బీఫ్ పార్టీలో ఎమ్మెల్యే రషీద్ (ఫైల్)
శ్రీనగర్: బీఫ్ వివాదం జమ్ముకశ్మీర్ అసెంబ్లీలో దుమారం రేపింది. బీఫ్ పార్టీ ఇచ్చినందుకు ఓ ఎమ్మెల్యేను తోటి సభ్యులు అసెంబ్లీలోనే చితకబాదారు.
జమ్ము కశ్మీర్లో బీఫ్పై నిషేధాన్ని వ్యతిరేకిస్తూ బుధవారం ఇండిపెండెంట్ ఎమ్మెల్యే ఇంజినీర్ రషీద్ బీఫ్ పార్టీ ఇచ్చారు. శ్రీనగర్ ఎమ్మెల్యే హాస్టల్లోఈ పార్టీ ఏర్పాటు చేశారు. బీఫ్ను నిషేధిస్తూ అసెంబ్లీలో బిల్లు పాసయినా తాను ఖాతరు చేయబోనని అన్నారు. గురువారం అసెంబ్లీ ప్రారంభంకాగానే ఈ విషయంపై దుమారం చెలరేగింది. సభలో బీజేపీ ఎమ్మెల్యేలు గగన్ భగత్, రాజీవ్ శర్మలు.. రషీద్పై దాడి చేశారు. స్పీకర్ కవీందర్ గుప్తా ఎదుటే ఆయన్ను చితకబాదారు. ఈ సమయంలో ప్రతిపక్ష నేషనల్ కాన్ఫరెన్స్కు చెందిన ఎమ్మెల్యేలు రషీద్ను కాపాడారు. ఇది దురదృష్టకర సంఘటన అని ప్రతిపక్ష నాయకుడు, మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా అన్నారు. ఈ సంఘటనను ముఖ్యమంత్రి ముఫ్తీ మహ్మద్ సయీద్ ఖండించారు. జమ్ముకశ్మీర్లో పీడీపీ, బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడిన సంగతి తెలిసిందే.