షిర్డీ సాయి చిత్రంతో... లిమిటెడ్ ఎడిషన్ వాచీ
♦ ధర రూ.3-4 లక్షలుండే అవకాశం
♦ రూపకల్పనలో స్విస్ కంపెనీ సెంచురీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : ఖరీదైన వాచీల తయారీలో ఉన్న స్విస్ కంపెనీ ‘సెంచురీ టైమ్స్ జెమ్స్’ భారతీయ దేవుళ్లను వాచీల్లో ప్రతిష్ఠించే పనిలో పడింది. ఇప్పటికే తిరుపతి వెంకటేశ్వర స్వామి చిత్రంతో కూడిన వాచీని ప్రవేశపెట్టి ఇక్కడి కస్టమర్లను ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. తాజాగా షిర్డీ సాయినాథుని చిత్రంతో వాచీని అభివృద్ధి చేస్తున్నట్టు తెలిసింది. మార్కెట్లోకి రావటానికి కొన్నాళ్లు పట్టొచ్చని రోడియో డ్రైవ్ మార్కెటింగ్ ప్రతినిధి సంజీవ్ ‘సాక్షి బిజినెస్ బ్యూరో’కు వెల్లడించారు. ధర రూ.3-4 లక్షలు ఉండే అవకాశం ఉందన్నారు. లిమిటెడ్ ఎడిషన్‌లో భాగంగా మొత్తం 2,000 వాచీలను మాత్రమే సెంచురీ ద్వారా తయారు చేయిస్తామన్నారు. సెంచురీ వాచీలను ప్రమోట్ చేసేందుకు ప్రతి నగరంలో ఒక ప్రముఖ ఆభరణాల సంస్థతో భాగస్వామ్యం కుదుర్చుకుంటామని అన్నారు. వాచీల విక్రయంలో ఉన్న బెంగళూరుకు చెందిన రోడియో డ్రైవ్ భాగస్వామ్యంతో సెంచురీ భారత్‌లో ప్రవేశించింది. వాచీల ధర రూ.3 లక్షలు-2 కోట్ల వరకు ఉంది.
బాలాజీ వాచీలు 32 అమ్మకం..
సెంచురీ టైమ్స్ జెమ్స్ 2013లో వెంకటేశ్వరుడి చిత్రంతో కూడిన వాచీని ఆవిష్కరించింది. ఇప్పటి వరకు 32 అమ్ముడయ్యాయి. వీటిలో 18 వాచీలను తెలుగు రాష్ట్రాలకు చెందిన కస్టమర్లు ద క్కించుకున్నారు. 11 వాచీలు కర్నాటక, 3 వాచీలు తమిళనాడుకు చెందిన వారు కొనుగోలు చేశారు. విడుదలైనప్పుడు ధర రూ.27 లక్షలుంటే, ఇప్పుడు రూ.29 లక్షలుంది. లిమిటెడ్ ఎడిషన్‌లో భాగంగా 333 వాచీలనే రూపొందించారు. డయల్‌ను మెటాలిక్ తెలుపు రంగులో అందంగా తీర్చిదిద్దారు. డయల్ వెనుకవైపు గోపురం ఆకారాన్ని ఉంచారు. 18 క్యారట్ల రెడ్ గోల్డ్‌ను వాచీ తయారీకి వాడారు. 34 పచ్చలు, 34 కెంపులు, 13 వజ్రాలు వాచీకి అందాన్ని తెచ్చిపెట్టాయి. వాచీల విక్రయ ఆదాయంలో కొంత మొత్తాన్ని టీటీడీకి చెందిన బాలాజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సర్జరీ, రిసర్చ్ అండ్ రిహాబిలిటేషన్ ఫర్ ద డిసేబుల్డ్కు ఇస్తున్నారు.