IIT-Bombay
-
ఐఐటీ–బాంబేలో ప్రొఫెసర్‌గా ‘టీసీఎస్’ గోపీనాథన్
ముంబై: ఐటీ దిగ్గజం టీసీఎస్ సీఈవో హోదా నుంచి తప్పుకుని అందర్నీ ఆశ్చర్యపర్చిన రాజేశ్ గోపీనాథన్ తాజాగా ఐఐటీ–బాంబేలో పార్ట్‌టైమ్ ప్రొఫెసర్‌గా బాధ్యతలు చేపట్టారు. మేథోసంపత్తిని ప్రయోగశాలల నుంచి పరిశ్రమకు బదలాయించడంలో సహాయకరంగా ఉండేలా ఇటీవల ఏర్పాటు చేసిన ట్రాన్స్లేషనల్ రీసెర్చ్ సెంటర్‌కు ఆయన హెడ్‌గా వ్యవహరిస్తారని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐ టీ) బాంబే తెలిపింది. ’ప్రొఫెసర్ ఆఫ్ ప్రాక్టీస్’ హోదాలో గోపీనాథన్ ఈ సెంటర్ మరింత క్రి యాశీలకంగా పని చేసేందుకు తోడ్పాటు అందించనున్నట్లు వివరించింది. ఈ కోవకు చెంది న ప్రొఫెసర్లు ప్రత్యేక లెక్చర్లు, కోర్సులను అందిస్తూ పార్ట్–టైమ్‌గా బాధ్యతలు నిర్వహిస్తుంటారని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ ఏ డాది తొలినాళ్లలో రాజేశ్ గోపీనాథన్ టీసీఎస్ సీఈవో హోదా నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. -
ఆధార్ కార్డ్ వినియోగదారులకు కేంద్రం శుభవార్త! ఇంటి వద్ద నుంచే స్మార్ట్‌ఫోన్ ద్వారా
ఆధార్ కార్డ్ దారులకు ప్రజలకు కేంద్రం శుభవార్త చెప్పింది. త్వరలో భారత విశిష్ట ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్‌లో టచ్‌లెస్ బయోమెట్రిక్ విధానాన్ని అందుబాటులోకి తేనుంది. ఈ సౌకర్యం అందుబాటులోకి వస్తే ప్రజలు ఎక్కడున్నా, ఏ సమయంలోనైనా ఆధార్ కార్డ్ కోసం బయోమెట్రిక్ (ముఖ ఛాయాచిత్రం, ఐరిస్ స్కాన్, వేలిముద్రలు) వేయొచ్చు. ఇందుకోసం ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ బాంబే)తో ఒప్పందం కుదుర్చుకుంది. ఎంఓయూలో భాగంగా ‘ఆధార్ సంస్థ - ఐఐటీ బాంబే’ సంయుక్తంగా ఫోన్ ద్వారా కేవైసీ వివరాలతో ఫింగర్‌ప్రింట్స్ తీసుకునేలా ‘మొబైల్ క్యాప్చర్ సిస్టమ్’ టెక్నాలజీపై రీసెర్చ్ చేయనున్నారు. మొబైల్ క్యాప్చర్ టెక్నాలజీ వినియోగంలోకి వస్తే టచ్‌లెస్ బయోమెట్రిక్ క్యాప్చర్ సిస్టమ్ సాయంతో ఇంటి వద్ద నుంచే ఆధార్ బేస్డ్ ఫింగర్ ప్రింట్ అథంటికేషన్‌ను (వేలిముద్రలు) అప్డేట్ చేయొచ్చు. నిజమైన ఆధార్ లబ్ధి దారుల్ని గుర్తించేలా ఫేస్ రికగ్నైజేషన్‌కు సమానంగా ఫింగర్ ప్రింట్ పద్దతి పనిచేస్తుంది. ఇది అమల్లోకి వచ్చిన తర్వాత ఆధార్ వ్యవస్థ మరింత మెరుగు పడనుంది. సిగ్నల్/ఇమేజ్ ప్రాసెసింగ్, మెషిన్ లెర్నింగ్/డీప్ లెర్నింగ్ వంటి టెక్నాలజీ కలయికతో పనిచేసే ఈ వ్యవస్థ ఆధార్ సంబంధిత సేవల్ని మొబైల్ ద్వారా అందించడలో మరింత సులభతరం చేస్తుంది. రోజుకు 70 మిలియన్ల మంది అధికారిక వర్గాల సమాచారం ప్రకారం..పేరు, చిరునామా, పుట్టిన తేదీ, జెండర్, మొబైల్ నంబర్, ఈ-మెయిల్ ఐడీ, రిలేషన్షిప్ స్టేటస్, ఐరిస్, వేలిముద్ర, ఫోటో వంటి వివరాలను అప్డేట్ చేసుకునే (Aadhaar authentications) వారి సంఖ్య పెరిగిపోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆధార్‌లో మార్పులు చేసుకునేందుకు గాను యూఐడీఏఐకి రోజుకు 70-80 మిలియన్ల మంది అప్లయ్ చేసుకుంటున్నారు. డిసెంబర్ 2022 చివరి నాటికి వారి సంఖ్య 88.29 బిలియన్లను దాటింది. సగటున రోజుకు 70 మిలియన్ల మంది ఆధార్‌లో మార్పులు చేసుకుంటున్నట్లు యూఐడీఏఐ తెలిపింది. చదవండి👉 ఊహించని ఎదురు దెబ్బ..చిక్కుల్లో వీజీ సిద్ధార్థ సతీమణి మాళవిక హెగ్డే! -
భారతీయుడి చేతికి ట్విట్టర్ పగ్గాలు.. సీఈవోగా ఐఐటీ ముంబై పూర్వ విద్యార్థి
శాన్ఫ్రాన్సిస్కో: టెక్నాలజీ ప్రపంచంపై మరో భారతీయ అమెరికన్ తనదైన ముద్ర వేయనున్నారు. ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ట్విట్టర్’ సీఈవోగా భారతీయ అమెరికన్ పరాగ్ అగర్వాల్ నియమితులయ్యారు. ప్రస్తుతం సీఈవో స్థానంలో ఉన్న సంస్థ సహ వ్యవస్థాపకుడు జాక్‌డార్సే సోమవారం రాజీనామా చేశారు. ఈ విషయాన్ని కంపెనీతోపాటు.. డార్సే సైతం ట్విట్టర్లో ప్రకటించారు. పరాగ్ అగర్వాల్ ఇప్పటి వరకు ట్విట్టర్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్(సీటీవో)గా పనిచేశారు. ఫైనాన్షియల్ పేమెంట్స్ కంపెనీ ‘స్క్వేర్’కు సైతం డార్సే చీఫ్‌గా ఉన్నారు. దీంతో సంస్థలో వాటాలు కలిగిన పెద్ద ఇన్వెస్టర్లు.. డార్సే రెండు బాధ్యతలను సమర్థవంతంగా నడిపించగలరా? అన్న సందేహాలను వ్యక్తం చేశారు. దీంతో ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం. వెళ్లిపోయే సమయం వచ్చింది ‘‘కంపెనీ వ్యవస్థాపకుడి నుంచి సీఈవో, ఎగ్జిక్యూటివ్ చైర్మన్ వరకు 16 ఏళ్లలో ఎన్నో బాధ్యతల్లో పనిచేశాను. కంపెనీని వీడే సమయం వచ్చిందన్న నిర్ణయానికి వచ్చేశాను. ఎందుకని? వ్యవస్థాపకుల నేతృత్వంలోని సంస్థ ప్రాముఖ్యం గురించి పెద్ద చర్చే నడుస్తోంది. అంతిమంగా ఇది ఎన్నో పరిమితులకు దారితీస్తుందని, వైఫల్యానికి ఏకైక అంశంగా మారుతుందని భావిస్తున్నాను’’ అంటూ ట్విట్టర్ పేజీలోని తన పోస్ట్‌లో డార్సే వివరించారు. ఏకాభిప్రాయంతో ఎంపిక: ‘‘బోర్డు విస్తృత ప్రక్రియ, అన్ని ఆప్షన్లను పరిశీలించి ఏకాభిప్రాయంతో పరాగ్‌ను సీఈవోగా నియమించింది. కంపెనీని ఎంతో లోతుగా అర్థం చేసు కున్న పరాగ్ ముందు నుంచి నా ఎంపికే. సంస్థలో ప్రతీ కీలక నిర్ణయం వెనుక ఆయన ఉన్నా రు. పరాగ్ ఎంతో ఆసక్తి, పరిశీలన, సృజనాత్మకత, స్వీయ అవగాహన, వినయం కలిగిన వ్యక్తి. మనస్ఫూర్తిగా సంస్థను నడిపిస్తారు. నేను నిత్యం ఆయన నుంచి ఎంతో కొంత నేర్చుకున్నాను. సీఈవోగా ఆయన పట్ల నాకు పూర్తి విశ్వాసం ఉంది’’అని డార్సే అన్నారు. 2022 లో డార్సే పదవీకాలం పూర్తయ్యే వరకు ట్విట్టర్ బోర్డులో కొనసాగుతారని కంపెనీ తెలిపింది. 11 ఏళ్లలోనే కీలక స్థానానికి.. పరాగ్ అగర్వాల్ ఐఐటీ బోంబేలో బీటెక్ విద్య పూర్తయిన తర్వాత స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో ఎంఎస్, పీహెచ్డీ పూర్తి చేశారు. పదేళ్ల క్రితం 2011లో ట్విట్టర్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా చేరారు. ఆ సమయంలో సంస్థ ఉద్యోగులు 1,000 మందే ఉండడం గమనార్హం. 2018లో సీటీవో అయ్యారు. సీఈవోగా ఎంపిక కావడం తనకు గర్వకారణమని పరాగ్ ప్రకటించారు. ‘‘మీ (జాక్‌డార్సే) మార్గదర్శకత్వం, స్నేహానికి జోహార్లు. మీరు నిర్మించిన పని విధానం, సంస్కృతికి ధన్యుడను. సంస్థను కీలకమైన సవాళ్ల మధ్య నడిపించారు. దశాబ్దం క్రితం.. ఆ రోజులను నిన్నటిగానే భావిస్తాను. మీ అడుగుల్లో నడిచాను. ఉద్దాన, పతనాలు, సవాళ్లు, అడ్డంకులు, విజయాలు, తప్పులను స్వయంగా చూశాను. వీటన్నింటినీ మించి గొప్ప విజయాలను చూస్తున్నాను. గొప్ప అవకాశాలు మా ముందున్నాయి’’అని అగర్వాల్ ప్రకటించారు. భారతీయుల ముద్ర భారతీయుల అపార ప్రతిభా సామర్థ్యాలకు నిదర్శనంగా ఇప్పటికే పలు అంతర్జాతీయ దిగ్గజ సంస్థలను జన్మతః భారతీయులైన వారు దిగ్విజయంగా నడిపిస్తున్నారు. ఈ జాబితాలోకి పరాగ్ అగర్వాల్ కూడా చేరిపోయారు. గూగుల్ (ఆల్ఫాబెట్) సీఈవోగా సుందర్ పిచాయ్, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల, ఐబీఎం సీఈవో అరవింద్ కృష్ణ, అడోబ్ సీఈవో శంతను నారాయణన్, మాస్టర్‌కార్డ్ సీఈవోగా అజయ్‌పాల్ సింగ్ బంగా తదితరులు తమ సత్తా చాటుతుండడం గమనార్హం. -
వామ్మో! ఎస్బీఐ ఛార్జీల రూపంలో ఇంత వసూలు చేసిందా?
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బిఐ)తో సహా పలు బ్యాంకులు జీరో బ్యాలెన్స్ లేదా బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్స్(బిఎస్‌బిడిఎ) ఖాతాదారులకు అందించే కొన్ని సేవలపై అధిక ఛార్జీలు విధిస్తున్నట్లు ఐఐటి-బొంబాయి అధ్యయనం వెల్లడించింది. బీఎస్‌బిడిఎ ఖాతాదారులు నాలుగు దాటిన ప్రతి డెబిట్ లావాదేవీ నుంచి రూ.17.70 వసూలు చేయాలని ఎస్బీఐ తీసుకున్న నిర్ణయాన్ని"సహేతుకమైనది"గా పరిగణించ లేమని అధ్యయనం పేర్కొంది. సేవా ఛార్జీలు విధించడం వల్ల 2015-20 మధ్య కాలంలో ఎస్బిఐ దాదాపు 12 కోట్ల బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్(బీఎస్‌బిడిఎ) హోల్డర్ల నుంచి రూ.300 కోట్లకు పైగా వసూలు చేసినట్లు నివేదికలో పేర్కొంది. అలాగే, ఎస్బీఐ తర్వాత ఇండియాలో రెండవ అతిపెద్ద ప్రభుత్వ రంగ రుణదాత పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఇదే సమయంలో 3.9 కోట్ల బీఎస్‌బిడిఎ ఖాతాల నుంచి రూ.9.9 కోట్లు వసూలు చేసింది. "కొన్ని బ్యాంకులు బీఎస్బిడిఎలపై గల ఆర్బిఐ నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు ఐఐటి-బొంబాయి అధ్యయనం వెల్లడించింది. ముఖ్యంగా ఎస్బీఐ గరిష్ట సంఖ్యలో బీఎస్‌బిడిఎలను నిర్వహిస్తుంది. ప్రతి డెబిట్ లావాదేవీపై(డిజిటల్ మార్గాల ద్వారా కూడా) నెలకు నాలుగు దాటిన ప్రతిసారి 17.70 రూపాయలు వసూలు చేస్తుంది. 2018-19 కాలంలో రూ.72 కోట్ల వసూలు చేస్తే 2019-20 రూ.158 కోట్లు వసులు చేసినట్లు” ఐఐటి బొంబాయి ప్రొఫెసర్ ఆశిష్ దాస్ అధ్యయనం పేర్కొంది. 2013 సెప్టెంబర్ ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం బీఎస్‌బీడిఎపై ఛార్జీలు వసూలు చేయడం జరుగుతుంది. ఎస్బీఐ, 2013 నాటి నుంచి ఆర్బిఐ నిర్దేశించిన నిబంధనలను ఉల్లంఘిస్తూ నెలకు నాలుగు దాటిన ప్రతి డెబిట్ లావాదేవీపై బీఎస్బీడిఎ హోల్డర్ల నుంచి అధిక చార్జీలు వసూలు చేస్తుంది. నెఫ్ట్, ఐఎంపిఎస్ వంటి డిజిటల్ లావాదేవీలపై కూడా ఛార్జీలు రూ.17.70 వసూలు చేస్తున్నట్లు నివేదిక పేర్కొంది. "ఒక వైపు ప్రభుత్వం దేశంలో డిజిటల్ చెల్లింపు మార్గాలను గట్టిగా ప్రోత్సహిస్తుంటే. మరోవైపు, ఎస్బీఐ ఖాతాదారులను నిరుత్సాహపరుస్తుంది" అని ప్రొఫెసర్ ఆశిష్ దాస్ అధ్యయనం పేర్కొంది. చదవండి: రెమిడెసివర్ ఎగుమతులపై కేంద్రం నిషేధం! -
బాంబే ఐఐటీకి భారీగా నిధులు
ముంబై: ‘సోలార్ ఊర్జా ల్యాంప్’ (ఎస్ఓయూఎల్) పథకం కింద బాంబే ఐఐటీకి కేంద్రం రూ.1,800 కోట్లు మంజూరు చేయనున్నట్లు విద్యుత్ మంత్రి పియూష్ గోయెల్ చెప్పారు. ఈ డబ్బుతో బాంబే ఐఐటీ దేశంలోని 10 కోట్ల మంది పాఠశాల విద్యార్థులకు సౌర దీపాలను అందిస్తుంది. 10 లక్షల మంది విద్యార్థులకు దీపాలను అందించాలని ఈ పథకం ప్రారంభించారు. ఇప్పుడు బాంబే ఐఐటీ సహాయంతో ఈ సంఖ్యను 10 కోట్లకు పెంచుతున్నారు. దేశంలోని ప్రతి పాఠశాల విద్యార్థికి చదువుకునేందుకు అందుబాటు ధరల్లో స్పష్టమైన వెలుగునిచ్చే సౌరదీపాలను అందించాలని ఈ పథకం లక్ష్యం. -
ముంబై ఐఐటీలో 'క్యాట్' వాక్
కష్టమైన ఎంట్రెన్స్ టెస్టులేవీ పాసవ్వకుండానే ఏకంగా ప్రతిష్ఠాత్మక ముంబై ఐఐటీలో అడుగుపెట్టి.. గుబులు రేపిందో ఓ చిరుత పులి. అక్కడివారిని గడగడలాడించిన అనుకోని అతిథి ఎట్టకేలకు తనంతట తానే వీడ్కోలు తీసుకుంది. నాలుగు రోజుల క్యాంపస్ విహరం అనంతరం తిరిగి అటవీ ప్రాంతానికి వెళ్లిపోయింది. దీంతో ఈ నాలుగు రోజులూ బిక్కుబిక్కుమంటూ గడిపిన ఐఐటీ విద్యార్థులు, ప్రొఫెసర్లు, మేనేజ్మెంట్ ఊపిరి తీసుకున్నారు. ఇక వివరాల్లోకి వెళ్తే అటవీ ప్రాంతంలో ఉండాల్సిన ఓ చిరుత గత బుధవారం జనారణ్యంలోకి వచ్చింది. అక్కడా ఇక్కడా కాకుండా... ఏకంగా ఐఐటీ క్యాంపస్‌లోకి అడుగుపెట్టింది. ఆహారం కోసం ఓ కుక్కను వేటాడుతూ సమీప అడవిలో నుంచి నేరుగా క్యాంపస్ ప్రాంగణంలోకి వచ్చేసింది. వచ్చిన అతిథిని చూసి క్యాంపస్ అంతా కలకలం రేగింది. అదిగో పులి అంటే.. ఇదిగో తోక అన్న చందంగా భయంతో క్యాంపస్ లోని వారంతాప్రాణాలు అరచేతిలో పెట్టుకొని గడిపారు. చిరుతను పట్టుకోవడానికి సంజయ్‌గాంధీ జాతీయ పార్కు, థానె అటవీ అధికారులను రంగంలోకి దింపారు. దాన్ని పట్టుకునేందుకు అందుబాటులో ఉన్న ఆధునిక పరిజ్ఞానం ఉపయోగించినా చిరుత దగ్గర ఆ పప్పులేమీ ఉడకలేదు. వారికి చిరుత ఆనవాళ్లు కూడా చిక్కలేదు. దాని కాలి గుర్తులు, అది తిరిగిన ఆనవాళ్లు ఉన్నప్పటికీ ఉపయోగం లేకపోయింది. 550 ఎకరాల విస్తారమైన ఐఐటీ క్యాంపస్‌లో దాదాపు నాలుగు రోజులపాటు అధికారులకు ముచ్చెమటలు పట్టించి, దాగుడుమూతలు ఆడిన చిరుత ఎట్టకేలకు విన్న పాఠాలు చాలనుకుందేమో తన ఆవాసానికి వెళ్లిపోయింది. క్యాంపస్ మొత్తం అంజనం వేసి గాలించినా.. చిరుతపులి కనిపించకపోవడంతో అది అడవిలోకి వెళ్లిపోయిందని నిర్ధారణకు వచ్చిన అటవీశాఖ అధికారులు గాలింపును నిలిపివేసి బచ్ గయా అనుకున్నారు. మరోవైపు ఎలాంటి ఎంట్రెన్స్‌లు రాయకుండానే..‘క్యాట్’ పాసవ్వకుండానే ఐఐటీలో అడుగుపెట్టిన ‘క్యాట్’ (చిరుత)దేమీ భాగ్యమోనంటూ ట్విట్టర్లో హాస్యోక్తులు పేలాయి.