Indian origin people
-
చరిత్ర సృష్టించిన రిషి సునాక్ (ఫొటోలు)
-
బ్రిటన్ పీఎంగా రిషి.. మరి ఈ దేశాలను ఏలుతోంది మనోళ్లేనని తెలుసా?
బ్రిటన్ రాజకీయాల్లో భారత సంతతి వ్యక్తి రిషి సునాక్ చరిత్ర సృష్టించారు. బ్రిటన్ ప్రధానిగా ఏకగ్రీవంగా ఎన్నికై.. ఆ పదవి చేపడుతున్న మొట్టమొదటి భారత సంతతి వ్యక్తిగా నిలిచారు. గడిచిన 200 ఏళ్లలో బ్రిటన్ ప్రధానుల్లో రిషి సునాక్ అత్యంత పిన్నవయస్కుడిగా గుర్తింపు పొందారు. వివిధ దేశాల అధినేతలుగా భారత సంతతి వ్యక్తుల జాబితాలో చేరారు రిషి సునాక్. ఈ సందర్భంగా దేశాల అధినేతలుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న భారత సంతతి వ్యక్తుల వివరాలు తెలుసుకుందాం.. ► ప్రవింద్ జుగ్నాథ్.. భారత సంతతికి చెందిన ప్రవింద్ జుగ్నాథ్ 2017లో మారిషస్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. ప్రవింద్ పూర్వీకులు ఉత్తర్‌ప్రదేశ్ నుంచి మారిషస్‌కు వలస వెళ్లారు. ఆయన హిందూ కుటుంబంలో జన్మించారు. ► పృథ్విరాజ్ సింగ్ రూపున్.. 2019లో మారిషస్ ఏడవ అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టారు పృథ్విరాజ్ సింగ్ రూపున్. ఆయన భారత మూలలున్న ఆర్య సమాజ్ హిందూ కుటుంబంలో జన్మించారు. ► ఆంటోనియా కోస్టా.. భారత మూలలు కలిగిన ఆంటోనియా కోస్టా 2015లో పోర్చుగల్ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. గోవాలో ఆయనను బబుష్గా పిలుస్తారు. కొంకణి భాషలో అత్యంత ప్రియమైన వ్యక్తిగా దాని అర్థం. ► ఛాన్ సంటోఖి.. చంద్రికాపెర్సాద్ ఛాన్ సంటోఖి.. సురినామిస్ దేశంలో కీలక రాజకీయ నేత. మాజీ పోలీసు అధికారి. 2020లో సురినామిస్ 9వ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. ఇండో-సురినామిస్ హిందూ కుటుంబంలో 1959లో జన్మించారు సంటోఖి. ► మొహమెద్ ఇర్ఫాన్ అలీ.. గయానా 9వ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్‌గా 2020, ఆగస్టు 2న ప్రమాణ స్వీకారం చేశారు మొహమెద్ ఇర్ఫాన్ అలీ. లియోనోరాలోని ఇండో-గయానీస్ ముస్లిం కుటుంబంలో జన్మించారు ఇర్ఫాన్ అలీ. ► హలిమా యాకోబ్.. భారత మూలలున్న హలిమా యాకోబ్ సింగపూర్ రాజకీయ నాయకురాలు, మాజీ న్యాయవాది. 2017 నుంచి 8వ అధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. సింగపూర్ చరిత్రలో తొలి మహిళా అధ్యక్షురాలిగా చరిత్ర సృష్టించారు. హలిమా తండ్రి పూర్వీకుల కారణంగా ఆమె భారతీయ ముస్లింగా గుర్తింపు పొందారు. ► వేవల్ రామ్‌కలవాన్.. సీషెల్లోస్ రాజకీయ నాయకుడు, 2020, అక్టోబర్ 26 నుంచి దేశాధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆయన 1961, మార్చి 15న మహేలో జన్మించారు. 1993-2011, 2016-2022 వరకు ప్రతిపక్ష ఎంపీగా కొనసాగారు. ఆయన గ్రాండ్ పేరెంట్స్ భారత్‌లోని బిహార్ రాష్ట్రానికి చెందిన వారే. ► కమలా హారీస్.. భారత సంతతి వ్యక్తి కమలా హారిస్ అగ్రరాజ్యం అమెరికా ఉపాధ్యాక్షురాలిగా బాధ్యతలు చేపట్టి చరిత్ర సృష్టించారు. 2019లో అధ్యక్ష పదవికి పోటీ పడినప్పటికీ.. విజయవంతం కాలేకపోయారు. ఆ తర్వాత ఉపాధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టారు. ఇదీ చదవండి: బ్రిటన్ కొత్త ప్రధానమంత్రిగా రిషి సునాక్ -
భారత సంతతి యూకే మంత్రి సుయెల్లాకు క్వీన్ అవార్డు
లండన్: భారత సంతతికి చెందిన బ్రిటన్ హోం మంత్రి సుయెల్లా బ్రేవర్మాన్ (42) మొట్టమొదటి క్వీన్ ఎలిజబెత్–2 ఉమన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు గెలుచుకున్నారు. లండన్‌లో శనివారం జరిగిన 20వ ఆసియన్ అఛీవర్స్ అవార్డ్స్ కార్యక్రమంలో ఆమె తల్లిదండ్రులు అవార్డును అందుకున్నారు. బ్రేవర్మన్ తల్లి తమిళ మూలాలున్న ఉమ, తండ్రి గోవాకు చెందిన క్రీస్టీ ఫెర్నాండెజ్. సుయెల్లా లండన్‌లో జన్మించారు. బ్రిటన్‌లో పలు రంగాల్లో విజయాలు సాధించిన దక్షిణాసియాకు చెందిన వారిని ఈ అవార్డులకు ఎంపిక చేస్తుంటారు. -
జర భద్రం..! ఆ దేశానికి వెళ్లే వారికి కేంద్రం హెచ్చరిక
సాక్షి, న్యూఢిల్లీ: కెనడాలోని భారతీయులు, ఆ దేశానికి వెళ్లాలనుకుంటున్న విద్యార్థులకు కేంద్రం శుక్రవారం కీలక సూచనలు చేసింది. కెనడాలో విద్వేష దాడులు, భారతీయులను లక్ష్యంగా చేసుకుని నేరాలు, హింస పెరుగుతోందని తెలిపింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఆ దేశంలో ఉన్న భారతీయులు, భవిష్యత్తులో అక్కడకు వెళ్లాలని ప్లాన్ చేసుకుంటున్న విద్యార్థులు అత్యంత జాగ్రత్తగా ఉండాలని విదేశాంగ శాఖ సూచించింది. భారతీయులు లక్ష్యంగా కెనడాలో జరుగుతున్న దాడులపై ఆ దేశంతో చర్చించినట్లు కేంద్రం పేర్కొంది. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది. ఇప్పటివరకు జరిగిన నేరాల్లో ఒక్క బాధ్యుడ్ని కూడా శిక్షించలేదని గుర్తుచేసింది. సిక్కులకు ప్రత్యేక దేశం కోరతూ ఖలిస్థాన్ అనుకూల శక్తులు కెనడాలో ప్రజాభిప్రాయ సేకరణ చేయడం దౌత్యపరంగా వివాదానికి దారీ తీసిన సమయంలోనే కేంద్రం ఈ సూచన చేయడం గమనార్హం. విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చీ ఈ ప్రజాభిప్రాయ సేకరణను ఉగ్రవాద, రాడికల్ శక్తుల హాస్యాస్పద చర్యగా అభివర్ణించారు. భారత్‌తో మంచి సంబంధాలున్న దేశం దీన్ని అనుమతించడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కెనడాలో 16 లక్షల మంది భారత సంతతి వ్యక్తులు ఉన్నారు. ఈ సంఖ్య ఆ దేశ జనాభాలో మూడు శాతం. అయితే ఇటీవల కాలంలో అక్కడ జాతి విద్వేష దాడులు జరుగుతున్నాయి. భారతీయులు లక్ష్యంగా దుండగులు కాల్పులతో రెచ్చిపోతున్నారు. ఈ నేపథ్యంలోనే కేంద్రం కీలక సూచనలు చేసింది. చదవండి: కెనడాలో కాల్పుల కలకలం.. భారతీయ విద్యార్థి మృతి -
బ్రిటన్ చరిత్రలో తొలిసారి.. కేబినెట్లో కీలక పదవులన్నీ వాళ్లకే..
లండన్: బ్రిటన్ నూతన ప్రధాని లిజ్ ట్రస్ 10 డౌనింగ్ స్ట్రీట్‌లో బుధవారం తన తొలి కేబినెట్ సమావేశం నిర్వహించారు. బ్రిటన్ చరిత్రలోనే తొలిసారి విభిన్నమైన కేబినెట్‌ను ప్రకటించిన తర్వాత ఈ భేటీ జరిగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా కీలక శాఖల బాధ్యతలను మైనార్టీ వర్గాలకే కేటాయించారు ట్రస్. దీంతో తొలిసారి శ్వేత జాతీయులు కీలక హోదాలో లేకుండా బ్రిటన్ కేబినెట్ ఏర్పాటు జరిగింది. రిషి సునాక్ టీంకు నో ఛాన్స్ అందరూ ఊహించినట్లుగానే ట్రస్ కేబినెట్లో భారత సంతతికి చెందిన, ప్రధాని పదవికి పోటీ పడిన రిషి సునాక్‌కు చోటు దక్కలేదు. ట్రస్ మంత్రివర్గంలో ఉండబోనని రిషి ముందుగానే చెప్పారు. అందుకు తగినట్లుగానే ట్రస్ ఆయనకు మొండిచేయి చూపారు. అంతేకాదు రిషికి మద్దతుగా నిలిచిన మాజీ మంత్రుల్లో ఏ ఒక్కరిని ట్రస్ తన కేబినెట్లోకి తీసుకోలేదు. దీంతో వారంతా ఏ పదవీ లేకుండా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. ట్రస్ మంత్రివర్గంలో భారత సంతతికి చెందిన సుయెళ్లా బ్రవర్మన్కు హోంమంత్రిగా అవకాశం దక్కింది. ఆగ్రాలో పుట్టిన మరో భారత సంతతి వ్యక్తి అలోక్ శర్మకు కూడా చోటు లభించింది. భారత్, శ్రీలంక మూలాలున్న రణిల్ జయవర్దనాకు పర్యావరణ మంత్రిగా స్థానం దక్కింది. చదవండి: దేశ అధ్యక్షుడి ప్రసంగం.. అందరి దృష్టిని ఆకర్షించిన బుడ్డోడు.. -
బైడెన్ టీంలో భారత సంతతి వ్యక్తులదే హవా.. 130మందికి కీలక పదవులు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సరికొత్త రికార్డు సృష్టించారు. ఆయన పాలనా యంత్రాంగంలో ఏకంగా 130మందికిపైగా భారత సంతతి వ్యక్తులకు కీలక బాధ్యతలు అప్పగించారు. దాదాపు అన్ని ప్రభుత్వ శాఖల్లో వీరికి చోటు కల్పించారు. అమెరికా జనాభాలో దాదాపు ఒక్క శాతం ఉన్న భారత సంతతి వ్యక్తులకు ఇంత ప్రాధాన్యం ఇవ్వడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. 2020 అధ్యక్ష ఎన్నికల ప్రచార సమయంలోనే భారత సంతతి వ్యక్తులకు సముచిత స్థానం కల్పిస్తామని హమీ ఇచ్చారు బైడెన్. ఇచ్చిన మాట ప్రకారం ఆ హామీని నిలబెట్టుకున్నారు. అంతేకాదు అమెరికా చరిత్రలోనే తొలిసారి భారత సంతతికి చెందిన మహిళ కమలా హ్యారిస్‌కు ఉపాధ్యక్ష పదవి ఇచ్చారు. మాజీ అధ్యక్షుడు ట్రంప్ పాలనా యంత్రాంగంలో 80 మంది భారత సంతతి వ్యక్తులు ఉండేవారు. బరాక్ ఒబామా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఈ సంఖ్య 60గా ఉంది. బైడెన్ మాత్రం గత ప్రభుత్వాలతో పోల్చితే రికార్డు స్థాయిలో 130మందికిపైగా భారత సంతతి వ్యక్తులకు చోటు కల్పించారు. దీంతో శ్వేతసౌధంలో ఏ సమావేశం జరిగినా అందులో తప్పనిసరిగా భారత సంతతి వ్యక్తులుంటారు. వీరు లేకుండా సమావేశాలు చాలా అరుదుగా జరుగుతుంటాయి. అంతేకాదు ప్రతినిధుల సభలో నలుగురు సభ్యులు సహా మొత్తం 40 మంది భారత సంతతి వ్యక్తులు రాష్ట్ర, జాతీయ స్థాయిలో వివిధ ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు. అమెరికాలోని 20 టాప్ కంపెనీలకు కూడా సీఈఓలుగా భారత సంతతి వ్యక్తులే ఉండటం గమనార్హం. బైడెన్ పాలనాయంత్రాంగంలో ఉన్న భారత సంతతి వ్యక్తుల్లో ఆయన స్పీచ్ రైటర్ వినయ్ రెడ్డి, కోవిడ్-19 ముఖ్య సలహాదారు డా.ఆశిష్ రెడ్డి, క్లైమేట్ పాలసీ సలహాదారు సోనియా అగర్వాల్, క్రిమినల్ జస్టిస్ ప్రత్యేక సలహాదారు చిరాగ్ బైన్స్, పర్సనల్ మేనెజ్మెంట్ ఆఫీస్ హెడ్ కిరణ్ అహుజా, సీనియర్ అడ్వైజర్ నీర టాండెన్, డ్రగ్ కంట్రోల్ పాలసీ అడ్వైజర్ రాహుల్ గుప్తా వంటి వారు ఉన్నారు. చదవండి: ఉక్రెయిన్‌కి ఇది పునర్జన్మ! ఇక రాజీపడేదే లే!: జెలనెన్ స్కీ -
అయ్యో పాపం! రెండేళ్ల బాలుడికి ప్రపంచంలోనే అరుదైన వ్యాధి.. చికిత్స కోసం?
మానవత్వం మాయం అవుతున్న ఈ రోజుల్లో.. ఇంకా కొందరు తమలో జాలి, దయ, ప్రేమ ఉన్నాయని నిరూపించారు. ప్రపంచంలోనే అరుదైన వ్యాదితో భాదపడుతున్న 2 ఏళ్ల బాలుడిని కాపాడటం కోసం సింగపూర్ వాసులందరు ఒక్కటయ్యారు. భారత సంతతికి చెందిన రెండేళ్ల బాలుడు సింగపూర్ వాసుల సహాయంతో ప్రపంచంలోనే అరుదైన స్పెనల్ మస్కులర్ అట్రోఫీ(ఎస్ఎంఏ) వ్యాధి నుంచి కోలుకున్నాడు. బాలుడు చికిత్స కోసం దాదాపు 30 లక్షల సింగపూర్ డాలర్లు(రూ.16.68 కోట్లు) విరాళంగా ఇచ్చి సింగపూర్ వాసులు తమ సహృదయాన్ని మరోసారి చాటారు. దేవదాన్ దేవరాజ్ భారత సంతతికి చెందిన ప్రభుత్వోద్యోగి డేవ్ దేవెరాజ్, ఇంటీరియర్ డిజైనర్ భార్య షు వెన్ దేవరాజ్(చైనీస్ సంతతి)ల ఏకైక సంతానం. భార్యాభర్తలిద్దరూ 33 సంవత్సరాల వయస్సు కలిగి ఉన్నారు. దేవదాన్ అనే చిన్నారి అరుదైన స్పెనల్ మస్కులర్ అట్రోఫీ(ఎస్ఎంఏ) వ్యాధితో బాధపడుతున్నాడు. అయితే, ఈ వ్యాధి నయం చేయాలంటే ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఔషధంగా పిలిచే జోల్గెన్స్మా ఇంజెక్షన్ అవసరం. దీనిని అమెరికా సంస్థ తయారు చేస్తోంది. దీని ఖరీదు రూ.16 కోట్లు. ఈ ఔషధానికి అమెరికా ఎఫ్‌డీఏ అనుమతిని ఇచ్చినప్పటికీ, సింగపూర్ హెల్త్ సైన్సెస్ అథారిటీ మాత్రం ఆమోదించలేదు. కానీ స్పెషల్ యాక్సెస్ రూట్ కింద ఈ ఇంజెక్షన్‌ను దిగుమతి చేసుకోవచ్చు. చిన్నారి ప్రాణాలను కాపాడటం కోసం తల్లిదండ్రులు పడుతున్న ఆవేదనను అర్ధం చేసుకున్న “రే ఆఫ్ హోప్ ” అనే స్వచృంద సంస్థ ఆన్లైన్ ద్వారా విరాళాలను సేకరించే పనిని ప్రారంభించింది. స్వచ్ఛంద సంస్థ విరాళను సేకరించడం ప్రారంభించిన కేవలం 10 రోజుల్లోనే భారత సంతతి చిన్నారి ప్రాణాలను రక్షించేందుకు స్థానిక సింగపూర్ వాసులు అందరూ కలిసి రూ.16.68 కోట్లను విరాళ రూపంలో అందజేశారు. దేవదాన్ చికిత్స కోసం క్రౌడ్ ఫండింగ్ ఛారిటీ 'రే ఆఫ్ హోప్' ద్వారా సుమారు 30,000 మంది విరాళం ఇచ్చినట్లు ఛారిటీ పేర్కొంది. రే ఆఫ్ హోప్ జనరల్ మేనేజర్ టాన్ ఎన్ మాట్లాడుతూ.. మేము ఇప్పటి వరకు సేకరించిన విరాళలో ఇదే పెద్ద మొత్తం అని తను పేర్కొన్నారు. చిన్నారి తల్లి షువెన్ మాట్లాడుతూ.. దేవదాన్‌ను రక్షించడానికి ముందుకు వచ్చిన దాతలందరికి కృతజ్ఞతలు తెలిపారు. (చదవండి: దేశంలో కొనసాగుతున్న డిజిటల్ చెల్లింపుల హవా..!) -
అమెరికాలోనే కాదు ఆరు దేశాల్లో మనవాళ్లే!
ఇటీవల ముగిసిన అమెరికా ఎన్నికల్లో భారత సంతతికి చెందిన కమలా హ్యారిస్ ఉపాధ్యక్ష పదవికి ఎన్నికైన సంగతి తెలిసిందే. ఒకరకంగా ఆమె దేశానికి సహ అధినేత. అమెరికాలోనే కాదు, మరో అరడజను దేశాలలో సైతం మన భారత సంతతికి చెందిన వారు దేశాధినేతలుగా, ప్రభుత్వాధినేతలుగా ప్రస్తుతం పదవుల్లో కొనసాగుతున్నారు. మారిషస్, సింగపూర్, పోర్చుగల్, సురినేమ్, గుయానా, సీషెల్స్ దేశాలకు ఇప్పుడు భారత సంతతి నాయకులే అధినేతలుగా ఉన్నారు. కమలా హ్యారిస్ అమెరికా ఉపాధ్యక్ష పదవికి ఎన్నికైన నేపథ్యంలో వివిధ దేశాల్లో అధినేతలుగా కొనసాగుతున్న భారత సంతతి నాయకుల గురించి సింహావలోకనం. ఇదివరకు ఎన్నడూ లేనంత హోరాహోరీగా సాగిన అమెరికా ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ ఘన విజయం సాధించడంతో జో బైడెన్ అధ్యక్షుడిగా, కమలా హ్యారిస్ ఉపాధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. భారత సంతతికి చెందిన కమలా హ్యారిస్ న్యాయవాదిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. డెమోక్రటిక్ పార్టీలో చేరి, వివిధ పదవుల్లో పనిచేశారు. కాలిఫోర్నియాలోని అలామెడా కౌంటీ డిప్యూటీ డిస్ట్రిక్ట్ అటార్నీగా 1990లో బాధ్యతలు చేపట్టి, త్వరలోనే అంచెలంచెలుగా ఎదిగారు. క్రిమినల్ న్యాయవాదిగా పేరుప్రఖ్యాతులు సాధించి, కాలిఫోర్నియా అటార్నీ జనరల్ పదవిలో 2011–2017 వరకు ఆరేళ్లు సేవలందించారు. న్యాయవాదిగా మహిళలు, బాలల హక్కుల పరిరక్షణ కోసం ఎనలేని కృషి చేశారు. గత 2016 ఎన్నికల్లో కాలిఫోర్నియా నుంచి సెనేటర్‌గా ఎన్నికై, అమెరికా ఎగువసభలోకి అడుగుపెట్టారు. ప్రస్తుత ఎన్నికల్లో ఉపాధ్యక్ష పదవికి పోటీ చేసి, అనూహ్య విజయాన్ని అందుకున్నారు. కమలా హ్యారిస్ తల్లి శ్యామలా గోపాలన్ తన పంతొమ్మిదేళ్ల వయసులో ఉన్నత విద్య కోసం అమెరికా వచ్చి, ఇక్కడే స్థిరపడ్డారు. బయోమెడికల్ శాస్త్రవేత్త అయిన శ్యామలా గోపాలన్ యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా నుంచి పీహెచ్డీ చేశారు. అదే వర్సిటీలో ఎకనామిక్స్ పీహెచ్డీ చేస్తున్న డొనాల్డ్ హ్యారిస్‌తో పరిచయం ప్రేమకు దారితీయడంతో ఆయనను పెళ్లాడారు. బ్రిటిష్ జమైకా నుంచి అమెరికాకు వలస డొనాల్డ్ హ్యారిస్ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో ఎకనామిక్స్ ప్రొఫెసర్‌గా చేరారు. ఈ దంపతులకు కమలా హ్యారిస్ 1964 అక్టోబర్ 20న జన్మించారు. కమలాకు ఏడేళ్ల వయసులోనే తల్లిదండ్రులిద్దరూ విడాకులు తీసుకున్నారు. కమలా హ్యారిస్ తల్లి శ్యామలా గోపాలన్ నాటి మద్రాసులో (ఇప్పటి చెన్నై) పుట్టి పెరిగారు. శ్యామలా గోపాలన్ తండ్రి పీవీ గోపాలన్ బ్రిటిష్ హయాంలో ఇంపీరియల్ సెక్రటరియేట్ సర్వీస్ అధికారిగా భారత్‌తో పాటు అప్పట్లో బ్రిటిష్ పాలనలో ఉన్న జాంబియా, రొడేషియా (జింబాబ్వే) తదితర దేశాల్లో పనిచేశారు. గోపాలన్ జాంబియాలో పనిచేస్తున్న కాలంలో చిన్నారి కమల తన ఐదేళ్ల వయసులో తాతగారింటికి వచ్చింది. తన తాత స్ఫూర్తితోనే ఈ స్థాయికి చేరుకున్నానని, ఆయనను తాను అమితంగా అభిమానిస్తానని కమలా హ్యారిస్ పలు ఇంటర్వ్యూల్లో చెప్పడం విశేషం. ప్రవింద్‌కుమార్ జగన్నాథ్ మారిషస్ ప్రధాని భారత మూలాలు కలిగిన ప్రవింద్‌కుమార్ జగన్నాథ్ ప్రస్తుతం మారిషస్ ప్రధానిగా కొనసాగుతున్నారు. ఆయన మిలిటెంట్ సోషలిస్ట్ మూవ్మెంట్ పార్టీ (ఎంఎస్ఎం) తరఫున ఎన్నికై, 2017 జనవరి 23న ప్రధాని పదవి చేపట్టారు. ఆయన తండ్రి అనిరు«ద్ జగన్నాథ్ గతంలో మారిషస్ ప్రధానిగా, అధ్యక్షుడిగా కూడా పని చేశారు. అనిరు«ద్ తల్లిదండ్రులు మారిషస్‌లో స్థిరపడటంతో ఆయన ఇక్కడే పుట్టారు. ఆయన కుటుంబానికి చెందిన ప్రవింద్‌కుమార్ ప్రస్తుతం మారిషస్ ప్రభుత్వానికి అధినేతగా కొనసాగుతుండటం విశేషం. ప్రవింద్ పూర్వీకులు బిహార్ నుంచి మారిషస్‌కు వలస వచ్చారు. వీరి మాతృభాష భోజ్‌పురి. అప్పట్లో మారిషస్ బ్రిటన్ హయాంలో ఉండేది. ప్రవింద్‌కుమార్ జగన్నాథ్ ఇంగ్లాండ్‌లోని బకింగ్‌హామ్ యూనివర్సిటీ నుంచి బార్ ఎట్ లా పూర్తి చేశారు. తర్వాత ఫ్రాన్స్‌లోని ఏక్స్మార్సిలే వర్సిటీ నుంచి పౌరచట్టాల్లో డిప్లొమా చేశారు. స్వదేశానికి తిరిగి వచ్చాక 1990లో ఎంఎస్ఎంలో చేరారు. తర్వాత పదేళ్లకు 2000 ఎన్నికల్లో గెలుపొంది, వ్యవసాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఐదేళ్లు ఆ పదవిలో కొనసాగాక, 2005 ఎన్నికల్లో ఎంఎస్ఎం నేతృత్వంలోని ఓటమి చెందడంతో ప్రతిపక్షంలో ఉంటూనే కీలక పాత్ర పోషించారు. తిరిగి 2010 ఎన్నికల్లో ఎంఎస్ఎం కూటమి అధికారంలోకి వచ్చాక, ఉపప్రధానిగా, ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అప్పట్లో ప్రవింద్ తండ్రి అనిరు«ద్ మారిషస్ అధ్యక్షుడిగా ఉండేవారు. తర్వాత 2014–17 వరకు ఐటీ మంత్రిగా కొనసాగారు. దేశంలో 2017–19 కాలంలో నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల్లో స్వల్పకాలం ప్రధానిగా ఉన్నారు. తిరిగి 2019 ఎన్నికల్లో ఎంఎస్ఎం కూటమి ఘనవిజయం సాధించడంతో తిరిగి పూర్తి ఐదేళ్లకాలం కొనసాగేలా ప్రధాని పదవి చేపట్టారు. పృథ్వీరాజ్‌సింగ్ రూపున్: మారిషస్ అధ్యక్షుడు మారిషస్ ప్రస్తుత అధ్యక్షుడు పృథ్వీరాజ్‌సింగ్ రూపున్ కూడా భారత సంతతికి చెందిన వారే. బిహార్ మూలాలు కలిగిన ఆయన పూర్వీకులు దాదాపు శతాబ్దం కిందటే మారిషస్‌లో స్థిరపడ్డారు. మారిషస్‌లోని న్యూ ఎటాన్ కాలేజీ నుంచి డిగ్రీ పూర్తి చేశాక కొంతకాలం ఈడెన్ కాలేజీలో మ్యాథమేటిక్స్ అధ్యాపకుడిగా పనిచేశారు. తర్వాత బ్రిటన్‌కు వెళ్లి, అక్కడి యూనివర్సిటీ ఆఫ్ సెంట్రల్ లాంకషైర్ నుంచి వాణిజ్య చట్టాల్లో ఎల్ఎల్ఎం పూర్తి చేశారు. రూపున్ 1983లో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. తొలిసారిగా 1995లో ఎన్నికల్లో పోటీ చేసి, జాతీయ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. తిరిగి 2000 ఎన్నికల్లో గెలుపొంది, నాలుగేళ్లు ప్రభుత్వ డిప్యూటీ చీఫ్ పదవిలోను, ఆ తర్వాత ఏడాది పాటు స్థానిక సంస్థల శాఖ మంత్రిగాను కొనసాగారు. తర్వాత 2010 ఎన్నికల్లో గెలుపొంది, రెండేళ్లు డిప్యూటీ స్పీకర్‌గా కొనసాగారు. 2014–17 వరకు సామాజిక సమైక్యత, ఆర్థిక స్వావలంబన శాఖ మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత 2017–19 వరకు సాంస్కృతిక శాఖ మంత్రిగా సేవలందించారు. 2019 సాధారణ ఎన్నికల్లో ఆయన అధ్యక్ష పదవికి పోటీ పడకపోయినా, ఎన్నికలు పూర్తయ్యాక అనూహ్యంగా ఆ పదవికి నామినేట్ కావడంతో 2019 డిసెంబర్ 2న ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ఏడాది ప్రారంభంలో ఆయన భారత్ పర్యటనకు వచ్చి, గయలో తన పూర్వీకులకు పిండప్రదానం చేశారు. వారణాసిలోని ఆలయాలను దర్శించుకున్నారు. పురాతన నలంద విశ్వవిద్యాలయ శిథిలాలను తిలకించారు. ఆంటోనియో కోస్టా: పోర్చుగల్ ప్రధాని పోర్చుగల్ ప్రస్తుత ప్రధాని ఆంటోనియో కోస్టా పూర్వీకులు గడచిన శతాబ్దిలోనే గోవా నుంచి వలస వెళ్లి, పోర్చుగల్‌లో స్థిరపడ్డారు. ఆంటోనియో కోస్టా తండ్రి ఓరియాండో ద కోస్టా రచయిత. తల్లి మారియా ఆంటోనియా పాలా జర్నలిస్టు. ఆంటోనియో పోర్చుగల్ రాజధాని లిస్బన్లో పుట్టిపెరిగారు. లిస్బన్ వర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో డిగ్రీ పూర్తి చేశారు. పోర్చుగల్ నిబంధనల ప్రకారం నిర్బంధ సైనికోద్యోగం చేయాల్సి ఉండటంతో, సైన్యంలో చేరి, 1987 వరకు పనిచేశారు. సైన్యం నుంచి బయటకు రాగానే, న్యాయవాద వృత్తిలో కొనసాగుతూనే రాజకీయాల్లో చేరారు. తొలిసారిగా 1988లో లిస్బన్ మునిసిపల్ కౌన్సిల్‌కు ఎన్నికయ్యారు. అంచెలంచెలుగా ఎదుగుతూ 1997 పార్లమెంటరీ ఎన్నికల్లో గెలుపొంది, అప్పటి సోషలిస్టు ప్రభుత్వంలో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రిగా 1999 వరకు, ఆ తర్వాత 2002 వరకు న్యాయశాఖ మంత్రిగా కొనసాగారు. పోర్చుగల్ సోషలిస్టు పార్టీ అభ్యర్థిగా యూరోపియన్ పార్లమెంటు సభ్యునిగా 2004 వరకు కొనసాగారు. తమ పార్టీకి చెందిన అగ్రశ్రేణి నాయకుడు ఆంటోనియో డిసౌజా ఫ్రాంకో 2004లో ఆకస్మికంగా మరణించడంతో, ఆయన స్థానంలో ఉపాధ్యక్ష అభ్యర్థిగా పోటీ చేసి, యూరోపియన్ పార్లమెంటులోని పద్నాలుగు మంది ఉపాధ్యక్షుల్లో ఒకరిగా ఎన్నికయ్యారు. లిస్బన్ మేయర్‌గా 2007–15 వరకు సేవలందించారు. 2015 నాటి సాధారణ ఎన్నికల్లో గెలుపొంది, ప్రధాని పదవి చేపట్టి, ఇప్పటి వరకు ఆ పదవిలో కొనసాగుతున్నారు. హలీమా యాకోబ్ సింగపూర్ అధ్యక్షురాలు సింగపూర్ తొలి మహిళా అధ్యక్షురాలు హలీమా యాకోబ్ భారత మూలాలు కలిగిన వ్యక్తి. ఆమె తండ్రి భారత్ నుంచి ఉపాధి కోసం వెళ్లి సింగపూర్‌లో స్థిరపడ్డారు. తల్లి మలేసియా మూలాలు గల మలయ్ మహిళ. అతి సామాన్యమైన నేపథ్యం నుంచి వచ్చిన హలీమా సింగపూర్ అధ్యక్ష పదవిని అందుకోవడం విశేషం. ఆమె తండ్రి వాచ్‌మన్‌గా పనిచేసేవారు. తల్లి సింగపూర్ పాలిటెక్నిక్ వెలుపల ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ నిర్వహించేవారు. యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ నుంచి న్యాయశాస్త్రంలో బ్యాచిలర్ డిగ్రీ, నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ నుంచి మాస్టర్స్ డిగ్రీ, డాక్టరేట్ పూర్తి చేసిన హలీమా, న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తూనే, కార్మికుల హక్కుల కోసం పోరాడుతూ, కార్మిక నాయకురాలిగా ఎదిగారు. నేషనల్ ట్రేడ్స్ యూనియన్ కాంగ్రెస్‌కు న్యాయ సలహాదారుగా, సింగపూర్ లీగల్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ డైరెక్టర్‌గా, సింగపూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లేబర్ స్టడీస్ డైరెక్టర్‌గా సేవలందించారు. ఆమె 2001 ఎన్నికలతో రాజకీయాల్లోకి అడుగు పెట్టి, పార్లమెంటు సభ్యురాలిగా ఎన్నికయ్యారు. 2011 ఎన్నికల్లో గెలుపొందాక యువజన క్రీడాశాఖ మంత్రిగా, సామాజికాభివృద్ధి, కుటుంబ సంక్షేమశాఖ మంత్రిగా, పార్లమెంటు స్పీకర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. 2015 సాధారణ ఎన్నికల్లో పీపుల్స్ యాక్షన్ పార్టీ తరఫున బరిలోకి దిగిన ఏకైక మహిళా అభ్యర్థి హలీమానే కావడం విశేషం. 2017 అధ్యక్ష ఎన్నికలకు ముందు స్పీకర్ పదవికి రాజీనామా చేసి, అధ్యక్ష ఎన్నికల్లో బరిలోకి దిగి ఘనవిజయం సాధించి చరిత్ర సృష్టించారు. చాన్ సంతోఖి సురినేమ్ అధ్యక్షుడు దక్షిణ అమెరికాలోని ఒక చిన్న దేశమైన సురినేమ్ ప్రస్తుత అధ్యక్షుడు చాన్ సంతోఖి. ఆయన పూర్తి పేరు చంద్రికాప్రసాద్ సంతోఖి. ఆయన పూర్వీకులు గుజరాత్ నుంచి వలస వెళ్లి సురినేమ్‌లో స్థిరపడ్డారు. ఈ ఏడాది జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో పోటీ లేకుండా గెలుపొందిన సంతోఖి జూలై 16న ప్రమాణ స్వీకారం చేశారు. చాన్ సంతోఖి తండ్రి సురినేమ్ రాజధాని పారామారిబో హార్బర్లో పనిచేసేవారు. తల్లి లెలిడార్ప్లోని ఒక వ్యాపారసంస్థలో షాప్ అసిస్టెంట్‌గా పనిచేసేవారు. చాన్ బాల్యం ఎక్కువగా లెలిడార్ప్లో గడిచింది. సురినేమ్‌లో హైస్కూల్ చదువు పూర్తయ్యాక స్కాలర్‌షిప్‌పై నెదర్లాండ్స్ వెళ్లారు. నెదర్లాండ్స్‌లోని పోలీసు అకాడమీలో చదువు పూర్తి చేసుకున్నాక, 1982లో సురినేమ్‌కు తిరిగి వచ్చారు. సురినేమ్ పోలీసు శాఖలో వివిధ పదవుల్లో పనిచేసి, అత్యున్నతమైన చీఫ్ కమిషనర్ ఆఫ్ పోలీసు పదవి దక్కించుకున్నారు. ఉద్యోగ జీవితాన్ని 2005లో విడిచిపెట్టి, ప్రోగ్రెసివ్ రిఫార్మ్ పార్టీలో చేరడం ద్వారా రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. అదే ఏడాది ఎన్నికల్లో పోటీ చేసి, న్యాయశాఖ మంత్రి పదవి దక్కించుకున్నారు. పార్టీలో అంచెలంచెలుగా ఎదిగి, 2011లో ప్రోగ్రెసివ్ రిఫార్మ్ పార్టీ చైర్మన్ పదవి చేపట్టారు. మహమ్మద్ ఇర్ఫాన్ అలీ గుయానా అధ్యక్షుడు దక్షిణ అమెరికాలోనిదే మరో దేశం గుయానా. భారత మూలాలు కలిగిన ఇర్ఫాన్ అలీ ఈ దేశానికి అధ్యక్షుడిగా ఈ ఏడాది ఆగస్టు 2న పదవీ బాధ్యతలు చేపట్టారు. గుయానాలో స్థిరపడిన భారతీయుల్లో నాలుగో తరానికి చెందిన వ్యక్తి ఇర్ఫాన్ అలీ. గుయానాలోని సెయింట్ స్టానిస్లాస్ కాలేజీ నుంచి డిగ్రీ పూర్తి చేసిన తర్వాత, ఉన్నత చదువుల కోసం భారత్ వచ్చారు. ఢిల్లీలోని ఇంద్రప్రస్థ యూనివర్సిటీ నుంచి ఎంఏ పూర్తి చేశారు. తర్వాత యూనివర్సిటీ ఆఫ్ వెస్టిండీస్ నుంచి అర్బన్ అండ్ రీజియనల్ ప్లానింగ్‌లో పీహెచ్డీ పూర్తి చేశారు. కొంతకాలం కరీబియన్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ మేనేజర్‌గా పనిచేశారు. పీపుల్స్ ప్రోగ్రెసివ్ పార్టీ–సివిక్ (పీపీపీసీ)లో చేరి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 2006లో జరిగిన సాధారణ ఎన్నికల్లో పోటీచేసి, జాతీయ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. గృహనిర్మాణ, నీటిపారుదల శాఖ మంత్రిగా, పర్యాటక, వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఈ ఏడాది మార్చిలో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి, ఘన విజయం సాధించారు. వావెల్ రామ్‌కలావాన్ సీషెల్స్ అధ్యక్షుడు ఆఫ్రికాలోని ద్వీప దేశమైన సీషెల్స్ అధ్యక్షుడిగా భారత సంతతికి చెందిన వావెల్ రామ్‌కలావాన్ గత అక్టోబర్ 26న పదవీ బాధ్యతలు స్వీకరించారు. రామ్‌కలావాన్ తాత బీహార్ నుంచి ఉపాధి కోసం సీషెల్స్‌కు వలస వచ్చి, ఇక్కడే స్థిరపడిపోయారు. ఆయన తండ్రి టిన్ లోహంతో వస్తువులను తయారు చేసేవారు. తల్లి ఒక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలిగా పనిచేసేవారు. సీషెల్స్‌లో పాఠశాల విద్య పూర్తయిన తర్వాత రామ్‌కలావాన్ మారిషస్‌లోని సెయింట్ పాల్స్ థియోలాజికల్ కాలేజీలో థియాలజీలో డిగ్రీ పూర్తి చేశారు. తర్వాత బ్రిటన్‌లోని బర్మింగ్‌హామ్ వర్సిటీ నుంచి థియాలజీలో మాస్టర్స్ డిగ్రీ పూర్తిచేసి, సీషెల్స్‌కు తిరిగి చేరుకున్న తర్వాత హోలీ సేవియర్ చర్చి ప్రీస్ట్ ఇన్చార్జ్గా బాధ్యతలు చేపట్టారు. ప్రీస్ట్‌గా ఉండగా తన వద్దకు వచ్చే రకరకాల ప్రజలతో సన్నిహితంగా ఉండేవారు. ప్రజలపై ఏక పార్టీ ప్రభుత్వం సాగిస్తున్న దమనకాండకు నిరసనగా గళం వినిపించడం ప్రారంభించారు. నేషనల్ రేడియో ద్వారా ప్రసారమైన తన ప్రసంగంలో ప్రభుత్వ విధానాలను నిలదీస్తూ, ప్రజలకు మరింత స్వేచ్ఛ కావాలని, పౌరహక్కులకు ప్రభుత్వం భరోసా కల్పించాలని డిమాండ్ చేశారు. ఒకవైపు మతబోధకుడిగా ఉంటూనే నిషిద్ధ సెసెల్వా పార్టీలో చేరారు. మరోవైపు సీషెల్స్ ప్రభుత్వంపై అంతర్జాతీయ ఒత్తిడి పెరగడంతో అనివార్యంగా 1992లో బహుళపార్టీ ప్రజాస్వామ్యం వైపు మొగ్గింది. ఆ మరుసటి ఏడాది నిర్వహించిన ఎన్నికల్లో సెసెల్వా పార్టీతో మరో రెండు పార్టీలు కలిసి ‘యునైటెడ్ అపోజిషన్గా బరిలోకి దిగాయి. విపక్ష కూటమికి కేవలం 9 శాతం ఓట్లే వచ్చినా, ఆ ఎన్నికలతో వావెల్ రామ్‌కలావాన్ పార్లమెంటులోకి అడుగుపెట్టగలిగారు. తన పార్టీకి 2001లో ‘సీషెల్స్ నేషనల్ పార్టీ’గా పేరు మార్చి, అధ్యక్ష ఎన్నికల్లో తలపడ్డారు. ఆ ఎన్నికలతో పాటు 2006, 2011, 2015 అధ్యక్ష ఎన్నికల్లో వరుసగా ఓటమి పాలైనా, ఈ ఏడాది జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ఆయన ఘనవిజయం సాధించి, పాలనా పగ్గాలు చేపట్టారు. -
టెండూల్కర్ డ్రైవ్... కోహ్లి క్రెసెంట్
మెల్బోర్న్: రియల్ ఎస్టేట్ మాయలు, జిమ్మిక్కులు ఇక్కడే కాదు ఆస్ట్రేలియాలోనూ ఉంటాయి. తాము డెవలప్ చేసినవి అమ్ముకోవాలన్నా, సొమ్ము చేసుకోవాలన్నా... కొనుగోలు దారుల కంట్లో పడాలని ఆసీస్ వెంచర్ యజమాని మన క్రికెటర్ల పేర్లపై పడ్డాడు. మెల్బోర్న్లోని రాక్బ్యాంక్ ప్రాంతంలో అకొలేడ్ ఎస్టేట్ ఓ వెంచర్‌ని అభివృద్ధి చేసింది. ఇక్కడ భారత సంతతి ప్రజలు ఎక్కువగా ప్లాట్లను కొనుగోలు చేస్తుంటారు. దీన్ని దృష్టిలో పెట్టుకున్న ఆ వెంచర్ డైరెక్టర్ అక్కడి వీధులకు సచిన్, కోహ్లి, కపిల్ దేవ్ల పేర్లు పెట్టారు. టెండూల్కర్ డ్రైవ్, కోహ్లి క్రెసెంట్, దేవ్ టెర్రస్లతో బోర్డులు పాతాడు. అలాగే విదేశీ ఇతర దేశ అభిమానుల కోసం మిగతా వీధులకు వా స్ట్రీట్, మియందాద్ స్ట్రీట్, ఆంబ్రోస్ స్ట్రీట్, సోబర్స్ డ్రైవ్, కలిస్ వే అనే పేర్లు పెట్టారు. దీనిపై ఆ వెంచర్ డైరెక్టర్ ఖుర్రమ్ సయీద్ మాట్లాడుతూ తనకిష్టమైన క్రికెటర్ల పేర్లను కొత్త వెంచర్ వీధులకు పెట్టినట్లు చెప్పారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వీధుల పేర్లకు ఆమోదం కోసం 60 పేర్లతో స్థానిక మెల్టన్ కౌన్సిల్‌కు అతను దరఖాస్తు చేశాడు. -
భారతీయుల హవా
బ్రిటన్ పార్లమెంటుకి జరిగిన ఎన్నికల్లో భారతీయం వెల్లి విరిసింది. భారత సంతతికి చెందిన 15 మంది సభ్యులు హౌస్ ఆఫ్ కామన్స్‌కు ఎన్నికై కొత్త రికార్డు నెలకొల్పారు. అటు అధికార కన్జర్వేటివ్ పార్టీ, ఇటు ప్రతిపక్ష లేబర్ పార్టీ నుంచి ఏడుగురు చొప్పున విజయం సాధించారు. లిబరల్ డెమొక్రాట్ పార్టీ తరఫున మరొకరు ఎన్నికయ్యారు. 12 మంది తమ సీట్లను నిలబెట్టుకుంటే ముగ్గురు కొత్తగా పార్లమెంటులో అడుగుపెట్టనున్నారు. కన్జర్వేటివ్ పార్టీ తరఫున పోటీపడిన సిట్టింగ్ ఎంపీలందరూ తమ స్థానాలను నిలబెట్టుకోగా గగన్ మహీంద్రా, క్లెయిర్ కౌతినో కొత్తగా ఎన్నికయ్యారు. లేబర్ పార్టీ నుంచి మొదటిసారిగా నవేంద్రూ మిశ్రా కొత్తగా పార్లమెంటులో అడుగు పెట్టబోతుండగా లిబరల్ డెమొక్రాట్ తరఫు మునీరా విల్సన్ ఎన్నికయ్యారు. ఈసారి ఎన్నికల్లో విజయం సాధించిన ప్రతీ 10 మందిలో ఒకరు మైనార్టీ వర్గానికి చెందినవారు. బ్రిటన్‌లో 15 లక్షల మంది వరకు ప్రవాస భారతీయులున్నారు. వీరంతా కన్జర్వేటివ్ పార్టీకి అనుకూలంగా ప్రచారం చేశారు. -
తప్పతాగి ఎయిర్ హోస్టెస్‌పై లైంగిక వేధింపులు
న్యూఢిల్లీ: భారత సంతతికి చెందిన ఇద్దరు వ్యక్తులు తాగిన మైకంలో మహిళా సిబ్బందిని లైంగికంగా వేధించారు. భద్రతా సిబ్బంది ఫిర్యాదు మేరకు పోలీసులు ఆ ఇద్దరిని అరెస్ట్ చేశారు. అనంతరం బెయిల్‌పై నిందితులు విడుదలయ్యారు. ఆ వివరాలిలా ఉన్నాయి.. భారత సంతతికి చెందిన జస్పాల్ సింగ్, చంద్రదీప్ ఖైరాలు బ్రిటన్‌లో నివాసం ఉంటున్నారు. వీరిద్దరూ మార్చి 29న లండన్ నుంచి ఎయిర్ ఇండియా విమానంలో ఢిల్లీకి వచ్చారు. జైపూర్ లో ఓ వివాహ వేడుక కోసం భారత్‌కు వస్తుండగా విమానంలో ఎయిర్ హోస్టెస్‌తో అసభ్యంగా ప్రవర్తించి ఆమెను వేధింపులకు గురిచేశారని డీసీపీ(ఎయిర్ పోర్ట్) సంజయ్ భాటియా తెలిపారు. తమకు కొన్ని ఫుడ్ ఐటమ్స్ కావాలని మహిళా సిబ్బందిని అడిగారు. వారు అడిగిన వెంటనే ఆమె స్పందించకపోవడంతో ఆవేశానికి లోనైనవారు ఆమెతో అసభ్యంగా ప్రవర్తిస్తూ.. లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. తోటి మహిళా సిబ్బంది ఈ విషయాన్ని విమాన సెక్యూరిటీ దృష్టికి తీసుకెళ్లారు. విమానం ఢిల్లీకి చేరుకోగానే ఎయిర్ పోర్టు పోలీసులు ఎయిర్ ఇండియా సిబ్బంది ఫిర్యాదు మేరకు వీరిని అరెస్ట్ చేశారు. అనుమానం వచ్చిన పోలీసులు వీరిని పరీక్షించగా మద్యం సేవించి ఉన్నట్లు గుర్తించారు. మద్యం మత్తులోనే వారు ఇలా ప్రవర్తించి ఉంటారని పోలీసులు చెప్పారు. నిందితులు బెయిల్‌పై విడుదలయ్యారు. ఎయిర్‌హోస్టెస్‌పై వేధింపులకు పాల్పడటాన్ని ఎయిర్ ఇండియా తీవ్రంగా ఖండించింది. విమాన సిబ్బందికి ప్రయాణికులు సహకరించాలని ఓ ప్రకటన ద్వారా విజ్ఞప్తిచేసింది.