సాక్షి, ముంబై: రాజ్యసభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో వివిధ పార్టీల, స్వతంత్ర ఎమ్మెల్యేలతో ప్రధాన పార్టీల ప్రతినిధులు రహస్యంగా మంతనాలు జరపడం, ఓట్ల కొనుగోలు కోసం బేరసారాలు చేయడం జోరందుకున్నట్లు తెలుస్తోంది. కొందరు ప్రత్యక్షంగా, మరికొందరు పరోక్షంగా సమావేశాల్లో పాల్గొంటున్నారు. అంతేగాకుండా ఓట్లు చీలిపోకుండా ప్రధాన రాజకీయ పార్టీలు తమతమ ఎమ్మెల్యేలతో, చిన్నాచితక పార్టీలు, ఇండిపెండెంటు ఎమ్మెల్యేలతో వేర్వేరుగా చర్చలు జరుపుతున్నాయి. ఈనెల 10న ఆరు రాజ్యసభ స్ధానాలకు ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. కానీ ఆరు స్ధానాలకుగాను ఏడుగురు అభ్యర్థులు నామినేషన్లు వేయడంతో పేచీ మొదలైంది.
ఇందులో బీజేపీ తరఫున (ముగ్గురు) కేంద్ర రైల్వే మంత్రి పీయుష్ గోయల్, రాష్ట్ర వ్యవసాయ శాఖ మాజీ మంత్రి, విదర్భకు చెందిన డాక్టర్ అనీల్ బోండే, కొల్హాపూర్‌కు చెందిన మాజీ ఎంపీ ధనంజయ్ మహాడిక్, శివసేన తరఫున (ఇద్దరు) సంజయ్ రావుత్, సంజయ్ పవార్, ఎన్సీపీ తరఫున (ఒక్కరు) ప్రఫుల్ పటేల్, కాంగ్రెస్ తరఫున (ఒక్కరు) ఇమ్రాన్ ప్రతాపగడి ఇలా ఏడుగురు బరిలో ఉన్నారు. నామినేషన్ ఉపసంహరించుకునేందుకు ఇచ్చిన గడువు చివరి నిమిషం వరకు ఇరు పార్టీల నాయకుల మధ్య చర్చలు జరిగాయి. అభ్యర్థి ఉపసంహరణకోసం ఒకరికొకరు ఆఫర్లు ప్రకటించుకున్నారు. అయినప్పటికీ చర్చలు విఫలం కావడంతో ఎన్నికలు అనివార్యమయ్యా యి.
దీంతో ఆరో అభ్యర్ధిని గెలిపించుకోవడానికి ఇటు బీజేపీ, అటు శివసేన తమ ప్రతిష్టను ఫణంగా పెడుతున్నాయి. ఎలాగైనా తమ అభ్యర్ధిని గెలిపించుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. అందులో భాగంగా శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ నేతృత్వంలోని మహావికాస్ ఆఘాడికి చెందిన ఎమ్మెల్యేలతో చర్చించేందుకు ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ముంబైలోని ఫైవ్‌స్టార్ హోటల్ ట్రయ్‌డెంట్‌లో మంగళవారం ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి కొందరు ఇండిపెండెంటు ఎమ్మెల్యేలు కూడా హాజరు కానున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.
చదవండి: నోట్లపై గాంధీ బొమ్మ బదులు.. ఆర్బీఐ క్లారిటీ
బీజేపీ మూడో అభ్యర్థితో మొదలైన కాక...
బీజేపీ మూడో అభ్యర్ధిని బరిలో దింపడంతో 24 ఏళ్ల తరువాత రాష్ట్రంలో రాజ్యసభ ఎన్నికలు జరుగుతున్న విషయం విదితమే. లేని పక్షంలో ఆరుగురు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికై రాజ్యసభకు వెళ్లేవారు. బీజేపీ కారణంగా ఈ ఎన్నికలు మరింత రసవత్తరంగా మారాయి. దీంతో అన్ని ప్రధాన పార్టీలు తమ పరువు, ప్రతిష్టను ఫణంగా పెడుతున్నాయి. ఎక్కడ తమ ఎమ్మెల్యేలు అమ్ముడుపోతారోనని భయం పట్టుకుంది. దీంతో ఎమ్మెల్యేలు చీలిపోకుండా ఎన్నికలకు రెండు రోజుల ముందే తమ పార్టీ ఎమ్మెల్యేలందరినీ ఓ రహస్య స్థావరానికి తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఎవరితో సంప్రదింపులు జరపకుండా, బయట ప్రపంచంతో సంబంధం లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోనున్నారు. ఎన్నికలు జరిగే రోజు వరకు ఎమ్మెల్యేలందరూ ఎక్కడ బస చేశారనే విషయం బయటకు పొక్కకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నారు.
ముంబై చేరుకున్న అశ్వినీ వైష్ణవ్
రాష్ట్రంలో జరగనున్న రాజ్యసభ ఎన్నికల పనులు పర్యవేక్షించేందుకు కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను బీజేపీ నియమించింది. దీంతో వైష్ణవ్ ఆదివారమే ముంబైకి చేరుకున్నారు. మూడో అభ్యర్ధిని గెలిపించుకునేందుకు రచించాల్సిన వ్యూహంపై కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి వైష్ణవ్‌తోపాటు కేంద్ర వాణిజ్య మంత్రి, రాజ్యసభ బీజేపీ అభ్యర్ధి పీయూష్ గోయల్, ప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్ తదితర కీలక నేతలు హాజరయ్యారు. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ సమావేశం ప్రతిపక్ష నేత దేవేంద్ర ఫడ్నవీస్‌కు చెందిన సాగర్ బంగ్లాలో జరగాల్సి ఉంది. కానీ ఆయనకు కరోనా పాజిటివ్ రావడంతో బీజేపీ కార్యాలయంలో ఈ సమావేశం నిర్వహించారు. కరోనా కారణంగా ఫడ్నవీస్ ప్రత్యక్షంగా హాజరు కాలేకపోయినప్పటికీ ఆన్‌లైన్‌లో పాల్గొన్నారు.
చదవండి: బెడిసికొట్టిన ఏకగ్రీవం.. రాష్ట్రంలో 24 ఏళ్ల తరువాత రాజ్యసభ ఎన్నికలు
Comments
Please login to add a commentAdd a comment