india boxers
-
సారీ! నేను గెలువలేకపోయాను!
రియో డిజెనీరో: రియో ఒలింపిక్స్ లో పతకాల బోణీ కొట్టాలన్న భారత్ ఆశ ఇప్పటికీ ఆశగానే మిగిలిపోయింది. భారీ ఆశలతో రియో అడుగుపెట్టిన భారత బాక్సర్లు పెట్టెబేడా సర్దుకొని ఇంటిముఖం పట్టారు. పతకంపై ఆశలు రేకెత్తించిన భారత బాక్సర్ వికాస్ క్రిషన్ యాదవ్ క్వార్టర్ ఫైనల్ లో చతికిలపడ్డాడు. 75కిలోల మిడిలి వెయిట్ విభాగంలో ఉజ్బెకిస్థాన్ బాక్సర్ బెక్టెమెర్ మెలికుజీవ్ చేతిలో 0-3 తేడాతో క్రిషన్ యాదవ్ చిత్తుగా ఓడిపోయాడు. మెలికుజీవ్ తో గెలిస్తే స్వర్ణపతకంతో భారత్ తో అడుగుపెడతానని అభిమానులకు క్రిషన్ యాదవ్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే, క్వార్టర్ ఫైనల్ లో ఓడిపోయి.. ఉట్టిచేతులతో స్వదేశానికి వస్తుండటంపై క్రిషన్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాడు. ఇప్పటికే భారత బాక్సర్లు శివ థాప (56 కిలోలు), మనోజ్ కుమార్ (64 కిలోలు) ఇంటిముఖం పట్టడంతో బాక్సింగ్ లో భారత పోరు ముగిసిపోయింది. 'ఆగస్టు 15న భారత ప్రజలకు పతకాన్ని కానుకగా ఇవ్వాలని అనుకున్నాను. కానీ కుదరలేదు' అని 24 ఏళ్ల హర్యానా బాక్సర్ క్రిషన్ యాదవ్ పేర్కొన్నాడు. భారత బాక్సింగ్ ఫెడరేషన్- అంతర్జాతీయ బాక్సింగ్ సమాఖ్య విభేదాల నేపథ్యంలో తమకు అంతర్జాతీయంగా తగిన శిక్షణ లభించలేదని అతను వాపోయాడు. 'మన బాక్సింగ్ ఫెడరేషన్ పై నిషేధం విధించారు. దీంతో ఇతర దేశాలకు వెళ్లి మంచి బాక్సర్ల్ నేతృత్వంలో మేం శిక్షణ పొందలేకపోయాం. అయినా నేను ఎవరినీ నిందించడం లేదు. నా కారణంగానే నేను ఓడిపోయాను. పతకాన్ని గెలువలేకపోయాను క్షమించండి' అంటూ క్రిషన్ పేర్కొన్నాడు. -
భారత బాక్సర్లకు లైన్ క్లియర్!
రియో ఒలింపిక్స్ బరిలో ఉన్న భారత బాక్సర్లకు లైన్ క్లియర్ అయింది. ఏ దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారో.. అందుకు సంబంధించిన డ్రెస్ కోడ్(జెర్సీ) పాటించకపోవడంపై కాస్త సందిగ్ధత నెలకొన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం అంతర్జాతీయ బాక్సింగ్ సమాఖ్య సూచించిన విధంగా ఉన్న జెర్సీని భారత బాక్సర్లకు ఏర్పాటుచేశారు. లిథువేనియా బాక్సర్ పెట్రాస్కస్తో 64 కేజీల విభాగంలో జరిగిన బౌట్లో మన బాక్సర్ మనోజ్ కుమార్ భారత్ పేరున్న డ్రెస్ కోడ్ పాటించకపోవడం గమనించిన అధికారులు సాంకేతికంగా జరిగిన పొరపాటుగా దీనిని గుర్తించారు. మరో బాక్సర్ వికాస్ కృష్ణన్ తొలి బౌట్లో నెగ్గిన విషయం తెలిసిందే. 56 కేజీల విభాగంలో క్యూబా బాక్సర్ తో భారత బాక్సర్ శివ థాపా పోటీపడనున్న నేపథ్యంలో జెర్సీలు అందుబాటులోకి రావడం సంతోషకర అంశం. దీంతో భారత బాక్సర్లు ఎలాంటి అనర్హత వేటుకు గురికాకుండా తర్వాతి బౌట్లలో తలపడవచ్చు. -
పసిడి లేని ‘పంచ్’
బాక్సింగ్‌లో నాలుగు రజతాలు అన్ని ఫైనల్స్‌లోనూ భారత బాక్సర్ల ఓటమి 1998 తర్వాత స్వర్ణం లేకపోవడం ఇదే తొలిసారి గ్లాస్గో: ఒకటి కాదు... రెండు కాదు... ఏకంగా నాలుగు స్వర్ణాలపై ఆశలు రేకెత్తించిన భారత బాక్సర్లు పసిడి మెట్టుపై బోల్తా పడ్డారు. స్వర్ణ పతక పోరుకు అర్హత సాధించిన నలుగురూ రజత పతకాలతో సంతృప్తి పడ్డారు. పురుషుల విభాగంలో లైష్రామ్ దేవేంద్రో సింగ్ (49 కేజీలు), మన్దీప్ జాంగ్రా (69 కేజీలు), విజేందర్ (75 కేజీలు)... మహిళల విభాగంలో లైష్రామ్ సరిత దేవి (60 కేజీలు) టైటిల్ పోరులో ఓడిపోయి రజత పతకాలు సాధించారు. శుక్రవారం జరిగిన మహిళల 51 కేజీల సెమీఫైనల్లో ఓడిన పింకీ రాణికి కాంస్యం లభించిన సంగతి తెలిసిందే. మొత్తానికి 1998 కౌలాలంపూర్ గేమ్స్ తర్వాత తొలిసారి భారత బాక్సర్లు ‘పసిడి పతకం’ లేకుండా స్వదేశానికి తిరిగి రానున్నారు. 2002, 2006, 2010 కామన్వెల్త్ క్రీడల్లో భారత బాక్సర్లు కనీసం ఒక స్వర్ణమైనా గెలిచారు. ఫైనల్స్‌లో దేవేంద్రో 0-3 (28-29, 27-30, 28-29)తో డిఫెండింగ్ చాంపియన్ ప్యాడి బార్నెస్ (నార్తర్న్ ఐర్లాండ్) చేతిలో; సరిత దేవి 0-3 (37-39, 37-39, 37-39)తో షెల్లీ వాట్స్ (ఆస్ట్రేలియా) చేతిలో; మన్దీప్ 0-3 (27-30, 27-29, 26-30)తో స్కాట్ ఫిట్జ్‌గెరాల్డ్ (ఇంగ్లండ్) చేతిలో; విజేందర్ 0-3 (27-29, 28-29, 28-29)తో ఆంటోనీ ఫౌలెర్ (ఇంగ్లండ్) చేతిలో ఓడాడు. గతేడాది ఆసియా చాంపియన్‌షిప్‌లో రజతం నెగ్గిన మన్దీప్ ఫైనల్లో తేలిపోయాడు. ఫిట్జ్‌గెరాల్డ్ పంచ్‌ల ధాటికి ఈ హర్యానా బాక్సర్ ఉక్కిరిబిక్కిరి అయ్యాడు. రెండో రౌండ్లోనైతే ఇంగ్లండ్ బాక్సర్ సంధించిన పంచ్‌కు మన్దీప్ రింగ్‌లోనే కుప్పకూలిపోయాడు. ఆ తర్వాత తేరుకున్నా ఆత్మరక్షణకే ప్రాధాన్యమిచ్చి ఓటమిని ఖాయం చేసుకున్నాడు. 2008 బీజింగ్, 2012 లండన్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకాలు నెగ్గిన బార్నెస్ అనుభవం ముందు దేవేంద్రో పోరాటపటిమ అతనికి స్వర్ణాన్ని అందించలేకపోయింది. తొలి, చివరి రౌండ్లలో కేవలం పాయింట్ తేడాతో వెనుకబడిన దేవేంద్రో రెండో రౌండ్లో మాత్రం బార్నెస్ ధాటికి జవాబివ్వలేకపోయాడు. షెల్లీ వాట్స్ (ఆస్ట్రేలియా)తో జరిగిన ఫైనల్లో సరిత రెండు నిమిషాల వ్యవధిగల నిర్ణీత నాలుగు రౌండ్లలో తొలి రెండు రౌండ్లలో ఆధిపత్యం కనబరిచింది. అయితే చివరి రెండు రౌండ్లలో షెల్లీ వాట్స్ దూకుడు ముందు సరిత ఎదురునిలువడంలో విఫలమైంది. ఈ విజయంతో కామన్వెల్త్ గేమ్స్ చరిత్రలో స్వర్ణం నెగ్గిన ఆస్ట్రేలియా తొలి మహిళా బాక్సర్‌గా షెల్లీ వాట్స్ గుర్తింపు పొందింది.