indian arrested
-
నిజ్జర్ హత్య కేసులో మరో భారతీయుడి అరెస్ట్
వాషింగ్టన్/ఒట్టావా: ఖలిస్తాన్ వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో కెనడా పోలీసులు తాజాగా మరో భారతీయుడిని అరెస్ట్‌చేశారు. బ్రాంప్టన్ సిటీలో నివసించే 22 ఏళ్ల అమన్‌దీప్ సింగ్‌ను హత్య, హత్యకు కుట్ర నేరాల కింద అరెస్ట్‌చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఉదంతంలో గత వారమే ముగ్గురు భారతీయులను అక్కడి పోలీసులు అరెస్ట్‌చేశారు. అమన్దీప్ను ఒంటారియాలో మే 11న అరెస్ట్‌చేసినట్లు రాయల్ కెనడియన్ పోలీసులు ఆదివారం ప్రకటించారు. బ్రిటిష్ కొలంబియాలో 2023 జూన్ 18వ తేదీన గురునానక్ గురుద్వారా వద్ద 45 ఏళ్ల నిజ్జర్‌ను గుర్తుతెలియని వ్యక్తులు కాల్చి చంపిన విషయం తెల్సిందే. నిజ్జర్‌ను చంపిన ఇద్దరు షూటర్లలో అమన్‌దీప్ ఒకడని గ్లోబల్ న్యూస్ ఒక కథనం వెలువర్చింది. -
అమెరికాలో మరో భారతీయుని అరెస్టు
వాషింగ్టన్: అమెరికాలో సీనియర్ సిటిజన్ల ఖాతాలను దోచేసిన కేసులో తాజాగా మరో భారతీయుడు అరెస్టయ్యాడు. వర్జీనియాకు చెందిన అనిరుధ్ కల్‌కోటెను (24) శుక్రవారం హూస్టన్‌లో కోర్టులో హాజరుపరిచారు. సీనియర్ సిటిజన్ల నుంచి డబ్బులు దోచేందుకు వారికి కొందరు బెదిరింపు మెయిల్స్ పంపడం, ఇవ్వకుంటే దాడులకు దిగుతామని హెచ్చరించడం వంటివి చేశారు. హూస్టన్‌లో చట్టవిరుద్ధంగా ఉంటున్న కొందరు భారతీయులు ముఠాగా ఏర్పడి వెస్ట్రన్ యూనియన్, మనీగ్రాం వంటి ట్రాన్స్మిటర్ బిజినెస్‌ల లింకులు పంపి వృద్ధుల ఖాతాల్లోని సొమ్ము కాజేశారు. మహమ్మద్ ఆజాద్ (25) అనే వ్యక్తితో కలిసి ఈ నేరానికి పాల్పడ్డాడన్నది అనిరుధ్‌పై అభియోగం. ఆజాద్‌ను 2020లోనే అరెస్టు చేశారు. నేరాలు రుజువైతే 20 ఏళ్ల జైలుశిక్ష, 20 వేల డాలర్ల జరిమానా పడొచ్చు. -
గూఢచర్య ఆరోపణలపై పాక్‌లో భారతీయుడి అరెస్ట్
లాహోర్: దేశంలో గూఢచర్యానికి పాల్పడుతున్నాడనే ఆరోపణలపై పాకిస్తాన్ ఓ భారతీయుడిని అరెస్ట్‌చేసింది. తానో గూఢచారినని రాజు లక్ష్మణ్ ఒప్పుకున్నాడని, అతడిని పంజాబ్ ప్రావిన్స్‌లోని డేరా ఘాజీ ఖాన్ జిల్లాలోని రాఖీగజ్ ప్రాంతంలో అరెస్ట్‌చేసినట్లు పాక్ పోలీసులు వెల్లడించారు. ఇతర వివరాలు రాబట్టేందుకు లక్ష్మణ్‌ను పోలీసులు గుర్తుతెలియని ప్రాంతానికి తరలించారు. బెలూచిస్తాన్ ప్రావిన్స్ నుంచి డేరా ఘాజీ ఖాన్ జిల్లాలోకి లక్ష్మణ్ ప్రవేశిస్తుండగా అరెస్ట్ చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. గూఢచర్యానికి పాల్పడ్డారనే ఆరోపణలపై గతంలో భారత మాజీ నేవీ అధికారి కుల్‌భూషణ్ జాదవ్‌ను బెలూచిస్తాన్ ప్రాంతంలోనే పాక్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
విమానంలో లైంగిక దాడి.. ఎన్నారై అరెస్టు
విమానంలో తోటి ప్రయాణికురాలిపై లైంగిక దాడికి పాల్పడినందుకు అమెరికాలో ఎన్నారై ఒకరిని పోలీసులు అరెస్టు చేశారు. బేటన్ రోగ్ ప్రాంతంలో నివసించే దేవేందర్ సింగ్ (61) ప్రయాణిస్తున్న విమానం నెవార్క్లో ల్యాండ్ అవ్వగానే ఎఫ్‌బీఐ వర్గాలు అక్కడకు చేరుకుని మరీ ఆయనను అరెస్టు చేశాయి. లైంగిక దాడి చేసినందుకు గాను ఒక కౌంటు కేసు నమోదు కావడంతో ఆయనను న్యూజెర్సీ కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసు రుజువైతే దేవేందర్ సింగ్‌కు గరిష్ఠంగా రెండేళ్ల జైలుశిక్ష, కోటిన్నర రూపాయల జరిమానా విధించే అవకాశముంది. హ్యూస్టన్ నుంచి నెవార్క్ వెళ్తున్న విమానంలో ఓ ప్రయాణికురాలు కిటికీ పక్కన సీట్లో కూర్చోగా, ఆ పక్క సీట్లో సింగ్ కూర్చున్నారు. ఆమెకు సింగ్ ఎవరో తెలీదు. విమానం గాల్లోకి ఎగిరిన కాసేపటికే ఆమె నిద్రపోయింది. తాను నిద్రలో ఉండగానే సింగ్ తనను ముఖం మీద ముద్దు పెట్టుకున్నారని, అనంతరం లైంగిక దాడి కూడా చేశాడని ఆమె ఫిర్యాదు చేసింది. కాసేపటికి మెలకువ రావడంతో ఆయనను పక్కకు తోసేసి, విమాన సిబ్బంది వద్దకు వెళ్లానని.. విమానం ల్యాండ్ అయ్యేసరికి అక్కడకు పోలీసులను పిలవాల్సిందిగా వారికి చెప్పానని ఆమె తరఫు న్యాయవాదులు తెలిపారు.