సిరియాలో వైమానిక దాడులు: 45 మంది మృతి
బీరట్: సిరియాపై ఒప్పందానికి రష్యా, అమెరికా అంగీకరించిన ఒక రోజు తరువాత అక్కడి ఓ మార్కెట్, రెబెల్ల అధీనంలోని ఇద్లిబ్ పట్టణంలో కొన్ని ప్రాంతాల్లో శనివారం జరిగిన వైమానిక దాడుల్లో 45 మంది చనిపోయారు. మరో 90 మంది గాయపడటానికి కారణమైన ఈ దాడికి పాల్పడింది ఎవరో తెలియరాలేదు. కొన్ని మృతదేహాలు గుర్తించలేనంతగా కాలిపోవడంతో మృతుల్లో సాధారణ పౌరులు ఎందరన్నది స్పష్టం కాలేదు. దాడుల్లో పలు దుకాణాలు, వాహనాలు ధ్వంసమయ్యాయి.
సిరియాలో సోమవారం నుంచి కాల్పుల విరమణ ఒప్పందం ప్రారంభమవుతుందని జెనీవాలో చర్చల తరువాత అమెరికా విదేశాంగ మంత్రి జాన్కెర్రీ, రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ శుక్రవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ఒప్పందం అమలైతే ప్రభుత్వ దళాలు తిరుగుబాటుదారుల అధీనంలోని ప్రాంతాలపై దాడులను ఆపాలి. ఫలితంగా యుద్ధ ప్రభావిత పౌరులకు అవసరమైన సాయం అందుతుందని భావిస్తున్నారు.