వాషింగ్టన్: చైనా పొరుగుదేశాలను బెదిరిస్తోందనీ, తాము పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తున్నామని అమెరికా తెలిపింది. భారత్–చైనాల మధ్య కొనసాగుతున్న సరిహద్దు ప్రతిష్టంభనపై బైడెన్ యంత్రాంగం ఈ మేరకు తొలిసారిగా స్పందించింది. భారత భూభాగాలపై చైనా అక్రమంగా ప్రవేశించి, ఆక్రమించడంపై అడిగిన ప్రశ్నకు వైట్‌హౌస్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రతినిధి ఎమిలీ జె.హార్న్ సమాధానమిచ్చారు. ‘చైనా పొరుగు దేశాలను బెదిరించేందుకు చేస్తున్న ప్రయత్నాలపై అమెరికా ఆందోళన చెందుతోంది. ఈ విషయంలో మా స్నేహితులకు అండగా ఉంటాం’అని అన్నారు.
చైనా కట్టడికి భారత్, జపాన్, ఆస్ట్రేలియాలతో క్వాడ్ కూటమిని ఏర్పాటు చేయాలని అమెరికా భావిస్తోంది. దక్షిణ చైనా సముద్రంపై తనకే హక్కుందంటూ వియత్నాం, ఫిలిప్పైన్స్‌తోనూ, తూర్పు చైనా సముద్ర జలాలపై హక్కు కోసం జపాన్‌తో చైనా గొడవపడుతోంది. సముద్ర రవాణాకు కీలకమైన చమురు, ఖనిజాలు వంటి అపార సంపదకు నెలవైన ఎవరికీ చెందని ప్రాంతంపై హక్కులను కోరరాదని అమెరికా అంటోంది.
ట్రంప్ వలస విధానాలకు చెక్
వలసలకు సంబంధించి ట్రంప్ హయాంలో తీసుకున్న నిర్ణయాలను అధ్యక్షుడు బైడెన్ తిరగదోడుతున్నారు. ఇందుకు సంబంధించిన 3 ఎగ్జిక్యూటివ్ ఉత్తర్వులపై సంతకాలు చేయనున్నారు. దేశంలోకి అక్రమంగా ప్రవేశించారనే నెపంతో ట్రంప్ యంత్రాంగం తల్లిదండ్రుల నుంచి వారి పిల్లలను వేరు చేసి ప్రభుత్వ సంరక్షణలో ఉంచడం తెల్సిందే. ఆ పిల్లలను తిరిగి కన్నవారి చెంతకు చేర్చేందుకు వీలుగా టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేయడం, వలస విధానాన్ని న్యాయబద్ధంగా అమలు చేయడం వంటివి ఉత్తర్వుల్లో ఉన్నాయి.
త్వరలో ఏర్పాటయ్యే టాస్క్‌ఫోర్స్ వేరుపడిన వలసదారుల కుటుంబాలను ఒక్కటి చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలను అధ్యక్షుడికి తెలియజేస్తుంది. ప్రభావిత కుటుంబాలకు చెందిన వారితో సంప్రదింపులు జరిపి ట్రంప్ యంత్రాంగం వేరు చేసిన తల్లిదండ్రులను, వారి పిల్లలను గుర్తిస్తుంది. తల్లిదండ్రుల నుంచి వారి పిల్లలను వేరు చేయడం సబబేనని ట్రంప్ జారీ చేసిన ఉత్తర్వులను బైడెన్ వెనక్కి తీసుకోనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment