రోహిత్ శర్మ
డర్బన్ : టెస్టుల కోసం తన ఆటను మార్చే ప్రస్తక్తే లేదని టీమిండియా వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ స్పష్టం చేశాడు. పొట్టి ఫార్మాట్‌లో చెలరేగిపోయే రోహిత్ దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్‌లో ఘోరంగా విఫలమై చివరి టెస్టుకు జట్టులో చోటును కోల్పోయిన విషయం తెలిసిందే. ఆతిథ్య జట్టుతో ఆరు వన్డేల సిరీస్‌లో భాగంగా తొలి వన్డే గురువారం జరగనుంది. ఈ నేపథ్యంలో మీడియాతో రోహిత్ మాట్లాడాడు.
‘నేను అన్ని ఫార్మాట్‌లో ఒకేలా ఆడుతా. ప్రత్యేకంగా టెస్టుల కోసం నా ఆటను మార్చుకోలేను. ఎవరైనా వారి వ్యక్తిత్వాన్నే నమ్ముకుంటారు. నేను ఇలాంటి విపత్కర పరిస్థితులు ఇంతకు ముందు చాలా ఎదుర్కొన్నాను. ఈ పరిస్థితులను ఎలా అధిగమించాలో నాకు తెలుసు. ఇక నేను జరిగిపోయిన టెస్టు సిరీస్ గురించి మాట్లాడదలుచుకోలేదు. ఇప్పుడు వన్డే సిరీస్ గెలిచే పెద్ద బాధ్యత మాపై ఉంది. ప్రతి ఒక్క బ్యాట్స్‌మన్ వన్డే సిరీస్‌లో ముఖ్యపాత్ర పోషించాలి. నేను కూడా ఈ సిరీస్‌లో రాణించాలి. మేము ఈ సిరీస్‌ను ఖచ్చితంగా గెలవాలని భావిస్తున్నాం. కానీ ఇది చాలా పెద్ద సిరీస్. మొత్తం ఆరు వన్డేలు ఆడాలి. దీంతో మాపై ఒత్తిడి ఉంది. ఈ ఒత్తిడిని జట్టుగా మేము అధిగమించగలము. గతంలో దక్షిణాఫ్రికాపై వన్డే సిరీస్‌ను కోల్పోయాం. అప్పటి జట్టులో చాలా మంది ప్లేయర్లకు ఇక్కడి పరిస్థితులు కొత్త. కానీ ఇప్పుడు అదే జట్టులోని చాలా మంది ప్లేయర్లు ఉన్నారు. వారి అనుభవంతో టెస్టుల్లో అద్భుతంగా బౌలింగ్ చేశార’ని రోహిత్ తెలిపాడు.
భారత్‌కు డర్బన్‌లో మంచి రికార్డు లేకపోవడంపై స్పందిస్తూ.. ‘అప్పటి పరిస్థితులకు ప్రస్తుతానికి చాలా తేడా ఉంది. ధోని, దినేశ్‌కార్తీక్, మనీష్ పాండే, కేదార్ జాదవ్, శ్రేయస్ అయ్యర్‌లతో భారత మిడిలార్డర్ పటిష్టంగా ఉంది. గత ఆరు నెలలుగా మేము అద్భుతంగా రాణిస్తున్నాం. ఒక చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ నిరాశ పరిచినప్పటికి మేం మంచి విజయాలందుకున్నాం. ఇది 2019 ప్రపంచకప్‌కు బాగా ఉపయోగపడుతుందని నేను నమ్ముతున్నా. ఇక ఆటను ఆస్వాదిస్తూ ముందుకు సాగడమే మా పన’ని రోహిత్ వ్యాఖ్యానించాడు.
Comments
Please login to add a commentAdd a comment