ఒప్పుకొందామా? తప్పందామా?
చైనాతో మనకున్న తూర్పు, పశ్చిమ సరిహద్దుల వివాదం విషయమై భారతదేశ అనిశ్చయాత్మకత గురించి ఎ.ఎస్. భాసిన్ రాసిన పుస్తకం కలవరపరిచే అనేక ప్రశ్నలను రేకెత్తించింది. బ్రిటిష్ కాలం నుంచి 1954 వరకు సర్వే ఆఫ్ ఇండియా వారి ప్రపంచ పటాలలో చైనాతో భారత్ పశ్చిమ సరిహద్దు కచ్చితమైన కొలతలు లేకుండానే ఉండిపోయింది. భౌగోళిక కచ్చితత్వం కోసమని నెహ్రూ ఎలాంటి కారణం గానీ, చైనా అంగీకరిస్తుందన్న నమ్మకం గానీ లేకుండా ఏకపక్షంగా భారత్‌లో కలిపేయడానికి అక్సాయ్‌చిన్ ప్రాంతాన్ని ఎంపిక చేసుకున్నారు. మ్యాపులో ఉన్నా, లేకున్నా భారత్ సరిహద్దు భూభాగాలు భారత్‌వే అనే నెహ్రూ మంకుపట్టు దేశానికీ, ఆయనకూ వినాశకరంగా పరిణమించాయి.
కరోనా ప్రబలత గొప్ప పఠనావకాశాన్ని కలిగించింది. దురదృష్టం, ఆ చీకటి రోజుల్లో ప్రచురణతో వెలుగును చూసిన ఎన్నో పుస్తకాలు యోగ్యతను కలిగి ఉండి కూడా పాఠకుల దృష్టి ధ్యాసల్ని తమ వైపునకు మరల్చుకోలేక పోయాయి. అవతార్ సింగ్ భాసిన్ రాసిన ‘నెహ్రూ, టిబెట్ అండ్ ఇండియా’ ఇందుకొక ప్రముఖమైన ఉదాహరణ. చైనాతో మనకున్న తూర్పు, పశ్చిమ సరిహద్దుల వివాదం విషయమై భారతదేశ అనిశ్చ యాత్మకత గురించి ఆ పుస్తకం కలవరపరిచే అనేక ప్రశ్నలను రేకెత్తిం చింది. సమస్యను పరిష్కరించడంలో జవహర్లాల్ నెహ్రూ ఎలా తన బాధ్యతారాహిత్యాన్ని కనబరిచిందీ సంకేతపరచింది. విదేశీ వ్యవహా రాల మంత్రిత్వశాఖలోని చరిత్ర విభాగానికి ముప్పై ఏళ్ల పాటు అధిపతిగా ఉన్న తర్వాత భాసిన్ రాసిన పుస్తకం కనుక ఇందులో పొందుపరచిన అంశాలతో వివాదించడం కష్టమే. ముఖ్యంగా తన వెల్లడింపులకు ఆయన అనేక వాస్తవాలను జోడించినప్పుడు. పుస్త కంలో ఆయనేం రాసిందీ క్లుప్తంగా చెబుతాను.
బ్రిటిష్ కాలం నుంచి 1954 వరకు సర్వే ఆఫ్ ఇండియా వారి ప్రపంచ పటాలలో చైనాతో భారత్ పశ్చిమ సరిహద్దు కచ్చితమైన కొలతలు లేకుండానే ఉండిపోయింది. భౌగోళిక కచ్చితత్వం కోసమని నెహ్రూ ఎలాంటి కారణం గానీ, చైనా అంగీకరిస్తుందన్న నమ్మకం గానీ లేకుండా ఏకపక్షంగా భారత్‌లో కలిపేయడానికి అక్సాయ్‌చిన్ ప్రాంతాన్ని ఎంపిక చేసుకున్నారు. ఆ ఎంపిక పట్ల ఆనాటి మన విదే శాంగ కార్యదర్శులిద్దరూ ఆర్.కె. నెహ్రూ, సుబిమల్ దత్ ఉదాసీనంగా ఉండిపోయారు. ఆర్.కె. నెహ్రూ అనడం...‘అక్సాయ్‌చిన్ మాది’ అనేందుకు మన దగ్గర బలమైన వాదన లేదని నిపుణులు అంటున్నా రని. సుబిమల్ దత్ కూడా అదే మాటను ఇంకోలా చెప్పారు. ‘పశ్చిమ సరిహద్దు’ల నిర్ణయం నిర్దిష్టంగా లేదని! అయితే నెహ్రూ తను అను కున్నదానిపైనే ఉండిపోయారు.
అక్సాయ్‌చిన్ భూభాగంలో మన వాడకమే ఎక్కువ కనుక, పైగా అక్కడున్నవి అధికంగా మన ఆచారాలే కనుక అది మనదే అవుతుందని నెహ్రూ అభిప్రాయం. ఆయన చెప్పిన వాడుకకూ, ఆచారాలకూ తగిన రుజువులు లేవని భాసిన్ తన పుస్త కంలో రాశారు. ‘‘అధ్వాన్నం ఏమిటంటే, అక్సాయ్‌చిన్‌ను తన భూభాగంగా నిలబెట్టుకునే ప్రయత్నం ఏదీ భారత్ గట్టిగా చేయక పోవడం! 1954లోనే అక్సాయ్‌చిన్‌ను కలుపుకొంటూ సరిహద్దుల్ని మార్చిన భారత్ ఆ ప్రాంతంలో సైనిక, రాజకీయ, పాలనా పరమైన ఉనికిని చాటుకునేందుకు ఎలాంటి చర్యా తీసుకోలేదు. అక్కడ ఒక చెక్ పోస్ట్ లేదు. సార్వభౌమాధికారాన్ని ప్రకటించే విధంగా ఒక పతా కాన్ని ఎగరేసింది లేదు.
హక్కును పొందేందుకు మ్యాప్‌పై ఒక గీత గీసుకుంటే చాలు అని భారత్ భావించినట్లుంది’’ అని భాసిన్ వ్యాఖ్యా నించారు. ఇంకా ఘోరం ఏంటంటే, అక్సాయ్‌చిన్ ప్రాంతంలో చైనా 120 కిలోమీటర్ల రహదారి నిర్మించుకుంటూ వచ్చిన ఏడేళ్ల కాలంలో ఆ సంగతి భారత్‌కు తెలియకపోవడం! 1957లో ఆ సంగతిని కనిపెట్టినా భారత్ నిరసన కేవలం అనధికారికంగానే ఉండిపోయింది. పైగా మన అభ్యంతరం ఎలా ఉందో చూడండి... అక్సాయ్‌చిన్‌లో రహదారిని నిర్మించిన చైనా కార్మికులకు ఇండియా వీసా లేదని మన ఫిర్యాదు. మరీ హాస్యాస్పదం... సరిహద్దు గస్తీ విధుల్లో ఉండగా అదృశ్యం అయిన భారత సైనికుల ఆచూకీ తెలుసుకోవడం కోసం చైనా సహా యాన్ని భారత్ కోరడం. ‘తెలిస్తే మేమే తరిమికొడతాం’ అని చైనా అన్నప్పుడు భారత్ ఇచ్చిన సమాధానమైతే... అక్సాయ్‌చిన్ అసలు ఇండియాదేనా అనే సందేహాలను ధ్రువీకరించేలా ఉంది. ‘‘ఆ నిర్దిష్ట ప్రాంతం భారతదేశంలో ఉందా లేక చైనాలో ఉందా అనే విషయం వివాదాస్పదంగా ఉంది. దానిని వేరుగా పరిష్కరించుకోవాలి’’ అని భారత్ తన ప్రతిష్ఠను తనే దెబ్బతీసుకునేలా మాట్లాడింది.
ఇప్పుడిక తూర్పు సరిహద్దుకు వద్దాం. 1914 నాటి సిమ్లా ఒప్పందంలో భాగంగా టిబెట్–బ్రిటిష్ ఇండియాల మధ్య ఏర్పరచిన మెక్‌మహాన్ విభజన రేఖ ఒక్కటే అక్కడి భూభాగం తనది అని భారత్ చెప్పుకోడానికి ఆధారం. అయితే సిమ్లా ఒప్పందంలో చైనా భాగ స్వామి కాదు కనుక అక్కడి సరిహద్దు ప్రాంతంపై భారత్ హక్కును చైనా గుర్తించలేదు. ఆ సంగతి నెహ్రూకు తెలుసు. 1935లో మెక్ మహానే స్వయంగా 1914 నాటి విభజన రేఖను ప్రశ్నించారు! ఆ రేఖను ఆయన ‘‘టిబెట్–భారత్‌ల మధ్య ఒక మాటగా కుదిరిన సరిహ ద్దుల విభజన మాత్రమే’’నని అన్నారు. ఆ మాటను ఉదహరిస్తూ... ‘‘దీనర్థం.. సర్వేలు లేకుండా, హద్దు రాళ్లు లేకుండా మ్యాపులో మెక్ మహాన్ రేఖను గీశారని...’’ అని భాసిన్ రాశారు. ‘‘సర్వే జరగాలి. హద్దుల్ని గుర్తించాలి. నిర్ణయించాలి’’ అంటారు భాసిన్.
ఇక్కడ నాలుగు వాస్తవాలు ముఖ్యమైనవి. మొదటిది.. బ్రిటిషర్లు ఆ కాలపు ఉత్తర, తూర్పు సరిహద్దుల మధ్య ఉన్న మొత్తం భూభా గాన్ని గానీ, మెక్‌మహాన్ గీతకు ఇరువైపుల ఉన్న ప్రదేశాన్ని గానీ ఏనాడూ అక్రమించుకోలేదు. రెండు.. మెక్‌మహాన్ చెప్పిన ప్రకారం తవాంగ్.. ఇండియాలో భాగమే అయినప్పటికీ అది టిబెట్ ఆక్రమణ లోనే ఉంది. మూడు.. భారత్ భూభాగంగా ఉన్న వివాద రహిత టిబెట్ ప్రాంతాలను తిరిగి టిబెట్‌లోకి సర్దుబాటు చేస్తూ విభజన రేఖను గీయవలసిందిగా టిబెట్ మెక్‌మహాన్‌ను కోరింది. నాలుగు.. అలా విభజించేందుకు బ్రిటన్ సుముఖతను వ్యక్తం చేసింది. దీనిని బట్టి మెక్‌మహాన్ రేఖ పరమ ప్రామాణికమైనది కాదని తెలియడం లేదా? నిజానికి 1951 వరకు తవాంగ్ టిబెట్ చేతుల్లోనే ఉంది. టిబెట్ చైనా నియంత్రణలోకి వెళ్లడం మొదలయ్యాక ఇండియానే తవాంగ్ని ఆక్రమించింది. ఎందుకంటే తవాంగ్, టిబెట్‌తో ఉంటే కనుక అప్పు డది టిబెట్‌తో పాటుగా చైనా అధీనంలోకి వెళుతుంది. ‘‘పర్యవసా నంగా భారత్ సరిహద్దు అస్సాంలోని మైదాన ప్రాంతాల వరకు కుదించుకుపోతుంది’’ అంటారు భాసిన్.
చివరిగా భాసిన్ ముగింపు ఇది: సరిహద్దుల అంశాన్ని నాటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ తేలిగ్గా తీసుకున్నారు. మ్యాపులో ఉన్నా, లేకున్నా భారత్ సరిహద్దు భూభాగాలు భారత్‌వే అనే నెహ్రూ మంకుపట్టు దేశానికీ, ఆయనకూ వినాశకరంగా పరిణమించిందన్నది రుజువైంది... అని! పుస్తకంలోని ఈ విషయాలన్నీ కలవరపరిచేవీ, భారత్ వాదనలోని కొలబద్దతలను ప్రశ్నించడానికి అర్హమైనవీ. భాసిన్ తప్పయితే కనుక అతడిని నిలదీయాలి. తప్పు కాకుంటే కనుక అతడు ఎత్తి చూపిన వాస్తవాలను మనం అంగీకరించాలి.
కరణ్ థాపర్
వ్యాసకర్త ప్రముఖ పాత్రికేయులు