మళ్లీ రామసేతు వివాదం ఎందుకు?
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అఖండ విజయం సాధించడంతో గత ఆరేళ్లుగా కోర్టు పెండింగ్‌లో ఉన్న వివాదాస్పద రామ మందిర నిర్మాణ అంశం తెరమీదకు వచ్చింది. ఇప్పుడు అదే కోవలో కాల గమనంలో కనుమరుగైందని అనుకుంటున్న ‘రామసేతు’ అంశం అనూహ్యంగా తెరమీదకు వచ్చింది. రామసేతు ప్రకతిసిద్ధంగా ఏర్పడినదా లేదా మానవ నిర్మాణమా? అన్న అంశాన్ని తెలుసుకోవడానికి తాము స్వతంత్య్ర సర్వే నిర్వహించాలనుకుంటున్నామని భారత చారిత్రక పరిశోధన మండలి శనివారం ఓ ప్రకటన చేసింది. ఈ మండలి చైర్మన్ సుదర్శన్‌రావు పక్కా హిందుత్వ వాదనే విషయం అందరికి తెల్సిందే. పుక్కిటి పురాణాన్ని చరిత్రగా మలిచేందుకు జరిగే ప్రయత్నమే ఇదని కొంత మంది చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు.
రామ సేతు లేదా ఆడమ్స్ బ్రిడ్జి
తమిళనాడులోని రామేశ్వరం తీరం నుంచి శ్రీలంక ఆగ్నేయ తీరంలోని మన్నార్ దీవులకు మధ్య సముద్రం నీటి లోపల ఓ వారధిలాంటి నిర్మాణం ఉంది. బ్రిటానియా ఎన్సైక్లోపీడియా ప్రకారం దీన్ని రామసేతు లేదా ఆడమ్స్ బ్రిడ్జి అని పిలుస్తారు. ఇది సున్నపు మేటల వల్ల ఏర్పడిందన్నది శాస్త్రవేత్తల అభిప్రాయం. దీన్ని ఆడమ్స్ నిర్మించడం ఆడమ్స్ బ్రిడ్జి అని, కాదు రాముడు నిర్మించడం వల్ల రామసేతు అని పేరు వచ్చిందన్నది మత విశ్వాసకుల అభిప్రాయం. సీతను రావణాసురుడు శ్రీలంకకు ఎత్తుకుపోవడం వల్ల అక్కడికి వెళ్లేందుకు వానర సైన్యం రాళ్లతో ఈ వంతెన నిర్మించిందన్నది మత విశ్వాసకుల అభిప్రాయం.
18వ శతాబ్దంలోనే కొట్టేయాలనుకున్నారు
పాశ్చాత్య దేశాల నుంచి సరకు రవాణా నౌకలు భారత తూర్పు తీరానికి రావాలంటే సముద్రం నీటిలో ఈ రామసేతు అడ్డుగా ఉంది. దాంతో ఆ నౌకలు శ్రీలంకను చుట్టి భారత్ తీరానికి వస్తున్నాయి. దీని వల్ల అపార ఖర్చుతోపాటు ఎంతో కాలం ఖర్చవుతోంది. బ్రిటిష్ కాలంలో ఇంగ్లండ్ నుంచి భారత్ తూర్పు తీరానికి ఈస్ట్ ఇండియా కంపెనీ సరకుల నౌకలు కూడా శ్రీలంకను చుట్టి వచ్చేవి. ఈ అనవసర ఖర్చును, సమయాన్ని ఆదా చేయడం కోసం రామసేతును కొట్టేయాలని ఇంగ్లీష్ జియోగ్రాఫర్ జేమ్స్ రెన్నెల్ ప్రణాళిక వేశారు. అది అనేక చారిత్రక కారణాల వల్ల కార్యరూపం దాల్చలేదు.
సేతు సముద్రం కెనాల్ ప్రాజెక్ట్
భారత్‌కు స్వాతంత్య్రం వచ్చాక మళ్లీ ఈ ప్రాజెక్ట్ ప్రతిపాదనలు ముందుకొచ్చాయి. 1955లో సేతు సముద్రం ప్రాజెక్టు కమిటీ ప్రతిపాదనలను భారత్ ప్రభుత్వం ఆమోదించింది. అయితే 50 ఏళ్ల తర్వాత, అంటే 2005లో ప్రాజెక్ట్ నిర్మాణానికి అప్పటి యూపీఏ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అప్పటి ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ ప్రాజెక్ట్‌కు శంకుస్థాపన చేశారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, విశ్వహిందూ పరిషద్ లాంటి సంస్థలు ప్రాజెక్ట్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఆందోళనలకు దిగడమే కాకుండా సుప్రీం కోర్టుకెక్కాయి. రామాయణం ఒక ఇతియాసం మాత్రమేనని, అందులోని రాముడి పాత్ర నిజంగా ఉందనడానికి ఎలాంటి చారిత్రక ఆధారాలు లేవంటూ భారత ఆర్కియాలోజి సంస్థ కోర్టులో 2007లో అఫిడవిట్ దాఖలు చేసింది. ఇది అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న ఎల్కే అద్వానీకి ఎంతో కలసివచ్చింది. కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయడానికి ఆయన అఫిడవిట్‌ను అస్త్రంగా మలుచుకొన్నారు. మత విశ్వాసాలను గౌరవించలేని కాంగ్రెస్‌కు లౌకికవాదినని చెప్పుకునే అర్హత కూడా లేదని విమర్శించారు.
రాముడు ఏ ఇంజనీరింగ్ కాలేజీలో చదివాడు?
కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సేతు సముద్రం ప్రాజెక్ట్‌కు తమిళనాడులోని డీఎంకే, ఏఐడీఎంకే పార్టీలు మద్దతు పలికాయి. రామసేతును దెబ్బతీయకుండానే ప్రాజెక్ట్‌ను చేపట్టాల్సిందిగా ఏఐడీఎంకే సూచించింది. డీఎంకే నాయకుడు కరుణానిధి ఒక అడుగు ముందుకేసి, రామసేతును కట్టడానికి రాముడు ఏ ఇంజనీరింగ్ కాలేజీ నుంచి పట్టా పుచ్చుకున్నారని వ్యాఖ్యానించడం పట్ల హిందూ సంస్థలు నాడు తీవ్రంగా గొడవ చేశాయి. ప్రముఖ చరిత్రకారుడు పన్నీకర్ కూడా రామసేతుకు నష్టం జరుగకుండా ప్రాజెక్ట్ నిర్మాణం కొనసాగాలని సూచించారు. రామాయణం చరిత్రకాదని, అది కల్పిత గాధన్నది తనకు తెలుసునని, అయితే కోట్లాది మంది ప్రజల విశ్వాసాన్ని ఇక్కడ దెబ్బతీయడం సమంజసం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. 2009లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోవడంతో వివాదం సద్దుమణగింది.
పర్యావరణ అంశాల అవరోధం
2009 తర్వాత కోర్టు వాదనలన్నీ ప్రధానంగా పర్యావరణ అంశాలపై కొనసాగాయి. సేతు సముద్రం ప్రాజెక్ట్ వల్ల పర్యావరణ సమతౌల్యత దెబ్బతింటుందంటూ పర్యావవరణ పరిరక్షణ సంస్థలు వాదించాయి. ఈనేపథ్యంలో వాస్తవాస్తవాలను తేల్చేందుకు ఆర్కే పచౌరి కమిటీ ఏర్పాటయింది. పర్యావరణ పరిస్థితులకు తీవ్ర విఘాతం కలుగుతుందంటూ 2013లో పచౌరి కమిటీ నివేదిక సమర్పించింది. అప్పటి నుంచి పూర్తిగా తెరపడిన ఈ వివాదాన్ని మళ్లీ తెరపైకి తీసుకరావడం వెనక దురుద్దేశాలున్నాయని కేరళ, తమళనాడు పార్టీలు విమర్శిస్తున్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లో మతం పునాదులను బలోపేతం చేసుకునే ప్రయత్నం కావచ్చన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.