భారత్ ఆర్థిక, రాజకీయ వ్యవస్థలు అభివృద్ధి చెందాలి
చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్ అరవింద్ సుబ్రమణ్యం
న్యూఢిల్లీ: భారత ఆర్థిక, రాజకీయ వ్యవస్థలు మరెంతో పరపక్వత సాధించాల్సి ఉందని ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణ్యం పేర్కొన్నారు. ఈ కారణంగా పలు సున్నిత అంశాల్లో ఒక్కొక్కసారి కఠినమైన, మరొకసారి ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్లాల్సి వస్తున్నట్లు అరవింద్ సుబ్రమణ్యం పేర్కొన్నారు. న్యాయవ్యవస్థ క్రియాశీలత గురించి అడిగిన ఒక ప్రశ్నకు ఆయన సమాధానం చెబుతూ, సమాజంలో పలు అంశాలు సంక్లిష్టతతో ఇమిడిఉన్న నేపథ్యంలో...
రాజకీయ పరిధి నుంచి ఆయా అంశాలను వేరుచేయడానికి స్వతంత్య్ర రెగ్యులేటరీ వ్యవస్థల అవసరం ఎంతో ఉందని కూడా అరవింద్ సుబ్రమణ్యం అన్నారు. రెగ్యులేటరీ వ్యవస్థల పనితీరు దేశంలో పురోగతిలో ఉందని వివరించారు. అయితే ఆయా వ్యవస్థల్లో సైతం మనం మరింత పరిపక్వత సాధించాల్సి ఉందని ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో పేర్కొన్నారు. ఒక సంస్థ పరిపక్వతతో పనిచేసే పటిష్ట వ్యవస్థ ఏర్పాటు ఎంతో కీలకమని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఇందులో భాగంగా రాజకీయ వ్యవస్థ జోక్యం లేని స్వతంత్య్ర రెగ్యులేటరీ వ్యవస్థ వల్ల వ్యవస్థకు బహుళ ప్రయోజనాలు ఒనగూరుతాయని అన్నారు.