భారత మామిడిపై ఈయూ నిషేధం
దోసకాయ, కాకర, వంకాయ, చేమపై కూడా తాత్కాలిక వేటు
లండన్: భారత మామిడి ఉత్పత్తిదారులపై ప్రభావం చూపే నిర్ణయాన్ని 28 దేశాలతో కూడిన యూరోపియన్ యూనియన్(ఈయూ) తీసుకుంది. భారత్ నుంచి ఆల్ఫోన్సో రకం మామిడికాయల దిగుమతులపై తాత్కాలిక నిషేధం విధించింది. అలాగే, వంకాయ, చేమ, కాకరకాయ, దోసకాయల దిగుమతులపై కూడా తాత్కాలిక వేటు వేసింది. ఈ నిర్ణయం మే నెల 1 నుంచి అమల్లోకి రానుంది. దీనిపై స్థానిక భారతీయ సమాజం, వర్తకుల నుంచి నిరసన వ్యక్తం అవుతోంది. 2013లో భారత్ నుంచి దిగుమతైన పండ్లు, కూరగాయల్లో హానికారక కీటకాలు (ఫ్రూట్ ఫ్లయిస్ ఇతర రకాలు) ఉన్నట్లు బయటపడడంతో మొక్కల ఆరోగ్యాన్ని పరిరక్షించే స్టాండింగ్ కమిటీ తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది. కాగా, కొత్త రకం కీటకాలు తమ వ్యవసాయ ఉత్పత్తికి ముప్పుగా పరిణమించగలవని... ఈ నిషేధం వర్తించే ఉత్పత్తుల దిగుమతులు భారత్ నుంచి దిగుమతయ్యే మొత్తం తాజా పండ్లు, కూరగాయలలో 5 శాతంలోపే ఉంటాయని కమిటీ పేర్కొంది. తమ దేశంలో 32.1 కోట్ల పౌండ్ల విలువైన టమాటా, దోసకాయ పంటలకు ముప్పు కలిగించే కీటకాల కారణంగా ఈ నిషేధం అవసరమని బ్రిటన్కు చెందిన పర్యావరణ, ఆహార, గ్రామీణ వ్యవహారాల విభాగం అభిప్రాయపడింది. ఒక్క బ్రిటనే ఏటా 1.6కోట్ల మామిడికాయలను భారత్ నుంచి దిగుమతి చేసుకుంటోంది.
మేము నష్టపోతాం... స్థానిక వర్తకుల ఆందోళన
ఈ నిషేధాన్ని బ్రిటన్లో భారతీయులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లోని వర్తకులు వ్యతిరేకిస్తున్నారు. దీనివల్ల తాము నష్టపోతామని, తమపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది అర్థం పర్థం లేని నిర్ణయమని, యూరో యంత్రాంగం మతిలేకుండా వ్యవహరిస్తోందని, భారత సంతతికి చెందిన ఎంపీ కెయిత్వాజ్ అన్నారు. నిషేధం వల్ల ప్రభావం పడే వారిని సంప్రదించకుండా ఇలా చేయడంపై ఆగ్ర హించారు. దీనిపై యూరోపియన్ కమిషన్ అధ్యక్షుడికి లేఖ రాశారు.