దేవుని ప్రేమలో ఓ రష్యన్ అమ్మాయి
ఆధ్యాత్మికం
‘‘మనిషి స్వార్థమే సమాజ దురవస్థకు ప్రధాన కారణం. అందుకే మనిషి స్వార్థాన్ని జయించిననాడు ఈ ప్రపంచం భూతల స్వర్గం అవుతుంది’’ అంటుంది ఓల్గా వ్లాడిమీర్. పేదవాళ్లు ఒకరి వైపు చేయి చాచకుండా తమ కాళ్ల మీద తాము నిలబడి, కష్టించి పనిచేసి, ఉన్నతిని సాధించేలా; చెడు సావాసాలతో అనేక దుర్వ్యసనాలకు లోనైన యువకులు వాటి బారి నుండి బయట పడేలా; నాస్తికులు ఆస్తికులుగా మారేలా; కఠిన హృదయాలను సైతం ‘క్రీస్తు ప్రభువు’ ప్రేమతో కరిగించి, వారి కన్నీళ్లను ఆనందబాష్పాలుగా మార్చిన ఓల్గా వ్లాడిమీర్ జీవితగాథే ‘ఐ యామ్ ఇన్ లవ్...(విత్ గాడ్)’ పుస్తకం!
అందరితో కలివిడిగా ఉండే, చురుకైన, ఓ మోస్తరు అందమైన సాదాసీదా రష్యన్ అమ్మాయి ఓల్గా వ్లాడిమీర్. ‘ఐ యామ్ ఇన్ లవ్’లో ఓల్గా పాత్ర కల్పితమే అయినా, ఆమె జీవితంలో జరిగిన ప్రతి సంఘటనా వాస్తవ జీవితంలోనిదే. రచయిత ఎస్.విజయభాస్కర్ తన జీవితంలో ఎదురైన నిజ ఘటనలను ఓల్గా పాత్రకు అన్వయించి, రష్యా దేశ చరిత్ర, కథనానికి సంబంధించిన పరిసర ప్రాంతాలు, అక్కడి జీవనశైలి పొందుపరచి ఆద్యంతం ఉత్కంఠ భరితంగా ఉండేలా కథనాన్ని కొనసాగించారు.
భారతీయ రైల్వేలో సీనియర్ మెటీరియల్స్ మేనేజర్‌గా విధులు నిర్వహిస్తూనే, సాహితీరంగంలో కూడా తన వంతు కృషి చేస్తున్న విజయ భాస్కర్ తాజా రచన ‘ఐయామ్ ఇన్ లవ్...’ ఆంగ్ల ఆధ్యాత్మిక ఫిక్షన్ గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ, ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రశంసలు కూడా పొందింది. అన్ని ప్రధాన పుస్తక విక్రయ కేంద్రాలలో లభ్యమౌతున్న ఈ పుస్తకం తెలుగు భాషలో కూడా అందుబాటులో ఉంది.