు అందించేందుకు సీఏలు అవకాశాలను అందిపుచ్చుకోవాలని సూచించారు. ది ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ (ఐసీఏఐ) ఆధ్వర్యంలో అంతర్జాతీయ సదస్సు ‘జ్ఞాన యజ్ఞ’ను శనివారమిక్కడ ప్రారంభించి ప్రసంగించారు. ‘జీఎస్టీ సజావుగా అమలయ్యేలా చూసేందుకు అకౌంటింగ్ నిపుణులు సన్నద్ధం కావాలి. దేశ పురోగతిలో భాగస్వాములయ్యేందుకు ఇది మీకు ఒక మంచి అవకాశం’ అని సీఏలకు సూచించారు. ధనార్జనే ధ్యేయం కాకుండా ప్రమాణాలకు, నైతికతకు పెద్ద పీట వేయాలని పేర్కొన్నారు.అంతర్జాతీయ అకౌంటింగ్ ప్రమాణాలను అందుకునే క్రమంలో ఐసీఏఐ గట్టి కృషి చేస్తోందని ప్రశంసించారు.
వృద్ధి బాటలో భారత్ ..:ప్రపంచ దేశాలన్నీ మందగమనంలో ఉన్న ప్రస్తుత తరుణంలో వేగంగా ఎదుగుతున్న ఏకైక దేశం భారత్ మాత్రమేనని, తద్వారా పెట్టుబడులకు ఆకర్షణీయ దేశంగా నిలుస్తోందని వెంకయ్య చెప్పారు. ప్రభుత్వం చేపడుతున్న సంస్కరణలతో రాబోయే రోజుల్లో ఆర్థిక వృద్ధి మరింత పుంజుకోగలదన్నారు. అవినీతికి తావులేకుండా వ్యవస్థలను పటిష్టం చేస్తున్నామన్నారు. ఇందులో భాగంగా జన ధన యోచన, ఆధార్, మొబైల్ మొదలైనవి సమర్ధంగా వినియోగించే ప్రయత్నాల్లో ఉన్నామని వెంకయ్య నాయుడు తెలిపారు.
కాగా, అంతర్జాతీయంగా అకౌంటింగ్ విధానాలు, దేశీ ప్రమాణాలను మెరుగుపర్చుకోవడం మొదలైన అంశాలపై ఈ సదస్సులో చర్చించనున్నట్లు ఐసీఏఐ ప్రెసిడెంట్ ఎం. దేవరాజ రెడ్డి తెలిపారు. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆసియన్ అండ్ పసిఫిక్ అకౌంటెంట్స్ (సీఏపీఏ) ప్రెసిడెంట్ జాకీ పొయీర్, వైస్ ప్రెసిడెంట్ మనోజ్ ఫడ్నిస్, ఐసీఏఐ వైస్ ప్రెసిడెంట్ నీలేష్ వికమ్సే తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రెండు రోజుల ఈ సదస్సులో దేశవిదేశాల నుంచిమూడున్నరవేల మంది ప్రతినిధులు హాజరవుతున్నారు.