Indo-China border pact
-
చైనాకు చెక్..ఇంజినీర్ వైశాలి
‘తొలి మహిళ’ అనే మాట బాగా పాతబడిపోయిన భావనగా అనిపించవచ్చు. ‘అది ఇది ఏమని అన్ని రంగముల’ మహిళలు తమ ప్రతిభా ప్రావీణ్యాలను నిరూపించుకుంటూ రావడం ఇప్పుడు కొత్తేమీ కాకపోవచ్చు. అంతమాత్రాన తొలి మహిళ కావడం ఘనత కాకుండా పోదు. తాజాగా వైశాలి హివాసే అనే మహిళ ఇండో–చైనా సరిహద్దులో భారత సైన్యం నిర్మించబోతున్న వ్యూహాత్మక రహదారి ప్రాజెక్టుకు కమాండింగ్ ఆఫీసర్‌గా ఎంపికయ్యారు! ఒక మహిళ ఇలాంటి విధులను చేపట్టనుండడం భారత ఆర్మీ చరిత్రలోనే ప్రప్రథమం. ఆర్మీ విభాగమైన బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్‌లో ఎగ్జిక్యూటివ్ ఇంజొనీరుగా పని చేస్తున్న వైశాలికి ఇండియన్ ఆర్మీ ఈ ‘కఠినతరమైన’ పనిని అప్పగించడానికి కారణం గతంలో వైశాలి కార్గిల్ సెక్టార్లో ఇంజినీరుగా తనకు అప్పగించిన బాధ్యతల్ని సమర్థంగా నిర్వహించడమే. ‘బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్’ (బీఆర్వో).. భారత సైన్యానికి ఎంత కీలకమైనదో, బీఆర్వోలో పని చేసే ఇంజినీర్ల బాధ్యతలు అంత ముఖ్యమైనవి. మహారాష్ట్రలోని వార్థా ప్రాంతానికి చెందిన వైశాలి ఎం.టెక్ చదివి ఇటువైపు వచ్చారు. సరిహద్దుల్లో శత్రుదేశాలను వెనక్కు తరిమేందుకు, మిత్రదేశాలకు అవసరమైన సాధన సంపత్తిని అందచేసేందుకు వీలుగా ఎప్పటికప్పుడు శత్రు దుర్భేద్యంగా దారులను నిర్మించడం బీఆర్వో ప్రధాన విధి. ఇప్పుడు వైశాలీ కమాండింగ్ ఆఫీసర్‌గా ఉండబోతున్నది శత్రుదేశం చొరబాట్లను నియంత్రించే దారిని నిర్మించే ప్రాజెక్టుకే! గత ఏడాది లడఖ్ సెక్టార్లో భారత్–చైనా ఘర్షణల మధ్య కూడా బీఆర్వో సిబ్బంది శత్రువును కట్టడి చేసే పైకి కనిపించని మార్గాలను, సొరంగాలను నిర్మిస్తూనే ఉన్నారు. వాటికి కొనసాగింపుగా ఇప్పుడు సముద్ర మట్టానికి 10 వేల అడుగుల ఎత్తులో ప్రతికూల వాతావరణ, భౌగోళిక పరిస్థితుల్లో వైశాలి నేతృత్వంలోని ఇంజినీర్లు, నిర్మాణ కార్మికులు అక్కడి గండశిలల్ని పెకిలించి, భూభాగాలను తొలిచి.. భారత సైన్యం మాటువేసి శత్రువును తరిమికొట్టడానికి వీలుగా పోరాట మార్గాలను నిర్మించబోతున్నారు. అంత ఎత్తులో పని చేసేవారికి ఆక్సిజన్ సరిగా అందదు. తవ్వకాల్లో దుమ్మూధూళీ పైకి లేస్తుంది. డ్రిల్లింగ్ ధ్వనులు నిర్విరామంగా చెవుల్లో హోరెత్తుతుంటాయి. సాంకేతిక సమస్యలు తలెత్తవచ్చు. మధ్యలో కన్స్ట్రక్షన్ ప్లాన్‌ని మార్చవలసి రావచ్చు. వీటన్నిటినీ వైశాలే దగ్గరుండి పరిష్కరించాలి. ఇప్పటికే అక్కడికి రెండు ‘ఎయిర్–మెయిన్‌టైన్డ్ డిటాచ్మెంట్స్’ (అత్యవసర సేవల బృందాలు) చేరుకున్నాయి. ఇక వైశాలి వెళ్లి పనిని మొదలు పెట్టించడమే. శత్రువు ఆట కట్టించేందుకు ‘షార్ట్‌కట్’ మార్గాలను కనిపెట్టి, ‘పోరు దారులను’ నిర్మించడమే. ∙∙ బీఆర్వో ప్రస్తుతం లడఖ్, జమ్ము–కశ్మీర్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కింలలో వ్యూహాత్మక దారుల్ని నిర్మిస్తోంది. చైనా సరిహద్దు వెంబడి ఉన్న 66 ప్రాంతాలలో ఇలాంటి దారుల్ని 2022 డిసెంబరు నాటికి నిర్మించాలన్న ధ్యేయంతో పని చేస్తోంది. కమాండింగ్ ఆఫీసర్ గా వైశాలి ఇప్పుడు ఎలాగూ కొండల్ని పిండి చేయిస్తారు కనుక తర్వాతి బాధ్యతల్లో కొన్నింటినైనా ఆమెకే అప్పగించే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు చెప్పండి. ‘తొలి మహిళ’ అనే మాట పాతబడి పోయినట్లనిపిస్తోందా?! -
చైనా బెదిరింపులకు పాల్పడుతోంది!
వాషింగ్టన్: చైనా పొరుగుదేశాలను బెదిరిస్తోందనీ, తాము పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తున్నామని అమెరికా తెలిపింది. భారత్–చైనాల మధ్య కొనసాగుతున్న సరిహద్దు ప్రతిష్టంభనపై బైడెన్ యంత్రాంగం ఈ మేరకు తొలిసారిగా స్పందించింది. భారత భూభాగాలపై చైనా అక్రమంగా ప్రవేశించి, ఆక్రమించడంపై అడిగిన ప్రశ్నకు వైట్‌హౌస్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రతినిధి ఎమిలీ జె.హార్న్ సమాధానమిచ్చారు. ‘చైనా పొరుగు దేశాలను బెదిరించేందుకు చేస్తున్న ప్రయత్నాలపై అమెరికా ఆందోళన చెందుతోంది. ఈ విషయంలో మా స్నేహితులకు అండగా ఉంటాం’అని అన్నారు. చైనా కట్టడికి భారత్, జపాన్, ఆస్ట్రేలియాలతో క్వాడ్ కూటమిని ఏర్పాటు చేయాలని అమెరికా భావిస్తోంది. దక్షిణ చైనా సముద్రంపై తనకే హక్కుందంటూ వియత్నాం, ఫిలిప్పైన్స్‌తోనూ, తూర్పు చైనా సముద్ర జలాలపై హక్కు కోసం జపాన్‌తో చైనా గొడవపడుతోంది. సముద్ర రవాణాకు కీలకమైన చమురు, ఖనిజాలు వంటి అపార సంపదకు నెలవైన ఎవరికీ చెందని ప్రాంతంపై హక్కులను కోరరాదని అమెరికా అంటోంది. ట్రంప్ వలస విధానాలకు చెక్ వలసలకు సంబంధించి ట్రంప్ హయాంలో తీసుకున్న నిర్ణయాలను అధ్యక్షుడు బైడెన్ తిరగదోడుతున్నారు. ఇందుకు సంబంధించిన 3 ఎగ్జిక్యూటివ్ ఉత్తర్వులపై సంతకాలు చేయనున్నారు. దేశంలోకి అక్రమంగా ప్రవేశించారనే నెపంతో ట్రంప్ యంత్రాంగం తల్లిదండ్రుల నుంచి వారి పిల్లలను వేరు చేసి ప్రభుత్వ సంరక్షణలో ఉంచడం తెల్సిందే. ఆ పిల్లలను తిరిగి కన్నవారి చెంతకు చేర్చేందుకు వీలుగా టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేయడం, వలస విధానాన్ని న్యాయబద్ధంగా అమలు చేయడం వంటివి ఉత్తర్వుల్లో ఉన్నాయి. త్వరలో ఏర్పాటయ్యే టాస్క్‌ఫోర్స్ వేరుపడిన వలసదారుల కుటుంబాలను ఒక్కటి చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలను అధ్యక్షుడికి తెలియజేస్తుంది. ప్రభావిత కుటుంబాలకు చెందిన వారితో సంప్రదింపులు జరిపి ట్రంప్ యంత్రాంగం వేరు చేసిన తల్లిదండ్రులను, వారి పిల్లలను గుర్తిస్తుంది. తల్లిదండ్రుల నుంచి వారి పిల్లలను వేరు చేయడం సబబేనని ట్రంప్ జారీ చేసిన ఉత్తర్వులను బైడెన్ వెనక్కి తీసుకోనున్నారు. -
ఇండో-చైనా సరిహద్దులో రాజ్‌నాథ్ పర్యటన
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్రహోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈ వారంలో ఉత్తరాఖండ్‌లోని ఇండో-చైనా సరిహద్దులో పర్యటిస్తారని ఆర్మీ అధికార వర్గాలు ఆదివారం ప్రకటించాయి. ఈ మధ్యకాలంలో చైనా బలాగాలు సరిహద్దును అతిక్రమించి భారత భూభాగంలోకి చొచ్చుకువచ్చిన నేపథ్యంలో రాజ్‌నాథ్ పర్యటనకు ప్రాముఖ్యత ఏర్పడింది. భారతీయ బలగాలు సమర్థవంతంగా ఎదుర్కోవడంతో.. చైనా బలగాలు వెనక్కు మళ్లిన సంగతి తెలిసిందే. హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈ పర్యటనలో ఇండో టిబెటన్ సరిహద్దు బలగాలతో ప్రత్యేకంగా సమావేశమవుతున్నట్లు తెలుస్తోంది. డోక్లామ్ వివాదం ముగిసిన తరువాత కేంద్ర అత్యున్నత మంత్రి ఈ ప్రాంతంలో పర్యటించడం ఇదే తొలిసారి. భూమి 12,500 అడుగుల ఎత్తులో ఉన్న రిమ్‌కిమ్, 10,500 అడుగుల ఎత్తులో ఉన్న మనా, 10,200 అడుగుల ఎత్తులో ఉన్న ఆర్మీ పోస్టులను రాజ్‌నాథ్ ఈ నెల 28న సందర్శిస్తారని ఆర్మీ వర్గాలు ప్రకటించాయి. జూలై 25న చైనా బలగాలు ఉత్తరాఖండ్‌లోని ఛమోలి జిల్లాలోని సరిహద్దు ప్రాంతమైన బార్హోతిలోకి 800 అడుగుల మేర చొచ్చుకుని వచ్చి.. కొన్ని గంటలు ఉండి.. తిరిగి వెనక్కు వెళ్లాయి. ఈ పర్యటనలోనే కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ముస్సోరిలోని లాల్‌బహుదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ అఫ్ అడ్మినిస్ట్రేషన్‌లోని శిక్షణ కొందుతున్న యువ ఐఏఎస్, ఐపీఎస్‌లను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అలాగే చైనా సరిహద్దులో నిర్మిస్తున్న రహదారి పనులను రాజ్‌నాథ్ పర్యవేక్షిస్తారు. -
భారత్ - చైనా సరిహద్దు రక్షణ ఒప్పందం
చైనాతో సరిహద్దు రక్షణ సహకార ఒప్పందం ( బీడీసీఏ)పై సంతకం చేసినట్లు భారత ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ వెల్లడించారు. దాంతో ఇరుదేశాల సరిహద్దుల్లో శాంతి, సుస్థిరతలు నెలకొంటాయని ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు. చైనా ప్రధాని లి కెషాంగ్‌తో మన్మోహన్ సింగ్ బుధవారం ఉదయం భేటీ అయ్యారు. ఆ భేటీ అనంతరం ఇరుదేశాల ప్రధానులు మీడియా ఎదుట మాట్లాడారు. చైనాతో ప్రధానితో భేటీలో జరిగిన చర్చలు సంతృప్తికరంగా సాగాయని మన్మోహన్ వివరించారు. అలాగే తీవ్రవాదాన్ని కట్టడి చేసేందుకు చైనాతో కలసి పని చేస్తామన్నారు. మన్మోహన్ పాలనలో భారత్, చైనా సంబంధాలు త్వరితగతిన మరింత మెరుగుపడటమే కాకుండా కొత్త పుంతలు తొక్కుతాయని చైనా ప్రధాని లి కెషాంగ్ ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రధాని మన్మోహన్‌తో జరిగిన భేటీలో ఇరుదేశాల మధ్య ద్వైపాకిక్ష సంబంధాలతోపాటు పలు అంతర్జాతీయ అంశాలపై లోతుగా చర్చించినట్లు చెప్పారు. ప్రధాని మన్మోహన్ సింగ్ గౌరవార్థం చైనా దేశాధ్యక్షుడు జిన్ పింగ్ విందు ఇవ్వనున్నారు. ఆ విందుకు మన్మోహన్ సింగ్ హాజరుకానున్నారు. చైనా అధ్యక్షుడు మూడు రోజుల పర్యటనలో భాగంగా భారత్ ప్రధాని మన్మోహన్ సింగ్ మంగళవారం సాయంత్రం చైనా చేరుకున్నారు.