Indus OS
-
ఫోన్ పే చేతికి ఇండస్ ఓఎస్!
ముంబై: కంటెంట్, యాప్ డిస్కవరీ ప్లాట్‌ఫామ్ ఇండస్ ఓఎస్‌ను.. డిజిటల్ పేమెంట్స్ దిగ్గజం ఫోన్ పే సొంతం చేసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు చర్చలు జరుగుతున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఒప్పందం కుదిరితే ఫోన్ పే 6 కోట్ల డాలర్లు(సుమారు రూ. 440 కోట్లు) చెల్లించే అవకాశమున్నట్లు అంచనా వేశాయి. తద్వారా ఫుడ్, ట్రావెల్, షాపింగ్, లైఫ్‌స్టైల్ తదితర విభాగాలతో కూడిన సూపర్ యాప్ ‘స్విచ్’ను ఫోన్ పే మరింత విస్తరించే వీలుంది. పలు విభాగాలకు చెందిన సర్వీసులను ఒకే గొడుగు కింద అందించేందుకు స్విచ్‌ను ఫోన్ పే రూపొందించింది. కాగా.. దేశీ భాషల కంటెంట్ ద్వారా ఇండస్ ఓఎస్ వినియోగదారులకు చేరువైంది. వెరసి ఇండస్ ఓఎస్ కొనుగోలు ద్వారా ఫోన్ పే స్థానిక డెవలపర్స్‌ను ఆకట్టుకునేందుకు వీలుంటుందని పరిశ్రమ వర్గాలు తెలియజేశాయి. ఇండస్ బ్యాక్‌గ్రౌండ్ ఐఐటీ పూర్వవిద్యార్ధులు రాకేష్ దేశ్‌ముఖ్, ఆకాష్ డాంగ్రే, బి.సుధీర్ కలసి 2015లో ఇండస్ ఓఎస్‌ను ఏర్పాటు చేశారు. ఇండస్ యాప్ బజార్ పేరుతో ఆండ్రాయిడ్ యాప్‌స్టోర్ ద్వారా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. సుమారు 12 భారతీయ భాషల ద్వారా యాప్‌లతోపాటు, కంటెంట్‌నూ అభివృద్ధి చేస్తోంది. 4 లక్షల యాప్‌లకు నిలయమై..10 కోట్లకుపైగా కస్టమర్లకు సర్వీసులందిస్తున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. ఫోన్ పే జోరు దేశీయంగా యూపీఐ చెల్లింపులలో ఫోన్ పే.. టాప్ ర్యాంక్ థర్డ్ పార్టీ ప్రాసెసర్‌గా నిలుస్తోంది. గత నెల(ఏప్రిల్)లో 119 కోట్ల యూపీఐ లావాదేవీలను నిర్వహించింది. వీటి విలువ రూ. 2.34 లక్షల కోట్లుకాగా.. దాదాపు 45 శాతం మార్కెట్ వాటాకు సమానమని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ఇటీవల మాతృ సంస్థ వాల్‌మార్ట్ నుంచి 70 కోట్ల డాలర్ల(సుమారు రూ. 5,100 కోట్లు) పెట్టుబడులను అందుకుంది. దీంతో ఫోన్ పే విలువ 550 కోట్ల డాలర్ల(రూ. 40,200 కోట్లు)కు చేరినట్లు అంచనా. -
చైనా సాధించలేనిది.. భారత్ సాధించింది!
ఇప్పటికీ సొంతంగా తనకంటూ ఓ ఓఎస్ (ఆపరేటింగ్ సిస్టమ్)ను రూపొందించుకోనందుకు చైనా ఈర్ష్య పడుతూ ఉండవచ్చు. గత 15 ఏళ్లుగా దేశీయ ఓఎస్‌ను రూపొందించుకునేందుకు చైనా నానా తంటాలు పడుతూనే ఉంది. ఓఎస్ టెక్నాలజీ విషయంలో పాశ్చాత్య దేశాల ఆధిపత్యం నుంచి తప్పించుకోవాలని ప్రయత్నిస్తోంది. కానీ, ఆ ప్రయత్నం ఇప్పటివరకు సఫలీకృతం కాలేదు. కానీ, భారత్ మాత్రం రెండేళ్ల కిందటే ఆ ఘనతను సొంతం చేసుకుంది. ఇండస్ ఓఎస్.. ఇప్పుడు భారత్‌లో మొబైల్ ఫోన్లు అత్యధికంగా వాడుకుంటున్న మొబైల్ బేస్డ్ ఆపరేటింగ్ సిస్టమ్‌లలో రెండోస్థానంలో ఉంది. ఆల్ఫాబెట్ అండ్రాయిడ్ తర్వాత 6.3శాతం మార్కెట్ వాటాతో రెండోస్థానంలో ఇండస్ ఓఎస్ ఉంది. స్థానిక భారతీయ భాషలలో రూపొందిన ఈ ఓఎస్ 2015 సంవత్సరం ముగిసేనాటికి రెండోస్థానాన్ని ఆక్రమించి.. ప్రస్తుత సంవత్సరంలోనూ ఆ స్థానాన్ని నిలబెట్టుకుంది. ఈ వారమే విడుదలైన కౌంటర్ పాయింట రీసెర్చ్ నివేదిక ఈ వివరాలను వెల్లడించింది. ఐవోఎస్తోపాటు షియోమి, ఎంఐయూఐ, సియానోజెన్ వంటి ఆండ్రాయిడ్ వెరియంట్లు కూడా ఇండస్ ఓఎస్‌ను వాడుతున్నాయి. చైనా సొంతంగా ఓఎస్ రూపొందించుకునే క్రమంలో చైనా ఓఎస్ (సీఓఎస్), కిలిన్, రెడ్ ఫ్లాగ్, యున్ఓఎస్ వంటి ప్రయోగాలు చేసినప్పటికీ అవి అంతగా విజయవంతం కాలేదు. చైనా ప్రభుత్వం, పలు ప్రైవేటు కంపెనీలు ఈ విషయంలో ప్రోత్సాహం అందించినా అనుకున్న లక్ష్యాన్ని అది సాధించలేదు. వాస్తవంగా ఫస్ట్‌టచ్ పేరిట రూపొందించిన ఇండస్ ఓస్ 2015లో సంచలనం సృష్టించింది. ఈ ఓఎస్‌ను వాడుకోవడానికి మైక్రోమాక్స్ కంపెనీ ముందుకురావడం దీనికి పెద్ద ఊతంగా నిలిచింది. స్థానిక డిమాండ్లను దృష్టిలో ఉంచుకొని ఈ ఓఎస్ రూపొందడంతో ఇది బాగా ఆదరణ పొందింది. టైపింగ్ సౌలభ్యకరంగా ఉండటం, టైపింగ్‌లో ప్రాంతీయ భాషల పదాల ప్రిడిక్షన్ సరిగ్గా ఉండటం ఈ ఓఎస్ కు కలిసివొచ్చే అంశం. ఇది ఓఎస్ విషయంలో ఐఫోన్ ఆపరేటింట్ సిస్టమ్ అయిన ఐఓఎస్‌ను దేశీయంగా అధిగమించింది. యాప్ బజార్ వంటి యాప్‌లతో మరిన్ని ఆర్థిక సేవలు అందించేందుకు ఈ ఓఎస్ సిద్ధమవుతోంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపునిచ్చిన ’మేకిన్ ఇండియా’కు ఈ ఓఎస్ రూపకల్పన పెద్ద ఊతమిచ్చే అంశమని నిపుణులు చెప్తున్నారు.