India-South Africa cricket series
-
మూడేళ్ల తర్వాత తిరిగి జట్టులోకి.. ఇంకా బయోబబుల్‌లోనే!
మూడేళ్ల తర్వాత తిరిగి జాతీయ జట్టులోకి వచ్చిన దక్షిణాఫ్రికా పేసర్ డ్యుయన్నే ఓలివర్.. టీమిండియాతో తొలి టెస్ట్‌కు జట్టులో ఉంటాడని అంతా భావించారు. కానీ అనూహ్యంగా అతడికి తుది జట్టులో చోటు దక్క లేదు. అతడికి జట్టులో చోటు దక్కపోవడానికి గల గల కారణాన్ని ఆ జట్టు సెలెక్టర్ల కన్వీనర్ మిప్టిసెన్ వెల్లడించాడు. ఈ సిరీస్‌కు కొన్ని వారాల ముందు ఓలివర్ కరోనా బారిన పడ్డాడని, అయితే అతడు కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నాడని అతడు తెలిపాడు. కాగా అతడు స్వీయ నిర్బంధంలో ఉన్నాడని మిప్టిసెన్ చెప్పారు. "ఓలివర్ కొన్ని రోజుల క్రితం కరోనా బారిన పడ్డాడు. అతడు తన కుటుంబ సభ్యులతో కలిసి ఉన్నప్పడు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఓలివర్ ప్రస్తుతం పూర్తిగా కోలుకున్నాడు. అతడిని సెలక్షన్ ప్యానల్ ఎంపిక చేసిన తరువాత నేరుగా జట్టు బయోబుల్‌లో వచ్చి చేరాడు. అదే విధంగా ఇంట్రా-స్క్వాడ్ మ్యాచ్‌లో భాగంగా ఓలివర్ గాయపడ్డాడు. అదృష్టవశాత్తు గాయం అంతా తీవ్రమైనది కాదు. కానీ కొవిడ్ ప్రొటోకాల్, అతడి గాయన్ని దృష్టిలో పెట్టుకుని మేము అంత రిస్క్ తీసుకోలేదు. అందుకే అతడికి తొలి టెస్ట్‌కు జట్టులో చోటు దక్కలేదు. మిగిలిన రెండు టెస్ట్‌లకు ఎంపిక చేసే ఆలోచనలో ఉన్నాము" అని అతడు పేర్కొన్నాడు. గాయపడ్డ స్టార్ పేసర్ అన్రిచ్ నోర్ట్జే స్ధానంలో ఓలివర్ జట్టులోకి వచ్చాడు. చదవండి: తండ్రైన టీమిండియా క్రికెటర్.. మా కుమారుడు అంటూ ఎమోషనల్..! కంగ్రాట్స్ భయ్యా! . -
చాహల్ కళ్లజోడు రహస్యం చెప్పిన తండ్రి..
ముంబై: టీమిండియా మణికట్టు స్పిన్నర్ యజువేంద్ర చాహల్ ఇటీవల వాండరర్స్ లో జరిగిన టీ20 మ్యాచ్‌లో కళ్లజోడుతో కనిపించాడు. చాహల్ బౌలింగ్ లేదా బ్యాటింగ్ చేసేటప్పుడు కళ్లద్దాలు ఉపయోగించాడు. ఫీల్డిండ్ చేసేటప్పుడు మాత్రమే వాడుతున్నాడు. ఈ విషయం వెనుక ఉన్న నిజాన్ని అతడి తండ్రి బయటపెట్టారు. ‘ దక్షిణాఫ్రికా టూర్‌కు వెళ్లే ముందు చాహల్ కంటి వైద్యుడిని సంప్రదించాడు. కేవలం డాక్టర్ చెప్పడం వల్లే తన కుమారుడు కళ్లజోడు ధరిస్తున్నాడు. చాహల్ కంటిచూపు మంచిగా ఉంది. కానీ అరుదుగా వాడమని వైద్యుడు సలహా ఇచ్చాడు’ అని తెలిపాడు. ప్రస్తుతం ఇండియా టీంలో చాహల్ మాత్రమే గ్లాసెస్ ఉపయోగిస్తున్నాడు. టీమిండియా విజయాల్లో ఇటీవల చాహల్ కీలకపాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. కెప్టెన్ విరాట్ కోహ్లి, కీపర్ మహేంద్ర సింగ్ ధోనిలు కూడా బయట గ్లాసెస్ వాడుతారు. మ్యాచ్ జరిగే సమయంలో మాత్రం వారు కళ్లద్దాలు ఉపయోగించరు. న్యూజిలాండ్ మాజీ కెప్టెన్, స్పీన్నర్ వెటోరి కూడా మ్యాచ్‌లో నిత్యం కళ్లజోడు ధరించేవాడు. నేడు సెంచూరియన్‌లో భారత్-దక్షిణాఫ్రికా మధ్య రెండో టీ20 మ్యాచ్ జరగనుంది. మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 1-0తో అధిక్యంలో ఉంది. -
‘ఈ విజయం చాలా గొప్పది.. మనవాళ్లు అదరగొట్టారు..’
టీమిండియా ఆరు వన్డేల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 4-1తో సొంతం చేసుకుంది. పోర్ట్‌ఎలిజబెత్‌లో మంగళవారం ఇండియా- దక్షిణాఫ్రికా మధ్య జరిగిన ఐదో వన్డేలో భారత్ 73 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ విజయంపై బీసీసీఐ తాత్కలిక అధ్యక్షుడు సీకే ఖన్నా మన క్రికెటర్లను పొగడ్తలతో ముంచెత్తారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ విజయం చాలా గొప్పది అని అన్నారు. ‘ఇండియా సారథి విరాట్ కోహ్లి, మిగతా ఆటగాళ్లు అసాధారణమైన ప్రదర్శన కనబర్చారు. ఏ జట్టునైనా వారి స్వదేశలంలో ఓడించే సామర్ధ్యం ఇండియా జట్టుకు ఉందని ఈ విజయంతో నిరూపించారు. 25 సంవత్సరాల తర్వాత వారు భారత్‌కు సిరీస్ సాధించండం దేశానికి గర్వకారణం’ అని సీకే ఖన్నా ఇండియా క్రికెటర్లను కొనియాడారు. దక్షిణాఫ్రికా టాస్ గెలిచి టీమిండియాను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 274 పరుగులు చేసింది. మొదట నుంచి విఫలం చెందిన రోహిత్ ఐదో వన్డేలో సెంచరీతో మెరిశాడు. రోహిత్‌ను(126 బంతుల్లో; 115 పరుగులు) ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు వరించింది. వన్డే కెరీర్లో రోహిత్‌కు 17వ సెంచరీ. సౌతాఫ్రికా బౌలర్లలో ఇన్‌గిడి 4 వికెట్లు పడగొట్టాడు. అనంతరం దక్షిణాఫ్రికా 42.2 ఓవర్లలో 201 పరుగులకే ఆలౌటైంది. హషీం ఆమ్లా(71పరుగులు) ఒక్కడే పోరాడాడు. జట్టును విజయం వైపు నడిపిస్తున్న ఆమ్లాను పాండ్యా అద్భుత ఫీల్డింగ్‌తో రన్ అవుట్ చేశాడు. ఇండియా బౌలర్లలో కుల్దీప్ యాదవ్‌కు 4 వికెట్లు, హర్ధిక్ పాండ్యాకు 2 వికెట్లు, చాహల్‌కు 2 వికెట్లు, బుమ్రాకు ఒక వికెట్ దక్కాయి. ఈ విజయంతో సిరీస్ సొంతం చేసుకున్న భారత్ ఐసీసీ ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్ స్థానాన్ని పటిష్టం చేసుకుంది. -
‘టెస్టుల కోసం నా ఆటను మార్చను’
డర్బన్ : టెస్టుల కోసం తన ఆటను మార్చే ప్రస్తక్తే లేదని టీమిండియా వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ స్పష్టం చేశాడు. పొట్టి ఫార్మాట్లో చెలరేగిపోయే రోహిత్ దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్‌లో ఘోరంగా విఫలమై చివరి టెస్టుకు జట్టులో చోటును కోల్పోయిన విషయం తెలిసిందే. ఆతిథ్య జట్టుతో ఆరు వన్డేల సిరీస్‌లో భాగంగా తొలి వన్డే గురువారం జరగనుంది. ఈ నేపథ్యంలో మీడియాతో రోహిత్ మాట్లాడాడు. ‘నేను అన్ని ఫార్మాట్లో ఒకేలా ఆడుతా. ప్రత్యేకంగా టెస్టుల కోసం నా ఆటను మార్చుకోలేను. ఎవరైనా వారి వ్యక్తిత్వాన్నే నమ్ముకుంటారు. నేను ఇలాంటి విపత్కర పరిస్థితులు ఇంతకు ముందు చాలా ఎదుర్కొన్నాను. ఈ పరిస్థితులను ఎలా అధిగమించాలో నాకు తెలుసు. ఇక నేను జరిగిపోయిన టెస్టు సిరీస్ గురించి మాట్లాడదలుచుకోలేదు. ఇప్పుడు వన్డే సిరీస్ గెలిచే పెద్ద బాధ్యత మాపై ఉంది. ప్రతి ఒక్క బ్యాట్స్‌మన్ వన్డే సిరీస్‌లో ముఖ్యపాత్ర పోషించాలి. నేను కూడా ఈ సిరీస్‌లో రాణించాలి. మేము ఈ సిరీస్‌ను ఖచ్చితంగా గెలవాలని భావిస్తున్నాం. కానీ ఇది చాలా పెద్ద సిరీస్. మొత్తం ఆరు వన్డేలు ఆడాలి. దీంతో మాపై ఒత్తిడి ఉంది. ఈ ఒత్తిడిని జట్టుగా మేము అధిగమించగలము. గతంలో దక్షిణాఫ్రికాపై వన్డే సిరీస్‌ను కోల్పోయాం. అప్పటి జట్టులో చాలా మంది ప్లేయర్లకు ఇక్కడి పరిస్థితులు కొత్త. కానీ ఇప్పుడు అదే జట్టులోని చాలా మంది ప్లేయర్లు ఉన్నారు. వారి అనుభవంతో టెస్టుల్లో అద్భుతంగా బౌలింగ్ చేశార’ని రోహిత్ తెలిపాడు. భారత్‌కు డర్బన్‌లో మంచి రికార్డు లేకపోవడంపై స్పందిస్తూ.. ‘అప్పటి పరిస్థితులకు ప్రస్తుతానికి చాలా తేడా ఉంది. ధోని, దినేశ్‌కార్తీక్, మనీష్ పాండే, కేదార్ జాదవ్, శ్రేయస్ అయ్యర్‌లతో భారత మిడిలార్డర్ పటిష్టంగా ఉంది. గత ఆరు నెలలుగా మేము అద్భుతంగా రాణిస్తున్నాం. ఒక చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ నిరాశ పరిచినప్పటికి మేం మంచి విజయాలందుకున్నాం. ఇది 2019 ప్రపంచకప్‌కు బాగా ఉపయోగపడుతుందని నేను నమ్ముతున్నా. ఇక ఆటను ఆస్వాదిస్తూ ముందుకు సాగడమే మా పన’ని రోహిత్ వ్యాఖ్యానించాడు. -
మూడో వికెట్ కోల్పోయిన భారత్
జొహన్నెస్‌బర్గ్ : దక్షిణాఫ్రికాతో జరుగుతున్న చివరి టెస్టులో టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. కెప్టెన్ విరాట్ కోహ్లి 101 బంతుల్లో 9 ఫోర్లతో కెరీర్లో 16 హాఫ్ సెంచరీ సాధించిన వెంటనే.. లుంగిసాని ఎంగిడి బౌలింగ్‌లో క్యాచ్ అవుట్‌గా వెనుదిరిగాడు. దీంతో భారత్ మూడు వికెట్లు కోల్పోయి 97 పరుగులు చేసింది. అంతకు ముంది కోహ్లికి లైఫ్రాగా దానిని సద్వినియోగం చేసుకోని హాఫ్ సెంచరీ సాధించాడు. రబాడ వేసిన 20.1వ బంతికి కోహ్లీ ఇచ్చిన క్యాచ్‌ను మిడాఫ్‌లో ఉన్న ఫిలాండర్ సరిగ్గా అంచనా వేయలేక నేలపాలు చేశాడు. ఈ సారి డివిలియర్స్ కోహ్లికి ఆ అవకాశం ఇవ్వలేదు. క్రీజులో పుజారా(21), రహానే(0)లున్నారు. -
స్టెయిన్ ‘గన్ డౌన్’
భారత్‌తో జరుగుతున్న కేప్‌టౌన్ టెస్టులో 17.3 ఓవర్లు వేసిన తర్వాత... ఈ మ్యాచ్‌కు ముందు తాను ఆడిన ఆఖరి టెస్టులో ఆస్ట్రేలియాపై పెర్త్లోనూ తొలి ఇన్నింగ్స్‌లో 12.4 ఓవర్ల తర్వాత... అంతకు కొన్నాళ్ల క్రితం డర్బన్‌లో ఇంగ్లండ్‌పై రెండో ఇన్నింగ్స్‌లో 3.5 ఓవర్ల తర్వాత... దానికంటే ముందు మొహాలీలో భారత్‌తో జరిగిన తొలి టెస్టులో 11 ఓవర్లకే! దిగ్గజ ఫాస్ట్ బౌలర్ డేల్ స్టెయిన్ మ్యాచ్ మధ్యలోనే తప్పుకోవడం ఇది కొత్త కాదు. తాను బరిలోకి దిగిన గత ఆరు టెస్టుల్లో గాయం కారణంగా నాలుగు మ్యాచ్‌ల్లో ఆట మధ్యలోనే మైదానం నుంచి నిష్క్రమించాడు. ఇప్పుడు కూడా అతను తొలి టెస్టుతో పాటు సిరీస్‌కు దూరమయ్యే అవకాశం కనిపిస్తోంది. తాజా పరిణామాలు చూస్తుంటే అతను మళ్లీ కోలుకొని జట్టులోకి రావడం, గత స్థాయిలో ప్రదర్శన ఇవ్వడం చాలా కష్టం కావచ్చు. పదమూడేళ్లుగా అంతర్జాతీయ క్రికెట్‌పై తనదైన ముద్ర వేసి ఎందరో బ్యాట్స్‌మెన్‌ను భయపెట్టిన స్టెయిన్ కెరీర్ ప్రమాదంలో పడింది. తొలి టెస్టుకు ముందు దక్షిణాఫ్రికా కోచ్ ఒటిస్ గిబ్సన్ మీడియాతో మాట్లాడుతూ స్టెయిన్‌కు తుది జట్టులో దాదాపుగా అవకాశం లేదని తేల్చేశాడు. జట్టు కూర్పు ఒక సమస్య కాగా, గాయం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న అతను, ఏదైనా జరిగి మ్యాచ్ మధ్యలో తప్పుకుంటే సమస్యగా మారుతుందని స్పష్టంగా చెప్పాడు. నిజంగా ఆయన భయపడినట్లే జరిగింది. న్యూలాండ్స్ పిచ్‌ను దృష్టిలో ఉంచుకొని సఫారీ జట్టు నలుగురు పేసర్లతో బరిలోకి దిగడంతో స్టెయిన్‌కు చాన్స్ లభించినా... అతను మళ్లీ గాయంతో వెనుదిరగడం ఆ టీమ్‌ను ముగ్గురు పేసర్లకే పరిమితం చేసింది. ఇది చివరకు జట్టు విజయావకాశాలపై ప్రభావం చూపించవచ్చు కూడా. భుజం గాయం నుంచి కోలుకొని ఏడాది తర్వాత పునరాగమనం చేశాక ఇప్పుడు మరో కొత్త తరహా గాయం (మడమ)తో అతను మధ్యలోనే వెళ్లిపోవడం ఏమాత్రం మేలు చేసేది కాదు. భారత్‌తో సిరీస్ తర్వాత మార్చిలో కీలకమైన ఆస్ట్రేలియా సిరీస్ కూడా ఉంది. అతను అప్పటిలోగా కోలుకోగలడా? ప్రదర్శన బాగున్నా... భుజం గాయం నుంచి కోలుకున్న తర్వాత స్టెయిన్ ముందుగా దేశవాళీ టి20ల్లో ఐదు మ్యాచ్‌లు ఆడి తన ఫిట్నెస్ పరీక్షించుకున్నాడు. ఆ తర్వాత జింబాబ్వేతో ప్రాక్టీస్ మ్యాచ్‌లో కూడా 12 ఓవర్లు వేశాడు. అయితే అనారోగ్యంతో జింబాబ్వేతో టెస్టు ఆడలేకపోయాడు. భారత్‌తో మ్యాచ్‌లో అతని బౌలింగ్‌లో ఎప్పటిలాగే పదును కనిపించడం విశేషం. షార్ట్ బంతులు, అవుట్ స్వింగర్లు వేయడంలో ఎక్కడా తీవ్రత తగ్గకపోగా, బౌలింగ్ రనప్, యాక్షన్‌లో ఎక్కడా పాత గాయం సమస్య కనిపించలేదు. ధావన్‌ను వెనక్కి పంపిన బంతిగానీ, ఆ వెంటనే కోహ్లిని దాదాపుగా అవుట్ చేసినట్లుగా అనిపించిన బంతిగానీ పాత స్టెయిన్‌ను చూపించాయి. చాలా సార్లు స్టెయిన్ బంతులు గంటకు 140 కిలోమీటర్ల వేగాన్ని కూడా దాటాయి. ఆ తర్వాత సాహా వికెట్, పాండ్యా క్యాచ్ డ్రాప్ అయిన బంతి కూడా అతని గొప్పతనాన్ని చాటాయి. అయితే దురదృష్టవశాత్తూ గాయం అతని జోరుకు బ్రేక్ వేసింది. నిజానికి దక్షిణాఫ్రికా టీమ్ మేనేజ్మెంట్ లెక్కల ప్రకారం పేస్‌కు బాగా అనుకూలించే తర్వాతి రెండు టెస్టుల వేదికలు సెంచూరియన్, జొహన్నెస్‌బర్గ్‌లలో అతను తప్పనిసరిగా జట్టులో ఉండేవాడు. కానీ ఇప్పుడు ఆ అవకాశం కనిపించడంలేదు. గత రెండేళ్ల కాలంలో అతను తుంటి, రెండు సార్లు భుజం, మడమ గాయాలకు గురయ్యాడు. భుజానికి సర్జరీ కూడా జరగడంతో అతను ఏడాది పాటు ఆటకు దూరం కావాల్సి వచ్చింది. అద్భుతమైన రికార్డు... సమకాలీన క్రికెట్లోని అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్లలో స్టెయిన్ ఒకడు అనడంలో సందేహం లేదు. గత కొన్నేళ్ళలో జీవం లేని పిచ్‌లు, చిన్న మైదానాలు, పెద్ద బ్యాట్లు రాజ్యమేలుతున్న సమయంలో కూడా అతను తన ముద్ర చూపించాడు. గాయాలు ఇబ్బంది పెడుతున్నా అతని బౌలింగ్ ఇంకా భీకరమే. గాయంతో పెర్త్ టెస్టు నుంచి తప్పుకోవడానికి ముందు తొలి ఇన్నింగ్స్‌లో అతని అద్భుత బౌలింగ్ పునాదితోనే దక్షిణాఫ్రికా మ్యాచ్ గెలవగలిగింది. ప్రస్తుతం ప్రపంచ క్రికెట్లో అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో స్టెయిన్ టాప్–10లో ఉన్నాడు. వారిలో కేవలం ఇద్దరు పేసర్లకు (మెక్‌గ్రాత్, హ్యాడ్లీ)లకు మాత్రమే స్టెయిన్ (22.32) కంటే మెరుగైన సగటు ఉంది. ఎంతో మంది పేసర్లు తమ సొంతగడ్డపై, అనుకూల పిచ్‌లపై చెలరేగినా... ఉపఖండానికి వచ్చేసరికి మాత్రం తేలిపోయారు. అయితే ఈతరంలో తనతో పోటీ పడిన బ్రెట్ లీ, మిచెల్ జాన్సన్, అండర్సన్, బ్రాడ్ తదితరులతో పోలిస్తే భారత్‌లాంటి చోట అతని ప్రదర్శన స్టెయిన్‌ను అందరికంటే ప్రత్యేకంగా నిలబెడుతుంది. భారత గడ్డపై 6 టెస్టుల్లో కేవలం 21.38 సగటుతో 26 వికెట్లు పడగొట్టడం, పాకిస్తాన్లో 24.66, శ్రీలంకలో 24.71 సగటు అతనేమిటో చెబుతాయి. దక్షిణాఫ్రికా తరఫున 44 టెస్టు విజయాల్లో భాగమైన స్టెయిన్... వాటిలో నమ్మశక్యం కాని రీతిలో 16.03 సగటుతో 291 వికెట్లు పడగొట్టడం అతని విలువేమిటో చూపిస్తోంది. ఇలాంటి గొప్ప ఆటగాడి కెరీర్ అర్ధాంతరంగా ముగియా లని ఏ జట్టూ కోరుకోదు. డాక్టర్ల సహకారంతో వీలైనంత త్వరగా అతను కోలుకునేలా ప్రయత్నిస్తామని జట్టు మేనేజర్ మూసాజీ చెప్పడం తమ స్టార్ ఆటగాడిపై వారికి ఉన్న నమ్మకమే కారణం. వారు ఆశించినట్లుగా స్టెయిన్ మళ్లీ తిరిగొచ్చి తన సత్తా చూపించాలని క్రికెట్ ప్రపంచం కూడా కోరుకుంటోంది. 419: 86 టెస్టుల్లో స్టెయిన్ పడగొట్టిన వికెట్ల సంఖ్య. ఓవరాల్‌గా పదో స్థానంలో ఉన్న అతను... మరో మూడు వికెట్లు తీస్తే అత్యధిక వికెట్లు తీసిన దక్షిణాఫ్రికా బౌలర్‌గా షాన్ పొలాక్ (421)ను అధిగమిస్తాడు. 60 ఏళ్ల వయసులో కూడా 90 కిలోమీటర్ల మారథాన్ పరుగెత్తే కొందరు మిత్రులే నాకు ఆదర్శం. ఫిట్నెస్ గురించి నాకు బెంగ లేదు. ప్రస్తుతం మా జట్టులోని చాలా మంది యువ ఆటగాళ్లకంటే నా ఫిట్నెస్ చాలా బాగుంది. కనీసం ఈ ఏడాది మొత్తం ఆడిన తర్వాతే కెరీర్‌పై పునరాలోచిస్తా. ప్రస్తుతం 35 ఏళ్ల వయసులో నాకు క్రికెట్ గురించే తప్ప రిటైర్మెంట్, ఇతర వ్యాపకాల గురించి ఆలోచన లేదు. సాధ్యమైనంత ఎక్కువ కాలం క్రికెట్ ఆడాలని భావిస్తున్న నాకు వయసు సమస్యే కాదు. –కేప్‌టౌన్ టెస్టుకు ముందు స్టెయిన్ వ్యాఖ్య కేప్‌టౌన్‌కు వానొచ్చింది ► మూడో రోజు ఆట పూర్తిగా రద్దు ► భారత్, దక్షిణాఫ్రికా తొలి టెస్టు కేప్‌టౌన్: అనూహ్య మలుపులు తిరుగుతూ ఆసక్తికరంగా మారిన భారత్, దక్షిణాఫ్రికా తొలి టెస్టు మ్యాచ్‌కు ఆకస్మిక విరామం... రెండు రోజుల పాటు క్రికెట్ అభిమానులను అలరించిన టెస్టుకు మూడో రోజు వాన అడ్డంకిగా మారింది. భారీ వర్షం కారణంగా ఆదివారం ఆట పూర్తిగా తుడిచి పెట్టుకుపోయింది. రోజంతా ఒక్క బంతి వేయడం కూడా సాధ్యం కాలేదు. శనివారం రాత్రి నుంచే నగరంలో కురుస్తున్న వర్షం ఆదివారం ఉదయం జోరందుకుంది. మధ్యలో కొన్ని సార్లు తెరిపినిచ్చినా, గ్రౌండ్‌ను సిద్ధం చేసేందుకు అది సరిపోలేదు. అంపైర్లు కనీసం న్యూలాండ్స్ మైదానాన్ని పరిశీలించాల్సిన అవసరం కూడా లేకుండా ఆటను రద్దు చేశారు. మ్యాచ్ నిర్దేశిత ఆరంభ సమయంనుంచి సరిగ్గా ఐదు గంటల తర్వాత అంపైర్లు ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం రెండో ఇన్నింగ్స్‌లో 2 వికెట్లకు 65 పరుగులు చేసిన దక్షిణాఫ్రికా ఓవరాల్‌గా 142 పరుగులు ముందంజలో ఉంది. మిగిలిన రెండు రోజుల ఆట ఎలాంటి మలుపులు తీసుకుంటుందో, ఎలాంటి తుది ఫలితం వస్తుందో చూడాలి. సోమ, మంగళవారాల్లో రోజుకు 98 ఓవర్ల చొప్పున ఆట సాగనుంది. మరోవైపు ఈ భారీ వర్షం స్థానికంగా క్రికెట్ వీరాభిమానులను కూడా ఏమాత్రం నిరాశపర్చలేదు. ఈ వాన వారిలో అమితానందాన్ని నింపింది. వర్షాలే లేకపోవడంతో గత వందేళ్లలో ఎన్నడూ లేనంత తీవ్ర నీటి కొరతను ఎదుర్కొంటున్న కేప్‌టౌన్‌కు ఇదో వరంగా వారు భావిస్తున్నారు. వాతావరణ శాఖ సూచన ప్రకారం సోమవారం మాత్రం వర్షసూచన లేదు. –సాక్షి క్రీడా విభాగం -
కోహ్లి సేనతో తలపడే సఫారీ జట్టు ఇదే
కేప్‌టౌన్: కోహ్లిసేన దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా జనవరి 5 నుంచి ప్రారంభమయ్యే టెస్టు సిరీస్‌కు ఆ దేశ క్రికెట్ బోర్డు జట్టును ప్రకటించింది. డుప్లెసిస్ కెప్టెన్‌గా 15 మంది సభ్యుల జట్టును ఎంపిక చేసింది. ఈ ఏడాది జూన్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో గాయపడి జట్టుకు దూరమైన క్రిస్ మోరిస్‌కు చోటు దక్కింది. అలాగే గాయం, ఇన్ ఫెక్షన్ నుంచి కోలుకున్న డీకాక్, స్టెయిన్‌లు కూడా జట్టులో చోటు సంపాదించారు. తాజాగా జింబాబ్వేతో నాలుగు రోజుల ప్రయోగాత్మక టెస్టు మ్యాచ్‌లో విజయం సాధించి ఊపుమీదున్న దక్షిణాఫ్రికా జనవరి 2 నుంచి శిక్షణ శిబిరంలో పాల్గొననుంది. స్టెయిన్ కూడా గత ఏడాది ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో గాయపడి ఏడాదిగా క్రికెట్‌కు దూరమైన విషయం తెలిసిందే. జింబాంబ్వేతో ఏకైక టెస్టుకు ఎంపికైనా అతను రిజర్వ్ బెంచ్‌కే పరిమితమయ్యాడు. భారత్‌తో సిరీస్ కోసమే స్టెయిన్‌కు విశ్రాంతి ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక భారత్ జట్టు కేప్‌టౌన్‌కు చేరుకున్న విషయం తెలిసిందే. దక్షిణాఫ్రికా జట్టు: డుప్లెసిస్(కెప్టెన్), డికాక్(వికెట్ కీపర్), హషీమ్ ఆమ్లా, బవుమా, ఏబీ డివిలియర్స్, డి బ్రూన్, ఎల్గర్, కేశవ్ మహారాజ్, మర్ర్కమ్, మోర్కెల్, క్రిస్ మోరిస్, అండిలే పెహ్లుక్వాయో, ఫిలాండర్, రబాడ, డేల్ స్టెయిన్. -
భారత్-దక్షిణాఫ్రికా సిరీస్‌కు ప్రత్యేక టాస్ కాయిన్
న్యూఢిల్లీ: జాతిపిత మహాత్మా గాంధీ 146వ జయంతి సందర్భంగా భారత్-దక్షిణాఫ్రికా క్రికెట్ సిరీస్ కోసం బీసీసీఐ ప్రత్యేకంగా టాస్ కాయిన్‌ను రూపొందించింది. 20 గ్రాముల బరువు గల ఈ నాణెమును స్వచ్ఛమైన వెండితో బంగారు పూత పూసి తయారు చేయించారు. దీనిపై గాంధీ, దక్షిణాఫ్రికా నల్లసూరీడు నెల్సన్ మండేలా చిత్రాలను ముద్రించినట్టు బీసీసీఐ ఓ ప్రకటనలో తెలియజేసింది. నాణెం బొమ్మ భాగంపై గాంధీ, మండేలా చిత్రాలను, బొరుసు భాగంపై భారత్, క్రికెట్ సిరీస్ లోగోను ముద్రించారు. శుక్రవారం భారత్, దక్షిణాఫ్రికా ద్వైపాక్షిక సిరీస్ ప్రారంభంకానుంది. రాత్రి 7 గంటల నుంచి ధర్మశాలలో ఇరు జట్ల మధ్య తొలి టి-20 మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ సందర్భంగా భారత్, దక్షిణాఫ్రికా కెప్టెన్లు ధోనీ, డుప్లెసిస్లతో కలసి బీసీసీఐ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ టాస్ కాయిన్‌ను ఆవిష్కరిస్తారు. ఈ సిరీస్‌లో ప్రతీ మ్యాచ్‌కు ఇదే టాస్ కాయిన్‌ను ఉపయోగిస్తారు. గాంధీ గౌరవార్థం ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఠాకూర్ చెప్పారు.