నంబర్ ప్లేట్ కావాలా నాయనా!
హైసెక్యూరిటీ నంబర్ ప్లేట్ పేరుతో వాహనదారుల నుంచి డబ్బులు నొక్కేస్తున్నారు. నెలకు లక్షల్లో అక్రమంగా సంపాదిస్తున్నారు. వాహనదారులు ప్రశ్నిస్తే వేధింపులకు పాల్పడుతున్నారు. కంపెనీ ప్రతినిధుల అక్రమాలపై సంబంధిత అధికారులు మాత్రం పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారు. పేట్లలో నాణ్యతకూడా అంతంత మాత్రంగానే ఉంది.
నెల్లూరు(టౌన్): హై సెక్యూరిటీ పేరుతో కంపెనీ ప్రతినిధులు అక్రమార్జనకు పాల్పడుతున్నారు. ప్రమాదాలను తగ్గించి ప్రమాణాలను పెంపొందించాలన్న ఉద్దేశంతో హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్ల విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలులోకి తీసుకువచ్చింది. ప్రభుత్వం నిర్ణయించిన ధరకు వాహనానికి నంబర్ ప్లేట్‌ను బిగించాల్సి ఉంది. అయితే కంపెనీ ప్రతినిధులు మాత్రం అక్రమార్జనకు పాల్పడుతున్నారు. అక్రమ వసూళ్లను నియంత్రించాల్సిన రవాణా, ఆర్టీసీ అధికారులు తేలుకుట్టిన దొంగల్లా వ్యవహరిస్తున్నారని వాహనదారులు ఆరోపిస్తున్నారు.
ప్లేట్ కోసం ఎదురుచూపులు
హైసెక్యూరిటీ నంబర్ ప్లేటు విధానం 2016 జనవరి నుంచి అమలులోకి వచ్చింది. నంబర్ ప్లేట్ల తయారీ కాంట్రాక్ట్ట్ను లింకో ఆటో టెక్ సంస్థకు ప్రభుత్వం అప్పగించింది. కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రతి వాహనానికీ హైసెక్యూరిటీ నంబర్ ప్లేట్ బిగించుకోవాలని అధికారులు ఆదేశించారు. రిజిస్ట్రేషన్ సమయంలోనే నంబర్ ప్లేట్‌కు కూడా చలానా చెల్లించాల్సి ఉంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం చలానా చెల్లించిన నాలుగు రోజులకు నంబర్ ప్లేట్ బిగించాల్సిఉంది. అయితే 20 నుంచి 25 రోజులకు పైగా నంబర్ ప్లేట్ కోసం ఎదురుచూడాల్సివస్తోందని వాహనదారులు వాపోతున్నారు. అన్ని రకాల పన్నులతో కలిపి ద్విచక్రవాహనానికి రూ.245, మూడు చక్రాల వాహనాలకు రూ.282, నాలుగు చక్రాల వాహనానికి రూ.619, లారీలకు రూ.650, ట్రాక్టర్ ట్రైలర్‌కు రూ.900 ధరను నిర్ణయించారు. నంబర్ ప్లేట్‌ను కంపెనీ ప్రతినిధులే బిగించాల్సిఉంటుంది. అయితే నంబర్ ప్లేట్ నాణ్యత పడిపోయి పలుచటి రేకును వాడుతుండడంతో దెబ్బతింటోందని వాహనదారులు చెబుతున్నారు.
నెలకు రూ.3 లక్షల అక్రమార్జన
జిల్లాలో నెల్లూరుతోపాటు గూడూరు, కావలి, సూళ్లూరుపేట, ఆత్మకూరు ప్రాంతాల్లో వాహనాలకు రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా రోజుకు సరాసరి 200కు పైగా వివిధ రకాల వాహనాలు రిజిస్ట్రేషన్ అవుతున్నట్లు అధికారులు లెక్కలు చెబుతున్నారు. అయితే నంబర్ ప్లేట్‌కు చలానా కట్టించుకున్న లింక్ ఆటో టెక్ ప్రతినిధులు సంబంధిత వాహనానికి ప్లేట్‌ను ఉచితంగా బిగించాలన్న నిబంధన ఉంది.
కంపెనీ ప్రతినిధులు మాత్రం నంబర్ ప్లేట్ బిగించినందుకు కారు, రవాణా వాహనాలకు రూ.200 నుంచి రూ.300 వరకు, బైకుకు రూ.50 నుంచి రూ.100 వరకు ఇస్తేనే నంబర్ ప్లేట్ బిగిస్తున్నారు. అదనంగా ఎందుకు ఇవ్వాలని వాహనదారులు అడిగితే కంపెనీ ప్రతినిధులు నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారు. ఈ లెక్కన అన్ని రకాల వాహనాలకు కలిపి సరాసరి రూ.50 ప్రకారం లెక్కిస్తే రోజుకు ఆదాయం రూ.10 వేలు ఉంటోంది. అంటే నెలకు వీరి అక్రమ సంపాదన రూ.3 లక్షల వరకు ఉంటోంది. ఇంటికి వచ్చి వాహనానికి నంబర్ ప్లేట్ బిగిస్తే రూ.200 వసూలు చేస్తున్నారు. ఇలా కంపెనీ ప్రతినిధులు వాహనదారులను దోపిడీ చేస్తున్నారు.
చోద్యం చూస్తున్న అధికారులు
నంబర్ ప్లేట్ బిగించే విషయంలో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదు. కంపెనీ వ్యవహారాలను పర్యవేక్షించాల్సిన ఆర్టీసీ అధికారులు అటువైపు కన్నెత్తి చూడటం లేదు. రవాణా కార్యాలయంలోనే తమ కళ్ల ముందే కంపెనీ ప్రతినిధులు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నా రవాణాశాఖ అధికారులు పట్టించుకోకపోవడంతో వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పైగా అదనపు వసూళ్లపై ప్రశ్నిస్తే రవాణా అధికారుల సాయంతో నిబంధనల పేరుతో ఇబ్బందులు పెడుతున్నారని వాహనదారులు వాపోతున్నారు. నంబర్ ప్లేట్ కూడా వాహనానికి సక్రమంగా బిగించడం లేదని చెబుతున్నారు. వాహనానికి ఇచ్చిన రంధ్రాలు, నంబర్ ప్లేట్ సైజు సరిపడకపోవడంతో వంకరటింకరగానే ప్లేట్ బిగించుకోవాల్సివస్తోందని వాహనదారులు చెబుతున్నారు. ఇప్పటికైనా కంపెనీ ప్రతినిధుల అక్రమ వసూళ్లపై అధికారులు చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు.
డబ్బులు వసూళ్లు చేస్తున్నారన్న విషయం దృష్టికి వచ్చింది.నంబరు ప్లేటు బిగిస్తే అదనంగా డబ్బులు వసూళ్లు చేస్తున్నారన్న విషయం తన దృష్టికి వచ్చింది. ఈ విషయంపై ఇప్పటికే రవాణాశాఖ కమిషనర్‌కు ఫిర్యాదు చేశాం. రాష్ట్ర వ్యాప్తంగా ఈ సమస్య ఉంది. వారి మీద చర్యలు తీసుకునే అధికారం మాకులేదు. కొంతమంది వాహన యజమానులు ఎక్కువ డబ్బులు ఇచ్చి నెంబరు ప్లేటును ఇంటికి తీసుకెళ్తుతున్నారు.
– ఎన్.శివరాంప్రసాద్, రవాణాశాఖ ఉప రవాణా కమిషనర్
తయారీ వరకే మా పరిధి
నంబర్ ప్లేట్ తయారీ వరకే మా పరిధి ఉంది. నాణ్యత ప్రమాణాలుపై ఎవరైనా ఫిర్యాదు చేస్తే సంబంధిత అధికారికి దానిని ఫార్వర్డ్ చేస్తాం. మిగిలిన వాటిని రవాణా అధికారులు చూసుకుంటారు. – రవివర్మ, రీజనల్
మేనేజర్, ఆర్టీసీ