జీ20 నిర్ణయాల అమలు వేగవంతం చేయాలి
న్యూఢిల్లీ: అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్), ప్రపంచ బ్యాంకు వంటి సంస్థల్లో సంస్కరణలు అమలు చేయడానికి సంపన్న దేశాలు ఇష్టపడటం లేదని కేంద్ర ఆర్థిక మంత్రి పి. చిదంబరం చెప్పారు. ఈ నేపథ్యంలో జీ20 కూటమి తన విశ్వసనీయతను నిలబెట్టుకోవాలంటే.. ఇటీవలి సదస్సులో తీసుకున్న నిర్ణయాలను వేగవంతంగా అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. అంతర్జాతీయ ఆర్థిక సంబంధాల పరిశోధన సంస్థ ఐసీఆర్ఐఈఆర్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయాలు చెప్పారు. అంతర్జాతీయ వేదికలపై తీసుకునే విధానపరమైన నిర్ణయాలు, ప్రతి దేశానికి ఒకే రకంగా వర్తించవని ఆయన చెప్పారు. అభివృద్ధికి సంబంధించి ఒక్కో దేశం సమస్యలు ఒక్కో రకంగా ఉంటాయి కనుక.. ఆయా దేశాలు దేశీయంగా నెలకొన్న పరిస్థితులకు అనుగుణంగా విధానాలను తీర్చిదిద్దుకోవాల్సి ఉంటుందన్నారు.