independent MLA
-
రాజ్యసభ ఎన్నికలు.. జోరందుకున్న బేరసారాలు!
సాక్షి, ముంబై: రాజ్యసభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో వివిధ పార్టీల, స్వతంత్ర ఎమ్మెల్యేలతో ప్రధాన పార్టీల ప్రతినిధులు రహస్యంగా మంతనాలు జరపడం, ఓట్ల కొనుగోలు కోసం బేరసారాలు చేయడం జోరందుకున్నట్లు తెలుస్తోంది. కొందరు ప్రత్యక్షంగా, మరికొందరు పరోక్షంగా సమావేశాల్లో పాల్గొంటున్నారు. అంతేగాకుండా ఓట్లు చీలిపోకుండా ప్రధాన రాజకీయ పార్టీలు తమతమ ఎమ్మెల్యేలతో, చిన్నాచితక పార్టీలు, ఇండిపెండెంటు ఎమ్మెల్యేలతో వేర్వేరుగా చర్చలు జరుపుతున్నాయి. ఈనెల 10న ఆరు రాజ్యసభ స్ధానాలకు ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. కానీ ఆరు స్ధానాలకుగాను ఏడుగురు అభ్యర్థులు నామినేషన్లు వేయడంతో పేచీ మొదలైంది. ఇందులో బీజేపీ తరఫున (ముగ్గురు) కేంద్ర రైల్వే మంత్రి పీయుష్ గోయల్, రాష్ట్ర వ్యవసాయ శాఖ మాజీ మంత్రి, విదర్భకు చెందిన డాక్టర్ అనీల్ బోండే, కొల్హాపూర్‌కు చెందిన మాజీ ఎంపీ ధనంజయ్ మహాడిక్, శివసేన తరఫున (ఇద్దరు) సంజయ్ రావుత్, సంజయ్ పవార్, ఎన్సీపీ తరఫున (ఒక్కరు) ప్రఫుల్ పటేల్, కాంగ్రెస్ తరఫున (ఒక్కరు) ఇమ్రాన్ ప్రతాపగడి ఇలా ఏడుగురు బరిలో ఉన్నారు. నామినేషన్ ఉపసంహరించుకునేందుకు ఇచ్చిన గడువు చివరి నిమిషం వరకు ఇరు పార్టీల నాయకుల మధ్య చర్చలు జరిగాయి. అభ్యర్థి ఉపసంహరణకోసం ఒకరికొకరు ఆఫర్లు ప్రకటించుకున్నారు. అయినప్పటికీ చర్చలు విఫలం కావడంతో ఎన్నికలు అనివార్యమయ్యా యి. దీంతో ఆరో అభ్యర్ధిని గెలిపించుకోవడానికి ఇటు బీజేపీ, అటు శివసేన తమ ప్రతిష్టను ఫణంగా పెడుతున్నాయి. ఎలాగైనా తమ అభ్యర్ధిని గెలిపించుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. అందులో భాగంగా శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ నేతృత్వంలోని మహావికాస్ ఆఘాడికి చెందిన ఎమ్మెల్యేలతో చర్చించేందుకు ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ముంబైలోని ఫైవ్‌స్టార్ హోటల్ ట్రయ్డెంట్లో మంగళవారం ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి కొందరు ఇండిపెండెంటు ఎమ్మెల్యేలు కూడా హాజరు కానున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. చదవండి: నోట్లపై గాంధీ బొమ్మ బదులు.. ఆర్బీఐ క్లారిటీ బీజేపీ మూడో అభ్యర్థితో మొదలైన కాక... బీజేపీ మూడో అభ్యర్ధిని బరిలో దింపడంతో 24 ఏళ్ల తరువాత రాష్ట్రంలో రాజ్యసభ ఎన్నికలు జరుగుతున్న విషయం విదితమే. లేని పక్షంలో ఆరుగురు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికై రాజ్యసభకు వెళ్లేవారు. బీజేపీ కారణంగా ఈ ఎన్నికలు మరింత రసవత్తరంగా మారాయి. దీంతో అన్ని ప్రధాన పార్టీలు తమ పరువు, ప్రతిష్టను ఫణంగా పెడుతున్నాయి. ఎక్కడ తమ ఎమ్మెల్యేలు అమ్ముడుపోతారోనని భయం పట్టుకుంది. దీంతో ఎమ్మెల్యేలు చీలిపోకుండా ఎన్నికలకు రెండు రోజుల ముందే తమ పార్టీ ఎమ్మెల్యేలందరినీ ఓ రహస్య స్థావరానికి తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఎవరితో సంప్రదింపులు జరపకుండా, బయట ప్రపంచంతో సంబంధం లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోనున్నారు. ఎన్నికలు జరిగే రోజు వరకు ఎమ్మెల్యేలందరూ ఎక్కడ బస చేశారనే విషయం బయటకు పొక్కకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ముంబై చేరుకున్న అశ్వినీ వైష్ణవ్ రాష్ట్రంలో జరగనున్న రాజ్యసభ ఎన్నికల పనులు పర్యవేక్షించేందుకు కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను బీజేపీ నియమించింది. దీంతో వైష్ణవ్ ఆదివారమే ముంబైకి చేరుకున్నారు. మూడో అభ్యర్ధిని గెలిపించుకునేందుకు రచించాల్సిన వ్యూహంపై కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి వైష్ణవ్‌తోపాటు కేంద్ర వాణిజ్య మంత్రి, రాజ్యసభ బీజేపీ అభ్యర్ధి పీయూష్ గోయల్, ప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్ తదితర కీలక నేతలు హాజరయ్యారు. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ సమావేశం ప్రతిపక్ష నేత దేవేంద్ర ఫడ్నవీస్‌కు చెందిన సాగర్ బంగ్లాలో జరగాల్సి ఉంది. కానీ ఆయనకు కరోనా పాజిటివ్ రావడంతో బీజేపీ కార్యాలయంలో ఈ సమావేశం నిర్వహించారు. కరోనా కారణంగా ఫడ్నవీస్ ప్రత్యక్షంగా హాజరు కాలేకపోయినప్పటికీ ఆన్లైన్లో పాల్గొన్నారు. చదవండి: బెడిసికొట్టిన ఏకగ్రీవం.. రాష్ట్రంలో 24 ఏళ్ల తరువాత రాజ్యసభ ఎన్నికలు -
కింగ్‌మేకర్‌గా ఒకే ఒక్కడు..
చండీగఢ్ : హరియాణాలో హంగ్ అసెంబ్లీ నెలకొన్న నేపథ్యంలో ప్రభుత్వ ఏర్పాటులో ప్రతి సభ్యుడూ కీలకంగా మారారు. గతంలో తాము రాజకీయంగా టార్గెట్ చేసిన వ్యక్తి హరియాణా లోక్‌హిత్ పార్టీని స్దాపించి ఎన్నికల్లో ఆ పార్టీ తరపున తానొక్కడే గెలుపొందడంతో కాషాయ నేతలు అతడిని తమ శిబిరంలోకి రప్పించేందుకు ప్రయత్నించారు. బీజేపీకి మద్దతు ప్రకటించి ఢిల్లీకి చేరిన స్వతంత్ర ఎమ్మెల్యేల బృందంలో ఆ వివాదాస్పద ఎమ్మెల్యే గోపాల్ కందా కూడా ఉన్నారు. హరియాణాలో ఐఏఎఫ్ విమానంలో గురువారం సాయంత్రం ఢిల్లీకి బయలుదేరిన వారిలో ఇండిపెండెంట్ ఎమ్మెల్యే రంజీత్ సింగ్‌తో పాటు గోపాల్ కందా ఫోటో ఉండటం ఈ వార్తలకు బలం చేకూర్చింది. కాగా 2012లో తన ఏవియేషన్ కంపెనీలో పనిచేసే ఎయిర్ హోస్టెస్ ఆత్మహత్యకు పాల్పడటంతో తనపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఆయన భూపీందర్ సింగ్ హుడా నేతృత్వంలోని కేబినెట్ నుంచి ఆయన వైదొలిగారు. గోపాల్ కందా వేధింపులతోనే తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నట్టు ఎయిర్‌హోస్టెస్ గీతికా శర్మ సూసైడ్ నోట్లో పేర్కొనడంతో ఆయనను అరెస్ట్ చేశారు.ఇక తొలుత షూ వ్యాపారంలో భారీ నష్టాలు రావడంతో 1998లో రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఆయన అడుగుపెట్టారు. 2007లో గోపాల్ తన కారులో నలుగురు నేరస్తులతో కలిసి పట్టుబడటంతో ఆయన దందాలపై దర్యాప్తు చేయాలని కేంద్రం హర్యానా ప్రభుత్వాన్ని ఆదేశించింది. వివాదాస్పద ఎమ్మెల్యే, హర్యానా లోక్‌హిత్ పార్టీ తరపున ఏకైక సభ్యుడు గోపాల్ కందా గతంలో తనను రాజకీయంగా టార్గెట్ చేసిన బీజేపీకి ఇప్పుడు ప్రభుత్వ ఏర్పాటుకు సహకరిస్తుండటం గమనార్హం. -
నటిపై వ్యాఖ్యలను సమర్థించుకున్న ఎమ్మెల్యే
ముంబై: మన దేశంలో చాలామంది ప్రజలు క్రికెటర్లు ఎన్ని పరుగులు చేశారన్న విషయాన్ని లెక్కపెట్టుకుని గుర్త పెట్టుకుంటారు కానీ రైతుల దుస్థితి గురించి ఏమాత్రం పట్టించుకోరని మహారాష్ట్రకు చెందిన ఇండిపెండెంట్ ఎమ్మెల్యే ఓం ప్రకాశ్ బాబారావు అలియాస్ బచ్చు కడు ఆవేదన వ్యక్తం చేశాడు. అహ్మద్‌నగర్ జిల్లా శ్రీరామ్‌పూర్‌లో జరిగిన రైతుల ర్యాలీలో ఆయన ప్రసంగించారు. 'దేశంలో చాలామంది ప్రజలు క్రికెట్లో సచిన్ టెండుల్కర్ ప్రతి పరుగును లెక్కకట్టి గుర్తు పెట్టుకుంటారు. కానీ పొలాల్లో కష్టపడుతున్న రైతులు గురించి కనీసం ఆలోచించరు' అని కడు అన్నారు. ఇటీవల రైతుల ఆత్యహత్యలపై కడు మాట్లాడుతూ బాలీవుడ్ నటి హేమమాలినిపై సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. మద్యంతాగే అలవాటున్నవారే ఆత్మహత్యలు చేసుకుంటున్నారని చెప్పడం దారుణమని, అలాగైతే హేమమాలిని రోజు మద్యం తాగుతారని, ఆమె ఆత్మహత్య చేసుకోలేదని వ్యాఖ్యానించారు. దీనిపై విమర్శలు రాగా, ఎమ్మెల్యే తన వ్యాఖ్యలను సమర్థించుకునేందుకు ప్రయత్నించారు. తాను హేమమాలిని వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడలేదని, సినిమాల్లో ఆమె మద్యం తాగుతారని చెప్పానని అన్నారు. అమరావతి జిల్లాలోని అచలపూర్ నుంచి ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. -
'నన్ను జైలుకు పంపినా నా అభిప్రాయం ఇదే'
శ్రీనగర్: భారత్‌లో జమ్మూ కశ్మీర్ అంతర్భాగం కాదని ఆ రాష్ట్ర స్వతంత్ర ఎమ్మెల్యే షేక్ రషీద్ అసెంబ్లీలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై ప్రజాభిప్రాయానికి వెళ్లాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్, బీజేపీ సభ్యులు ఈ వ్యాఖ్యలపై నిరసన వ్యక్తం చేశారు. రషీద్ శాసనసభకు రాజీనామా చేసి పాకిస్తాన్‌కు వలస పోవాలని లేదా వేర్పాటువాదులతో చేరాలని సూచించారు. ‘‘నన్ను జైలుకు పంపినా, ఎన్నికల్లో పాల్గొనకుండా నిషేధించినా కశ్మీర్‌పై నా అభిప్రాయం ఇదే. చారిత్రక వాస్తవం అర్థం చేసుకోండి. ఈ విషయంలో ప్రజాభిప్రాయం తప్ప మరో మార్గం లేదని న్యూఢిల్లీకి తెలియజేయండి ’’ అని రషీద్ సభలో అన్నారు. భారత్ సార్వభౌమత్వానికి తాను వ్యతిరేకం కాదని, భారత్-పాక్ మధ్య వివాదానికి కారణమైన జమ్మూ కశ్మీర్ గురించే మాట్లాడుతున్నానని చెప్పారు. ఐరాస తీర్మానాలను మరుగునపరిచే అధికారం అసెంబ్లీకి లేదని పేర్కొన్నారు. -
అసెంబ్లీలోనే ఎమ్మెల్యేను చితకబాదారు
శ్రీనగర్: బీఫ్ వివాదం జమ్ముకశ్మీర్ అసెంబ్లీలో దుమారం రేపింది. బీఫ్ పార్టీ ఇచ్చినందుకు ఓ ఎమ్మెల్యేను తోటి సభ్యులు అసెంబ్లీలోనే చితకబాదారు. జమ్ము కశ్మీర్లో బీఫ్‌పై నిషేధాన్ని వ్యతిరేకిస్తూ బుధవారం ఇండిపెండెంట్ ఎమ్మెల్యే ఇంజినీర్ రషీద్ బీఫ్ పార్టీ ఇచ్చారు. శ్రీనగర్ ఎమ్మెల్యే హాస్టల్లోఈ పార్టీ ఏర్పాటు చేశారు. బీఫ్‌ను నిషేధిస్తూ అసెంబ్లీలో బిల్లు పాసయినా తాను ఖాతరు చేయబోనని అన్నారు. గురువారం అసెంబ్లీ ప్రారంభంకాగానే ఈ విషయంపై దుమారం చెలరేగింది. సభలో బీజేపీ ఎమ్మెల్యేలు గగన్ భగత్, రాజీవ్ శర్మలు.. రషీద్‌పై దాడి చేశారు. స్పీకర్ కవీందర్ గుప్తా ఎదుటే ఆయన్ను చితకబాదారు. ఈ సమయంలో ప్రతిపక్ష నేషనల్ కాన్ఫరెన్స్‌కు చెందిన ఎమ్మెల్యేలు రషీద్‌ను కాపాడారు. ఇది దురదృష్టకర సంఘటన అని ప్రతిపక్ష నాయకుడు, మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా అన్నారు. ఈ సంఘటనను ముఖ్యమంత్రి ముఫ్తీ మహ్మద్ సయీద్ ఖండించారు. జమ్ముకశ్మీర్‌లో పీడీపీ, బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడిన సంగతి తెలిసిందే.