సాక్షి, న్యూఢిల్లీ : కేంద్రహోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈ వారంలో ఉత్తరాఖండ్‌లోని ఇండో-చైనా సరిహద్దులో పర్యటిస్తారని ఆర్మీ అధికార వర్గాలు ఆదివారం ప్రకటించాయి. ఈ మధ్యకాలంలో చైనా బలాగాలు సరిహద్దును అతిక్రమించి భారత భూభాగంలోకి చొచ్చుకువచ్చిన నేపథ్యంలో రాజ్‌నాథ్ పర్యటనకు ప్రాముఖ్యత ఏర్పడింది. భారతీయ బలగాలు సమర్థవంతంగా ఎదుర్కోవడంతో.. చైనా బలగాలు వెనక్కు మళ్లిన సంగతి తెలిసిందే. హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈ పర్యటనలో ఇండో టిబెటన్ సరిహద్దు బలగాలతో ప్రత్యేకంగా సమావేశమవుతున్నట్లు తెలుస్తోంది.
డోక్లామ్ వివాదం ముగిసిన తరువాత కేంద్ర అత్యున్నత మంత్రి ఈ ప్రాంతంలో పర్యటించడం ఇదే తొలిసారి. భూమి 12,500 అడుగుల ఎత్తులో ఉన్న రిమ్‌కిమ్, 10,500 అడుగుల ఎత్తులో ఉన్న మనా, 10,200 అడుగుల ఎత్తులో ఉన్న ఆర్మీ పోస్టులను రాజ్‌నాథ్ ఈ నెల 28న సందర్శిస్తారని ఆర్మీ వర్గాలు ప్రకటించాయి. జూలై 25న చైనా బలగాలు ఉత్తరాఖండ్‌లోని ఛమోలి జిల్లాలోని సరిహద్దు ప్రాంతమైన బార్హోతిలోకి 800 అడుగుల మేర చొచ్చుకుని వచ్చి.. కొన్ని గంటలు ఉండి.. తిరిగి వెనక్కు వెళ్లాయి.
ఈ పర్యటనలోనే కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ముస్సోరిలోని లాల్‌బహుదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ అఫ్ అడ్మినిస్ట్రేషన్‌లోని శిక్షణ కొందుతున్న యువ ఐఏఎస్, ఐపీఎస్‌లను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అలాగే చైనా సరిహద్దులో నిర్మిస్తున్న రహదారి పనులను రాజ్‌నాథ్ పర్యవేక్షిస్తారు.