illness passed away
-
గులాబీ మాటల రచయిత నరసింగరావు కన్నుమూత
సీనియర్ రచయిత నడిమింటి నరసింగరావు (72) ఇక లేరు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ హాస్పిటల్లో తుదిశ్వాస విడిచారు. కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన ‘గులాబీ’, రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వంలోని ‘అనగనగా ఒకరోజు’ వంటి సూపర్ హిట్ ఫిల్మ్స్‌తో పాటు ‘పాత బస్తీ, ఊరికి మొనగాడు, కుచ్చికుచ్చి కూనమ్మా’ ... ఇలా దాదాపు యాభై సినిమాలకు నరసింగరావు మాటల రచయితగా చేశారు. సినిమాల్లోకి రాకముందు తెలుగు నాటకరంగానికి జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిన ‘బొమ్మలాట, రైలుబండి’ వంటి నాటకాలు రాశారు. అలాగే ‘తెనాలి రామకృష్ణ, అంతరంగాలు, లేడీ డిటెక్టివ్, వండర్ బాయ్’ ఇలా దాదాపు యాభై సీరియల్స్‌కు ఆయన మాటలు రాశారు. రచయితగా రాష్ట్ర ప్రభుత్వ పురస్కారాలు, సన్మానాలు ఎన్నో అందుకున్నారు. కాగా ‘ఆదిత్య 369’కి సీక్వెల్‌గా దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించాలనుకున్న చిత్రం స్క్రిప్ట్ వర్క్‌లో పాలుపంచుకున్నారు. నరసింగరావుకు భార్య, కుమార్తె ఉన్నారు. ఆయన మృతికి తెలుగు సినీ రచయితల సంఘం అధ్యక్షుడు పరుచూరి గోపాలకృష్ణతో పాటు పలువురు చిత్రరంగ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. -
ఎల్విస్ ప్రెస్లీ కూతురు లీసా మేరీ మృతి
లాస్ఏంజెలెస్: లెజెండరీ గాయకుడు ఎల్విస్ ప్రెస్లీ ఏకైక కూతురు లీసా మేరీ ప్రెస్లీ(54) గురువారం చనిపోయారు. అస్వస్థతకు గురైన తన కూతురు లాస్ఏంజెలెస్లోని ఓ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారని ఆమె తల్లి నటి, ప్రిసిల్లా ప్రెస్లీ వెల్లడించారు. తండ్రి రూపురేఖలు, గళంతో వృత్తిపరంగా ఆయన అడుగుజాడల్లోనే నడిచిన లీసా మేరీ..2000 సంవత్సరాల్లో తన సొంత రాక్ ఆల్బమ్‌లను విడుదల చేశారు. ఇన్ ది ఘెట్టో, డోన్ట్ క్రై డాడీ వంటి రికార్డుల్లో తండ్రి ఎల్విస్తోపాటు ఆమె పాడారు. మైకేల్ జాక్సన్, నికొలస్ కేజ్లతోపాటు నలుగురిని పెళ్లాడి, కొంతకాలానికే విడిపోయారు. ఈమెకు నలుగురు సంతానం కలిగారు. -
మూగబోయిన పాక్ మధుర స్వరం
కరాచి: పాకిస్తాన్ గానకోకిల, మెలోడి క్వీన్ నయ్యారా నూర్ కన్నుమూశారు. ఆమె వయసు 71 సంవత్సరాలు. నయ్యారా మరణంతో పాకిస్తాన్, భారత్ రెండింటి సంస్కృతులకి ప్రతీకగా నిలిచే సంగీత దిగ్గజాల శకం ముగిసినట్టయింది. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె కరాచీలో ఆస్పత్రిలో తుది శ్వాస విడిచినట్టుగా ఆమె మేనల్లుడు రజా జైదీ వెల్లడించారు. 1950లో అస్సాంలోని గౌహతిలో నయ్యారా నూర్ జన్మించారు. దేశ విభజన సమయంలో ఆమె తండ్రి మహమ్మదాలీ జిన్నాకి చెందిన ఆల్ ఇండియా ముస్లిం లీగ్ పార్టీలో చురుగ్గా ఉండేవారు. 1958లో ఆమె కుటుంబం లాహోర్‌కు వెళ్లిపోయింది. ఆమెలోని ప్రతిభకు చిన్న వయసులోనే పాకిస్తాన్ రేడియోలో పాడే అవకాశం వచ్చింది. 1971లో తొలిసారిగా పాకిస్తాన్ టెలివిజన్ సీరియల్స్‌కి పాడారు. ఆ తర్వాత వెండితెరకి పరిచయమయ్యారు. ఘరానా, తాన్సేన్ వంటి చిత్రాల్లో నయ్యారా పాడిన పాటలు దేశాన్ని ఒక ఊపు ఊపేశాయి. నయ్యారా స్వరం వెంట గాలిబ్ గజల్స్‌ను పాక్, భారత్‌లో కోట్లాది మంది మైమరచి వినేవారు. కెరీర్ ఉచ్ఛ దశలో ఉన్నప్పుడే పెళ్లి చేసుకొని వైవాహిక జీవితానికే ఆమె ప్రాధాన్యం ఇచ్చారు. లతా మంగేష్కర్‌కు ఆమె వీరాభిమాని. -
కన్నీటికే కన్నీరు! రెండేళ్ల తమ్ముడు మృతి.. రెండు గంటలు జాడలేని తండ్రి
భోపాల్: మధ్యప్రదేశ్‌లోని మోరేనా పట్టణంపై హృదయవిదారక సంఘటన చోటుచేసుకుంది. అంబా జిల్లాలోని బాద్‌ఫ్రా గ్రామానికి చెందిన పూజారామ్ జాతవ్ అనారోగ్యంతో బాధపడుతున్న తన రెండేళ్ల చిన్న కుమారుడు రాజాను మోరేనా జిల్లా ఆసుపత్రికి అంబులెన్స్‌లో తీసుకొచ్చాడు. ఎనిమిదేళ్ల పెద్ద కుమారుడు గుల్షన్ తండ్రి వెంట ఆస్పత్రికి వచ్చాడు. రక్తహీనత, కడుపునొప్పితో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బాబు శనివారం ప్రాణాలు కోల్పోయాడు. పూజారామ్ చేతిలో చిల్లిగవ్వ లేదు. పసిబిడ్డ మృతదేహాన్ని తిరిగి ఇంటికి ఎలా తీసుకెళ్లాలో తెలియక తల్లడిల్లాడు. ఆస్పత్రి వారు ఎలాంటి వాహనం ఏర్పాటుచేయలేమన్నారు. కనిపించిన వారినల్లా సాయం కోసం అర్థించాడు. ఇక చేసేది లేక తన బిడ్డ మృతదేహాన్ని భుజానికెత్తుకొని ఆసుపత్రి బయటకు నడిచాడు. రోడ్డు పక్కన గుల్షన్‌ను కూర్చోబెట్టి ఒడిలో రాజా మృతదేహాన్ని ఉంచి, సాయం కోసం వెళ్లాడు. దాదాపు రెండు గంటల పాటు తమ్ముడి శవంతో గుల్షన్ అక్కడే తండ్రి రాకకోసం ఎదురు చూస్తూ కూర్చున్నాడు. తమ్ముడి మృతదేహంపై వాలే ఈగలను తోలుతున్న గుల్షన్‌ను చూసి అటుగా వెళ్లేవాళ్ల హృదయం ద్రవించింది. నాన్న ఎప్పుడు వస్తాడో తెలియక భయంతో కన్నీరు పెట్టాడు. తనతో కలిసి ఆడుకున్న తమ్ముడి ఇక లేడని ఏడుస్తున్న గుల్షన్‌ను చూసి స్థానిక జర్నలిస్టు ఒకరు ఆ ఫొటోలు తీశారు. ఇంతలో పెద్ద సంఖ్యలో జనం అక్కడ గుమికూడారు. బాలుడి పరిస్థితిని చూసి చలించిపోయారు. పోలీసులకు సమాచారం చేరవేశారు. పోలీసు అధికారి యోగేంద్ర సింగ్ రంగంలోకి దిగారు. రాజా చికిత్స పొందిన ఆసుపత్రి అధికారులతో మాట్లాడి, వాహనం ఏర్పాటు చేశారు. రాజా శవాన్ని, అతడి తండ్రిని, సోదరుడిని వారి స్వగ్రామానికి పంపించారు. -
నిర్మాత శ్రీధర్ రెడ్డి కన్నుమూత
‘సోగ్గాడి కాపురం, ‘బాలరాజు బంగారు పెళ్ళాం’ చిత్రాల నిర్మాత సి. శ్రీధర్ రెడ్డి ఇకలేరు. అనారోగ్యం కారణంగా శనివారం రాత్రి ఆయన మరణించారు. శ్రీధర్ రెడ్డి స్వస్థలం నెల్లూరు. సినిమా ఇండస్ట్రీపై ఉన్న మక్కువతో చెన్నై వెళ్లారు. శోభన్‌బాబు, జయసుధ జంటగా కోడి రామకృష్ణ దర్శకత్వంలో ‘సోగ్గాడి కాపురం’ సినిమా నిర్మించారాయన. ఆ తర్వాత సుమన్, సౌందర్య హీరో హీరోయిన్లుగా వై. నాగేశ్వరావు దర్శకత్వంలో ‘బాలరాజు బంగారు పెళ్ళాం’ చిత్రం నిర్మించారు. శ్రీధర్ రెడ్డి మృతి పట్ల తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. -
దర్శకుడు కట్టా రంగారావు మృతి
ప్రముఖ దర్శకులు కట్టా రంగారావు అనారోగ్యంతో సోమవారం హైదరాబాద్‌లో కన్నుమూశారు. 1957 మే 5న జన్మించారాయన. ‘ఇంద్రధనస్సు’ చిత్రంతో దర్శకుడిగా మారిన రంగారావు ‘ఉద్యమం, అలెగ్జాండర్, నమస్తే అన్నా, బొబ్బిలి బుల్లోడు’తో పాటు మరికొన్ని చిత్రాలను రూపొందించారు. దర్శకుల సంఘంలో కీలక బాధ్యతలు నిర్వర్తించిన రంగారావు మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలియజేశారు. సోమవారం సాయంత్రం సూర్యాపేటలోని మేడారం గ్రామంలో ఆయన అంత్యక్రియలు జరిగాయి. -
సౌదీలో దుబ్బాక వాసి మృతి
దుబ్బాక టౌన్: ఊళ్లో ఉపాధి లేక బతుకుదెరువు కోసం గల్ఫ్ బాట పట్టిన ఓ కార్మికుడు అనారోగ్యం తో మృతిచెందాడు. దుబ్బాక పట్టణానికి చెందిన చింతకింది ఎల్లం (50) బతుకు దెరువు కోసం సౌదీకి వెళ్లి డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. 17 ఏళ్లుగా సౌదీలో పనిచేస్తున్నాడు. ఐదు రోజుల క్రితం ఎల్లం తీవ్ర అస్వస్థతకు గురవడంతో తోటి కార్మికులు ఆసుపత్రిలో చేర్చారు. ఎల్లంకు తలలో రక్తం గడ్డకట్టిపోయి స్పృహ తప్పి పడిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. చికిత్స పొందుతూ మంగళవారం మరణించాడు. దీంతో సౌదీలోనే మరో ప్రాంతంలో పనిచేస్తున్న ఎల్లం కుమారుడు నర్సింహులుకు సమాచారం అందించారు. మృతదేహాన్ని స్వదేశానికి తీసుకొచ్చేందుకు పది వేల రియాల్స్ కావాలని.. తన వద్ద అంత డబ్బు లేదని నర్సింహులు వాపోయాడు. దీంతో మృతుడి కుటుంబ సభ్యులు తమకు సహాయం చేయాలని దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డిని ఆశ్రయించారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే, మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్‌లతో మాట్లాడతానని వారికి హామీ ఇచ్చారు. -
మండేలా మాజీ భార్య విన్నీ కన్నుమూత
జోహన్నెస్‌బర్గ్: దక్షిణాఫ్రికా పోరాటయోధుడు నెల్సన్ మండేలా మాజీ భార్య విన్నీ మడికిజెల మండేలా(81) కన్నుమూశారు. దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్న విన్నీ ఇక్కడి నెట్‌కేర్ మిల్‌పార్క్ ఆస్పత్రిలో సోమవారం సాయంత్రం తుదిశ్వాస విడిచినట్లు ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. నెల్సన్ మండేలా, విన్నీ 1958, జూన్ 14న పెళ్లిచేసుకున్నారు. శ్వేతజాతీయులపై పోరాటంలో వీరిద్దరూ కలసి పాల్గొన్నారు. మండేలాకు 27 ఏళ్ల జైలుశిక్ష పడ్డప్పుడు ఇద్దరు కుమార్తెల బాధ్యతల్ని భుజాలపై వేసుకున్న విన్నీ ఉద్యమాన్ని నడపడంలో కీలకంగా వ్యవహరించారు. ఆమె దక్షిణాఫ్రికా కళలు, సంస్కృతి, సైన్స్ అండ్ టెక్నాలజీ సహాయ మంత్రిగా పనిచేశారు. 1996లో మండేలా, విన్నీలు విడాకులు తీసుకున్నారు -
మాజీ ఎమ్మెల్యే విఠల్ రావు దేశ్‌పాండే కన్నుమూత
హైదరాబాద్‌సిటీ: ఆదిలాబాద్ మాజీ ఎమ్మెల్యే విఠల్ రావు దేశ్‌పాండే(84) కన్నుమూశారు. అనారోగ్య కారణాల వల్ల ఆయన నాంపల్లిలోని కేర్ ఆసుపత్రిలో చేరారు. కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం విఠల్‌రావు తుదిశ్వాస విడిచారు. ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తొలిసారి 1962లో శాసనసభకు ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఎన్నికయ్యారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.