ఇటీవల ముగిసిన అమెరికా ఎన్నికల్లో భారత సంతతికి చెందిన కమలా హ్యారిస్ ఉపాధ్యక్ష పదవికి ఎన్నికైన సంగతి తెలిసిందే. ఒకరకంగా ఆమె దేశానికి సహ అధినేత. అమెరికాలోనే కాదు, మరో అరడజను దేశాలలో సైతం మన భారత సంతతికి చెందిన వారు దేశాధినేతలుగా, ప్రభుత్వాధినేతలుగా ప్రస్తుతం పదవుల్లో కొనసాగుతున్నారు. మారిషస్, సింగపూర్, పోర్చుగల్, సురినేమ్, గుయానా, సీషెల్స్ దేశాలకు ఇప్పుడు భారత సంతతి నాయకులే అధినేతలుగా ఉన్నారు. కమలా హ్యారిస్ అమెరికా ఉపాధ్యక్ష పదవికి ఎన్నికైన నేపథ్యంలో వివిధ దేశాల్లో అధినేతలుగా కొనసాగుతున్న భారత సంతతి నాయకుల గురించి సింహావలోకనం.
ఇదివరకు ఎన్నడూ లేనంత హోరాహోరీగా సాగిన అమెరికా ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ ఘన విజయం సాధించడంతో జో బైడెన్ అధ్యక్షుడిగా, కమలా హ్యారిస్ ఉపాధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. భారత సంతతికి చెందిన కమలా హ్యారిస్ న్యాయవాదిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. డెమోక్రటిక్ పార్టీలో చేరి, వివిధ పదవుల్లో పనిచేశారు. కాలిఫోర్నియాలోని అలామెడా కౌంటీ డిప్యూటీ డిస్ట్రిక్ట్ అటార్నీగా 1990లో బాధ్యతలు చేపట్టి, త్వరలోనే అంచెలంచెలుగా ఎదిగారు. క్రిమినల్ న్యాయవాదిగా పేరుప్రఖ్యాతులు సాధించి, కాలిఫోర్నియా అటార్నీ జనరల్ పదవిలో 2011–2017 వరకు ఆరేళ్లు సేవలందించారు. న్యాయవాదిగా మహిళలు, బాలల హక్కుల పరిరక్షణ కోసం ఎనలేని కృషి చేశారు. గత 2016 ఎన్నికల్లో కాలిఫోర్నియా నుంచి సెనేటర్‌గా ఎన్నికై, అమెరికా ఎగువసభలోకి అడుగుపెట్టారు. ప్రస్తుత ఎన్నికల్లో ఉపాధ్యక్ష పదవికి పోటీ చేసి, అనూహ్య విజయాన్ని అందుకున్నారు.
కమలా హ్యారిస్ తల్లి శ్యామలా గోపాలన్ తన పంతొమ్మిదేళ్ల వయసులో ఉన్నత విద్య కోసం అమెరికా వచ్చి, ఇక్కడే స్థిరపడ్డారు. బయోమెడికల్ శాస్త్రవేత్త అయిన శ్యామలా గోపాలన్ యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా నుంచి పీహెచ్‌డీ చేశారు. అదే వర్సిటీలో ఎకనామిక్స్ పీహెచ్‌డీ చేస్తున్న డొనాల్డ్ హ్యారిస్‌తో పరిచయం ప్రేమకు దారితీయడంతో ఆయనను పెళ్లాడారు. బ్రిటిష్ జమైకా నుంచి అమెరికాకు వలస డొనాల్డ్ హ్యారిస్ స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలో ఎకనామిక్స్ ప్రొఫెసర్‌గా చేరారు. ఈ దంపతులకు కమలా హ్యారిస్ 1964 అక్టోబర్ 20న జన్మించారు. కమలాకు ఏడేళ్ల వయసులోనే తల్లిదండ్రులిద్దరూ విడాకులు తీసుకున్నారు.
కమలా హ్యారిస్ తల్లి శ్యామలా గోపాలన్ నాటి మద్రాసులో (ఇప్పటి చెన్నై) పుట్టి పెరిగారు. శ్యామలా గోపాలన్ తండ్రి పీవీ గోపాలన్ బ్రిటిష్ హయాంలో ఇంపీరియల్ సెక్రటరియేట్ సర్వీస్ అధికారిగా భారత్‌తో పాటు అప్పట్లో బ్రిటిష్ పాలనలో ఉన్న జాంబియా, రొడేషియా (జింబాబ్వే) తదితర దేశాల్లో పనిచేశారు. గోపాలన్ జాంబియాలో పనిచేస్తున్న కాలంలో చిన్నారి కమల తన ఐదేళ్ల వయసులో తాతగారింటికి వచ్చింది. తన తాత స్ఫూర్తితోనే ఈ స్థాయికి చేరుకున్నానని, ఆయనను తాను అమితంగా అభిమానిస్తానని కమలా హ్యారిస్ పలు ఇంటర్వ్యూల్లో చెప్పడం విశేషం.
ప్రవింద్‌కుమార్ జగన్నాథ్ మారిషస్ ప్రధాని
భారత మూలాలు కలిగిన ప్రవింద్‌కుమార్ జగన్నాథ్ ప్రస్తుతం మారిషస్ ప్రధానిగా కొనసాగుతున్నారు. ఆయన మిలిటెంట్ సోషలిస్ట్ మూవ్‌మెంట్ పార్టీ (ఎంఎస్‌ఎం) తరఫున ఎన్నికై, 2017 జనవరి 23న ప్రధాని పదవి చేపట్టారు. ఆయన తండ్రి అనిరు«ద్ జగన్నాథ్ గతంలో మారిషస్ ప్రధానిగా, అధ్యక్షుడిగా కూడా పని చేశారు. అనిరు«ద్ తల్లిదండ్రులు మారిషస్‌లో స్థిరపడటంతో ఆయన ఇక్కడే పుట్టారు. ఆయన కుటుంబానికి చెందిన ప్రవింద్‌కుమార్ ప్రస్తుతం మారిషస్ ప్రభుత్వానికి అధినేతగా కొనసాగుతుండటం విశేషం. ప్రవింద్ పూర్వీకులు బిహార్ నుంచి మారిషస్‌కు వలస వచ్చారు. వీరి మాతృభాష భోజ్‌పురి.
అప్పట్లో మారిషస్ బ్రిటన్ హయాంలో ఉండేది. ప్రవింద్‌కుమార్ జగన్నాథ్ ఇంగ్లాండ్‌లోని బకింగ్‌హామ్ యూనివర్సిటీ నుంచి బార్ ఎట్ లా పూర్తి చేశారు. తర్వాత ఫ్రాన్స్‌లోని ఏక్స్‌మార్సిలే వర్సిటీ నుంచి పౌరచట్టాల్లో డిప్లొమా చేశారు. స్వదేశానికి తిరిగి వచ్చాక 1990లో ఎంఎస్‌ఎంలో చేరారు. తర్వాత పదేళ్లకు 2000 ఎన్నికల్లో గెలుపొంది, వ్యవసాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఐదేళ్లు ఆ పదవిలో కొనసాగాక, 2005 ఎన్నికల్లో ఎంఎస్‌ఎం నేతృత్వంలోని ఓటమి చెందడంతో ప్రతిపక్షంలో ఉంటూనే కీలక పాత్ర పోషించారు. తిరిగి 2010 ఎన్నికల్లో ఎంఎస్‌ఎం కూటమి అధికారంలోకి వచ్చాక, ఉపప్రధానిగా, ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
అప్పట్లో ప్రవింద్ తండ్రి అనిరు«ద్ మారిషస్ అధ్యక్షుడిగా ఉండేవారు. తర్వాత 2014–17 వరకు ఐటీ మంత్రిగా కొనసాగారు. దేశంలో 2017–19 కాలంలో నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల్లో స్వల్పకాలం ప్రధానిగా ఉన్నారు. తిరిగి 2019 ఎన్నికల్లో ఎంఎస్‌ఎం కూటమి ఘనవిజయం సాధించడంతో తిరిగి పూర్తి ఐదేళ్లకాలం కొనసాగేలా ప్రధాని పదవి చేపట్టారు.
పృథ్వీరాజ్‌సింగ్ రూపున్: మారిషస్ అధ్యక్షుడు
మారిషస్ ప్రస్తుత అధ్యక్షుడు పృథ్వీరాజ్‌సింగ్ రూపున్ కూడా భారత సంతతికి చెందిన వారే. బిహార్ మూలాలు కలిగిన ఆయన పూర్వీకులు దాదాపు శతాబ్దం కిందటే మారిషస్‌లో స్థిరపడ్డారు. మారిషస్‌లోని న్యూ ఎటాన్ కాలేజీ నుంచి డిగ్రీ పూర్తి చేశాక కొంతకాలం ఈడెన్ కాలేజీలో మ్యాథమేటిక్స్ అధ్యాపకుడిగా పనిచేశారు. తర్వాత బ్రిటన్‌కు వెళ్లి, అక్కడి యూనివర్సిటీ ఆఫ్ సెంట్రల్ లాంకషైర్ నుంచి వాణిజ్య చట్టాల్లో ఎల్‌ఎల్‌ఎం పూర్తి చేశారు. రూపున్ 1983లో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు.
తొలిసారిగా 1995లో ఎన్నికల్లో పోటీ చేసి, జాతీయ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. తిరిగి 2000 ఎన్నికల్లో గెలుపొంది, నాలుగేళ్లు ప్రభుత్వ డిప్యూటీ చీఫ్ పదవిలోను, ఆ తర్వాత ఏడాది పాటు స్థానిక సంస్థల శాఖ మంత్రిగాను కొనసాగారు. తర్వాత 2010 ఎన్నికల్లో గెలుపొంది, రెండేళ్లు డిప్యూటీ స్పీకర్‌గా కొనసాగారు. 2014–17 వరకు సామాజిక సమైక్యత, ఆర్థిక స్వావలంబన శాఖ మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత 2017–19 వరకు సాంస్కృతిక శాఖ మంత్రిగా సేవలందించారు.
2019 సాధారణ ఎన్నికల్లో ఆయన అధ్యక్ష పదవికి పోటీ పడకపోయినా, ఎన్నికలు పూర్తయ్యాక అనూహ్యంగా ఆ పదవికి నామినేట్ కావడంతో 2019 డిసెంబర్ 2న ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ఏడాది ప్రారంభంలో ఆయన భారత్ పర్యటనకు వచ్చి, గయలో తన పూర్వీకులకు పిండప్రదానం చేశారు. వారణాసిలోని ఆలయాలను దర్శించుకున్నారు. పురాతన నలంద విశ్వవిద్యాలయ శిథిలాలను తిలకించారు.
ఆంటోనియో కోస్టా: పోర్చుగల్ ప్రధాని
పోర్చుగల్ ప్రస్తుత ప్రధాని ఆంటోనియో కోస్టా పూర్వీకులు గడచిన శతాబ్దిలోనే గోవా నుంచి వలస వెళ్లి, పోర్చుగల్‌లో స్థిరపడ్డారు. ఆంటోనియో కోస్టా తండ్రి ఓరియాండో ద కోస్టా రచయిత. తల్లి మారియా ఆంటోనియా పాలా జర్నలిస్టు. ఆంటోనియో పోర్చుగల్ రాజధాని లిస్బన్‌లో పుట్టిపెరిగారు. లిస్బన్ వర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో డిగ్రీ పూర్తి చేశారు. పోర్చుగల్ నిబంధనల ప్రకారం నిర్బంధ సైనికోద్యోగం చేయాల్సి ఉండటంతో, సైన్యంలో చేరి, 1987 వరకు పనిచేశారు. సైన్యం నుంచి బయటకు రాగానే, న్యాయవాద వృత్తిలో కొనసాగుతూనే రాజకీయాల్లో చేరారు. తొలిసారిగా 1988లో లిస్బన్ మునిసిపల్ కౌన్సిల్‌కు ఎన్నికయ్యారు.
అంచెలంచెలుగా ఎదుగుతూ 1997 పార్లమెంటరీ ఎన్నికల్లో గెలుపొంది, అప్పటి సోషలిస్టు ప్రభుత్వంలో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రిగా 1999 వరకు, ఆ తర్వాత 2002 వరకు న్యాయశాఖ మంత్రిగా కొనసాగారు. పోర్చుగల్ సోషలిస్టు పార్టీ అభ్యర్థిగా యూరోపియన్ పార్లమెంటు సభ్యునిగా 2004 వరకు కొనసాగారు. తమ పార్టీకి చెందిన అగ్రశ్రేణి నాయకుడు ఆంటోనియో డిసౌజా ఫ్రాంకో 2004లో ఆకస్మికంగా మరణించడంతో, ఆయన స్థానంలో ఉపాధ్యక్ష అభ్యర్థిగా పోటీ చేసి, యూరోపియన్ పార్లమెంటులోని పద్నాలుగు మంది ఉపాధ్యక్షుల్లో ఒకరిగా ఎన్నికయ్యారు. లిస్బన్ మేయర్‌గా 2007–15 వరకు సేవలందించారు. 2015 నాటి సాధారణ ఎన్నికల్లో గెలుపొంది, ప్రధాని పదవి చేపట్టి, ఇప్పటి వరకు ఆ పదవిలో కొనసాగుతున్నారు.
హలీమా యాకోబ్ సింగపూర్ అధ్యక్షురాలు
సింగపూర్ తొలి మహిళా అధ్యక్షురాలు హలీమా యాకోబ్ భారత మూలాలు కలిగిన వ్యక్తి. ఆమె తండ్రి భారత్ నుంచి ఉపాధి కోసం వెళ్లి సింగపూర్‌లో స్థిరపడ్డారు. తల్లి మలేసియా మూలాలు గల మలయ్ మహిళ. అతి సామాన్యమైన నేపథ్యం నుంచి వచ్చిన హలీమా సింగపూర్ అధ్యక్ష పదవిని అందుకోవడం విశేషం. ఆమె తండ్రి వాచ్‌మన్‌గా పనిచేసేవారు. తల్లి సింగపూర్ పాలిటెక్నిక్ వెలుపల ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ నిర్వహించేవారు. యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ నుంచి న్యాయశాస్త్రంలో బ్యాచిలర్ డిగ్రీ, నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ నుంచి మాస్టర్స్ డిగ్రీ, డాక్టరేట్ పూర్తి చేసిన హలీమా, న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తూనే, కార్మికుల హక్కుల కోసం పోరాడుతూ, కార్మిక నాయకురాలిగా ఎదిగారు.
నేషనల్ ట్రేడ్స్ యూనియన్ కాంగ్రెస్‌కు న్యాయ సలహాదారుగా, సింగపూర్ లీగల్ సర్వీసెస్ డిపార్ట్‌మెంట్ డైరెక్టర్‌గా, సింగపూర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లేబర్ స్టడీస్ డైరెక్టర్‌గా సేవలందించారు. ఆమె 2001 ఎన్నికలతో రాజకీయాల్లోకి అడుగు పెట్టి, పార్లమెంటు సభ్యురాలిగా ఎన్నికయ్యారు. 2011 ఎన్నికల్లో గెలుపొందాక యువజన క్రీడాశాఖ మంత్రిగా, సామాజికాభివృద్ధి, కుటుంబ సంక్షేమశాఖ మంత్రిగా, పార్లమెంటు స్పీకర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. 2015 సాధారణ ఎన్నికల్లో పీపుల్స్ యాక్షన్ పార్టీ తరఫున బరిలోకి దిగిన ఏకైక మహిళా అభ్యర్థి హలీమానే కావడం విశేషం. 2017 అధ్యక్ష ఎన్నికలకు ముందు స్పీకర్ పదవికి రాజీనామా చేసి, అధ్యక్ష ఎన్నికల్లో బరిలోకి దిగి ఘనవిజయం సాధించి చరిత్ర సృష్టించారు.
చాన్ సంతోఖి సురినేమ్ అధ్యక్షుడు
దక్షిణ అమెరికాలోని ఒక చిన్న దేశమైన సురినేమ్ ప్రస్తుత అధ్యక్షుడు చాన్ సంతోఖి. ఆయన పూర్తి పేరు చంద్రికాప్రసాద్ సంతోఖి. ఆయన పూర్వీకులు గుజరాత్ నుంచి వలస వెళ్లి సురినేమ్‌లో స్థిరపడ్డారు. ఈ ఏడాది జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో పోటీ లేకుండా గెలుపొందిన సంతోఖి జూలై 16న ప్రమాణ స్వీకారం చేశారు. చాన్ సంతోఖి తండ్రి సురినేమ్ రాజధాని పారామారిబో హార్బర్‌లో పనిచేసేవారు. తల్లి లెలిడార్ప్‌లోని ఒక వ్యాపారసంస్థలో షాప్ అసిస్టెంట్‌గా పనిచేసేవారు. చాన్ బాల్యం ఎక్కువగా లెలిడార్ప్‌లో గడిచింది. సురినేమ్‌లో హైస్కూల్ చదువు పూర్తయ్యాక స్కాలర్‌షిప్‌పై నెదర్లాండ్స్ వెళ్లారు. నెదర్లాండ్స్‌లోని పోలీసు అకాడమీలో చదువు పూర్తి చేసుకున్నాక, 1982లో సురినేమ్‌కు తిరిగి వచ్చారు.
సురినేమ్ పోలీసు శాఖలో వివిధ పదవుల్లో పనిచేసి, అత్యున్నతమైన చీఫ్ కమిషనర్ ఆఫ్ పోలీసు పదవి దక్కించుకున్నారు. ఉద్యోగ జీవితాన్ని 2005లో విడిచిపెట్టి, ప్రోగ్రెసివ్ రిఫార్మ్ పార్టీలో చేరడం ద్వారా రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. అదే ఏడాది ఎన్నికల్లో పోటీ చేసి, న్యాయశాఖ మంత్రి పదవి దక్కించుకున్నారు. పార్టీలో అంచెలంచెలుగా ఎదిగి, 2011లో ప్రోగ్రెసివ్ రిఫార్మ్ పార్టీ చైర్మన్ పదవి చేపట్టారు.
మహమ్మద్ ఇర్ఫాన్ అలీ గుయానా అధ్యక్షుడు
దక్షిణ అమెరికాలోనిదే మరో దేశం గుయానా. భారత మూలాలు కలిగిన ఇర్ఫాన్ అలీ ఈ దేశానికి అధ్యక్షుడిగా ఈ ఏడాది ఆగస్టు 2న పదవీ బాధ్యతలు చేపట్టారు. గుయానాలో స్థిరపడిన భారతీయుల్లో నాలుగో తరానికి చెందిన వ్యక్తి ఇర్ఫాన్ అలీ. గుయానాలోని సెయింట్ స్టానిస్లాస్ కాలేజీ నుంచి డిగ్రీ పూర్తి చేసిన తర్వాత, ఉన్నత చదువుల కోసం భారత్ వచ్చారు. ఢిల్లీలోని ఇంద్రప్రస్థ యూనివర్సిటీ నుంచి ఎంఏ పూర్తి చేశారు. తర్వాత యూనివర్సిటీ ఆఫ్ వెస్టిండీస్ నుంచి అర్బన్ అండ్ రీజియనల్ ప్లానింగ్‌లో పీహెచ్‌డీ పూర్తి చేశారు.
కొంతకాలం కరీబియన్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ మేనేజర్‌గా పనిచేశారు. పీపుల్స్ ప్రోగ్రెసివ్ పార్టీ–సివిక్ (పీపీపీసీ)లో చేరి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 2006లో జరిగిన సాధారణ ఎన్నికల్లో పోటీచేసి, జాతీయ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. గృహనిర్మాణ, నీటిపారుదల శాఖ మంత్రిగా, పర్యాటక, వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఈ ఏడాది మార్చిలో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి, ఘన విజయం సాధించారు.
వావెల్ రామ్‌కలావాన్ సీషెల్స్ అధ్యక్షుడు
ఆఫ్రికాలోని ద్వీప దేశమైన సీషెల్స్ అధ్యక్షుడిగా భారత సంతతికి చెందిన వావెల్ రామ్‌కలావాన్ గత అక్టోబర్ 26న పదవీ బాధ్యతలు స్వీకరించారు. రామ్‌కలావాన్ తాత బీహార్ నుంచి ఉపాధి కోసం సీషెల్స్‌కు వలస వచ్చి, ఇక్కడే స్థిరపడిపోయారు. ఆయన తండ్రి టిన్ లోహంతో వస్తువులను తయారు చేసేవారు. తల్లి ఒక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలిగా పనిచేసేవారు. సీషెల్స్‌లో పాఠశాల విద్య పూర్తయిన తర్వాత రామ్‌కలావాన్ మారిషస్‌లోని సెయింట్ పాల్స్ థియోలాజికల్ కాలేజీలో థియాలజీలో డిగ్రీ పూర్తి చేశారు. తర్వాత బ్రిటన్‌లోని బర్మింగ్‌హామ్ వర్సిటీ నుంచి థియాలజీలో మాస్టర్స్ డిగ్రీ పూర్తిచేసి, సీషెల్స్‌కు తిరిగి చేరుకున్న తర్వాత హోలీ సేవియర్ చర్చి ప్రీస్ట్ ఇన్‌చార్జ్‌గా బాధ్యతలు చేపట్టారు. ప్రీస్ట్‌గా ఉండగా తన వద్దకు వచ్చే రకరకాల ప్రజలతో సన్నిహితంగా ఉండేవారు.
ప్రజలపై ఏక పార్టీ ప్రభుత్వం సాగిస్తున్న దమనకాండకు నిరసనగా గళం వినిపించడం ప్రారంభించారు. నేషనల్ రేడియో ద్వారా ప్రసారమైన తన ప్రసంగంలో ప్రభుత్వ విధానాలను నిలదీస్తూ, ప్రజలకు మరింత స్వేచ్ఛ కావాలని, పౌరహక్కులకు ప్రభుత్వం భరోసా కల్పించాలని డిమాండ్ చేశారు. ఒకవైపు మతబోధకుడిగా ఉంటూనే నిషిద్ధ సెసెల్వా పార్టీలో చేరారు. మరోవైపు సీషెల్స్ ప్రభుత్వంపై అంతర్జాతీయ ఒత్తిడి పెరగడంతో అనివార్యంగా 1992లో బహుళపార్టీ ప్రజాస్వామ్యం వైపు మొగ్గింది. ఆ మరుసటి ఏడాది నిర్వహించిన ఎన్నికల్లో సెసెల్వా పార్టీతో మరో రెండు పార్టీలు కలిసి ‘యునైటెడ్ అపోజిషన్‌గా బరిలోకి దిగాయి.
విపక్ష కూటమికి కేవలం 9 శాతం ఓట్లే వచ్చినా, ఆ ఎన్నికలతో వావెల్ రామ్‌కలావాన్ పార్లమెంటులోకి అడుగుపెట్టగలిగారు. తన పార్టీకి 2001లో ‘సీషెల్స్ నేషనల్ పార్టీ’గా పేరు మార్చి, అధ్యక్ష ఎన్నికల్లో తలపడ్డారు. ఆ ఎన్నికలతో పాటు 2006, 2011, 2015 అధ్యక్ష ఎన్నికల్లో వరుసగా ఓటమి పాలైనా, ఈ ఏడాది జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ఆయన ఘనవిజయం సాధించి, పాలనా పగ్గాలు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment