పీఎం ఫసల్ బీమా యోజనలో టమాటాకు దక్కని చోటు
వాతావరణ బీమాలో అవకాశమున్నా పెరిగిన ప్రీమియం
వేరుశనగకు బీమాకు గడువు మరో నాలుగు రోజులే
ఇంతవరకు వచ్చిన దరఖాస్తులు రెండు శాతమే
ఈదఫా కూడా రైతన్నలకు బీమా దక్కడం సందేహంగా మారింది. జిల్లాలోని పడమటి మండలాల్లో ఎక్కువగా సాగయ్యే టమాటాకు ప్రధానమంత్రి ఫసల్ బీమాలో చోటు దక్కలేదు. పోనీ వాతావరణ ఆధారిత బీమాలో అయినా ఉపశమనం లభిస్తుందా అనుకుంటే ప్రీమియం రూ.2,500కు పెంచేశారు. కనీసం లోనీ ఫార్మర్స్‌కైనా బ్యాంకులో బీమా కవర్ అవుతుందనుకుంటే రుణమాఫీ ఎఫెక్ట్‌తో కొత్త రుణాలు అంతంత మాత్రమే. ఇక వేరుశనగ, వరి రైతులకన్నా బీమా దక్కుతుందనుకుంటే అది మూన్నాళ్లముచ్చటే. రెండ్రోజుల క్రితం బీమా గురించి ప్రకటన వచ్చింది. గడువు మరో నాలుగు రోజులే మిగిలింది. ఇన్ని సమస్యల మధ్య ఈ ఖరీఫ్‌లో బీమాతో రైతులకు ధీమా కనిపించడం లేదు.
పలమనేరు: కేంద్ర ప్రభుత్వ సరికొత్త ఫసల్ బీమా యోజనలో రైతులు చెల్లించాల్సిన ప్రీమియం కేవలం రెండుశాతం మాత్రమే. మిగిలిన వాటా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భరిస్తాయి. జిల్లాలో ఎక్కువగా వేరుశనగ ఆపై టమాటా సాగుచేస్తారు. మదనపల్లె డివిజన్‌లో ఏటా టమాటా సాగు 11వేల హెక్టార్లుగా ఉండగా ఈ ఖరీఫ్‌లో 6వేల హెక్టార్లుగా ఉంది. కానీ ఈ పథకంలో టమాటాను చేర్చలేదు. దీంతో రైతులు వ్యవసాయ ఆధారిత బీమానే నమ్ముకోవాల్సి వస్తోంది. ఇందులో రైతులు చెల్లించాల్సిన ప్రీమియం 50శాతం కాబట్టి రైతులు బీమాపై ఆసక్తి చూపడం లేదు.
వేరుశనగకు సమీపిస్తున్న గడువు
ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనలో ప్రీమియం చెల్లించేందుకు ఈనెల 15న ఆఖరు తేదీగా గడువు నిర్ణయించారు. రెండ్రోజుల క్రితం బీమాకు సంబంధించిన వివరాలను తెలిపి మరో నాలుగు రోజుల్లోనే ఆఖరు గడవు పెట్టడంతో రైతులు బీమా చేసుకోలేని పరిస్థితి నెలకొంది. జిల్లాలో ఈదఫా 1.40 లక్షల హెక్టార్లలో వేరుశెనగ సాగవుతోంది. పలమనేరు డివిజన్‌లో 15,800 హెక్టార్లలో వేరుశనగ సాగవుతుండగా ప్రీమియం చెల్లించిన రైతులు 120 మంది విస్తీర్ణం కేవలం వంద హెక్టార్లు మాత్రమే. వరి సాగు చేసిన రైతులదీ ఇదే పరిస్థితి. జిల్లాలోని అన్ని డివిజన్లలోనూ ఇలాగే ఉంది. ఇప్పటిదాకా జిల్లాలో బీమా చేసుకున్న నాన్‌లోనీలు (బ్యాంకులో రుణం పొందని రైతులు) వారు కేవలం 2శాతం మంది మాత్రమే. ఇక నాలుగు రోజుల్లో వ్యవసాయశాఖ ఎంత విస్తృతప్రచారం చేసినా బీమా చేసుకునే రైతులు పదిశాతం మంది కూడా జరిగేలా లేదు.
ఎన్నో తిరకాసులు
పీఎం ఫసల్ బీమాలో రైతు చెల్లించాల్సిన ప్రీమియం రెండుశాతం మాత్రమే. అయితే ఇందులో టమాటాను చేర్చలేదు. వ్యవసాయాధారిత బీమాలో మాత్రం టమాటాకు అవకాశం కల్పించినా రైతు 50శాతం ప్రీమియం చెల్లించాలి. ఆలెక్కన హెక్టారుకు రూ,2.500 చెల్లించడం రైతులకు ఇబ్బందే. పోనీ బ్యాంకుల్లో రుణాలు పొందినవారికి బీమా కవర్ అవుతుంనుకుంటే అక్కడ రుణాలు మాఫీ కాకపోవడంతో సగం మందికి కొత్త రుణాలు రాలేదు. ఇక రైతులే సొంతంగా బీమా చేద్దామంటే ఇన్‌పుట్ సబ్సిడీ రాదేమోననే అనుమానం ఉంది. గతంలో బీమా ఉన్న రైతుల పేర్లను ఇన్‌పుట్ సబ్సిడీ జాబితానుంచి తొలగించారు. ఆఖరుకు బీమాను పొందలేని రైతులు ఇన్‌పుట్ సబ్సిడీగా ఎకరానికి రూ.100 నుంచి 500 లోపు పొందారు. అందిన నగదు అప్పట్లో బ్యాంకుల ఖాతాలు తెరవడానికి కూడా చాలకుండా పోయింది. ఈ అనుభవాల మధ్య వేరుశనగ, టమాటా రైతులు బీమా చెల్లించేందుకు ఆసక్తిని చూపడం లేదు.
బ్యాంకుల్లో పుట్టని కొత్త రుణాలు
రైతు రుణమాఫీ దెబ్బతో గతంలో రుణం ఉన్నవారికి కొత్త రుణాలను ఇచ్చేందుకు బ్యాంకర్లు సుముఖత చూపడం లేదు. ఆ లెక్కన రెన్యూవల్ చేసుకోలేని వారికి కొత్త రుణాలు రానట్టే. రుణ మాఫీ జాబితాలో ఉన్నా.. పూర్తిగా రుణం చెల్లించనివారు బ్యాంకర్ల లెక్కలో బకాయిదారులే. ఇలా ఉండగా లోనీఫార్మర్స్(బ్యాంకులో రుణం కొత్తగా పొందేవారు)కు అటు టమాటాకు ఇటు వేరుశనగకు పంట బీమా పొందే అవకాశం ఉంది. కానీ రీషెడ్యూల్ చేసుకున్న వారు లేదా అప్పు చెల్లించిన రైతులకు మాత్రమే కొత్త రుణాలు దక్కుతున్నాయి. దీంతో రుణాలు చెల్లించని రైతులకు బ్యాంకులో బీమా దక్కనట్టే.
బీమా చేసుకుంటే చాలా మేలు
పీఎం ఫసల్ బీమాలో టమాటాకు బీమాచేసుకునే అవకాశం లేనిమాట ని జమే. అయితే బజాజ్ అలయన్స్ వారి ద్వారా వాతావరణ ఆధారిత బీమాతో వచ్చేనెల 9దాకా ప్రీమియం చేసుకోవచ్చు. హెక్టారుకు రూ.2,500 కట్టాలి. ఈ ప్రాంత రైతులకు బీమా ఎంతో మేలుగా ఉంటుంది. కానీ ఇప్పటిదాకా 2శాతం కూడా లక్ష్యం ముందుకెళ్లలేదు. -సుబహానీ, ఏడీ హార్టికల్చర్, పలమనేరు డివిజన్
నాలుగురోజులే గడువు
మాకు ఆదేశాలు వచ్చి రెండ్రోజులయింది. మరో నాలుగు రోజుల్లో వరి, వేరుశెనగ బీమా ఆఖరు గడవు. ఆలోపు రైతులు బీమా చేసుకోవాలి. గడవు పెంచే అవకాశాలైతే కనిపించడం లేదు. ఇప్పటిదాకా ఓ రెండు శాతం మంది రైతులు ప్రీమియం చెల్లించారు. మేం కూడా ప్రచారం చేస్తున్నాం. -విశ్వనాథరెడ్డి, వ్యవసాయశాఖ సహాయ సంచాలకులు