ఎల్ఐసీ మెగా ఐపీవోకు సై...
కొన్ని దశాబ్దాలుగా బీమాకు మారుపేరుగా నిలుస్తున్న ఎల్ఐసీ పబ్లిక్ ఇష్యూకి రానుంది. తద్వారా సరికొత్త రికార్డులకు తెరతీయనుంది. దేశీ బీమా రంగంలో 70 శాతం మార్కెట్ వాటాతో పోటీ సంస్థలకు అందనంత ఎత్తులో ఉన్న ఎల్ఐసీ.. గతేడాదిలో తొలి ఏడాది ప్రీమియమే రూ. 1.42 లక్షల కోట్లను తాకడం కంపెనీ బలాన్ని చెబుతోంది. దేశీ కేపిటల్ మార్కెట్లో కంపెనీకున్న పెట్టుబడుల విలువే రూ. 28.74 లక్షల కోట్లుదాటడం విశేషం!!
న్యూఢిల్లీ: బీమా రంగ ప్రభుత్వ దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ఎల్ఐసీ) త్వరలో స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్ట్‌కానుంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తాజా బడ్జెట్లో ఇందుకు ప్రణాళికలు వేశారు. దశాబ్దాలుగా జీవిత బీమాకు మారుపేరుగా నిలుస్తున్న ఎల్ఐసీలో వాటా విక్రయాన్ని చేపట్టడం ద్వారా ప్రభుత్వం.. ఆదాయ లోటును పూడ్చుకోవాలని చూస్తోంది. దేశీయంగా అత్యంత విలువైన ఎల్ఐసీలో స్వల్ప వాటాకు సైతం అధిక విలువ చేకూరే అవకాశమున్నట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. దీంతో ఇటీవల సౌదీ ఇంధన దిగ్గజం అరామ్కో స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్ట్‌కావడం ద్వారా సాధించిన రికార్డులను దేశీయంగా ఎల్ఐసీ నెలకొల్పే వీలున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. గతేడాది లిస్టయిన అరామ్కో ప్రపంచంలోనే అతిపెద్ద పబ్లిక్ ఇష్యూగా రికార్డు సాధించింది. ప్రస్తుతం ఎల్ఐసీలో ప్రభుత్వానికి 100 శాతం వాటా ఉంది!
బీమా లీడర్
జీవిత బీమా రంగంలో ఎల్ఐసీ 70 శాతం మార్కెట్ వాటాతో అగ్రస్థానంలో కొనసాగుతుంటే.. మిగిలిన 23 కంపెనీలూ 30 శాతం వాటాను పంచుకుంటున్నట్లు పరిశ్రమవర్గాలు పేర్కొంటున్నాయి. ఇప్పటికే మార్కెట్లో ఎస్బీఐ ఇన్సూరెన్స్, జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్, హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సూరెన్స్, ఐసీఐసీఐ ప్రుడెన్షియిల్ లైఫ్, ఐసీఐసీఐ లంబార్డ్ తదితర కంపెనీలు లిస్టయ్యాయి. ప్రభుత్వ ప్రణాళికలు అమలైతే ఎల్ఐసీ సైతం స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టయ్యే వీలుంది. తద్వారా మార్కెట్ విలువ(కేపిటలైజేషన్)లో దిగ్గజ కంపెనీలు రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ తదితరాలను వెనక్కి నెట్టే అవకాశముంది.
ఇవీ బలాలు
ఎల్ఐసీ నిర్వహణలోని ఆస్తుల(ఏయూఎం) విలువ 2019లో తొలిసారి రూ. 30 లక్షల కోట్లను అధిగమించింది. రూ. 31.11 లక్షల కోట్లను తాకింది. వార్షిక ప్రాతిపదికన ఇది 9 శాతంపైగా వృద్ధికాగా.. మార్కెట్ విలువ 2019 మార్చికల్లా రూ. 28.74 లక్షల కోట్లుగా తెలుస్తోంది. గతేడాది(2018–19)లో ఎల్ఐసీ మొత్తం ఆదాయం ప్రీమియంలతో కలిపి రూ. 5,60,784 కోట్లుగా నమోదైంది. అంతక్రితం ఏడాదితో పోలిస్తే ఇది 7 శాతం అధికం. ప్రధానంగా తొలి ఏడాది ప్రీమియం విలువే రూ. 1.42 లక్షల కోట్లకు చేరడం విశేషం!
అతిచిన్న కేపిటల్
1956 ఎల్ఐసీ చట్టం ప్రకారం కంపెనీ రూ. 5 కోట్ల కేపిటల్ బేస్‌తో నడుస్తోంది. రూ. 48,436 కోట్ల మిగులు(లాభం)తో ఉంది. అతిచిన్న ఈక్విటీ కారణంగా ఎల్ఐసీ పబ్లిక్ ఇష్యూకి అత్యంత భారీ ప్రీమియం పలికే అవకాశముంది. అయితే ఐపీవో చేపట్టేముందు ఎల్ఐసీ చట్టంలో పలు మార్పులు చేపట్టవలసి ఉంటుందని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. ఎల్ఐసీ విక్రయించే అన్ని పాలసీలకూ ప్రభుత్వ హామీతో కూడిన సావరిన్ గ్యారంటీ ఉంటుంది. దీనికితోడు బీమా రంగంలో కంపెనీ ఏర్పాటుకు ఐఆర్డీఏ నిబంధనల ప్రకారం రూ. 100 కోట్ల కేపిటల్ బేస్ ఉండాలి.
పెట్టుబడులు ఇలా
ప్రభుత్వ రంగ కంపెనీలలో వాటా విక్రయ(డిజిన్వెస్ట్‌మెంట్) అంశంలో ఎల్ఐసీ పలుమార్లు ప్రభుత్వాన్ని ఆదుకుంటూ వచ్చిన విషయం విదితమే. తద్వారా పలు కంపెనీలలో వాటాలను సొంతం చేసుకోవండంతోపాటు.. డిబెంచర్లు, బాండ్లలోనూ పెట్టుబడులు కుమ్మరించింది. 2019 కల్లా వీటి విలువ రూ. 4.34 లక్షల కోట్లు. అంతేకాకుండా పలు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు సైతం నిధులు సమకూర్చింది. ఈ బాటలో ఇటీవలే కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ రానున్న ఐదేళ్లలో రూ. 1.25 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు నిధులను సమకూర్చేందుకు ముందస్తు అంగీకారం తెలిపినట్లు పేర్కొనడం గమనార్హం!
బంగారు బాతు
నిజానికి ప్రభుత్వం ఇంతవరకూ చేపడుతున్న డిజిన్వెస్ట్మెంట్కు ఎల్ఐసీ భారీస్థాయిలోనే చేయూతను ఇస్తోంది. తద్వారా పలు ప్రభుత్వ రంగ కంపెనీలలో వాటాలను సొంతం చేసుకుంటూ వచ్చింది. అయితే తాజాగా కేంద్రం ఎల్ఐసీనే డిజిన్వెస్ట్‌మెంట్ జాబితాలో చేర్చింది. ప్రభుత్వ రంగ కంపెనీలలో వాటాల విక్రయం ద్వారా నిధుల సమీకరణ చేపట్టడాన్ని డిజిన్వెస్ట్మెంట్గా పేర్కొనే సంగతి తెలిసిందే. కాగా.. ఎల్ఐసీ లిస్టయితే కార్పొరేట్ పాలన మెరుగుపడే వీలున్నట్లు విశ్లేషణలు ఉన్నాయి. కంపెనీ అపార మిగులు నిధులను ఇన్వెస్ట్ చేసే అంశంలో ఆచితూచి అడుగేయవలసి రావచ్చని నిపుణులు అభిప్రాయపడ్డారు.
►దేశీ కేపిటల్ మార్కెట్లో అరామ్కో తరహా లిస్టింగ్‌ను ఎల్ఐసీ సాధించే వీలున్నట్లు జాతీయ స్టాక్ ఎక్సే్ఛంజీల సభ్యుల అసోసియేషన్(ఏఎన్ఎంఐ) ప్రెసిడెంట్ విజయ్ భూషణ్ పేర్కొన్నారు. ఈ దశాబ్దపు ఐపీవోగా నిలిచే వీలున్నట్లు ఆయన అభిప్రాయపడ్డారు.
►ఎల్ఐసీ లిస్టింగ్వల్ల కార్పొరేట్ గవర్నెన్స్, పారదర్శకతకు మెరుగుపడతాయని ఎమ్కే గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎండీ కృష్ణ కుమార్ కార్వా పేర్కొన్నారు. తద్వారా ప్రభుత్వానికి మరిన్ని నిధుల సమీకరణ అవకాశాలు లభిస్తాయని అంచనా వేశారు.
►ఎల్ఐసీ ఐపీవో కోసం ఇన్వెస్టర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు మెట్రోపాలిటన్ స్టాక్ ఎక్సే్ఛంజీ మధ్యంతర సీఈవో బాటు నాయర్ చెప్పారు. దీంతో ప్రైమరీ మార్కెట్లకు జోష్ వస్తుందని తెలియజేశారు.
►ఎల్ఐసీ లిస్టయితే మార్కెట్లకు సానుకూల సంకేతాలు అందుతాయని ట్రేడింగ్ బెల్స్ సహవ్యవస్థాపకులు, సీఈవో అమిత్ గుప్తా పేర్కొన్నారు.
నిధుల సమీకరణకు జోష్
వ్యతిరేకిస్తున్నాం: యూనియన్లు ఎల్ఐసీలో వాటాను విక్రయించడం జాతి ప్రయోజనాలకు విరుద్ధమంటూ ఉద్యోగ సంఘాలు(యూనియన్లు) వ్యాఖ్యానించాయి. ఈ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలియజేశాయి. దేశ ఆర్థిక వృద్ధికి ఎల్ఐసీ పలు విధాలుగా తోడ్పడినట్లు ఉద్యోగ సంఘాల ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు. దేశ ఆర్థిక సార్వభౌమత్వం ప్రమాదంలో పడినట్లు వ్యాఖ్యానించారు. ఎల్ఐసీలో వాటా విక్రయానికి ప్రభుత్వం ముందుకెళితే.. దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టనున్నట్లు తెలియజేశారు.