గుండెపోటుతో కిర్పాల్ సింగ్ మృతి: పాకిస్థాన్
న్యూఢిల్లీ: భారత ఖైదీ కిర్పాల్ సింగ్ గుండెపోటుతో మృతి చెందాడని కేంద్ర ప్రభుత్వానికి పాకిస్థాన్ సమాచారం అందించింది. లాహోర్ జైల్లో రెండు రోజుల క్రితం కిర్పాల్ సింగ్ మృతి చెందాడు. ఈ నెల 11న మధ్యాహ్నం 2.55 ప్రాంతంలో కిర్పాల్ గుండెపోటుతో మృతి చెందాడని పాక్ ప్రభుత్వం తమకు తెలిపిందని విదేశాంగ కార్యదర్శి వికాస్ స్వరూప్ వెల్లడించారు. పూర్తి వివరాలు అందాల్సి ఉందని చెప్పారు. పంజాబ్ ప్రావిన్స్ లో జరిగిన సీరియల్ బాంబు పేలుళ్ల కేసులో 25 ఏళ్లుగా లాహోర్ జైల్లో కిర్పాల్ సింగ్ శిక్ష అనుభవిస్తూ మరణించాడు.
కిర్పాల్ మృతిపై అతడి కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేయడంతో పాటు ఆందోళనకు దిగడంతో ఈ విషయాన్ని పాకిస్థాన్ ప్రభుత్వం దృష్టికి కేంద్రం తీసుకెళ్లింది. కేంద్రం ఆదేశాలతో పాకిస్థాన్ లో భారత హైకమిషనర్ గా వ్యవహరిస్తున్న జేపీ సింగ్ బుధవారం పాక్ విదేశీ వ్యవహారాల శాఖ ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. కిర్పాల్ మృతికి కారణాలను అడిగి తెలుసుకున్నారు.