Indian election commission
-
ఆధార్‌ను ఓటరు కార్డుతో అనుసంధానించే బిల్లుకు లోక్‌సభ ఆమోదం!
Aadhaar - Voter ID Linking న్యూఢిల్లీ: ఎన్నికల చట్టాల (సవరణ) బిల్లు 2021కు లోక్‌సభ సోమవారం ఆమోదం తెలిపింది. ఆధార్‌ను ఓటర్ కార్డుతో అనుసంధానించేలా రూపొందించిన ఈ బిల్లును కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు సభలో ప్రవేశపెట్టారు. నకిలీ ఓట్లను గుర్తించడమే లక్ష్యంగా ఆధార్‌ను ఓటర్ కార్డుతో అనుసంధానించడానికే ప్రతిపాదన బిల్లును ప్రవేశపెట్టినట్లు ప్రశంగ సమయంలో మంత్రి పేర్కొన్నారు. బిల్లును వ్యతిరేకించేవారంతా సుప్రీంకోర్టు నిర్ణయాన్ని వక్రీకరించేందుకు ప్రయత్నిస్తున్నారని రిజిజు ఈ సందర్భంగా తెలిపారు. ఐతే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, ఏఐఎమ్ఐఎమ్, ఆర్ఎస్పీ, బీఎస్పీ పార్టీలు ఎన్నికల చట్టాల సవరణ బిల్లును ప్రవేశపెట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేకించాయి. బిల్లును పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ పరిశీలకు పంపాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఏఐఎమ్ఐఎమ్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఈ బిల్లు ద్వారా స్వతంత్ర, రాజ్యాంగబద్ధమైన ఎలక్షన్ కమిషన్‌ను నిర్వీర్యం చేసే ప్రయత్నం జరుగుతోందనీ, ఆధార్‌ను ఓటరు కార్డుతో అనుసంధానిస్తే భవిష్యత్తులో అనేక ఓటర్ల పేర్లను తొలగించే అవకాశం ఉందని వాదించారు. ఐతే అధికార బీజేపీకి పార్లమెంటు ఉభయసభల్లోనూ తగిన బలం ఉంది. అధికార ప్రతిపక్షాల వాదప్రతివాదనల మధ్య నేడు లోక్‌సభలో బిల్లు ఆమోదం పొందింది. ఈ బిల్లు ప్రకారం బోగస్ ఓట్లను గుర్తించడమేకాకుండా, ఒకటికంటే ఎక్కువ నియోజకవర్గాల్లో ఒకే వ్యక్తి ఓటు కలిగి ఉండటాన్ని నిరోధించవచ్చని ప్రభుత్వం ప్రతిపాధించింది. మరోనిబంధన ఏంటంటే ప్రతీ ఏట నాలుగు తేదీల్లో మాత్రమే యువత ఓటర్లుగా నమోదు చేసుకోవడానికి అనుమతి ఉంటుంది. ప్రస్తుతం 18 ఏళ్లు నిండిన వారు జనవరి 1వ తేదీలోపు ఓటరుగా నమోదు చేసుకునే అవకాశం ఉంది. కాగా విపక్ష నేతల ఆందోళనలతో సభ మంగళవారానికి వాయిదా పడింది. ఏదిఏమైనప్పటికీ ఎన్నికల సంస్కరణ బిల్లు దేశ చరిత్రలో కొత్త అధ్యయనాన్ని రచించనుందని చెప్పవచ్చు. చదవండి: ‘నెలంతా కురవాల్సిన వర్షం నిన్న ఒక్కరోజే కురవడంతో 30 వేల మంది నిరాశ్రయులయ్యారు' -
‘తమాంగ్’పై లెక్కలు తప్పిన ‘ఈసీ’
సాక్షి, న్యూఢిల్లీ: భారత ఎన్నికల కమిషన్ ఆదివారం నాడు ఓ అసాధారణ నిర్ణయం తీసుకుంది. సిక్కిం ముఖ్యమంత్రి ప్రేమ్‌సింగ్ తమాంగ్ ఎన్నికల్లో ఆరేళ్లపాటు పోటీ చేయకూడదనే ఆంక్షలను ఏడాది ఒక నెలకు (13 నెలలకు) కుదించింది. ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని 11వ సెక్షన్ కింద తమకున్న అధికారాలను ఉపయోగించుకొని ఈ అసాధారణ నిర్ణయం తీసుకున్నట్లు గొప్పగా సమర్థించుకుంది. ఇక్కడే దాని లెక్కలు పూర్తిగా తప్పాయి. అన్ని విషయాలను అవగాహన లోకి తీసుకొని ఆలోచిస్తే గుడ్లు తేలేసే పరిస్థితి దానికి తప్పదు. ఓ అవినీతి కేసులో దోషిగా తేలిన ప్రేమ్‌సింగ్ తమాంగ్ 2018, ఆగస్టు నెలలో జైలు నుంచి విడుదలయ్యారు. ప్రజా ప్రాతినిధ్యం చట్టం నిబంధనల ప్రకారం దోషిగా నిర్ధారితుడైన వ్యక్తి జైలు నుంచి విడుదలైన నాటి నుంచి ఆరేళ్ల పాటు ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయడానికి వీల్లేదు. అయితే 2019, మే నెలలో సిక్కిం అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ మిత్రపక్షంగా ప్రేమ్‌సింగ్ తమాంగ్ నాయకత్వంలోని ’సిక్కిం క్రాంతికారి మోర్చా’ పోటీ చేసింది. అసెంబ్లీలోని 32 సీట్లకుగాను 17 సీట్లను గెలుచుకుంది. మిత్రపక్షమైన బీజేపీ ఒక్క సీటును కూడా గెలుచుకోలేకపోయింది. అసెంబ్లీ ఎన్నికల్లో అధిక సీట్లను గెలుచుకున్న ‘సిక్కిం క్రాంతికారి మోర్చా’ తమ శాసన సభాపక్ష నేతగా ప్రేమ్‌సింగ్ తమాంగ్‌ను ఎన్నుకుంది. ఈ నేపథ్యంలో తమాంగ్‌పై ఆరేళ్లపాటు ఎన్నికల్లో పోటీ చేయరాదనే అనర్హత వేటు ఉన్నప్పటికీ ఆయన్నే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా సిక్కిం గవర్నర్ ఆహ్వానించారు. ఆ మేరకు 2019, మే 27వ తేదీగా సిక్కిం ముఖ్యమంత్రిగా తమాంగ్ ప్రమాణ స్వీకరాం చేశారు. ఆయన గత నాలుగు నెలలుగా సీంగా పదవిలో కొనసాగుతున్నారు. శాసన సభ్యత్వం లేకుండా సీఎంగా బాధ్యతలు స్వీకరించిన వ్యక్తి చట్ట ప్రకారం ఆరు నెలల్లో శాసస సభకు ఎన్నిక కావాల్సి ఉంది. అంటే ఆయన ఎన్నిక కావడానికి మరో రెండు నెలల వ్యవధి ఉంది. ఈ లోగా ఆరేళ్లపాటు ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హత లేని వ్యక్తిని ఎలా సీఎం చేస్తారంటూ ఆయన ఎన్నికను సవాల్ చేస్తూ ఓ రిట్ పిటిషన్ దాఖలైంది. అది ప్రస్తుతం సుప్రీం కోర్టు విచారణలో ఉంది. ఈ నేపథ్యంలో అదివారం నాడు కేంద్ర ఎన్నికల కమిషన్ తమాంగ్‌పై ఆరేళ్లపాటున్న అనర్హత ఆంక్షలను 13 నెలలకు కుదిస్తూ అసాధారణ నిర్ణయం తీసుకుంది. తమాంగ్ 2018, ఆగస్టు నెలలో విడుదలయ్యారు గనుక ఆయనపై ఆంక్షలు 2019, సెప్టెంబర్ నెల వరకు వర్తిస్తాయి. అక్టోబర్ నుంచి వర్తించవు. ఆయన నాలుగు నెలల క్రితమే సీఎం బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో అక్టోబర్ లేదా నవంబర్ నెలల్లో ఆయన అసెంబ్లీకి పోటీ చేయవచ్చన్నది ఎన్నికల కమిషన్ అంచనా లేదా వ్యూహం అని చెప్పవచ్చు. ఇక్కడే ఎన్నికల కమిషన్ అడుసులో కాలేసింది. అనర్హత వేటును ఎదుర్కొంటున్న వ్యక్తి సీఎంగా బాధ్యతలు స్వీకరించడానికే అనర్హుడు. ఈ విషయం ఎన్నికల కమిషన్ దృష్టిలో లేనట్లుంది. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత విషయంలో 2001లో సుప్రీం కోర్టు ఈ విషయాన్ని స్పష్టం చేసింది. 2000, ఏప్రిల్ నెలలో ఓ ప్రభుత్వ భూమి అమ్మకంలో జయలలిత అవినీతికి పాల్పడినట్లు 2001లో తేలింది. దాంతో ప్రజాప్రాతినిధ్య చట్టం కింద ఆమె ఆరేళ్లపాటు ఎన్నికల్లో పోటీ చేయడానికి వీల్లేకుండా పోయింది. 2001లో తమిళనాడు అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో జయలలితకు చెందిన ఏఐఏడిఎంకే పార్టీ విజయం సాధించింది. ఆ నేపథ్యంలో 2001, జూన్ నెలలో ఆమెతో సీఎంగా ఆ రాష్ట్ర గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఆమె నియామకాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ కేసులో జయలలిత నియామం చెల్లదంటూ సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది. ‘అనర్హత ఆంక్షలు ఎదుర్కొంటున్న వ్యక్తిని ముఖ్యమంత్రిగా గవర్నర్ ఏ కారణంతోని నియమించినా ఆ నియామకం చెల్లదు. ఆ నియామకం భారత రాజ్యాంగంలోని 164వ అధికరణకు విరుద్ధం. గవర్నర్ నియమించారన్న కారణంగా సీఎం నియామకం చెల్లుబాటు కాదు. రాజ్యాంగ నిబంధనలకు ఏమాత్రం విరుద్ధంగా ఉన్నా ఆ నియామకాన్ని రద్దు చేయాల్సిందే. ఆ తదుపరి న్యాయ ప్రక్రియ ద్వారాగానీ, నోటిఫికేషన్ ద్వారాగానీ నియామకాన్ని రద్దు చేయవచ్చు’ అంటూ సుప్రీం కోర్టు స్పష్టమైన తీర్పు చెప్పింది. తమాంగ్‌పై అనర్హత ఆంక్షలను ఎన్నికల కమిషన్ 13 నెలలకు కుదించడం వల్ల ఆ ఆంక్షలు ఈ సెప్టెంబర్ నెల వరకు వర్తిస్తాయి. తమాంగ్ నియామకం నాలుగు నెలల క్రితమే జరిగినందున సుప్రీం కోర్టు ఉత్తర్వులు చెల్లవు. తమాంగ్ తనపై ఆంక్షలను రద్దు చేయాల్సిందిగా గానీ లేదా కుదించాల్సిందిగా గానీ ఎన్నికల కమిషన్‌ను ఆశ్రయించారా? అంటూ ఎన్నికల కమిషన్ వర్గాలను మీడియా ప్రశ్నించగా, లేదని సమాధానం వచ్చింది. అలాంటప్పుడు ఆయనపై ఎన్నికల కమిషన్‌కు ఈ అసాధారణ ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చింది. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తీవ్ర ఒత్తిళ్లను ఎదుర్కొంటున్న ఎన్నికల కమిషన్ ఈసారి కూడా ఒత్తిళ్లకు తలొగ్గే ఇలాంటి అసాధారణ నిర్ణయం తీసుకుందా ? ఏదేమైనప్పటికీ అంతిమ తీర్పు రాజ్యాంగానికి లోబడాల్సిందే కదా! -
‘మల్కాజ్‌గిరిలో అనుమానాస్పద ఓట్లు’
సాక్షి, హైదరాబాద్: తాను పోటీ చేస్తున్న మల్కాజ్గిరి నియోజకవర్గంలో పలు చోట్ల అనుమానాస్పద ఓట్లు ఉన్నాయని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఈ తరహా ఓట్లపై చర్యలు తీసుకో వాలని బుధవారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి, భారత ఎన్నికల సంఘానికి ఆయన ఫిర్యాదు చేశారు. తాను ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓటర్ల జాబితా పరిశీలించినపుడు పలు చోట్ల ఒకే ఇంటి నంబరుతో అనేక ఓట్లు ఉండటాన్ని తాను గుర్తించానని, ఇది అసాధ్యమని రేవంత్ వివరించారు. ఇలాంటి అనుమానాస్పద ఓట్లపై పరిశీలన జరిపి వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన ఫిర్యాదులో కోరారు. -
స్త్రీలోక సంచారం
బర్మా రాజకీయ నాయకురాలు, తిరుగుబాటు యోధురాలు, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత ఆంగ్‌సాన్ సూచీకి 2009లో ఇచ్చిన ‘ది అంబాసిడర్ ఆఫ్ కన్సైన్స్ అవార్డు’ను ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఉపసంహరించుకుంది. మానవహక్కుల కోసం ఒకప్పుడు బర్మా నియంత ప్రభుత్వంతో అలుపెరగక పోరాడిన సూచీ.. బర్మాలో రొహింగ్యా ముస్లింల ఊచకోత జరుగుతుంటే.. ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండి కూడా చూస్తూ మిన్నకుండి పోయారనీ, ఆ ధోరణి.. ఒకప్పుడు ఆమె పాటించిన విలువలకు వెన్నుపోటు పొడవడమేనని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ వ్యాఖ్యానించింది. అయితే అవార్డును వెనక్కు తీసుకోవడం వల్ల తనకు వచ్చిన నష్టమేమీ లేదని సూచీ తిరుగు సమాధానం ఇచ్చారు. భారత ఎన్నికల సంఘం తొలిసారిగా.. ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న ఛత్తీస్‌గఢ్‌లో అందరూ మహిళలే ఉండే ఐదు పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేసింది. స్థానిక భాషలో ‘స్నేహితురాలు’ అనే అర్థం వచ్చే ‘సంఘ్వారీ’ అనే పేరును ఈ ప్రత్యేక మహిళా పోలింగ్ బూత్‌లకు పెట్టింది. మహిళలు మాత్రమే ఓటు హక్కును వినియోగించుకునే ఈ బూత్‌లలో ప్రిసైడింగ్ ఆఫీసర్లు, సూపర్వైజర్లు, భద్రతా సిబ్బంది.. అంతా మహిళలే కావడంతో.. మావోయిస్టు ప్రభావం ఉన్న ప్రాంతాలైనప్పటికీ మహిళలు ధైర్యంగా వచ్చి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఇలాంటి బూత్‌లనే మధ్యప్రదేశ్, రాజస్తాన్, మిజోరాం, తెలంగాణల ఎన్నికల్లో కూడా ఏర్పాటు చేయాలని ఎన్నికల సంఘం భావిస్తోంది. హవాయి రాష్ట్రం నుంచి అమెరికన్ ‘కాంగ్రెస్’కు నాలుగుసార్లు ఎన్నికైన తులసీ గబ్బార్డ్ (37) వచ్చే అధ్యక్ష ఎన్నికల్లో (2020) పోటీ చేయబోతున్నట్లు లాస్ ఏంజెలిస్‌లో జరిగిన ఒక సదస్సులో ఇండియన్ అమెరికన్ సంపత్ శివాంగి ప్రకటించారు. తులసి తల్లిదండ్రులకు భారతదేశంతో ఏవిధమైన అనువంశిక సంబంధాలూ లేనప్పటికీ ఆమె తల్లి.. హైందవ ధర్మాలను, ఆచారాలను పాటించడంతో తులసి కూడా తన పద్దెనిమిదవ ఏట నుంచీ హిందుత్వానికి ఆకర్షితురాలై, భారతీయురాలిగా పరిగణన పొందుతున్నారు. కాగా, తను అమెరికా అధ్యక్ష పదవికి పోటీపడనున్నట్లు డాక్టర్ సంపత్ చేసిన ప్రకటనను తులసి ఖండించడం గానీ, నిర్ధారించడం గానీ చేయలేదు. -
షాడో బృందాలు.. ఫ్లయింగ్ స్క్వాడ్లు!
* ఎన్నికల్లో అభ్యర్థుల వ్యయ నియంత్రణకు ఈసీ చర్యలు * ప్రత్యేక బ్యాంక్ ఖాతా, చెక్కుల ద్వారానే లావాదేవీలు * పరిమితి మించితే క్రిమినల్ కేసులు * పెయిడ్ న్యూస్ నిర్ధారణకు కమిటీలు * అక్రమాలపై ఫిర్యాదులకు టోల్‌ఫ్రీ నంబర్ 1950 * భారత ఎన్నికల కమిషన్ డెరైక్టర్ జనరల్ పీకే దాస్ వెల్లడి సాక్షి, హైదరాబాద్: ఎన్నికల్లో ధన ప్రభావాన్ని నియంత్రించే దిశగా ఎన్నికల సంఘం పలు చర్యలు చేపట్టనుందని భారత ఎన్నికల సంఘం డెరైక్టర్ జనరల్(డీజీ) పీకే దాస్ వెల్లడించారు. అందుకు మీడియా కూడా సహకరించాలని కోరారు. ఎన్నికల్లో వ్యయ నియంత్రణ, పెయిడ్ న్యూస్ తదితర అంశాలపై బుధవారం హైదరాబాద్‌లో మీడియా ప్రతినిధులతో జరిగిన చర్చాగోష్టిలో దాస్ పాల్గొన్నారు. ఆయన ఏమన్నారంటే... అభ్యర్థులు ఎన్నికల ఖర్చుకు ప్రత్యేకంగా బ్యాంకు ఖాతా తెరచి దాని ద్వారా చెక్కు రూపంలోనే చెల్లింపులు జరిపేలా నిబంధన పెడుతున్నాం. పరిమితికి మించి వ్యయం చేస్తే క్రిమినల్ కేసులు పెట్టడంతోపాటు గెలిచిన అభ్యర్థులను అనర్హులుగా ప్రకటిస్తాం. వచ్చే ఎన్నికల్లో అభ్యర్థుల వ్యయాన్ని నిశితంగా పరిశీలించేందుకు షాడో బృందాలు పనిచేస్తాయి. షెడ్యూల్ ప్రారంభం నుంచి అభ్యర్థులు చేసే ప్రతి చర్యనూ పరిశీలించి ప్రతి అంశాన్నీ ఎన్నికల వ్యయంలో చేర్చుతూ రోజువారీ నివేదికలు రూపొందిస్తాయి. డబ్బు, మద్యం రవాణాను అడ్డుకునేందుకు ప్రత్యేక ఫ్లయింగ్ స్క్వాడ్‌లతోపాటు చెక్‌పోస్టులు ఏర్పాటు చేస్తాం. అభ్యర్థులకు అనుకూలంగా వచ్చే పెయిడ్ న్యూస్‌ను ఎన్నికల సంఘం నిశితంగా పరిశీలించి సంబంధిత ఖర్చును వారి వ్యక్తిగత ఎన్నికల వ్యయంలో జమ చేస్తుంది. పెయిడ్ కథనాలకు సంబంధించి ఎన్నికల సంఘం ఇచ్చే నోటీసులకు 48 గంటల్లో అభ్యర్థులు సమాధానాలు ఇవ్వాలి. పెయిడ్‌న్యూస్ కథనాలు పరిశీలించి తగు చర్యలు తీసుకునేందుకు జిల్లా, రాష్ట్రస్థాయిల్లో కమిటీలు ఏర్పాటు చేస్తాం. వాటిలో అనుభవజ్ఞులైన మీడియా ప్రతినిధులను కూడా నియమిస్తాం. ఓటర్లను చైతన్యపరచడంలో ముందుండే మీడియా సంస్థలకు ప్రత్యేక అవార్డులు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నాం. ఎన్నికల్లో అక్రమాలు, డబ్బు, నజరానాల పంపిణీ వంటి ఫిర్యాదుల కోసం టోల్‌ఫ్రీ నంబరు 1950ని ఏర్పాటు చేస్తాం. దీనికి వచ్చే ప్రతి ఫిర్యాదును రికార్డు చేయడంతోపాటు విచారణ తర్వాత చర్యల నివేదికను కూడా ఫిర్యాదుదారులకు అందజేస్తాం. కొన్ని పార్టీలకు సొంత వార్తాచానళ్లు ఉన్నాయని అవి ఆయా పార్టీలకు బహిరంగంగా మద్దతు పలుకుతున్నందున వాటిని ఎలా నియంత్రిస్తారనే ప్రశ్నకు.. దీనికి ప్రత్యేక నిబంధనలేవీ లేవని దాస్ స్పష్టం చేశారు. పెయిడ్‌న్యూస్ కథనాలకు మాత్రమే ఎన్నికల సంఘం నిబంధనలు రూపొందించిందని, పార్టీల వ్యయంపై పరిమితి ఏమీ లేదన్నారు. ఆయా పార్టీల ప్రచారంలో అభ్యర్థులపై ప్రత్యేక ప్రకటనలు, కథనాలు వస్తే మాత్రం ఆ ఖర్చును ఆయా అభ్యర్థుల ఖాతాలో వేస్తారని తెలిపారు. ఎన్నికల వ్యయం విషయంలో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలు అతి సున్నిత కేటగిరీలో ఉన్నాయన్నారు.