Indian-American scientist
-
వైట్‌హౌస్‌లో భారతీయ ఆరతి
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తన సైన్స్ సలహాదారుగా భారత సంతతికి చెందిన ఆరతి ప్రభాకర్‌ను నామినేట్ చేయడంతో ‘ఆ పదవికి ఆమె అన్నివిధాలా అర్హురాలు’ అనే ప్రశంసలతో పాటు, ‘ఆరతి ప్రభాకర్ ఎవరు?’ అనే ఆసక్తితో కూడిన ప్రశ్న ముందుకు వచ్చింది... దిల్లీలో జన్మించింది ఆరతి ప్రభాకర్. తన మూడవ యేట కుటుంబం అమెరికాకు వలస వెళ్లింది. టెక్సాస్‌లోని లబ్బక్ సిటీలో పెరిగింది. ఆరతికి అమ్మ ఎప్పుడూ స్ఫూర్తిదాయకమైన విషయాలు చెబుతుండేది. ‘నీకంటూ ఒక ప్రత్యేకత సృష్టించుకోవాలి’ అని ఆమె తరచుగా చెప్పే మాట ఆరతి మనసులో బలంగా నాటుకుపోయింది. కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో అప్లైడ్ ఫిజిక్స్‌లో పీహెచ్డీ చేసిన తొలి మహిళగా గుర్తింపు పొందింది ఆరతి. 34 ఏళ్ల వయసులో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్టాండర్ట్స్ అండ్ టెక్నాలజీ (నిస్ట్)కి నాయకత్వం వహించింది. ‘నిస్ట్’కు నాయకత్వం వహించిన తొలి మహిళగా రికార్డ్ సృష్టించింది. ‘నిఫ్ట్’ తరువాత రెచెమ్ (ఏరోస్పేస్, ఆటోమోటివ్, టెలికమ్యూనికేషన్ ఇండస్ట్రీ) కార్పోరేషన్‌కు సీనియర్ టెక్నాలజీ ఆఫీసర్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు నిర్వహించింది. డిఫెన్స్ అడ్వాన్స్డ్ రిసెర్చ్ ప్రాజెక్ట్ ఏజెన్సీ(డర్ప)కి నాయకత్వ బాధ్యతలు స్వీకరించడం ఆమె కెరీర్లో మరో ఘనతగా చెప్పుకోవాలి. రక్షణకు సంబంధించి భవిష్యత్కాల సాంకేతిక జ్ఞానానికి సంబంధించిన అధ్యయనం, ఆవిష్కరణలకు సంబంధించి అమెరికాలో ఇది శక్తివంతమైన సంస్థ. దీనికి నాయకత్వం వహించడం చిన్న విషయమేమీ కాదు. పెంటగాన్ ‘బ్లూ స్కై రిసెర్చ్ ఏజెన్సీ’గా ప్రసిద్ధి పొందిన ఈ సంస్థకు నాయకత్వ బాధ్యతలను సమర్థవంతగా నిర్వహించి కొత్త ఆవిష్కరణలకు ఊతం ఇచ్చింది ఆరతి. ఇక వ్యక్తిగత విషయానికి వస్తే... తాను కౌమారంలో ఉన్నప్పుడు తల్లిదండ్రులు విడాకులు తీసుకున్నారు. ‘ఆ సమయంలో కూడా ఎప్పటిలాగే ఉండేది తప్ప, ఏవో విషయాలను గుర్తు తెచ్చుకొని బాధపడేది కాదు. ఆ విషాద ప్రభావాన్ని నానై చూపించేది కాదు. ఒకానొక దశలో ఆమెకు నేను, నాకు ఆమే ప్రపంచం అన్నట్లుగా ఉండేది. ఒకరకంగా చెప్పాలంటే మా అమ్మ అసాధారణమైన అమ్మ. సామాజిక సేవ అంటే ఎంతో ఇష్టం. ఆ సేవాదృక్పథం ఆమెను ఎప్పుడూ చురుకుగా ఉండేలా చేసేది’ అని తల్లిని గుర్తుచేసుకుంటుంది ఆరతి. ప్రస్తుత విషయానికి వస్తే... ప్రపంచం గొప్పగా మాట్లాడుకునే బాధ్యతను స్వీకరించబోతుంది ఆరతి. ఆమె గురించి అమ్మ మాటల్లో చెప్పాలంటే ‘సాహసం మూర్తీభవించే అమ్మాయి’ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మాటల్లో చెప్పాలంటే... ‘ప్రతిభావంతురాలైన, గౌరవనీయ శాస్త్రవేత్త’ అరవై మూడు సంవత్సరాల ఆరతి ప్రభాకర్...సెనేట్ అమోదముద్ర వేస్తే వైట్‌హౌస్ ఓఎస్టీపీ (ఆఫీస్ ఆఫ్ సైన్స్ టెక్నాలజీ పాలసీ) ముఖ్య సలహాదారుగా బాధ్యతలు చేపట్టబోయే తొలి భారత సంతతి మహిళగా రికార్డ్ సృష్టిస్తుంది. ఆమెకు అభినందనలు. -
అర్ణబ్ డేకు ప్రతిష్టాత్మక అవార్డు
సింగపూర్: భారత సంతతికి చెందిన అమెరికన్ ‘అర్ణబ్ డే’ కి ప్రతిష్టాత్మక ‘స్ప్రింగర్ థీసిస్ అవార్డు' వరించింది. కణితి అణిచివేతకు సంబంధించి అభివృద్ది చేసిన జన్యుమార్పిడి ప్రయోగానికి అర్ణబ్‌కు ఈ సత్కారం లభించింది. అత్యున్నతమైన పీహెచ్డీ థీసిస్‌కి ప్రపంచలోనే ప్రసిద్దిగాంచిన బుక్ పబ్లిషర్ ‘స్ప్రింగర్’ ఏటా ఈ అవార్డును అందజేస్తుంది. ఇదే ప్రయోగానికి ‘యంగ్ ఇన్విస్టిగేటర్ అవార్డు’ను అమెరికన్ పెప్టైడ్ సింపోసియమ్ బహూకరించింది. అంతేకాకుండా తన పీహెచ్‌డీలో భాగంగా మధుమేహ చికిత్సావిధానానికి పెప్టైడ్ సంబంధిత ప్రోడ్రగ్స్ను అభివృద్ది చేశారు. ఈ సిద్దాంతం న్యూయార్క్‌లోని కొలంబియా యూనివర్సిటీకి నామినేట్ అయింది. ఈ ప్రయోగాన్ని భారత యువతకు మార్గదర్శకుడిగా నిలిచిన మాజీ క్రికెట్ ఆటగాడు సచిన్ టెండూల్కర్‌కి అంకితం ఇస్తున్నట్లు అర్ణబ్ అప్పట్లో ప్రకటించారు. -
యూఎస్‌లో ఎన్నారైకి కీలక పదవి
అమెరికాలో ప్రముఖ ఎన్నారై శాస్త్రవేత్త సేతురామన్ పంచనాథన్కు అరుదైన గౌరవం దక్కింది. యూఎస్‌లోని ప్రతిష్టాత్మక నేషనల్ సైన్స్ ఫౌండేషన్‌కు చెందిన నేషనల్ సైన్స్ బోర్డులో సభ్యునిగా సేతురామన్ను ఆ దేశాధ్యక్షుడు బరాక్ ఒబామా నియమించారు. ఈ మేరకు యూఎస్ అధ్యక్ష భవనం వైట్‌హౌస్ శనివారం విడుదల చేసిన ఓ ప్రకటనలో వెల్లడించింది. 1984లో బెంగళూరులోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్‌లో బ్యాచిలర్ డిగ్రీ అందుకున్నారు. అనంతరం చెన్నైలోని ఇంటర్నేషనల్ సాఫ్ట్వేర్ ఇండియా లిమిటడ్లో డేటా కమ్యూనికేషన్ ఇంజినీరుగా సేతురామన్ విధులు నిర్వహించారు. మరి కొన్నాళ్లకు ఐఐటీ నుంచి ఎంటెక్ పట్టా అందుకున్నారు. ఆ క్రమంలో కెనడా పయనమై యూనివర్శిటీ ఆఫ్ ఒట్టావా నుంచి పీహెచ్డీ పట్టా పుచ్చుకున్నారు. అరిజోనా స్టేట్ యూనివర్శిటీలో పలు కీలక పదవులు నిర్వహించారు. శాస్త్ర సాంకేతిక రంగంపై ఇప్పటి వరకు ఆయన దాదాపు 400పైగా పత్రాలు ప్రచురితమైనాయి. -
భారతీయ అమెరికన్ శాస్త్రవేత్తకు రూ.5.40 కోట్లు
హూస్టన్: మెదడుపై కీలక పరిశోధన చేస్తున్న భారతీయ అమెరికన్ శాస్త్రవేత్త ఖలీల్ రెజాక్కు ‘నేషనల్ సైన్స్ ఫౌండేషన్(ఎన్ఎఫ్సీ)’ భారీ మొత్తంలో రూ 5.40 కోట్ల(8.66 డాలర్లు) గ్రాంటును ప్రకటించింది. రోజువారీ జీవితంలో శబ్దాలను మెదడు ఎలా విశ్లేషిస్తుంది? అన్న కోణంలో తదుపరి పరిశోధన నిర్వహించేందుకుగాను ‘ఫేకల్టీ ఎర్లీ కెరీర్ డెవలప్మెంట్ ప్రోగ్రాం’ కింద ఖలీల్‌కు ఈ మొత్తం గ్రాంటు లభించింది. ఈ నిధులను దశలవారీగా ఐదేళ్లలో ఎన్ఎఫ్సీ అందించనుంది. ఖలీల్ పరిశోధనలు ఓ కొలిక్కి వస్తే గనక... వయసు రీత్యా వచ్చే వినికిడి సమస్యలకు కొత్త చికిత్సలు కనుగొనేందుకు మార్గం సుగమం కానుంది.