ట్రంప్ విధానాలకు వ్యతిరేకంగా బాలల ర్యాలీ
వాషింగ్టన్: వలస విధానంలో అమెరికా అధ్యక్షుడు తీసుకొస్తున్న మార్పులపై ప్రపంచవ్యాప్తంగానేకాదు స్వదేశంలోనూ తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ట్రంప్ వలస విధానాలను వ్యతిరేకిస్తూ దాదాపు 200 మంది బాలలు రోడ్డెక్కారు. మియామీ, న్యూయార్క్, కొలరాడో, వాషింగ్‌టన్ డీసీలమీదుగా ర్యాలీ నిర్వహించారు.
ఇందుకోసం గతవారం బయలుదేరిన వీరు ఉత్తర కరోలినా వరకు నిరసన ప్రదర్శన కొనసాగించి శుక్రవారం శ్వేతసౌధాన్ని చేరుకున్నారు. అమెరికా అధ్యక్ష భవనం ముందు ప్లకార్డులు ప్రదర్శిస్తూ, నినాదాలు చేస్తూ వ్యతిరేకతను చాటారు. అమెరికాలో నివసిస్తున్న ప్రజలంతా ఒక్కటేనని, వలస విధానాల పేరుతో విడదీయడం సరికాదంటూ నినదించారు. తామంతా ఓ కుటుంబంలా నివసిస్తుంటే.. అధ్యక్షుడు ట్రంప్ తమను విడదీస్తున్నారని ఆరోపించారు. ఆయన వైఖరి సరికాదని, వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ప్రదర్శనలో పిల్లలతోపాటు వారి తల్లిదండ్రులు కూడా పాల్గొన్నారు.