తప్పతాగి ఎయిర్ హోస్టెస్‌పై లైంగిక వేధింపులు
న్యూఢిల్లీ: భారత సంతతికి చెందిన ఇద్దరు వ్యక్తులు తాగిన మైకంలో మహిళా సిబ్బందిని లైంగికంగా వేధించారు. భద్రతా సిబ్బంది ఫిర్యాదు మేరకు పోలీసులు ఆ ఇద్దరిని అరెస్ట్ చేశారు. అనంతరం బెయిల్‌పై నిందితులు విడుదలయ్యారు. ఆ వివరాలిలా ఉన్నాయి.. భారత సంతతికి చెందిన జస్పాల్ సింగ్, చంద్రదీప్ ఖైరాలు బ్రిటన్‌లో నివాసం ఉంటున్నారు. వీరిద్దరూ మార్చి 29న లండన్ నుంచి ఎయిర్ ఇండియా విమానంలో ఢిల్లీకి వచ్చారు.
జైపూర్ లో ఓ వివాహ వేడుక కోసం భారత్‌కు వస్తుండగా విమానంలో ఎయిర్ హోస్టెస్‌తో అసభ్యంగా ప్రవర్తించి ఆమెను వేధింపులకు గురిచేశారని డీసీపీ(ఎయిర్ పోర్ట్) సంజయ్ భాటియా తెలిపారు. తమకు కొన్ని ఫుడ్ ఐటమ్స్ కావాలని మహిళా సిబ్బందిని అడిగారు. వారు అడిగిన వెంటనే ఆమె స్పందించకపోవడంతో ఆవేశానికి లోనైనవారు ఆమెతో అసభ్యంగా ప్రవర్తిస్తూ.. లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. తోటి మహిళా సిబ్బంది ఈ విషయాన్ని విమాన సెక్యూరిటీ దృష్టికి తీసుకెళ్లారు.
విమానం ఢిల్లీకి చేరుకోగానే ఎయిర్ పోర్టు పోలీసులు ఎయిర్ ఇండియా సిబ్బంది ఫిర్యాదు మేరకు వీరిని అరెస్ట్ చేశారు. అనుమానం వచ్చిన పోలీసులు వీరిని పరీక్షించగా మద్యం సేవించి ఉన్నట్లు గుర్తించారు. మద్యం మత్తులోనే వారు ఇలా ప్రవర్తించి ఉంటారని పోలీసులు చెప్పారు. నిందితులు బెయిల్‌పై విడుదలయ్యారు. ఎయిర్‌హోస్టెస్‌పై వేధింపులకు పాల్పడటాన్ని ఎయిర్ ఇండియా తీవ్రంగా ఖండించింది. విమాన సిబ్బందికి ప్రయాణికులు సహకరించాలని ఓ ప్రకటన ద్వారా విజ్ఞప్తిచేసింది.