మయన్మార్-భారత్ సరిహద్దుల్లో మందులకు లొంగని మలేరియా పరాన్నజీవులు కనుగొన్నట్టు ఆక్స్‌ఫర్డ్ ట్రాపికల్ మెడిసిన్ రిసెర్చ్ యూనిట్‌కు చెందిన శాస్త్రవేత్తలు వెల్లడించారు.
లండన్: మయన్మార్-భారత్ సరిహద్దుల్లో మందులకు లొంగని మలేరియా పరాన్నజీవులు కనుగొన్నట్టు ఆక్స్‌ఫర్డ్ ట్రాపికల్ మెడిసిన్ రిసెర్చ్ యూనిట్‌కు చెందిన శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ పరాన్నజీవుల వ్యాప్తితో భారత్‌కు పెనుప్రమాదం పొంచి ఉందని హెచ్చరించారు. ఇవి ఆసియా నుంచి ఆఫ్రికా ఉప ఖండంలోకి ప్రవేశించినట్టయితే ప్రపంచ వ్యాప్తంగా గతంలో ఎన్నడూ చూడని విధంగా లక్షల సంఖ్యలో ప్రజల జీవితాలకు ప్రమాదం సంభవించే అవకాశం ఉందన్నారు. 2013-2014 మధ్య మయన్మార్‌లో ఏర్పాటు చేసిన 55 మలేరియా చికిత్స కేంద్రాల్లోని 940 మంది నుంచి సేకరించిన సాంపిళ్లను వీరు పరీక్షించారు. ఈ పరీక్షల్లో మందులకు లొంగని మలేరియా పరాన్నజీవులను గుర్తించారు. ముఖ్యంగా మయన్మార్‌లోని హోమాలీన్, సాగైంగ్‌లలో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో ఈ పరాన్న జీవులను గుర్తించారు. ఈ ప్రాంతం భారత సరిహద్దుకు కేవలం 25 కిలోమీటర్ల దూరంలోనే ఉండడంతో పరాన్నజీవులు భారత్‌లోకి ప్రవేశించే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు.