Immigration Policies
-
చైనా బెదిరింపులకు పాల్పడుతోంది!
వాషింగ్టన్: చైనా పొరుగుదేశాలను బెదిరిస్తోందనీ, తాము పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తున్నామని అమెరికా తెలిపింది. భారత్–చైనాల మధ్య కొనసాగుతున్న సరిహద్దు ప్రతిష్టంభనపై బైడెన్ యంత్రాంగం ఈ మేరకు తొలిసారిగా స్పందించింది. భారత భూభాగాలపై చైనా అక్రమంగా ప్రవేశించి, ఆక్రమించడంపై అడిగిన ప్రశ్నకు వైట్‌హౌస్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రతినిధి ఎమిలీ జె.హార్న్ సమాధానమిచ్చారు. ‘చైనా పొరుగు దేశాలను బెదిరించేందుకు చేస్తున్న ప్రయత్నాలపై అమెరికా ఆందోళన చెందుతోంది. ఈ విషయంలో మా స్నేహితులకు అండగా ఉంటాం’అని అన్నారు. చైనా కట్టడికి భారత్, జపాన్, ఆస్ట్రేలియాలతో క్వాడ్ కూటమిని ఏర్పాటు చేయాలని అమెరికా భావిస్తోంది. దక్షిణ చైనా సముద్రంపై తనకే హక్కుందంటూ వియత్నాం, ఫిలిప్పైన్స్‌తోనూ, తూర్పు చైనా సముద్ర జలాలపై హక్కు కోసం జపాన్‌తో చైనా గొడవపడుతోంది. సముద్ర రవాణాకు కీలకమైన చమురు, ఖనిజాలు వంటి అపార సంపదకు నెలవైన ఎవరికీ చెందని ప్రాంతంపై హక్కులను కోరరాదని అమెరికా అంటోంది. ట్రంప్ వలస విధానాలకు చెక్ వలసలకు సంబంధించి ట్రంప్ హయాంలో తీసుకున్న నిర్ణయాలను అధ్యక్షుడు బైడెన్ తిరగదోడుతున్నారు. ఇందుకు సంబంధించిన 3 ఎగ్జిక్యూటివ్ ఉత్తర్వులపై సంతకాలు చేయనున్నారు. దేశంలోకి అక్రమంగా ప్రవేశించారనే నెపంతో ట్రంప్ యంత్రాంగం తల్లిదండ్రుల నుంచి వారి పిల్లలను వేరు చేసి ప్రభుత్వ సంరక్షణలో ఉంచడం తెల్సిందే. ఆ పిల్లలను తిరిగి కన్నవారి చెంతకు చేర్చేందుకు వీలుగా టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేయడం, వలస విధానాన్ని న్యాయబద్ధంగా అమలు చేయడం వంటివి ఉత్తర్వుల్లో ఉన్నాయి. త్వరలో ఏర్పాటయ్యే టాస్క్‌ఫోర్స్ వేరుపడిన వలసదారుల కుటుంబాలను ఒక్కటి చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలను అధ్యక్షుడికి తెలియజేస్తుంది. ప్రభావిత కుటుంబాలకు చెందిన వారితో సంప్రదింపులు జరిపి ట్రంప్ యంత్రాంగం వేరు చేసిన తల్లిదండ్రులను, వారి పిల్లలను గుర్తిస్తుంది. తల్లిదండ్రుల నుంచి వారి పిల్లలను వేరు చేయడం సబబేనని ట్రంప్ జారీ చేసిన ఉత్తర్వులను బైడెన్ వెనక్కి తీసుకోనున్నారు. -
వలస విధానంపై ట్రంప్‌కి చుక్కెదురు
వాషింగ్టన్: వలసదారుల వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కి న్యాయస్థానంలో గట్టి ఎదురు దెబ్బ తగిలింది. మైనర్లుగా ఉన్నప్పుడే చట్టవిరుద్ధంగా తల్లిదండ్రులతో కలిసి అమెరికాకు వచ్చిన వారికి రక్షణ కల్పించడానికి ఒబామా హయాం నాటి వలస విధానాలను పునరుద్ధరించాలని అమెరికా ఫెడరల్ న్యాయమూర్తి ఆదేశించారు. దీంతో భారత్ సహా వివిధ దేశాల నుంచి అమెరికాకి అక్రమంగా వచ్చిన చిన్నారులకి రక్షణ కల్పించడానికి బరాక్ ఒబామా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు తీసుకువచ్చిన డిఫర్డ్ యాక్షన్ ఫర్ చైల్డ్‌హుడ్ అరైవల్స్ (డీఏసీఏ) విధానాన్ని రద్దు చేయడానికి ట్రంప్ ప్రభుత్వం మూడేళ్ల క్రితం ప్రయత్నించింది. అయితే ఆ ప్రయత్నాలకు అమెరికా కోర్టు అప్పట్లో అడ్డుకట్ట వేసింది. మరో రెండేళ్ల పాటు డీఏసీఏని కొనసాగించాలని న్యూయార్క్ జిల్లా న్యాయమూర్తి, సుప్రీంకోర్టులో కూడా న్యాయమూర్తి అయిన నికోలస్ గరాఫీ డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీని ఆదేశించారు. చట్టపర రక్షణ కోసం వలసదారులు చేసుకునే దరఖాస్తుల్ని సోమవారం నుంచి స్వీకరించాలని స్పష్టం చేశారు. 2017 నుంచి డీఏసీఏ విధానం కింద దరఖాస్తుల్ని తీసుకోవడం ట్రంప్ ప్రభుత్వం నిలిపివేసింది. మళ్లీ మూడేళ్ల తర్వాత ఈ విధానం ద్వారా చిన్నతనంలోనే అక్రమ మార్గాల ద్వారా దేశంలోకి వచ్చిన వారికి రక్షణ కలగనుంది. చిన్న వయసులో తల్లిదండ్రులతో కలిసి వచ్చిన వారికి రక్షణ కల్పించి, వారికి ఉపాధి మార్గం చూపించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని న్యాయమూర్తి నికోలస్ పేర్కొన్నారు. 2019 నాటి సౌత్ ఏసియన్ అమెరికన్స్ లీడింగ్ టుగెదర్ (సాల్ట్) నివేదిక ప్రకారం భారత్ నుంచి 6 లక్షల 30 వేల మంది అక్రమ వలసదారులు అమెరికాలో ఉన్నారు. 2010 నుంచి పదేళ్లలో వారి సంఖ్య 72 శాతం పెరిగింది. అదే సంవత్సరం భారత్ నుంచి వచ్చిన వారిలో 2,550 మందికి డీఏసీఏ ద్వారా రక్షణ లభించింది. -
అమెరికా కంపెనీలకే నష్టం
న్యూయార్క్: అమెరికా అధ్యక్షుడు తీసుకుంటున్న వలస విధానాల వల్ల అమెరికాలో కంపెనీల కార్యకలాపాలపై తీవ్ర ప్రభావం పడుతుందని ప్రధాన కంపెనీల సీఈవోలు హెచ్చరించారు. అమెరికా హోంలాండ్ సెక్యూరిటీ సెక్రటరీ కిర్స్‌జెన్ నీల్సన్‌కు ఈ మేరకు లేఖ రాశారు. శుక్రవారం యాపిల్ సీఈవో టిమ్ కుక్, పెప్సికో సీఈవో ఇంద్రా నూయి, మాస్టర్‌కార్డ్ సీఈవో అజయ్ భంగా, సిస్కో సీఈవో చుక్ రాబిన్స్ తదితరులతో బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. హెచ్1బీ వీసాల జారీ ప్రక్రియలో మార్పులపై ఆందోళన వ్యక్తం చేశారు. హెచ్1బీ ఉద్యోగుల భాగస్వామి విషయంలో నిబంధనలను సరళతరం చేస్తారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. చట్టాలకు లోబడి పనిచేస్తున్న వేలాది మంది ఉద్యోగుల జీవితాలకు విఘాతం కలిగించే నిర్ణయాలు తీసుకోవద్దని సూచించారు. ఉద్యోగ ఖాళీలు ఎక్కువగా ఉన్న ఈ సమయంలో ప్రతిభ ఉన్న వారిని అడ్డుకోవడం సరికాదని వివరించారు. -
ట్రంప్ విధానాలకు వ్యతిరేకంగా బాలల ర్యాలీ
వాషింగ్టన్: వలస విధానంలో అమెరికా అధ్యక్షుడు తీసుకొస్తున్న మార్పులపై ప్రపంచవ్యాప్తంగానేకాదు స్వదేశంలోనూ తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ట్రంప్ వలస విధానాలను వ్యతిరేకిస్తూ దాదాపు 200 మంది బాలలు రోడ్డెక్కారు. మియామీ, న్యూయార్క్, కొలరాడో, వాషింగ్టన్ డీసీలమీదుగా ర్యాలీ నిర్వహించారు. ఇందుకోసం గతవారం బయలుదేరిన వీరు ఉత్తర కరోలినా వరకు నిరసన ప్రదర్శన కొనసాగించి శుక్రవారం శ్వేతసౌధాన్ని చేరుకున్నారు. అమెరికా అధ్యక్ష భవనం ముందు ప్లకార్డులు ప్రదర్శిస్తూ, నినాదాలు చేస్తూ వ్యతిరేకతను చాటారు. అమెరికాలో నివసిస్తున్న ప్రజలంతా ఒక్కటేనని, వలస విధానాల పేరుతో విడదీయడం సరికాదంటూ నినదించారు. తామంతా ఓ కుటుంబంలా నివసిస్తుంటే.. అధ్యక్షుడు ట్రంప్ తమను విడదీస్తున్నారని ఆరోపించారు. ఆయన వైఖరి సరికాదని, వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ప్రదర్శనలో పిల్లలతోపాటు వారి తల్లిదండ్రులు కూడా పాల్గొన్నారు.