అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తన సైన్స్ సలహాదారుగా భారత సంతతికి చెందిన ఆరతి ప్రభాకర్‌ను నామినేట్ చేయడంతో ‘ఆ పదవికి ఆమె అన్నివిధాలా అర్హురాలు’ అనే ప్రశంసలతో పాటు, ‘ఆరతి ప్రభాకర్ ఎవరు?’ అనే ఆసక్తితో కూడిన ప్రశ్న ముందుకు వచ్చింది...
దిల్లీలో జన్మించింది ఆరతి ప్రభాకర్. తన మూడవ యేట కుటుంబం అమెరికాకు వలస వెళ్లింది. టెక్సాస్‌లోని లబ్‌బక్ సిటీలో పెరిగింది. ఆరతికి అమ్మ ఎప్పుడూ స్ఫూర్తిదాయకమైన విషయాలు చెబుతుండేది. ‘నీకంటూ ఒక ప్రత్యేకత సృష్టించుకోవాలి’ అని ఆమె తరచుగా చెప్పే మాట ఆరతి మనసులో బలంగా నాటుకుపోయింది.
కాలిఫోర్నియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో అప్లైడ్ ఫిజిక్స్‌లో పీహెచ్‌డీ చేసిన తొలి మహిళగా గుర్తింపు పొందింది ఆరతి. 34 ఏళ్ల వయసులో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్టాండర్ట్స్ అండ్ టెక్నాలజీ (నిస్ట్)కి నాయకత్వం వహించింది. ‘నిస్ట్’కు నాయకత్వం వహించిన తొలి మహిళగా రికార్డ్ సృష్టించింది.
‘నిఫ్ట్’ తరువాత రెచెమ్ (ఏరోస్పేస్, ఆటోమోటివ్, టెలికమ్యూనికేషన్ ఇండస్ట్రీ) కార్పోరేషన్‌కు సీనియర్ టెక్నాలజీ ఆఫీసర్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు నిర్వహించింది.
డిఫెన్స్ అడ్వాన్స్‌డ్ రిసెర్చ్ ప్రాజెక్ట్ ఏజెన్సీ(డర్ప)కి నాయకత్వ బాధ్యతలు స్వీకరించడం ఆమె కెరీర్‌లో మరో ఘనతగా చెప్పుకోవాలి. రక్షణకు సంబంధించి భవిష్యత్‌కాల సాంకేతిక జ్ఞానానికి సంబంధించిన అధ్యయనం, ఆవిష్కరణలకు సంబంధించి అమెరికాలో ఇది శక్తివంతమైన సంస్థ. దీనికి నాయకత్వం వహించడం చిన్న విషయమేమీ కాదు.
పెంటగాన్ ‘బ్లూ స్కై రిసెర్చ్ ఏజెన్సీ’గా ప్రసిద్ధి పొందిన ఈ సంస్థకు నాయకత్వ బాధ్యతలను సమర్థవంతగా నిర్వహించి కొత్త ఆవిష్కరణలకు ఊతం ఇచ్చింది ఆరతి.
ఇక వ్యక్తిగత విషయానికి వస్తే...
తాను కౌమారంలో ఉన్నప్పుడు తల్లిదండ్రులు విడాకులు తీసుకున్నారు.
‘ఆ సమయంలో కూడా ఎప్పటిలాగే ఉండేది తప్ప, ఏవో విషయాలను గుర్తు తెచ్చుకొని బాధపడేది కాదు. ఆ విషాద ప్రభావాన్ని నానై చూపించేది కాదు. ఒకానొక దశలో ఆమెకు నేను, నాకు ఆమే ప్రపంచం అన్నట్లుగా ఉండేది. ఒకరకంగా చెప్పాలంటే మా అమ్మ అసాధారణమైన అమ్మ. సామాజిక సేవ అంటే ఎంతో ఇష్టం. ఆ సేవాదృక్పథం ఆమెను ఎప్పుడూ చురుకుగా ఉండేలా చేసేది’ అని తల్లిని గుర్తుచేసుకుంటుంది ఆరతి.
ప్రస్తుత విషయానికి వస్తే...
ప్రపంచం గొప్పగా మాట్లాడుకునే బాధ్యతను స్వీకరించబోతుంది ఆరతి. ఆమె గురించి అమ్మ మాటల్లో చెప్పాలంటే ‘సాహసం మూర్తీభవించే అమ్మాయి’ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మాటల్లో చెప్పాలంటే... ‘ప్రతిభావంతురాలైన, గౌరవనీయ శాస్త్రవేత్త’ అరవై మూడు సంవత్సరాల ఆరతి ప్రభాకర్...సెనేట్ అమోదముద్ర వేస్తే వైట్‌హౌస్ ఓఎస్‌టీపీ (ఆఫీస్ ఆఫ్ సైన్స్ టెక్నాలజీ పాలసీ) ముఖ్య సలహాదారుగా బాధ్యతలు చేపట్టబోయే తొలి భారత సంతతి మహిళగా రికార్డ్ సృష్టిస్తుంది. ఆమెకు అభినందనలు.
Comments
Please login to add a commentAdd a comment